లక్ష్మీపతి కృష్ణమూర్తితో అన్నాడు.
"చూడు పంతులూ! ని పెళ్ళికి సత్యంగారూ, నేనూ పెద్దలుగా వ్యవహరిస్తాం సరిపోయింది గదా! అద్సరే---ఇంతకీ ఆ పిల్లెవరో చెప్పేవుకాదు!"
కృష్ణమూర్తి సత్యంవేపు చూశాడు. సత్యం తన దృష్టిని గోడకి అంకితం చేశాడు.
పద్మ గుండెల్లో ఆందోళన పెరుగుతోంది.
కృష్ణమూర్తి నీళ్ళు నములుతున్నాడు.
"అదేమిటి పంతులూ! పిల్లెవరంటే దిక్కులు చూస్తావేం? ఒకటి చెప్తా విను... ఆ అమ్మాయి ఎవరయినా కావచ్చు. నీలాంటి భర్త దొరకాలంటే పూర్వ జన్మలో పుణ్యం చేసుకొని వుండాలి. అలాంటిది-ఏదో కానిపని చేసినట్టు నువ్వు సిగ్గుపడతావేం? ఎవరా పిల్ల?" అన్నాడు లక్ష్మీపతి.
కృష్ణమూర్తి నాన్చుచూ అన్నాడు---
"రేపు మీరే చూస్తారుగా?"
కృష్ణమూర్తి చెంప చెళ్ళుమని పించాలనుకుంది పద్మ! విషయం ఇంతవరకు వచ్చేక, తండ్రికూడా ముచ్చట పడుతుంటే ఇంకా సస్పెన్సు ఎందుకు?
"అంటే రేపేనా పెళ్ళి?" అడిగేడు లక్ష్మీపతి.
కృష్ణమూర్తి తల ఊపాడు.
"నీ అసాధ్యం గూలా! ఎవరికీ చెప్పకుండ ముహూర్తం కూడా పెట్టేసుకున్నావన్నమాట? ఎక్కడ పెళ్ళి?"
"గుళ్ళో"
"గుళ్ళోనా?"
"అవునండి! ఆర్భాటం లేకుండా ఏమీ లేకుండా సింపులుగా గుళ్లో చేసుకుందామనుకున్నాం!"
"ఖర్చులేని పెళ్లన్నమాట! చివరికి ఆ పిల్ల పెద్దవాళ్ళు కూడా అదృష్టవంతులన్న మాట, పంతులూ! నీ అత్తమామలు కూడా వెనక జన్మలో అంతో ఇంతో పూజలు చేసుకున్న వాళ్లై వుంటారు. అవునూ ఏ గుళ్లో చేసుకుంటున్నావ్?"
"ఈడేపల్లి రామాలయంలో ఉదయం పదిన్నరకండీ!"
"అలాగే కానివ్వు! మేము కొంచెం పెందలాడే వస్తాం!"
"మీరు రాకుండా మాత్రం పెళ్ళి జరగదు!"
అని కృష్ణమూర్తి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
* * *
ఈడేపల్లి రామమందిరం అలంకరింపబడి వుంది.
సత్యం, లక్ష్మీపతి, అన్నపూర్ణమ్మ వగైరా పెద్దలంతా అక్కడే వున్నారు. వాళ్ళకి కృష్ణమూర్తి మర్యాదలు చేస్తున్నాడు.
ఆ కార్యక్రమంలో శాస్త్రికూడా బిజీగానే వున్నాడు.
ఇంక వధువు రావాలి?
లక్ష్మీపతి తన కుతూహలాన్ని అణచుకోలేక వధువు ఎవరిని మరోసారి కృష్ణమూర్తిని అడిగాడు.
తన కాబోయే భార్యామణి ఆకారాన్ని గుణగణాల్ని కవిత్వం జతచేసి పాటలో వినిపించాడు కృష్ణమూర్తి.
పాట పూర్తవుతుండగా---
వధువుని తీసుకొచ్చింది సుబ్బారావు భార్య.
వధువుగా వచ్చిన పద్మని చూడగానే అన్నపూర్ణమ్మ మొదలు ఆశ్చర్యపోయింది. తన కళ్ళని తానే నమ్మలేక పోయింది. ఆ తరువాత ఎంతో ఆనందించింది. దేవుడున్నాడని ఆమె అప్పుడు నిజంగానే నమ్మింది.
అన్నపూర్ణమ్మ పాదాలకు పద్మ నమస్కరించినప్పుడు ఆ తల్లి ఆనందభాష్పాలతో ఆమెను లేవదీసింది.
అప్పుడే చూసేడు లక్ష్మీపతి---పద్మని!
వధువు రూపంలో నన్ను పద్మని చూడగానే భూమి కంపించినట్టు అయిందతనికి! సప్త సముద్రాలూ పొంగి అతనిమీదకి విరుచుకు పడ్డట్టయింది. మనిషి మొత్తం వణికిపోతూ ఒక పిచ్చికేక పెట్టాడు "పద్మా" అని!
పద్మ తండ్రి పరిస్థితిని గమనించికూడా వీసమెత్తు చలించలేదు.
భర్త అవతారంచూసి భయపడ్డ అన్నపూర్ణమ్మ మాత్రం పద్మని దగ్గరకు తీసుకుంది.
ఆ తల్లీ కూతుళ్ళవేపు ఒక అడుగువేసి లక్ష్మీపతి గాండ్రించాడు---
"ఏమిటీ నాటకం?"
అన్నపూర్ణమ్మ కలగ జేసుకుంది---
"మీరు కొంచెం శాంతించండి!"
భార్యమీద విరుచుకుపడ్డాడు లక్ష్మీపతి---
"ముందు నువ్వు నోరుముయ్! దాన్ని విడిచిపెట్టు! కన్నతండ్రి కళ్ళుకప్పి నాటకం ఆడుతుందా! నాటకం? ఏమే మాట్లాడవ్? ఏం చూసుకుని వాడ్ని ప్రేమించేవే?"
"ప్రేమించడానికేం కావాలి?" అడిగింది పద్మ ధైర్యంగా.
లక్ష్మీపతి ఆమె చెంప చెళ్ళుమనిపించేడు. కృష్ణమూర్తి ఒక అడుగు ముందుకువేసేడు. సత్యం అతన్ని అపేడు---
లక్ష్మీపతి పద్మతో అంటున్నాడు---
"ఏం కావాలా? డబ్బు కావాలే! డబ్బు ఆస్తి ఐశ్వర్యాలు కావాలి. అంతస్థు కావాలి. కోటీశ్వరుడి కోడల్ని చేద్దామని నీమీద బోలెడు ఆశలు పెట్టుకున్నాను. ఆ సంగతి నీక్కూడా తెలుసు. తెలిసికూడా నన్ను దెబ్బ తీయాలని చూస్తావా?"
అతని ఆవేశం అన్నపూర్ణమ్మకు అసహ్యం కలిగించింది. అయినా అదంతా కడుపులో దాచుకొని నిబ్బరంగా అన్నది---
"డబ్బు లేకపోవచ్చు అంతేగా అందం తక్కువా? చదువు తక్కువా? గుణం తక్కువా? మీ నోటితో మీరే యోగ్యుడని పొగడేరు మరిచిపోయారా?"
"తీసెయ్! చెత్తవాగుడు కట్టిపెట్టు. అందచందాలు గుణగణా లెవడిక్కావాలే? తినడానికి లేని వెధవ ఏం చదువుకొని ఏం ప్రయోజనం? మన లారీడ్రైవర్ కూడా చదువుకున్న వాడేనే - ఎమ్మెస్సీ చదివేడు గదాని వాడిని అల్లుడిగా చేసుకోమంటావా? పేగుల్తీస్తాను జాగ్రత్త! ముందు దీన్ని ఇంటికి తీసుకెళ్ళు! ఊ..."
పద్మ తల్లినుంచి తప్పుకొని కృష్ణమూర్తివేపు నడిచింది. కృష్ణమూర్తి కూడా అడ్వాన్సయ్యేడు.
లక్ష్మీపతి కోపం ఇప్పుడు కృష్ణమూర్తి మీదికి మళ్లింది---
"ఒరే మేస్టరూ! నీ కుట్రేమిటో నాకిప్పుడు అర్ధమైందిరా! బంగారు పిచ్చుకని-పట్టుకుంటే లక్షలు మింగవచ్చని-దాని వెంటబడ్డావు. నాకు తెలీకుండా పెళ్లాడితే నీ ప్రాణాలు తీస్తానని భయపడి, నన్ను మెప్పించి అల్లుడవుదామని ఆశపడ్డావు అందుకే నా ఇంటిలోచేరి అందంగా నాటకమాడేవు. ఒరే నీ నాటకానికి పడిపోవచ్చుగానీ లక్షాధికారినవుదామనే నీ ఆశకు చస్తే పడను. మర్యాదగా పద్మని విడిచిపెట్టు ఊ..." అన్నాడు లక్ష్మీపతి.
తనముందే తన బిడ్డను నోటికొచ్చినట్టు తిడుతుంటే సత్యం సహించలేక పోయేడు. అతని గుప్పెట బిగిసింది.
కృష్ణమూర్తి పద్మని విడిచిపెట్టలేదు. గుండెల్లో కోపాన్ని గుండెల్లోనే దాచుకుని ఎంతో వినయంగా అన్నాడు.
"క్షమించాలి! మీరనుకున్నట్టు మీ లక్షలమీద ఆశలేదు నాక్కావల్సింది పద్మ! కేవలం పద్మ!"
