Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 43

                   
                                   29
    "రజీ, ఐ.ఎ.ఎస్ పరీక్ష పాసయ్యాను. పదిహేనో తారీఖున ఇంటర్వ్యూ కెళ్ళాలి."
    "వెరీగుడ్. ఇంతకన్నా శుభవార్త ఇంకేం కావాలి?"
    "అంతా నీ ప్రోత్సాహమే, రజీ. లేకుంటే నేనసలు పాసయ్యేవాడిని కాదు."
    "మళ్ళీ మొదలు పెట్టావా ఈ మాటలు?"
    "పోనీలే. రోగులకు మందులో రంగు నీళ్ళు కలిపి డబ్బు బాగా అర్జిస్తున్నావా ?' నవ్వుతూ అడిగాడు రాజ్.
    "ఆ. దినానికి వెయ్యి రూపాయలు. నీకూ కావాలా?"
    "ఆ డబ్బు నాకొద్దులే. దాన్ని చూస్తేనే భయం. మీ నాన్నగారు ఎప్పుడొస్తారు?"
    "అయన గారు రారట. అక్కడే ఆయనకు మనశ్శాంతి దొరికిందట. ఏం చెదస్తమో గానీ ఊళ్లు తిరిగితే మనశ్శాంతి దొరుకుతుందా , రాజ్!"
    "ఎవరి అభిప్రాయాలు వారివి. ఇప్పుడు నువ్వు ఒంటరి దాని వయ్యవన్న మాట."
    'అదెలా? నువ్వెప్పుడూ నాతోనే, నాలోనే ఉంటావుగా?"
    "నవ్వుకోన్నారిద్దరూ.'    
    "రజీ నాదో కోరిక."
    "అదే వద్దన్నాను. అజ్నాపించే అధికారం నీకెప్పుడూ ఉంది."
    "ఆ అర్హత పోగొట్టు కొన్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలి." సూటిగా చెప్పాడు. ఉలిక్కిపడింది రజియా. దాన్ని గురించి ఇంత వరకో తాను ఆలోచించలేదు. అసలు మరిచి పోయింది. అనుకుంటేనే భయం గొలిపే మాట-- పాత స్మృతులను మతికి తెచ్చే విషయం -- అనుభవించలేని ఆనందాన్ని ఎందుకు తిరిగి అందుకోకూడదనే ప్రశ్న -- ఆమెను తికమక పెట్టాయి.
    కానీ అది తనకు సాధ్యం కాదు. అయిందేదో అయింది. జీవితంలో ఒకసారే ఒకరికే మనసిచ్చింది. దాన్ని మళ్ళించుకోలేదు. అందువల్ల ఎవరోకీ శాంతీ, సౌఖ్యమూ ఉండవు. మరొక అమాయక ప్రాణిని హింసించాలి. ఆ తుఫాను లో అంచెలంచెలుగా వచ్చే ఎదురు గాలిని ఎదుర్కోలేదు. అది చేత కానిపని. ఇంత త్వరలో మరొకరిని పెళ్లి చేసుకోవడం -- వారికి తనువునే కాక మనసును కూడా అర్పించడం -- ఇదంతా అసంభవం. అందువల్ల మరొకరిని అన్యాయం చేయడం తప్ప సుఖంగా గడపలేని రోజులూ -- వాటిని మననం చేసుకుంటూ తిట్టుకొనే మనసులూ -- వాటి ఆధారంతో మొండిగా జీవించే బ్రతుకులూ-- ఆ బ్రతుకు లను చూసి ఎగతాళి చేసే మనుష్యులూ-- అటువంటి మనుష్యులతో కూడిన ప్రపంచమూ-- ఆ ప్రపంచం లో బ్రతకలేక బ్రతికే జీవితమూ -- హు-- అసంభవము.
    అడుగడుగునా అద్దంలా నిలిచే మనస్సూ-- దాని తీవ్ర దృక్కుల నుండి తప్పించు కోలేని సంఘటన లూ హృదయాన్ని క్షణ క్షణానికి  బాధకు గురిచేస్తుండగా తీరని కోరికలను చంపుకొని క్రొత్త కోరికలతో , క్రొత్త పోకడలతో జీవితాన్ని సుఖమనే భ్రమతో గడపడం -- ఆధారం లేని నిజాల మీద, సాక్ష్యం లేని మనసూ మీదా విరక్తి పుట్టడం సహజం. ఆ విరక్తి లో మ్రగ్గి పోవడం చేతకాని పని. గత్యంతరం కనబడని అతకని బ్రతుకులు-- అసహ్యించుకుంటూ ప్రేమంటే తెలుసుకోలేక కుళ్ళి పోయే జీవితం -- ఊహించుకోలేని సంఘటనలకు దారి తీసే గత స్మృతులు -- అనుమాన, అసూయా ద్వేషాలతో జీవితంలోని సుఖాన్ని చంపుకొని , మనస్సును రాయి చేసుకొని దారి కానరాక జీవితం నుండి పారిపోవడం -- తనకు వద్దు.
    "ఏమిటి రజీ , ఆలోచిస్తున్నావు?"
    "అది ఇప్పట్లో సాధ్యం కాదు రాజ్! కానీ జీవితంలో ఒక భర్త అవసరమని తోచినప్పుడు తప్పక చేసుకుంటాను.' చెప్పి తల వంచింది.
    'అంతేనా, రజీ? నా కోరిక తీర్చలేవా? నా ఆశ నిరాశ కావలసిందేనా?" బాధగా అడిగాడు రాజ్.
    "రాజ్, నీ అజ్ఞ మీరే శక్తి నాకు లేదు. కనీసం నాన్నగారు తిరిగి వచ్చేంత వరకు వేచి ఉండాలి కదా?"
    నిండుగా నిట్టూర్చాడు రాజ్.
    "ఇంతకూ పెళ్లి అంటే ఏమిటి , రాజ్? దాని వలన లాభమా? నష్టమా?"

                       *    *    *    *
    "పెళ్ళంటే నూరేళ్ళ పంటరా! నువ్వు పెళ్లి చేసుకొంటే వచ్చే నష్ట మేమిటి?"
    "నాన్నా, పెళ్ళంటే వ్యక్తీ స్వాతంత్యానికి ఒక గొడ్డలి పెట్టు. అది మానవుడి మెడకు ఒక గుది బండ. ఆ పెళ్లి మాట తలచుకొంటే నే భయంగా ఉంది. ఆ పెళ్లి చేసుకొని ఆ సంసారం తో కష్టాల ననుభవించి విసిగే కన్నా హాయిగా సముద్రంలో ఈద ప్రయత్నించడం మేలు. మనిషిని అన్నివిధాలా మోసగిస్తుంది. వివాహం చేసుకుంటే జీవితంలో ఆనందం-- నశిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక బాధ. బాధ్యత నెత్తికి తగులుకొని ప్రాణాలు తోడేస్తుంటాయి . ఏ పని చెయ్యాలన్నా ఆటంకమే. ఎక్కడికి పోవాలన్నా అభ్యంతరమే. ఎద్దు ముక్కుకు మొగతాడు లాంటిది పెళ్లి. వైవాహిక జీవితంలో కష్టాలు చూస్తున్నాను. వద్దు, నాన్నా , నాకా పెళ్లి వద్దు.' ఆనంద్ ఖండితం గా చెప్పేశాడు తండ్రితో.
    "పోరపడ్డవురా , నాయనా చాలా పోరాపడ్డావు. వైవాహిక జీవితాన్ని గురించి నువ్వు తప్పుగా అర్ధం చేసుకొన్నావు. సంసారిక జీవితంలో కష్టాలనే చూశావు. సుఖాలను చూడలేదు. భార్యాభర్తలు ఆనందంగా తమ జీవితాన్ని గడుపుకొంటూ జీవితాన్ని తను చెప్పు చేతులతో నడిపించుకొనే వారిని చూడలేదు. పెళ్లి-- అంటే నూరేళ్ళ పంట అని ఊరికే అనలేదు. ఆ జీవితాన్ని తలుచు కొంటె ఒళ్ళు పులకరిస్తుంది. సాంసారిక జీవితంలో ఉండే సుఖం నీకెప్పుడూ ఎక్కడా లభించదు. అ కష్టాలలో ఉండే సుఖం, బాధలో ఉండే తియ్యదనం, బాధ్యతలో హాయి, బరువులో సంతృప్తి -- అందరికీ లభ్యం కావు. ఆ జీవితం నీకు క్రొంగొత్త అనుభవాలను తెస్తుంది. కష్ట సుఖాలను రెండింటిని కలిపి అనుభవించే తరుణమిది. అది నీ స్వాతంత్యం పై అధికారాన్నీ, తృప్తి నీ ఇస్తుంది. లోటు పాట్లను చవి చూపించే జీవితం. మానవుడికి యౌవనం తక్కువ. ఆ కాలం లోనే పెళ్లి చేసుకొని సుఖాల్ని అనుభవించనున్నారు. ఎందరు జీవితాన్ని ఆనందంగా గడపడం లేదు?'
    "కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు రత్నం కోసం వెదికితే రాయి దొరికితే పడిన శ్రమకూ, దురదృష్టానికి కలిపి ఏడవవలసి ఉంటుంది. నువ్వు ఏమైనా చెప్పు. నేనిప్పుడు పెళ్ళే చేసుకోను."
    "ఇంకెప్పుడు?' ముసలివాడివై నాక చేసుకొంటావా?"
    "నాకసలు పెళ్ళే అక్కరలేదు. అంతగా అవసరమని తోచిన నాడు చేసుకుంటాను.  ముందు అరుణ కు పెళ్లి చేసెయ్యండి."
    "ఒరేయ్ , నిన్ను ఎమ్. ఎ చదివించాను. నీ ఇష్ట ప్రకారమే వ్యాపారం నీ కప్పజెప్పాను. ఇప్పటి కైనా ఈ యింటి బాధ్యత నీ కప్పగించాలని, నువ్వు పెళ్లి చేసుకొని పిల్లా జెల్లతో నవ్వుతూ కాపురం చేస్తుంటే చూడాలని ఉంది. నీ ఇష్టం. ఆలోచించుకో" అని వెళ్ళిపోయాడాయన.
    "అన్నయ్యా!' అరుణ మెల్లగా అంది.
    'అరుణా, నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు. కానీ వినే స్థితిలో లేను."
    
                         *    *    *    *
    'అది కాదు, నాన్నా. నే చెప్పేది కూడా కాస్త విను. చదువు ఇంకా మూడు సంవత్సరాలుంది . చదువు పూర్తయితే నువ్వు చెప్పినట్లు బావనే చేసుకుంటాను."
    "అది కాదమ్మా. సుగుణా. ఉన్నది ఒక్కటే మేనరికం. వాళ్ళు తొందర పడుతున్నారు. కాదంటే మనస్పర్ధలు. పెళ్లి నీ చదువుకు ఏమీ ఆటంకం రాదు. నీ చదువు నువ్వు చదువుకో."
    "పెళ్ళయితే చదువు సాగదు నాన్నా!"
    "ఎందుకు సాగదు? బావ నీకేమైనా క్రొత్త వాడా? నువ్వు చదువు కుంటా నంటే వద్దంటాడా?"
    "నీ ఇష్టం నాన్నా. నేనేం చెప్పలేను. నీకేది మంచిదని తోస్తే అలాగే చెయ్యి" అని సుగుణ లోపలికి వెళ్ళిపోయింది.
    ఒక కార్యం తీరిపోయిందన్నట్లుగా తృప్తిగా శ్వాస పీల్చారాయన.
    
                        *    *    *    *
    "గోపీ" అంటూ ఇంట్లోకి అడుగు పెట్టాడు రాజ్.
    "రండి" అని ఆహ్వానిస్తున్న శారద ను చూచి ఎలక్ట్రిక్ షాక్ తిన్నవాడిలా అయిపోయాడు. నోట మాట పెగల్లేదు. ఇదేమిటి శారదా అని అడగాలను కొంటూనే నోరు మెదపలేక పోయాడు.
    అడగకూడని విషయం. అర్ధం కాని ఆవేదన. హటాత్సంఘటన. అనుమానించ లేని నిజం. కానీ....కానీ ఊహించుకోలేక పోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS