Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 43


    తన తెల్లని చొక్కామీద పొట్టుపడ్తే మండిపడ్తాడు సుందరం. "ఎన్నిసార్లు చెప్పను-నాకిలాంటి హాస్యం నచ్చదని" అంటాడు. సుందరం వట్టి బెరుకు మనిషి-రాజావంటి అందమైన అమ్మాయిని కూడా "మీరు" అనితప్ప పిలిచేవాడు కాదు.
    "నాకేమో నీ తెల్లచొక్కా బాగనిపించదు-ఏంచేయమంటావ్? పైసపైస కూడబెట్టి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావ్. చూస్తా ఎలా పోతావో?" అనేది.
    తరవాత రసం ఉన్న చేతుల్తో సుందరంను ఊపి "సుందరం! ఇహ చెప్పు, దసరా ఎన్నాళ్లుంది?" అని అడిగేది.
    చొక్కాకు మరకలు అంటితే సుందరం మండిపడేవాడు. అతనికి ఉన్నది ఒకే షర్టు. దాన్ని రాత్రిపూట ఉతుక్కుంటాడు. గంజి పెడ్తాడు. ఇస్త్రీ చేసుకుంటాడు. మల్లెపూవులాంటి చొక్కా తొడుక్కుని మాసిపోతుందేమోనని తప్పుకుని తప్పుకుని తిరుగుతాడు. పరిస్థితులు అతన్ని అలా తయారుచేశాయి. తల్లిదండ్రులు బాల్యంలోనే పోయారు. ఆ పనీ, ఈ పనీ చేసి జీవించాడు. వారి, వీరి దయతో ఎఫ్.ఏ. వరకు చదివాడు. లోకం అతన్ని చెంపదెబ్బలు కొట్టింది. కొన్ని గుణపాఠాలు నేర్పింది. లోకానికి పాఠం నేర్పేశక్తి డబ్బుకు మాత్రమే ఉందని గ్రహించాడు. అందుకే అతడు డబ్బు సంపాదించడానికే జీవిస్తున్నాడు. అతనికి గుమాస్తాగిరి అంటే పడదు. పేదవాళ్ళంటే అసహ్యం. అందుకే అతడు అమెరికా వెళ్ళాలనుకున్నాడు. అక్కడ చదవాలని అతని అభిలాష. అందుకు అతడు ఏపని చేయడానికీ వెనుకాడేవాడు కాదు. ట్యూషన్లు చెప్పేవాడు. గుమాస్తాగా చేసేవాడు. పత్రికల్లో పనిచేసేవాడు. శాంతకు సహాయం చేసేవాడు. పిల్లలకు చదువు చెప్పేవాడు. బజారు నుండి సరుకులు తెచ్చేవాడు. నీళ్లు తోడేవాడు. శాంత అతనికి అన్నం పెట్టేది. అందుకే సుందరాన్ని నేను "తమ్ముడూ" అనేవాణ్ణి. అతన్ని నేను "తమ్ముడు" అనుకుంటే అనేక లాభాలున్నాయి. సుందరం నన్ను అన్న అనుకుంటాడు. మా ఇంటిని తన ఇల్లు అనుకుంటాడు. చాకిరి సాంతం చేస్తాడు. ట్యూషన్ చెప్పమంటే ఎవరూ ముప్పైకి తక్కువ తీసుకోరు. నీళ్లు తోడే మనిషిని పెడ్తే కనీసం పది ఇవ్వాలి. సరుకులు తేవడానికి కుర్రానికి అయిదివ్వాలి. సరే ఇవన్నీ ఎందుకు? నేను జన్మతః కళాకారుణ్ణి. సుందరానికి నా విషయంలో ఉన్న అభిమానాన్ని గురించి మాత్రమే చెప్పాలి. కాని అతని బలహీనతలు, అతని రహస్యాలు మీకు విప్పి చెప్పక్కర్లేదుగా! అన్నిటినీ మించిన అతని ఒక రహస్యం నాకు మాత్రమే తెలుసు. అతడు అమెరికా వెళ్లడానికి ఏడువేలు బ్యాంకులో భద్రపరచాడు. పాస్ బుక్ అల్మారీలో పుస్తకాలకింద దాచిపెట్టాడు. ఈ ఏడువేలు అతని భవిష్యత్తుకు పునాది. మనసుకు ధైర్యం. శరీరానికి ఆరోగ్యం. ఒక్క బీడీ మూడుసార్లు కాలుస్తాడు. ఒక్క చొక్కా ఏడాది తొడుగుతాడు. నా పాత బూట్లు నెలలకొద్ది వాడతాడు. రాజాకు, శాంతకు పట్టుచీరలు. శృంగార సామగ్రి కొంటుంటే చూచివెళ్ళి అంత ఖరీదైంది అయినందుకు విచారిస్తాడు.    
    ఆడపిల్లల ఖర్చుకు అంతులేదు. రాజా తండ్రి బట్టల దుకాణంలో గుమస్తా. అయినా తన ఒకే కూతురు కోర్కెలు చచ్చుకుంటూ తీర్చేవాడు. రాజాకు ఫిల్ములు చూడ్డం సరదా. సినిమా నటుల్లా అలంకరించుకోవడం సరదా. ఆమె రకరకాల బట్టలు కడుతుంది. నవ్వుతుంది. తుళ్లుతుంది. కనిపించిన వస్తువునల్లా కదిలిస్తుంది. చిందరవందర చేస్తుంది.
    శాంత రాజాతో పోట్లాడ్తుంది. రాజా పిచ్చిపనులన్నీ చెపుతూ తిరుగుతుంది. కాని రాజా దగ్గర ఒక మందుంది. శాంతను సినిమాకు తీసికెళ్తుంది. మాటలు చెపుతుంది. మనసు మారుస్తుంది.
    రాజా అంటే సుందరానికి పడదు.
    'రాజాను పెళ్ళిచేసుకున్నవాడి బ్యాంక్ బాలెన్సు ఎలా ఉంటుందంటారు?' అని అడిగాడు సుందరం అంట్లు తోముతూ శాంతను.
    "ఏమిటి సుందరం-వెర్రివాళ్ళలా మాట్లాడ్తావ్-రాజాను పెళ్ళాడిన వాడికి బ్యాంక్ బాలెన్సేమిటి?" అన్నది శాంత.
    సుందరం బూడిద దులుపుకొని అల్మారీవైపు దృష్టి సారించాడు.
    రాజా అప్పుడప్పుడు పకోడీలు తెచ్చేది. "ఇదిగో సుందరం కోసం తెచ్చాను. వట్టి పిసినారి. ఇలాంటివేం తింటాడు?" అనేది. రాజాకు మిఠాయిలు పడవు. కారపు వస్తువులే తినేది. ఉప్పటి వస్తువులంటే ఆమెకు మరీ ఇష్టం. ఆమెను చూచాడు. సుందరమూ మిఠాయి తినడం మానేశాడు. ఛాయ్ లో కూడా ఉప్పు వేసుకోసాగాడు.
    ఒకనాడు శాంత వచ్చింది. సుందరానికి బాగా తినిపించింది. వెళ్ళిపోయింది.
    "వదినా! ఎప్పుడూ రాజాయే నాకోసం ఏదోఒకటి తెస్తుంటే ఏంబావుంటుంది చెప్పు" సుందరం శాంతతో అన్నాడు.
    శాంత సుందరానికి జవాబివ్వలేదు.
    'విన్నారా మీ మరిది ఏమంటున్నాడో రాజాకోసం ఏదైనా కొంటాడట' అని నాతో అన్నది శాంత.
    నా చేతిలో పేపరు జారి పడిపోయింది. నాలోని కథాకారుడు ఎగిరిపోయాడు. 'నిజం?' అన్నాను.
    "అవును" అన్నది. సుందరం రెప్ప ఆర్పకుండా రాజా ఇంటి కిటికీలు చూస్తున్నాడు. కిటికీలకు నీలంరంగు చీటీ తెరలున్నాయి. అవి గాలికి ఎగురుతున్నాయి.
    అన్నింటినీ బద్దలుకొట్టాలనిపిస్తూంది. అప్పుడు తెలుస్తుంది అసలు లోన ఏమున్నది?' అంటూంది రాజా తెరల వెనుకనుంచి.
    'ఏమి ఇవ్వడం మంచిది? దాని ఖరీదు ఎంత ఉండాలి?' సుందరం నన్ను అడిగాడు - చూపుతిప్పి.
    ఇదొక సమస్య! బహుమతి చౌగ్గానూ ఉండాలి. రాజాకు నచ్చేట్టూ ఉండాలి. శాంత, సుందరం కలిసి ఆ రోజంతా ఆలోచించారు. చీరలు, ఉంగరం- సినిమాకెళ్ళడం శాంత ప్రతిపాదించింది. కాని వాటి ఖరీదు విని సుందరం అదిరిపోయాడు.
    'వదినా! నాకు సాధ్యం అయ్యేది ఏదైనా చెప్పు. ఫోటో ఫ్రేం అయితే ఎలా ఉంటుంది. అందులో రాజా ఫోటో మాత్రమేకాక మరో ఫోటో పెట్టగలగాలి.'
    సమస్య పరిష్కారం అయింది. తరవాత రోజులు గడిచాయి. వారం అయింది. వారాలు గడిచాయి. నెల అయింది. రాజా సుందరానికి ఊరగాయలు, అప్పడాలు, పకోడీలు తెచ్చిపెడుతూనే ఉంది. సుందరం ఉలకడు పలకడు. మాటల సందర్భంలో ముచ్చట రానేవచ్చేది.
    "ఫ్రేములు ప్రియమవుతున్నట్లున్నాయి"
    రాజా ఆ ఫ్రేంలో తనదికాక మరెవరి ఫోటో పెడ్తుంది?
    ఇలాంటివి మాటల సందర్భంలో దొర్లేవి.
    ఒకనాడు శాంత రాజాతో కూడా చెప్పేసింది. ఆమె అగ్గి అయింది. "వెధవ ఏమనుకుంటాడు? వాడి ఫోటో పెడ్తాననుకుంటాడా ఫ్రేంలో? వాణ్ణి ముక్కలుముక్కలు చేయాలనిపిస్తూంది. అమెరికా వెళ్ళడానికి కూడబెట్టిన డబ్బంతా ఖర్చుపెట్టాలనిపిస్తుంది. వాణ్ణి ఏడిపిస్తుంటే నాకు సరదాగా ఉంటుంది" అన్నది.
    రాజా సుందరాన్ని గంటలకొద్ది సతాయించేది. ఇద్దరూ ఎంతోసేపు పోట్లాడేవాళ్లు. కాని ఆనాటినుంచి రాజా గంభీరంగా ఉండిపోయింది. నవ్వడం, తుళ్ళడం నిలిచిపోయాయి. కొన్నాళ్ళపాటు సుందరానికి విముక్తి లభించినట్లయింది.
    ఒకనాడు సుందరం ఇస్త్రీ చేసిన తెల్లని చొక్కా తొడిగాడు. సుందరం చూపులు రాజామీద పడ్డాయి. రాజా మాట్లాడలేదు. చొక్కాను గురించి పట్టించుకోలేదు. శాంత దగ్గరికి చేరింది. కూరలు తరగసాగింది.
    'మీరు ఈమధ్య బొత్తిగా కనిపించడంలేదు' అన్నాడు సుందరం.
    ఆ మాట విని ఇద్దరూ నవ్వారు.
    అందమైన రాజా కళ్లు నవ్వాయి. ఆమె చెవికి ఉన్న లోలాకులు నవ్వాయి. ఆమె చేతికి ఉన్న గాజులు గలగలమని నవ్వాయి.
    'నేను చెప్పనా - ఈ మధ్య రాజా ఎక్కడుంటుందో? అని శాంత అంటే రాజా సిగ్గుపడిపోయింది.
    'వదినా! ఏమిటిది?' అని వారించింది.
    "బాబూ! ఈమధ్య రాజా ఒకరి మనసులో కూర్చుంది" శాంత వాక్యం పూర్తికాకుండానే రాజా రెండు చేతుల్తో ముఖం దాచుకుంది. అలక చూపింది. శాంతమీద కోపగించింది. "అబద్ధాలు చెప్పడం ఎప్పటినుంచి నేర్చావు?" అన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS