Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 43

"రావాలి! దిగి రావాలి!
దేవతలందరూ దిగి రావాలి!
రావాలి! దిగి రావాలి!
పాలపుంతకి అవతలివైపున    
మరుగుజ్జు సూర్యుడు
మరుగుజ్జు గ్రహం
ఎంతో దూరం
పెద్ద ప్రయాణం
చేసి వచ్చే దేవతలారా
రావాలి! దిగి రావాలి!"
వాళ్ళు అలా పాడుతూ నృత్యం చేస్తుంటే ఆకాశంలో కాంతి క్షణక్షణానికీ ఎక్కువ అవుతోంది.
సాహస్, అంకుష్ విస్మయంగా ఆకాశం వైపు చూస్తూ ఉండగానే...
ఆకాశంలో పడమటివైపు కనబడుతున్న వెలుగు మరింత తేజోవంతంగా మారుతోంది.
వెలుగు ఎక్కువ అవుతున్న కొద్దీ-
ఆ అనాది మానవుల కేకలు - మరింత పెద్దవయ్యాయి.
"దిగి రావాలి! దిగి రావాలి
దేవతలంతా దిగి రావాలి"
ఆ వెలుగు నిర్నిరీక్ష్యంగా మారి క్రమంగా చిక్కబడి ఒక ఆకారం దాల్చడం మొదలెట్టింది.
ఆటవికుల కేకలు మరింతగా ఎక్కువయ్యాయి.
ఆకాశంలో వెలుగు చిక్కబడి చిక్కబడి చివరికి ఒక నిర్దుష్టమైన రూపానికి వచ్చింది.
"ఫ్లయింగ్ సాసర్" అన్నాడు అంకుష్.
"స్పేస్ షిప్" అన్నాడు సాహస్.
వాళ్ళ మాటలు పూర్తి కాకముందే అరక్షణంలో ఆ వెలుగు కాస్తా అదృశ్యమైపోయింది.
"అదేమిటి? అదొక ఫ్లయింగ్ సాసర్ అంటావా?" అన్నాడు అంకుష్ ఆశ్చర్యంగా.
భుజాలు ఎగరేశాడు సాహస్.
"లుక్ సన్నీ! అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనబడే ఫ్లయింగ్ సాసర్లు వగైరాలు వున్నాయే వీటి విషయం ఇదమిద్ధంగా చెప్పలేం! ఒక్కొక్కసారి ఆకాశంలో ఎగిరే కొండల గుంపులూ, కొన్ని సందర్భాలలో ఆకాశంలో కనబడే కాంతిపుంజాలూ, ఇవన్నీ కూడా ఫ్లయింగ్ సాసర్లేనేమో అన్న భ్రాంతి కలిగిస్తాయి. అదలా వుంచితే ఫ్లయింగ్ సాసర్లు అంటే ఎగిరే పళ్ళాలు అనబడే స్పేస్ షిప్పులలో గ్రహాంతర వాసులయిన బుద్ధిజీవులు భూగోళం మీదకి రావడం, ఇక్కడి మనుషులు వాళ్ళని చూడడం - ఇలాంటి సంఘటనలు అనేకం రికార్డు అయివున్నాయి.  
"అంటే ఇంకో గ్రహం నుంచి బుద్ధిజీవులు ఈ భూగోళం మీదకి రావడం నిజమేనంటావ్?" అన్నాడు అంకుష్.
"అదే చెబుతోంది. ఫ్లయింగ్ సాసర్లని చూసినట్లుగా అనేకమైన రిపోర్టులు వున్నాయిగానీ వాటిలో నూటికి నూరుశాతం నిజమైనదని తేలింది ఇంతవరకూ ఏదీ లేదు" అన్నాడు సాహస్.
"మరి ఇందాక ఆకాశంలో కనబడింది నిజంగా ఒక ఫ్లయింగ్ సాసరే అనుకుంటే ఈ ఆటవికులకి దాని సంగతి ఎలా తెలిసింది? వాళ్ళు పాడిన పాటకి అర్థం ఏమిటి?" అన్నాడు అంకుష్ అయోమయంగా.
ఎగ్జయిటెడ్ గా అన్నాడు సాహస్.
"అదే విచిత్రం. ఇక్కడ నాకొక విషయం గుర్తు వస్తోంది"
"ఏమిటది?"
"ఆఫ్రికాలో ఉన్న నైజర్ నదీ ప్రాంతంలో డోగోన్ లు అనబడే ఆదిమ వాసులు వున్నారు. వాళ్ళలో చాలామంది గుహల్లో నివశిస్తూ వుంటారు. నాగరికత అంటే ఏమిటో బొత్తిగా తెలియని వాళ్ళు ఆ డోగోన్ లు".
"అయితే?" అన్నాడు అంకుష్.
"ఈ డోగోన్ జాతివారు చూడడానికి తక్కిన నీగ్రోలలాగే వుంటారుగానీ వాళ్ళలో ఒక ప్రత్యేకత వుంది" అన్నాడు సాహస్.
"ఏమిటది?"
"అనాగరికులయిన ఆ ఆదిమవాసులకి అద్భుతం అనిపించే అంతరిక్ష రహస్యాలు తెలుసు."
"నిజంగానే! ఆకాశంలో ఒక అతి చిన్న నక్షత్రం వుంది. అది మామూలుగా కంటికి కనబడదు. టెలిస్కోపులో చూసినా కూడా దాని దర్శనం దుర్లభం. దానిని ఖగోళ శాస్త్రజ్ఞులు 1970 లో మాత్రమే ఫోటో తీయగలిగారు."
"అయితే?" అన్నాడు అంకుష్.
"ఆ నక్షత్రం గురించి ఈ ఆదివాసులకి చాలా వివరాలు తెలుసు. ఆ నక్షత్రం అతి చిన్నదనీ, అతి కాంతివంతంగా, అతి బరువుగా, దాని ప్రక్కనే ఇంకో చిన్న నక్షత్రం వుందనీ, దానికి ఒక గ్రహం వుందనీ, ఈ ప్రాంతంనుంచి వచ్చిన బుద్ధిజీవులు తమ డోగోన్ జాతివారికి అనేకమైన అంతరిక్ష రహస్యాలు వగైరా చెప్పారనీ వారి నమ్మకం. అంతేగాక దేవుడు సృష్టించిన మొదటి నక్షత్రం ఇదేననీ, అన్నిరకాల పదార్ధాలు, ప్రాణులు మొదట ఇక్కడే రూపుదిద్దుకున్నాయనీ, మళ్ళీ చివరగా ఇక్కడే చేరుకుంటాయనీ కూడా ఆ డోగోన్ జాతి ప్రజలు చెప్పుకుంటారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS