Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 43


    కొడుకు ప్రయోజకత్వానికి సత్యం సంబరపడ్డాడు.

 

    మామా నీ కూతుర్నిచ్చి పెళ్ళిచేయమని లేకిగా అడిగేసి అల్లరి అవ్వకుండా- ఆ కోరికకు గట్టి పునాదివేసే ప్రయత్నంలో కృష్ణమూర్తి బిజీగా ఉన్నట్టు తెలిసి అదీవరస అనికూడా అనుకున్నాడు.

 

    ఇంత జరిగాక కూడా ఖాళీగా కూచోడం అతనికిష్టం లేకపోయింది. అంచేత ఎవ్వరికీ చెప్పకుండా రోడ్డెక్కాడు.

 

    బందరులో అందమయిన మైదానాలు ఎక్కువగానే ఉంటాయి. గిట్టనివాళ్ళు వాటికి పర్రలని పేరు పెడతారు. వదిలేయండి.

 

    సత్యానికి అలాంటి మైదానాలంటే గొప్ప యిష్టం. ఈ మధ్యకాలములో ఏ మైదానం ఎక్కడుందో కనుక్కుని సిద్ధంగా ఉన్నాడు గనక - సత్యం తన కారుని దేవుడి చెరువువేపు తిప్పేడు.

 

    దేవుడి చెరువు అనేచోట ఇప్పుడు చెరువులేదు. ఒకప్పుడు ఉండేదేమో తెలియదు.

 

    ఆ ప్రాంతమంతా సరుగుడు చెట్లతో చిన్న అడవిలాగా ఉంటుంది. వేపచెట్లు, చింతచెట్లు సరేసరి! గుంపులు గుంపులుగా ఉంటాయి.

 

    సత్యం కారు దిగి ఒక చెట్టు ఎక్కాడు.

 

    చాలా ఎత్తులో వున్న కొమ్మొకటి పట్టుకుని ఊగుతూనే అనేకమయిన ఫీట్లు చేస్తున్నాడు.

 

    తలకిందులుగా ఊగుతున్నప్పుడు అకస్మాత్తుగా కృష్ణమూర్తి కనిపించాడు.

 

    ఆ కృష్ణమూర్తి తలకిందులుగా కనిపించినప్పుడు గానీ సత్యానికి తెలీలేదు-తాను తలకిందులుగా ఊగుతున్నట్టు!

 

    వెంటనే చిన్న జర్కు ఒకటిచ్చి పైకొమ్మ మీదికి దూకి మామూలు పొజిషన్ కి వచ్చారు.

 

    అతనా ఫీటు చేస్తున్నప్పుడు కృష్ణమూర్తికి భయం వేసింది. పట్టు తప్పి తండ్రి పడిపోతాడేమోనని దడతో పరిగెత్తుకొంటూ చెట్టుకిందకొచ్చి నిలబడ్డాడు.

 

    చెట్టుమీద-చిటారు కొమ్మలో తండ్రి వున్నాడు.

 

    చెట్టుకింద కుమారుడున్నాడు.

 

    "నీకోసం వెతుక్కొంటూ ఇక్కడికొచ్చాను" అన్నాడు కృష్ణమూర్తి.

 

    "కంగ్రాట్స్! నన్ను కనుక్కొన్నందుక్కాదు! లక్ష్మీపతిని పడగొట్టి నందుకు!" అన్నాడు సత్యం.

 

    "ముందు చెట్టు దిగు!"

 

    "దిగను నాకు ఆనందంగా వుంది."

 

    "ఉంటే మాత్రం? మరీ అంత ఎత్తులోనా ఫీట్సు! కాలు జారితే ఏమవుతావ్?"

 

    "కింద పడతాను."

 

    "అప్పుడు కాలో చెయ్యో విరుగుతుంది."

 

    "విరగనీ! నీ విక్టరీ ముందు నా కాలూ చెయ్యీ ముఖ్యం కాదు."

 

    అల్లాంటి తండ్రి కడుపున పుట్టినందుకు కృష్ణమూర్తి ఆ క్షణంలో మరింత పొంగిపోయేడు. మొట్టమొదట తండ్రిని చెట్టు దింపితేనేగాని సుఖం లేదనుకొన్నాడు.

 

    జేబులో చెయ్యిపెట్టి గోలీలు తీశాడు కృష్ణమూర్తి. వాటిని గచ్చం గాయల్లాగా ఆ చేతిలోంచి ఈ చేతిలోకి-ఈ చేతిలోంచి ఆ చేతిలోకి ఎగరేసి పట్టుకొంటున్నాడు.

 

    చెట్టుమీద సత్యానికి కొడుకు చేతిలో గోలీలు కనిపించేసరికి కొత్త ఉత్సాహం కలిగింది.

 

    అయినాసరే చెట్టు దిగకుండానే అడిగాడు.

 

    "గోలీలేనా?"

 

    "కనిపించడం లేదా?"

 

    "ఏమిటి నాతో గోలీలాడగలవా?"

 

    "అదేదో తేల్చుకొందామనే వచ్చాను."

 

    ఆ మాట వినగానే సత్యం ఒక కొమ్మమీదికి జంపులుచేస్తూ నేలమీదికి వచ్చాడు.

 

    "కమాన్ ఆట ప్రారంభించు" అన్నాడు కొడుకుతో.

 

    ఆట మొదలయింది.

 

    ఆడుతూనే అంటున్నాడు కృష్ణమూర్తి...

 

    "లక్ష్మీపతి నా మాట కాదనడనే నమ్మకం కలిగింది."

 

    "మొత్తానికి కష్టపడి సాధించావ్! వాడి ముక్కుకి తాడేసావ్!"

 

    "కనుక డబ్బుకి ఎంత గడ్డికరిచే వెధవయినా మనిషి మంచితనానికి విలువ ఇస్తాడని ఇప్పుడయినా అర్ధమయిందా నాన్నా?"

 

    అని గోలీ సంధించాడు. అది గురి తప్పింది.

 

    తండ్రి విసుక్కున్నాడు---

 

    "ఆటల్లో ఉన్నప్పుడు దీక్ష అవసరం. సరిగ్గా ఆడు!" అన్నాడు.

 

    "ఇంక క్లెయిమాక్సు మిగిలింది. నేను గెలవాలని దీవించు నానా" అన్నాడు కృష్ణమూర్తి.

 

    గోలీతో గురిచూస్తూ అన్నాడు సత్యం.

 

    "ఏది జరిగినా నీ మంచికే?"

 

    అని గోలీ వదిలేడు. అది కూడా గురి తప్పింది.


                                      27


    ఆ సాయంత్రం...

 

    లక్ష్మీపతి, సత్యం ఇద్దరూ ఉండగా కృష్ణమూర్తి లక్ష్మీపతితో అంటున్నాడు...

 

    "క్షమించాలి? ఇన్నాళ్ళూ మీ దగ్గరో విషయం దాచాను"

 

    లక్ష్మీపతి హామీ యిస్తున్న ధోరణిలో అన్నాడు.

 

    "మరేం ఫర్వాలేదు. నువ్వేం దాచినా, ఏం చేసినా నాకు కోపంరాదు! విషయమేమిటో చెప్పు!"

 

    ఆ హామీకి అటు కృష్ణమూర్తి ఇటు సత్యం ఇద్దరూ సంతోషించేరు.

 

    కృష్ణమూర్తి నవ్వుతూ అన్నాడు...

 

    "నేనొక అమ్మాయిని ప్రేమించాను."

 

    ఆ మాటకి లక్ష్మీపతి గొల్లున నవ్వాడు. ఆ నవ్వు పూర్తయినాక సత్యంతో అన్నాడు.

 

    "ఏమండోయ్! ఏమిటో అనుకున్నాం మేస్టారూ అసాధ్యుడే! ప్రేమాయణంలో కూడా డిగ్రీలు పుచ్చుకుంటున్నాడు."

 

    "ఎంత మేస్టారయినా కుర్రాడే గదా!" అన్నాడు సత్యం.

 

    లక్ష్మీపతి కృష్ణమూర్తి భుజం తడుతూ అన్నాడు---

 

    "నువ్వు దాచిన విషయం ఇదన్నమాట? ఊ... ఇంకా ప్రేమలోనే ఉన్నావా? పెళ్ళివరకూ వచ్చావా?"

 

    "ఆ పెళ్లేదో పెద్దలు మీ చేతులమీదగా జరిపించితేనే అందం!" అన్నాడు కృష్ణమూర్తి.

 

    ఆ మాటకి లక్ష్మీపతి మురిసిపోయి అన్నాడు.

 

    "అంతకంటేనా? నీలాంటి యోగ్యుడి పెళ్ళి నా చేతులమీదుగా జరుగుతుందంటే అది నాకో ప్రిస్టేజికూడాను! ఏమంటారు సత్యంగారూ?"

 

    "అంతేగా మరి!" అన్నాడు సత్యం ముక్తసరిగా.

 

    అసలీ సంభాషణ ఎంతవరకు వెళ్ళి ఎట్లా మలుపు తిరుగుతుందో కూడా సత్యం ఊహించలేకుండా ఉన్నాడు అందువల్ల గొప్ప టెన్షన్లో కూచుని ఉన్నాడు.

 

    ఈ సంభాషణ చాటుగా వింటున్న పద్మ తన మనసులో కోటిదేముళ్ళకి మొక్కుకుంటోంది!

 

    మరోప్రక్కగా నిలబడి విషయం వింటున్న అన్నపూర్ణమ్మగారికి మాత్రం కళ్ళనీళ్ళు తిరిగేయి. భర్తతో చెప్పి వప్పించి కృష్ణమూర్తిని అల్లుడిగా చేసుకోవాలనుకున్న ఆశ కాస్తా ఆ క్షణంలో చప్పగా చల్లారిపోయింది. బంగారంలాంటి కుర్రాడనుకుందేగానీ ఎవర్నో ప్రేమించి పెళ్ళివరకు ఎదిగి పోతాడని ఆ క్షణంవరకు అనుకోలేదు. అసలీ విషయం ముందే తెలిసివుంటే అనవసరంగా ఆశను పెంచుకొనేది కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS