అలా కొట్టాలంటే ఎంతో తెగింపు కావాలి. జీవన్మరణ సమస్య ఏర్పడితే తప్ప మనిషికి తెగింపు రాదు.
గౌతమి అన్న చివరిమాట జ్ఞాపకాని కొచ్చింది రోష్ణికి.
"పిచ్చిపిల్లా! నీకు నాగతేపడుతుంది-" ఆ మాట అన్న వెంటనే భీముని పట్నం సన్నివేశం జ్ఞాపకానికొచ్చింది.
వెంటనే ఆకులా వణికిపోయింది రోష్ణి.
ఆపుకుందామన్నా ఆగని ఏడుపు వరదలాగా పారుతోంది. గట్లు తెంచుకుని పొర్లుతోంది.
ఆ ప్రవాహంలో తడిసిపోతోంది రోష్ణి.
అదే సమయంలో తలుపు చప్పుడైంది. కళ్ళు తుడుచుకుని లేచి తలుపు తీసింది.
ఎదురుగా పనిమనిషి.
"అమ్మాయి గారూ... మధ్యాహ్నం... మీకీ కవరొచ్చిందండి... మీరు లేరు కదా... నా దగ్గరే ఉంచాను..." చెప్పింది పనిమనిషి ఆ కవర్ని రోష్ణి చేతుల్లో పెడుతూ, పనిమనిషి వెళ్ళిపోయింది.
తలుపులోన గడియపెట్టి, ఆ కవరువేపు చూసింది రోష్ణి.
తెల్లటి పెద్దకవరు. ఆ కవరుమీద ఇంగ్లీషు టైప్ లో అక్షరాలు. ఫ్రమ్ అడ్రస్ కోసం చూసింది. ఎక్కడా కన్పించలేదు.
కవరు చింపింది.
అందులో ఒక ఫోటో.
ఆసక్తిగా బయటకు తీసిన ఆ ఫోటోని చూసి తల గిర్రున తిరిగిపోయింది రోష్ణికి.
భీమిలిలో తనూ, అవినాష్- ఇద్దరి వంటిమీదా బట్టలేవు. అవినాష్ ముఖం కన్పించడంలేదు.
రోష్ణి గజగజా వణికిపోయింది. విలవిల్లాడిపోయింది.
షాక్ మీద షాక్...
మంచమ్మీద మళ్ళీ కూలబడి పోయింది.
* * * *
అప్పుడు రాత్రి పదకొండు గంటలైంది. ఆటోదిగి తూలుకుంటూ రూం కొచ్చాడు అవినాష్.
తాళం తీసి, ఎడమవేపు గోడకున్న స్విచ్ ఆన్ చేశాడు.
గదినిండా ట్యూబ్ లైట్ వెల్తురు అవినాష్ మత్తు కళ్ళకు జిగేల్మని తగిలింది.
అతని మత్తు కళ్ళకు గది నేలమీద తెల్లటి కవరు కన్పించింది. తెల్లటి పెద్ద కవరు. ఆ కవరుమీద ఇంగ్లీషు టైపులో అక్షరాలు. ఫ్రమ్ అడ్రస్ కోసం చూశాడు అవినాష్. ఎక్కడా కన్పించలేదు.
అతని కళ్ళకు నిద్రవస్తోంది. మర్నాడుదయం తీరిగ్గా చూద్దామనుకుని టేబిల్ మీదకు విసిరేసి, గది తలుపు వేసేసి, లైటార్పి మంచమ్మీద పడిపోయాడు.
కానీ అవినాష్ కళ్ళకు నిద్రరావడం లేదు.
ఏవిటా కవరు? ఆ కవర్లో ఏవుంది? గబుక్కున లేచి లైటు వేసి టేబిల్ మీదున్న ఆ కవరు తీసి చింపాడు.
అందులో ఒక ఫోటో.
ఆసక్తిగా బయటకు తీసిన ఆ ఫోటోని చూసి తలగిర్రున తిరిగి పోయింది అవినాష్ కు.
తాగుడు మత్తంతా ఎగిరిపోయింది.
ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి గౌతమి, రెండో వ్యక్తి అవినాష్.
అవినాష్ చెయ్యి గౌతమి కంఠమ్మీదకు వెనకనుంచి పడుతున్న సమయంలో తిరుపతి కొండమీద తీసిన ఫోటో అది.
షాక్ మీద షాక్...
అవినాష్ వంటినిండా చెమట్లు పట్టేశాయి.
ఈ ఫోటో ఎవరు తీసారు? ఎవరు పంపారు...? అవినాష్ కి చటుక్కున ఫోటోగ్రాఫర్ జ్ఞాపకాని కొచ్చాడు.
"స్కౌండ్రల్..." బయటకు గట్టిగా తిట్టాడు.
ఫోటోని వెనక్కి తిప్పి వివరాల కోసం చూశాడు.
అక్కడ వివరాలేం లేవు. అక్కడ ఒకే ఒక్క వాక్యం రాసుంది.
ఆ వాక్యం
"భీమిలి ఫోటోలు కూడా కావాలంటే పంపిస్తాను."
ఆ వాక్యం చదవగానే కొండచిలువ నోట్లోకి దూరుతున్నట్టుగా అయిపోయాడు అవినాష్.
టేబిల్ మీద పిడికిలితో బలంగా గుద్ది... ఆ గదిలో గాభరాగా తిరిగాడు. పిచ్చికుక్కలా తిరిగాడు...
అతని చేతిలో ఉన్న ఆ ఫోటో వెనక వాక్యాన్ని మళ్ళీ చూశాడు.
"భీమిలి ఫోటోలు కూడా కావాలంటే పంపిస్తాను..."
ఆ వాక్యానికి పైన కార్నర్లో ఒక ఫోన్ నెంబరుంది.
అంటే...
ఆ ఫోటోగ్రాఫర్ తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
వెంటనే ఫోన్ దగ్గరకు నడిచాడు అవినాష్.
ఫోటో వెనక రాసున్న నెంబరుకి డయల్ చేసాడు.ఐదు నిమిషాలసేపు రింగవుతున్నా ఎవరూ ఎత్తలేదు.
మళ్ళీ ట్రై చేశాడు.
ఈసారి వెంటనే ఎవరో ఎత్తారు.
"ఈజిట్... ఒన్ టు సిక్స్ ఫోర్ ఫైవ్..." అడిగాడు అవినాష్.
"ఎస్... ఫోటోగ్రాఫర్ మధు స్పీకింగ్..."
అవినాషేం మాట్లాడలేదు. ఎలా మాట్లాడాలో అతనికేం అర్థం కావడం లేదు...
"ఫోటో అందిందా..." మధు తనకెవరు ఫోన్ చేశారో గుర్తు పట్టేశాడు. ఆ తర్వాత అన్నాడు.
"అమ్మాయిల్తో డబుల్ గేమ్ ఆడడం మంచిది కాదురా బాబూ... అందుకే ఆ ఫోటోలు పంపాను..."
"నీకేం కావాలి..." కోపంగా అన్నాడు అవినాష్.
"ఎన్నివేలిస్తావ్..." వెక్కిరింతగా అన్నాడు మధు.
"నీ దగ్గరున్న మొత్తం నెగెటివ్ లు నాక్కావాలి- పది వేలిస్తాను-"
