"పదివేలా-" నవ్వాడు మధు.
"ఆ ఫోటోల్ని మామూలుగా పత్రికలకిచ్చుకుంటే-పదివేలొస్తాయి.అందులోనూ - భీమిల్లోని ఫోటోలు - ఫారిన్ కి ఎక్స్ పోర్ట్ చేస్తే లక్ష రూపాయలొస్తాయి-" అన్నాడు మధు.
"అయితే లక్షరూపాయలు కావాలంటావ్..." గట్టిగా అరిచాడు అవినాష్.
"అరవకు - యాభై వేలివ్వు చాలు-"
"యాభై వేలా... అంత డబ్బు నా దగ్గర లేదు-"
"నీ దగ్గరలేదా - పోనీ లేకపోయినా పర్వాలేదు- రోష్ణీ ఉంది కదా- ఆ గోల్డెన్ గర్ల్ ని అడుగు- ఇస్తుంది-" సలహా చెప్పాడు మధు.
"రేపు పన్నెండు గంటలకు బృందావన్ హోటల్లోకి రా-డబ్బు తీసుకుని- నీ నెగటివ్ లు నీకిస్తాను - ఓ.కె-" మధు ఫోన్ పెట్టేశాడు.
ఈ పరిస్థితుల్లో రోష్ణీ డబ్బిస్తుందా? ఇవ్వకపోతే... వాళ్ళ డాడీకి ఇవేవీ తెలీదు కదా... రేపుదయాన్నే వెళ్ళి అత్యవసరమని ఆయన దగ్గర యాభైవేలు తీసుకుని...
ముందు ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర్నించి ఆ నెగెటివ్ లు తీసేసుకోవాలి.
ఆ తర్వాత...
తను వాటితో రోష్ణీ డాడీని బ్లాక్ మెయిల్ చెయ్యాలి. నిర్ణయించుకున్నాడు అవినాష్.
రోష్ణీ డబ్బుతోనే రోష్ణీని బ్లాక్ మెయిల్...
ఆ అయిడియా రావడంతోనే తన తెలివితేటలకు తనే పొంగిపోయాడు.
ఒక సమస్యకు పరిష్కారం దొరికినందుకు అవినాష్ మనసుకి ఊరటగా ఉంది.
అతనికి ఆ రాత్రి చాలా హాయిగా నిద్రపట్టింది.
* * * *
రోష్ణీని, అవినాష్ ని చూసిన మరుక్షణంలొ గౌతమికి అసలు విషయం అర్థమైంది. అవినాష్ తననెందుకు చంపాలని నిర్ణయించుకున్నాడో తెల్సింది.
తెల్సిన మరుక్షణం గౌతమి ఆశ్చర్యపోలేదు మరోసారి ఆమె గుండె భగ్గుమంది.
ఒకే ఊళ్లో ఉండి, అతను మరో అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే, తనకు తెలీకుండా పోవడం తలచుకుంటుంటే ఆశ్చర్యంగా ఉందామెకు.
నిజానికి ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమెకు తెల్సు.
అవినాష్ వ్యక్తిత్వం గురించి మొట్టమొదటిసారి తిరుపతి కాటేజ్ లోనే తెల్సింది. అవినాష్ లాంటి తేనెపూసిన కత్తులు, రెండో కంటికి తెలియకుండా, కుత్తుకలు కత్తిరించగలరని, అప్పుడే అర్ధమైంది ఆమెకు.
ప్రస్తుతం తన కర్తవ్యం?
తన ప్రాణం పోయినా ఫర్వాలేదు. అవినాష్ కు సరైన గుణపాఠం నేర్పాలి.
రోష్ణిని కల్సుకుంటే... లాభంలేదు... అవినాష్ ప్రేమమైకంలో మునిగిపోయిన ఆ అమ్మాయికి తను చెప్పేది తలకెక్కదు. అవినాష్ కురిపించే ప్రేమ జల్లులు, ఆమెమీద కాదని, ఆమె వెనకనున్న కోట్లరూపాయల ఆస్తి మీదని, ఆమెకెలా అర్ధమౌతుంది.
పోనీ... ఆమె తండ్రి ధన్ రాజ్ కి చెప్తే... ఆయన్ని కలసి జరిగిందంతా చెప్తే...
ఆయన వినొచ్చు... అసలాయనకు తన కూతురి ప్రేమ విషయం తెలుసా! తెల్సి ఉంటే...
వెనక పైసా ఆస్తిలేని... అవినాష్ కు కోట్లరూపాయల ఆస్తికి వారసురాలైన తనకూతుర్నిచ్చి ధన్ రాజ్ పెళ్ళి చెయ్యగలడా!
ఆయన మనస్తత్వం ఎలాంటిదో...
ఎనీ హౌ అవినాష్ మనస్తత్వం ఆయనకు తెలియాలి... అప్పుడు ఖచ్చితంగా ఆలోచనలలో పడతారాయన... తన కూతురు ప్రేమిస్తున్నది ఒక మోసగాడ్నని... అమ్మాయిల్ని వంచించి, వలలో వేసుకుని, అవసరం తీరాక, గొంతు నులిపేసే కిరాతకుడని ధన్ రాజ్ కి తెలియాలి.
తెల్సుకున్న మరుక్షణం.
రోష్ణి దగ్గరకు అవినాష్ రాకుండా జాగ్రత్తపడతాడాయన.
రోష్ణి తనమాటలు నమ్మకపోవచ్చు... కానీ ఆధారాలతో సహా తన ముందు నిలబడ్డ, కన్నతండ్రి మాటల్ని తప్పకుండా నమ్ముతుంది రోష్ణి.
అప్పుడు...
అవినాష్ ని ఛీ కొడుతుంది రోష్ణి. ఇంత మోసగాడివనుకోలేదని మొహమ్మీద తలుపేస్తుంది.
చెరిగిపోయిన కలలతో...
తుడుచుకుని పోయిన ఆశల్తో...
భరించలేని పరాభవంతో...
అవినాష్ రోడ్డుమీద పడతాడు...
రోడ్డుమీద పడ్డ అవినాష్ ని ఎలా చిత్రహింసలు పెట్టాలో తనకు తెల్సు.
ఎలా మానసిక వేదనకు గురిచెయ్యాలో తనకు తెల్సు.
పలు ఆలోచన్లతో పక్కమీద దొర్లుతున్న గౌతమికి ఒక్కసారి నవ్వొచ్చింది...
పకా పకా నవ్వింది...
ఆ నవ్వులో తను పడిన అవమానపు బాధ ఉంది.
ఆ నవ్వులో కక్ష ఉంది...
ఎట్టకేలకు నిద్రపోతున్నపుడు-
మర్నాడు ధన్ రాజ్ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది గౌతమి.
* * * *
ఉదయం...
సమయం ఎనిమిది గంటలైంది.
తలుపు టక... టక చప్పుడు కావడంతో మెలుకువొచ్చింది అవినాష్ కు.
ఎవరై ఉంటారు...?...ఆ ఫోటోగ్రాఫర్... ఎందుకొస్తాడు...
గబగబా లేచి, టేబిల్ మీదున్న ఫోటోని కవర్లో పెట్టేసి, దాన్ని టేబిల్ సొరుగు అడుగున కన్పించకుండా దాచేసి, తలుపు దగ్గరకు నడిచి, తలుపు తీశాడు.


