"కమాన్ మాలా... పోదాం-" పక్కనున్న మాల చేయి పట్టుకుని ఎవరివేపూ చూడకుండా... గబగబా... అడుగులేసుకుంటూ బయటి కొచ్చేసింది గౌతమి.
బయట ఖాళీగా ఉన్న ఆటోలో ఎక్కికూర్చుంది. పక్కనే మాల.
"పోనీ..." చెప్పింది గౌతమి ఆయాసంగా.
ఎక్కడకు వెళ్ళాలని కూడా ఆ ఆటోవాడు అడగలేదు.
అంతకు పూర్వం ఒక కుర్రాణ్ణి గౌతమి చెప్పుతీసి కొట్టడం చూసిన వాళ్ళలో అతనూ ఉన్నాడు.
అవినాష్ కారెక్కడానికి డోర్ తెరిచాడు.
"మిస్టర్ అవినాష్... ఆ డోర్ మీద చెయ్ తియ్..." కోపంగా అతని ముఖంలోకి చూసి ఉబికివస్తున్న కన్నీళ్ళను, అవమానాన్ని గుండెల్లో దిగమింగుతూ రోష్ణి గేరు తిప్పింది.
ఆ కారు కాంపౌండ్ లోంచి బయటికి అరక్షణంలో దూసుకుపోయింది.
అవినాష్ కేం చెయ్యాలో కొద్దిక్షణాలు - అతని మెదడు మొద్దుబారి నట్లయింది. తోచలేదు-గబగబా అక్కడ నుంచి పరుగు పరుగున బైటకొచ్చాడు.
అతని వెనక జనం "రాజ్ బబ్బర్... రాజ్ బబ్బర్" అని వెక్కిరిస్తూ కేకేయడం విన్పించలేదు.
15
ఊరికి దూరంగా ఉన్న చంపా బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చున్నాడు అవినాష్.
అప్పటికి అరగంటయింది. ఆఫ్ బాటిల్ ఖాళీ అయింది.
గౌతమి కనిపించడం అవినాష్ కి పెద్దషాక్. కాగా నడిరోడ్లో, కొన్ని వందల మంది ఎదుట చెప్పు దెబ్బలు తినడం మరింత షాక్.
గౌతమి బతికే ఉంది. బతికే ఉందన్న నిజాన్ని అవినాష్ భరించలేక పోతున్నాడు. తనిచ్చిన 'ఆంటీమనీ' పనిచేయలేదా? 'ఆంటీమనీ' పని చేయకపోవడం అన్న ప్రశ్నలేదు. మరి... ఏవైంది- "ఎందుకు చావలేదు?" ఆ ప్రశ్న అతని గుండెగదిలో సుడులు తిరుగుతోంది.
అప్పుడు అవినాష్ కి చటుక్కున ఓ విషయం జ్ఞాపకం వచ్చింది. అది కాఫీ తాగుతూ-ఏదో వాసన వస్తోందని మొహం చిట్లించడం...
ఉన్నట్లుంది... అతని ఆలోచనలు ఆగిపోయాయి. అతని మెదడు స్తంభించి పోయింది.
అంటే... గౌతమి గర్భంలోకి వెళ్ళింది ఆంటీమనీ కాదు. ఎందుకంటే ఆంటీమనీ వాసనరాదు. అంటే శ్రీధర్ ఆంటీమనీ సీసాలో ఇంకేదో మందు ఉంచాడేమో... తను దానినే ఆంటీమనీ అనుకుని తెచ్చేశాడు...
పూర్ బేబీ!
ఒరే అవినాష్ నవ్వు ఓడిపోతున్నావు.
అవును... అంతే జరిగి ఉంటుంది... మృత్యువు ఒడిలోకి వెళ్ళాల్సిన గౌతమి మత్తులో పడిపోయింది... మత్తులోంచి బయటపడ్డ మరోక్షణం తన పధకం అర్ధమై ఉంటుంది. తనను చంపడానికి కుట్ర చేశాడని తెల్సిపోయి ఉంటుందామెకు. ఫలితం... రోష్ణి ముందు తనని చెంపదెబ్బ కొట్టింది... అది చెంపదెబ్బకాదు- తన లక్ష్యమ్మీద రోష్ణి దెబ్బకొట్టింది. రోష్ణిని అడ్డు పెట్టుకుని కోటీశ్వరుడు కావాలనుకున్న తన ఆశలమీద దెబ్బకొట్టింది.
ఏం చేయాలిప్పుడు-?
గౌతమి మాటల్ని రోష్ణి నమ్ముతుందా? నమ్మకుండా ఉంటుందా?
"ఉహుఁ! నమ్ముతుంది.
ఏం ఫర్వాలేదు - రోష్ణిని తను నమ్మించగలడు - గౌతమి ఒకప్పుడు - తనని ప్రేమించిందని - తన చుట్టూ తిరిగిందని - పెళ్ళి చేసుకొమ్మని బతిమిలాడిందని, తను నిరాకరించేసరికి ఎవరితోనో తిరిగి గర్భం తెచ్చుకుని, వాడు మోసం చేసే సరికి తనకు పుట్టబోయే బిడ్డకు, తనని తండ్రి చేయడానికి పధకం పన్నిందని చెప్పాలి.
అందుకే కావాలని, రోష్ణితో తను ఉన్నపుడే తనమీద దాడి చేసిందని చెప్పాలి. అలా చేస్తే నడిబజార్లో జరిగిన అవమానానికి రోష్ణి మనసు దెబ్బతిని, తనకు దూరమౌతుందని తెలివిగా ఎత్తువేసిందని రోష్ణిని కన్విన్స్ చెయ్యాలి.
తన రీజనింగ్ ని చచ్చినట్టు రోష్ణి నమ్ముతుంది.
టీనేజ్ లో ఉన్న రోష్ణి, మొదటిసారి ప్రేమలో పడ్డ రోష్ణి, ఆ ప్రేమ ఉచ్చులోంచి బయటపడడానికి కొంత సమయం పడుతుంది.
కానీ-
గౌతమిని వదిలించుకోవడం ఎలా-
ఒకే ఒక మార్గం- ఈసారి ఖచ్చితంగా చంపడం నిర్ణయించుకున్నాడు అవినాష్.
* * * *
ధియేటర్ దగ్గర అనుకోని అవమానాన్ని ఎదుర్కొన్న రోష్ణి అవినాష్ కంటే ఎక్కువ షాక్ తింది.
పదిమందిలో అవినాష్ పక్కనున్నందుకు, తనకు జరిగిన అవమానం కంటే, ఇన్నాళ్ళూ తను ప్రేమించింది ఒక మేకవన్నె మృగమని, అనే సత్యం ఆమె మనసుని చెదపురుగులా తినేస్తోంది.
రోష్ణి నేరుగా కారుని గేటులోంచి లోపలికి తీసికెళ్ళి, సడన్ బ్రేక్ కొట్టింది. కీచుమంటూ బైర్లు నేలను బలంగా రాసుకుంటూ శబ్దం చేశాయి. ఆ శబ్దానికి లాన్లో పని చేసుకుంటున్న తోటమాలి ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు.
కార్ డోర్ తెరచుకుని, కిందకు దూకుతూ నేరుగా హాల్లోంచి మేడపైకి పరుగెత్తి, తనగదిలో దూరి మంచమ్మీద బోర్లాపడి పోయింది ఏడుస్తూ రోష్ణి, మరుక్షణం ఆ గదంతా రోష్ణి ఏడుపుతో ప్రతిధ్వనించింది. ఎంత ఆపుకుందామనుకున్నా సాధ్యం కావడం లేదామెకు, ఏడుస్తూనే రోష్ణి ఆలోచిస్తోంది.
ఎవరా అమ్మాయి - అవినాష్ వల్లే తనకు గర్భం వచ్చిందని చెప్తోంది. తనని పెళ్ళి చేసుకుంటాడని వంచించి, చివరకు చంపబోయాడని అంటోంది. నిజమేనా! నిజం కాకపోతే - పదిమందిలో ఒక ఆడపిల్ల, ఒక మగాడ్ని ఎందుకు కొడుతుంది.
