28
సాయంకాలం సింగారించుకొని భర్త కెదురుగా వెళ్లి చిరునవ్వుతో స్వాగతం చెప్పాలనుకొని త్వరత్వరగా ముస్తాబు ముగించుకోంది వసంత. కానీ ఎందుకో అందుకు మనసు అంగీకరించలేదు. తీరా అక్కడికి వెళితే నిరాదరణ తన పాలిట పడితే? దుర్భరం కదూ? అంతకన్నా ఊరు కుండడమే మేలు. నిశ్చయించుకొంది వసంత.
ఆదరణ కు ఆనందించే హృదయం నిరాదరణ కు నిలువ లేకుంటే ఎలా? ఆశకు లోబడ్డ నాడు నిరాశ ను భరించాలి. అది చేత కానప్పుడు ఏ ఆదరణనూ అశించ కూడదు. ఏ ఆశకూ లోబడకూడదు. కానీ మానవుల మనస్సు అంత స్థిరంగా ఉండదు. అయాచితమైన ఆనందం లభిస్తే అందుకొనే విధం తెలియని అసహాయత వారి నావరిస్తుంది.
క్రింద కారు వచ్చిన చప్పుడయింది. గుండెల్లో తెలియని ఆనందం, భయం. హృదయంలో చిలిపిగా గంతులు వేసే కోరిక. లేచి వెళ్ళ మంటుంది. అభిమానానికి కూడా ఆస్కారం లేని పట్టుదల ఆపని చెయ్యనివ్వ లేదు. అడుగుల చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ ఆత్రుత హెచ్చుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. లేచింది. కానీ అడుగు ముందుకు పడలేదు.
గదిలోకి అడుగు పెట్టిన రాజ్ ఒక్క క్షణం ముస్తాబై ఉన్న వసంత ను చూశాడు. కళ్ళు చెదిరిపోయే అందం. కానీ అందుకో కూడదనే నిస్సహాయత. ఆమె చూపులు అతడి దృష్టిని మళ్ళించాయి. వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మొహం పై చిరు చెమట తో బూట్లు విప్పుకొంటున్న అతన్ని చూసింది వసంత. ఆ పని తానూ చేసి తన పైట చెరుగుతో ఆ చిరు చెమటను తుడిచి వేస్తె? కానీ ఏదో శక్తి అడ్డు పడుతుంది. తన నిస్సహాయతకు ఏడావాలనిపించింది. కానీ ఎదురుగా ఉన్న భర్త ముందు చులకనై పోతాననే భయం.
అందమైన పూల తోట. అందులో ఎత్తుగా ఆకర్షణీయంగా పెరిగిన గులాబీ! దాని చుట్టూ ముళ్ళ కంప. ఆ కంప కు యింటి చుట్టూ కాంపౌండు గోడ అడ్డు. అందరూ తేరి చూడలేని పువ్వు. చూడ గలిగిన వారికి అందని పువ్వు. అందుకో గలిగిన వారి కది చేతకాకనో, అక్కర లేకనో ?చూడగానే ఉవ్విళ్ళూరించే ఆకర్షణ. ఆ ఆకర్షణ కు లొంగి అనుభవించలేక పోతున్నామనే బాధ.
ఏదో మాట్లాడాలనే ఇద్దరికీ ఆశ. కానీ మూగపోయాయి ఆ హృదయాలు.
దుస్తులు మార్చుకొంటూనే ఆమెను గమనించాడు . ఎక్కడికో బయలు దేరాదామనే ఆ అలంకరణ చేసుకోందని గ్రహించగలిగాడు. మరి ఎందుకో ఆ ఆలస్యం? తోడూ కావాలనా? అందుకు బిడియమా? అభిమానమా? రెండింటిలో ఏదైనా తనదిగా వర్తించుకోగలదు మొదటిది సహజం. రెండవది అసహజమైనది. నవ్వు వచ్చింది.
'అలా బయటి కొస్తావా, వసూ?" అడిగాడు రాజ్.
ఎగిరి గంతేసింది వసంత హృదయం. తను అడగవలసినది అతడే అడుగుతున్నాడు. మరి ఇంకా ఎందు కాలస్యం? సంతోషంతో తన అంగీకారాన్ని తెలుప వచ్చుగా? అదే ఆలస్యమయింది. అదే త్వరగా చెప్పలేక పోయింది. మౌనం వహించింది. "సరే' అని నిట్టూర్చి వెళ్ళిపోయాడు రాజ్.
ఖస్సుమని బుస కొట్టింది ఆ హృదయం. ఒక్క పరుగున వాకిలి వరకూ వచ్చింది. క్రిందికి వెళ్ళిపోతున్నాడు. "ఏమండీ!' అని పిలవాలను కొన్న ఆ మాట ఆ నాలిక చివరనే ఆగిపోయింది. తిరిగి బాల్కనీ లోకి వచ్చి వీధి లోకి చూసింది. కాంపౌండు గేటు దాటి వీధిలో పాతున్న రాజ్ ను చూసింది. హుందాగా నడిచి పోతున్నాడు. వసంత కళ్ళమ్మ ట రెండు కన్నీటి చుక్కలు జారాయి. తుడుచుకుని క్రిందికి దిగింది.
* * * *
సముద్రపు ఇసుకలో కూర్చొని పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఆలోచిస్తుంది వసంత. మనసులో తుఫాను రేగుతుంది. పెళ్ళయి నెల దాటిపోయినా ఒక్కనాడైనా భర్తతో మనసిచ్చి చనువుగా మాట్లాడి ఉండలేదు. ఎందుకీ బ్రతుకు? ఎలా ఈ ఒంటరి తనం భరించడం?దీనికి విముక్తే లేదా? చుట్టూ చూసింది. దూరంగా కొన్ని జంటలు నడిచి వస్తున్నారు. మరికొన్ని జంటలు కులాసాగా కబుర్లు చెపుతూ నవ్వుతూ గడుపుతున్నారు. వారి ఆనందం తనకు లేదు. ప్రక్కన చూసింది. అక్కడ రాజ్ ను ఊహించుకోంది. అప్పుడు అక్కడ ఉన్న వారి నందరినీ జయించిన గర్వం. కానీ ఆ ఖాళీ స్థలం, ఆ వెలితి చివుక్కుమని పించింది.
తలెత్తి చూసింది. అటుగా పోతున్న ఒక వ్యక్తిని చూసి "మూర్తి" అని పిలిచింది.
ఆ వ్యక్తీ వెను తిరిగి చిరునవ్వుతో ఆమె దగ్గరికి వచ్చాడు.
"ఏం, వసంతా, ఒంటరిగా ఉన్నావు?"
ఎత్తి పొడుపు కనిపించింది, కప్పి పుచ్చింది.
"దానికేం గాని, చాలా రోజులకు కనిపించావు." అంది. అతని తో మాట్లాడుతూ ఉండిపోయింది. అందులో ఆ బాధను మరిచి పోగలిగింది. ఊరడి కలిగించే తృప్తి -- బాధను పోగొట్టే హాయి -- చాలనుకోంది.
"వసంతా , పిక్చర్ కెళదామా?"
జవాబివ్వలేక పోయింది. అస్వతంత్రత ఆమె నావరించింది. ఎదురు తిరిగింది. ఏదో భయం ఆవేశించింది.
"భయపడుతున్నావా?' అడిగాడు మూర్తి.
"అబ్బే! నాకేం భయం?' గర్వం ఆమెను అతని వెంట పిక్చర్ తీసుకెళ్ళింది.
* * * *
"గోపీ, రాజా కనిపించాడా?' అడిగాడు ఆనంద్.
"లేదురా! అసలీ మధ్య వాడిని చూడడమే తటస్థించటం లేదు."
"అయినా ఇప్పుడు వాడి దగ్గర చేరాలంటే భయంగా ఉందిరా! వాడి గంబీరత్వాన్ని చూసి జడుసు కుంటాను అప్పుడప్పుడు. అప్పుడు మనకు తోడు నీడగా ఉండి కవ్వించి కబుర్లు చెప్పి నవ్వించే వాడు వీడేనా అని అనుమానం కూడా వస్తుంది."
"ఏం చేద్దాంరా? పరిస్థితులు. అటువంటి వాడు మిత్రుడు గా దొరకడం మన అదృష్టం. వాడి విషయం తలుచుకొంటే గుండెల్లో వ్యధ బయలుదేరుతుంది. పోనీలే కానీ, నువ్వు మీ నాన్నగారి లా వ్యాపారం లోకే దిగదలుచుకున్నావా?"
"మరేం చెయ్యమంటావు? పరీక్ష తప్పాను. ఒకవేళ పాసయినా ఆ పాడు ఉద్యోగాలు చెయ్యలేను. హాయిగా వ్యాపారం చేసుకొంటే ఏ తంటా ఉండదు."
'అవునులే. ఎవరి కిష్టమైనది వారి ప్రవృత్తి అనుకోవలసిందే."
"లత పాసయ్యింది. క్లాసు తెచ్చుకుంది గదా? పెళ్లి కాగానే ఉద్యోగం చేయిస్తావా'?"
"అది ఆమె ఇష్టం. చేస్తానంటే వద్దని చెప్పను. వీల్లేదంటే బలవంతం చెయ్యను. అయినా పెళ్లి కానిదే ఎందుకీ ఆలోచనలన్నీ?"
"అదేంత సేపు లేవోయ్! త్వరలో ఆ ముచ్చటా తీరిపోతుంది."
బాల్కనీ లో నిలబడి మిత్రులిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సినిమాకు వచ్చేవారిని చూస్తూ మాట్లాడు కుంటూ కాలం గడపడం వారికి సరదా -- అలవాటు.
"ఒరేయ్ గోపీ, అక్కడ వచ్చేదెవరో చూడు.' గోపీ అప్పుడే దియేటరు లోకి ప్రవేశిస్తున్న వసంత నూ , మూర్తి నీ చూశాడు.
'ఆ ప్రక్కన వాడు ఎవడ్రా?' అన్నాడర్ధం కాక.
"ఉన్నాడు లే. వాడొక వెధవ. ఒకసారి మా అరుణను ఏమో అన్నాడట; ఊరుకొంది. అదే పనిగా ఏడిపించడం మొదలు పెట్టాడు. ఒకసారి బాగా చితక దన్నాను. పీడ వదిలింది. అప్పుడు రాజా కూడా ప్రక్కనే ఉన్నాడు. అయినా ఈ మహాతల్లి కేం పోయేగాలం? వీడి వెంట తిరుగుతోంది. ఛ!' అని అప్పుడే బాల్కనీ లోకి ప్రవేశిస్తున్నవారిని చూసి తల త్రిప్పేసు కొన్నాడు.
గోపీ మరేం మాట్లాడలేక పోయాడు. వీరిని చూసింది వసంత. గతుక్కుమంది. నేరక వీరి కంట బడ్డానే, ఏం జరుగుతుందో నని భయపడింది. ఆనంద్ ను చూసిన మూర్తి వంచిన తల ఎత్తలేదు. వారు లోపలికి పోగానే ఆనంద్ కోపంతో పళ్ళు పటపట కొరికాడు. వారి హృదయాలు భాధతో సుళ్ళు తిరిగాయి.
రాత్రి పది గంటలవుతుండగా రాజ్ మామగారి గదిలో వారితో చదరంగం ఆడుతూ కూర్చున్నాడు. అటకట్టి పెట్టి "నా ఒంట్లో ఏం బాగుండడం లేదీ మధ్య. అందుకని రేపే ఆ పని పూర్తీ చేయాలను కొంటున్నాను. నా నిశ్చయం నేను పూర్తీ చేయక ముందు అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడాలి పిలు." అన్నారు ఆనందరావు గారు.
అయన ఉద్దేశ్యం గ్రహించాడు రాజ్. విల్లు వ్రాయడానికి తాపత్రయం పడుతున్నాడు అని అతనికి తెలుసు.
"వసంత పైన నిద్ర పోతున్నట్లుంది. మీరూ పడుకోండి. రేపు మాట్లాడవచ్చు." అన్నాడు.
"సరే. ప్రొద్దు పోయింది. నువ్వెళ్ళి పడుకో" అని ప్రక్క పై మెను వాల్చారు ఆనందరావు గారు.
రాజ్ బయటికి వచ్చాడు. గది ప్రక్కనే అప్పుడే ఎక్కడి నుండో తిరిగి వచ్చి వీరి మాటలు వింటున్న వసంత ను చూశాడు. ఏమైనా అంటాడేమోనని భయపడింది. కానీ అది తన తత్వమే కాదన్నట్లు వెళ్ళిపోయాడు రాజ్ పైకి. తండ్రితో తన బాధంతా చెప్పుకోవాలని పించింది. కానీ ఏం చెప్పగలదు? తనను పల్లెత్తు మాట అనని వారిపై ఏం తప్పు చూపొంచ గలదు? తనను దండించడం లేదని చెప్పగలదా? అతన్ని కవ్వించి కోపాన్ని తెప్పించాలని అతని వెనుకే పోయింది.
"నాన్నతో అబద్దం ఎందుకు చెప్పారు?"
"తర్వాత చెప్తాను గానీ, వంటలక్క పాపం నీకోసం ఎదురు చూస్తూ కునికి పాట్లు పడుతోంది. వెళ్లి భోజనం చేసిరా."
"నాకు నా ప్రశ్నకు సమాధానం కావాలి." కోపమొచ్చింది రాజ్ కు. నిగ్రహించు కొన్నాడు.
"నిజం చెప్పడం. నాకిష్టం లేదు గనుక."
"ఎందుకని?"
"అది నేను చెప్పలేను. నీకంత ఇష్టమైతే వెళ్లి చెప్పి వస్తాను."
"ఏమిటా మొండి సమాధానం?" గద్దించింది వసంత ఓర్పు నశించి.
ఎంత దురుసుగా మాట్లాడినా ఏమనడే, ఎలా చావడం అని ఏడుస్తుంది ఆమె మనసు.
ఆ గద్దింపు విని కోపంగా చూశాడు రాజ్. అంతే అక్కడి నుండి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది వసంత.
