Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 42


                                                                    చప్పటి కథ

    "కథారచయితలు అబద్ధాలు ఎక్కువ రాస్తారు. అయినా మనిషి వాటిని మరువలేడు." సుందరం అన్నాడు. అతని వెంట్రుకలు చిందరవందరగా ఉన్నాయి. చేతిలో సగంకాలిన బీడీ ఉంది, దాన్ని ఆర్పి నలిపి జేబులో వేసుకున్నాడు. అతడు గదిని చూచాడు. గదిలో ఉన్న ఫర్నీచర్ చూచాడు.
    "ఈ గదిలో ఇదే గదిలో కూర్చుని ఎన్ని ఆలోచించానో? ఏమేమి చేశానో? వొట్టు పెట్టుకుని చెబుతున్నాను-ఒక్కటీ గుర్తులేదు. దరిద్రం చాలా చెడ్డది. బహుబాధాకరం అయింది. బతకాలనే ఆశ ఉండదు. చస్తే బావుండుననిపిస్తుంది."
    'కావచ్చు' నేను వళ్లువిరుచుకుంటూ నిర్లక్ష్యంగా 'అవును మేం కథలు రాసేవాళ్లం. అబద్ధాలు రాయక తప్పదు. ఉదాహరణకు నీ కథ రాయాలనుకో. నీవు ప్రాణసమంగా ప్రేమించావు. ఇప్పుడు మరచావు అంటే ఎవడు నమ్ముతాడు? అలా రాశాననుకో అది చప్పచప్పని కథ అవుతుంది. ఎవడు చదువుతాడు?' అన్నాను.
    సుందరాన్ని చూస్తే శాంత కోపగిస్తుంది. అతని చిరిగిన బట్టలు, దగ్గు, ఊయడం, ఆపై వదినా, వదినా అని పిలవడం చూస్తే ఆమె అసహ్యించుకుంటుంది. అందుకే అతన్ని త్వరగా పంపేయాలని నా ప్రయత్నం.
    సుందరం దగ్గాడు. దగ్గుతో ఊపిరి సలపలేదు. బీడీ ముక్క తీశాడు.
    "ఏంచేయను? స్త్రీ హృదయం నాకెలా వస్తుంది? నేను మగాణ్ణి. మగాళ్లను స్వార్ధపరులు అంటుంది రాజా. అన్నీ మరువగలరంటుంది. ఆమె అనేది నిజం"
    నేను సుందరాన్ని చూచాను. నావి కథాకారులు చూపులు. అన్నింటిలో అబద్దాల అందాలు మేళవించడం నా పని. అందుకే నాకీ గదిలో-ఇవ్వాళ-చప్పుడు- ఒక వెలుగు కనిపిస్తూంది-నవ ప్రేమికుల నేత్రాల్లో కనిపించే కాంతిలాంటిది. ఒకనాడు సుగంధపుష్పపరిమళ పరివ్యాప్తమైంది. ఈనాడు అది లుప్తమైంది.
    సుందరాన్ని ధ్యాసగా చూచాను. కథాకారుని దృష్టితో కాదు వాస్తవిక దృష్టితో. అతడు నాకు ఇసుకలో కూరుకుపోయిన నావలా కనిపించాడు. ఆ నావ నాకు మళ్ళీ ఎందుకు జ్ఞాపకం వచ్చింది? అది చాలాకాలంనాటిమాట. మేధస్సు పొరల్లో ఎక్కడో అణగి పడివున్న పడవ ఇవ్వాళ వెలికి వచ్చింది.
    నేను, శాంత, సుందరం, రాజా సాయంకాలాల్లో పచారుకని ఏటి వడ్డుకు వెళ్ళేవాళ్ళం. అక్కడికి ఏటికి దూరంగా-ఇసుకలో ఒక నావ కూరుకుని ఉండేది. వస్తూ పోతూ సుందరం దాన్ని కాలితో కదలించడానికి ప్రయత్నించేవాడు. ఒక్కోసారి దానికి ఆనుకొని కూర్చునేవాడు. నావమీద పేరిన ఇసుకలో వేలితో రాజా తనపేరు రాసేది.
    "పాపం పడవ-ఎన్నాళ్ళయిందో నీటిముఖం చూడక" అనేది రాజా.
    "అరే రచయితా! నీకేమనిపిస్తుంది, ఇసుకలో ఇరికిపోయిన పడవను చూసి? వలపు తలపులు గుర్తుకువస్తాయా? వలపుల వగలు గుర్తుకు వస్తాయా? ఫలించని ప్రేమగా దరిచేరని నావ గుర్తుకు వస్తుందా? వలపుల నావ నీటినే చెరక ఇసుకలో ఇరుక్కుపోవడం గుర్తుకు వస్తుందా?"
    "వాహ్వ! కవిత బావుంది!" అని కిలకిలా నవ్వేశారు రాజా, శాంత.
    "అందుకే ఇక్కడ కూర్చొని విలపిస్తారు" శాంత సుందరాన్ని అడిగింది.
    "కాదు-కాదు తానూ నదిలో కొట్టుకుపోవాలని ఆలోచిస్తున్నారు" రాజా పట్టుచీర కొంగు మెలిపెడ్తూ, లిప్ స్టిక్ చెదరకుండా పెదవి కదిలించి అంటుంది.
    దాంతో అంతా నవ్వేస్తారు. కాదు సుందరానికీ నవ్వొస్తుంది. ఆ మాట ఎందుకు చెప్పానంటే సుందరం నవ్వడు. అతనికి నవ్వురాదు. సుందరం పరమ లోభి. పైస ఖర్చు చేయాలన్నా పదిసార్లు ఆలోచిస్తాడు. నవ్వు విషయంలోనూ అంతే. వృధాగా ఖర్చుచేయడు. అతడు బాల్యాన్ని కూడా తూచి తూచి ఖర్చుచేశాడు. అందుకే పాతికేళ్లు వచ్చినా అతని ముఖంలో పసితనం కనిపిస్తుంది. అతనికి అరవైఏళ్లు వచ్చినా, ఇరవైఏళ్ల వానిలా, తుమ్మెద రెక్కలాంటి వెంట్రుకల్తో భాసిస్తాడు. ఎంచేతంటే, వాళ్ళ తాత రిస్ట్ వాచీ అతని ముంజేతికుండి ఇప్పటికీ సరియైన సమయం చూపుతూంది.
    నాకు నావ గుర్తుకు వచ్చింది. వెంటనే అడిగాను:- "సుందరం, నీకు ఆ నావ గుర్తుందా?" అని.
    కాని సుందరం కవికాడు. కథాకారుడు కాదు. నా ప్రశ్నలోని లోతులు కొలవలేకపోయాడు. బంతిపూలు నలుపుతున్న మా బేబీని చూస్తున్నాడు. "బేబీని పూలు నలపొద్దను. నలపడం, కూల్చడం అలవాటుచేయకు" అన్నాడు.
    "సుందరం! అమ్మాయిలకు అవన్నీ అలవాటే!" అన్నాను.
    మళ్ళీ నాకు ఇసుకలో దిగిపోయిన విరిగిన నావ గుర్తుకువచ్చింది. అది నావ కాదు. రెమ్మలు విచ్చి వెదజల్లిన బంతిపూవు. పల్లవి తుంచి పారేసిన గీతం.
    సుందరం ఏదో ఆలోచించాడు-లోతుగా.అ బీడీ ముక్క వెలిగించుకున్నాడు. పొగలో దాగిపోయాడు. రచయితగా నేను అనుకున్నాను జ్యోతి వెలిగిందని. కాని సుందరంతో ఎలా చెప్పను? ధోరణి మార్చడానికి శాంతను పిలిచాను.
    "చూడు చాలాకాలం తరవాత నీ మరిది వచ్చాడు. పకోడీలు కావాలంటున్నాడు" అని "ఏం సుందరం నీకు పకోడీలు ఇష్టంకదూ!" అని అడిగాను.
    "కాదు కాదు" సుందరం దగ్గుతూ చేతి సైగతో వారించాడు. "నేను ఉప్పు తినను" అన్నాడు.
    "ఉప్పు తినవా! నువ్వు ఉప్పు మాత్రమే తినేవాడివే! అలా తింటే వంటినిండా విషం వ్యాపిస్తుందంటారు"
    "ఎవరివంట్లో? తిన్నవాని వంట్లోనా? తినిపించినవాని వంట్లోనా?" ఉలిక్కిపడి అడిగాడు సుందరం.
    సుందరంను గురించి ఏమిటి ఇలా మాట్లాడుతున్నాను? అతను పదేళ్ళక్రితం మా ఇంట్లో వ్యక్తి- నాకు రెండో ప్రాణం. అందుకే శాంతకు అతడంటే ఇష్టం. ఆ రోజుల్లో ఈ ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఎంతో అందంగా ఉండేది. రాజా ఉండే ఎదుటింటి కిటికీలు ఎప్పుడూ తెరిచి ఉండేవి. సుందరం బాల్కనీలో చదువుతుండేవాడు. ఎదుటి ఇంట్లో నిలిచి రాజా వెక్కిరించేది-కొక్కిరించేది!
    ఇప్పుడు చాలాకాలం నుంచి ఆ కిటికీలు మూసి ఉన్నాయి. తలుపులకు వేసిన రంగుమీద పదేళ్ళ కన్నీటిధారల గుర్తులు కనిపిస్తున్నాయి. కప్పుమీద గడ్డి మొలిచింది. గడ్డి నీలంరంగు పూలు పూసింది. గతపు చీకట్లను చీల్చుకుని నా హృదయంలోంచి వ్యాపించిన వెలుగులా ఉన్నాయి గడ్డిపూలు. రాజా ఇంటి కిటికీలు మూసుఉన్నాయి. అవి నాకు మూసిన కళ్ళలా కనిపిస్తున్నాయి. నిరీక్షణలో విసిగివేసారి మూసుకున్న కనురెప్పల్లా కనిపిస్తున్నాయి. వెలుగు మలిగిపోయినట్లుంది. కప్పుమీద ఒక పిచ్చుక కూర్చుంది. బిత్తరపోయిన కిచకిచమంటూంది. నావలెనే దానికీ అమాంతంగా మారిపోయిన వాతావరణం గుర్తుకు వచ్చినట్లుంది!
    రాజా తల్లి ఏది? ఆమె కప్పుమీద వాలిన కాకుల్తోను, పిచుకల్తోను పోట్లాడేది. రాజా ఎప్పుడూ సింగారించుకుని కూర్చుంటే అందును గురించి రాజా తల్లి భర్తతో పోట్లాడేది. రాజా తండ్రి ఏడి? తన చిలకముక్కు కదులుతుండగా, రాజా పక్షం వహించి, ఎప్పుడూ భార్యతో పోట్లాడుతుండేవాడు.
    రాజా నగలన్నా మంచిబట్టలన్నా పడిచచ్చేది. ఏది రాజా? మేకప్ చేసుకుని, పట్టుచీరలు కట్టుకుని, గంతులేస్తూ మెట్లు దిగేది-ఎక్కేది. కనిపించినదాన్నల్లా కదలించడం, ఊపడం, బద్దలు కొట్టటం ఆమె స్వభావం. మా గదిలోకివస్తే సుడిగాలి వచ్చినట్లుండేది. కుర్చీలను పక్కకు నెట్టేది. రేడియోను ఒకపక్కకు తిప్పేది. కిటికీ తలుపులు తెరిచేది. శాంత ఫోటో అందుకుంటే ఫ్రేం విరిగిపోయేది. సుందరంతో మాట్లాడితే పోట్లాటకు సిద్ధం అయ్యేది. కాఫీ తాగుతూ చేతిలోని గ్లాసు వదిలేసేది.
    "శాంత! చూడు నా కర్మ. దేన్ని తాకినా పగిలిపోతుంది. లేదా విరిగిపోతుంది" అంటుంది రాజా. నిముషంలో సగంకూడా ఉండదా బాధ. మరుక్షణం. బేబీతో ఆడుతూ పూలకుండి దొర్లిస్తుంది. శాంత జడ కొంటెగా విప్పేస్తుంది. సంత్రాలు తింటుంది. పొట్టు సుందరం మీదికి విసరుతుంది.
    "ముత్యాలు వెదజల్లుతున్నాను. ఏరుకో, అమెరికా వెళ్ళడానికి పనికి వస్తాయి" అంటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS