"ఎందులో?" అన్నాడు సర్వాధికారి.
"పిల్లల్ని కనడంలో. జనాభాని పెంచడంలో!" అన్నాడు అన్వేషి. "ఇండియాలో జరుగుతున్న పాపులేషన్ ఎక్స్ ఫ్లోజన్ దారుణంగా వుంది. ఇండియాలో ఎన్ని ప్రాజెక్టులు కట్టూ, పరిశ్రమలని ఎంతగా అభివృద్ధి చెయ్యి - ఆ ఫలితాలని మించిపోతోంది జనాభా పెరుగుదల! అందుకని ఎంత అభివృద్ధి సంపాదించినా కూడా అక్కడ ఆకలి చావులే! ఇండియాలో పాపులేషన్ పాపంలాగా పెరిగిపోతోంది. ఏదో ఒకరోజున ఇది ప్రపంచానికంతా కూడా ముప్పులా తయారు అయ్యేటట్టుగా వుంది."
అర్జెంటుగా అన్నాడు సర్వాధికారి.
"అన్వేషీ...దిసీజ్ ఎ ప్రామిస్! నేను జనాభా నియంత్రణకి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలూ తీసుకుంటాను. ఈ ఒక్కసారికి అప్పు ఇప్పించు. గండం గట్టెక్కించు."
"బట్ ఇటీజ్ టూ లేట్! ఇంక ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులలో జనాభాని కంట్రోల్ చేసే స్థితి దాటిపోయింది సర్వాధికారీ"
"మరి?" అన్నాడు సర్వాధికారి.
మిస్టీరియస్ గా అన్నాడు అన్వేషి.
"ఇంక ఒక్కటే పద్ధతి మిగిలింది.
"ఏమిటది?
"వామనాస్త్రం"
"వామనాస్త్రం! అంటే?"
వామనాస్త్రం అంటే...హిందూ పురాణాల ప్రకారం వామనావతారం అంటే తెలుసుగా?"
"తెలుసు...విష్ణుమూర్తి పొట్టివాడుగా మారిపోయాడు."
"ఎగ్జాక్ట్ లీ...నేనొక ప్రక్రియ కనిపెట్టాను. దానిని ప్రయోగిస్తే మనుషులు అంగుష్ట మాత్రులుగా మారిపోతారు. ఇండియాలోని జనాభాని అంతా అంగుళం సైజు మనుషులుగా మార్చేశామనుకో! ఫినిష్! ప్రాబ్లెమ్స్ అన్నీ ఒక్క దెబ్బతో సాల్వ్ అయిపోతాయి. ఒక్క కంచంలో పెట్టిన అన్నం వంద మంది మనుషులకి సరిపోతుంది. ఒక్క రెండు గదుల ఇంట్లో రెండువేలమంది కాపురం చెయ్యవచ్చు. ఇంక అంతా మిగులే! ఇండియాలో వున్న ప్రాబ్లెమ్స్ అన్నీ ఈ వామనాస్త్రంతో హుష్ కాకి అన్నట్లు తీరిపోతాయి"
సర్వాధికారీ! నువ్వు ఇండియాలో ఈ వామనాస్త్రం ప్రయోగించడానికి సిద్ధపడితే నేను నీకు యూనివర్శల్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించగలను."
"వామనాస్త్రం..ఓకే! నేను రెడీ" అన్నాడు సర్వాధికారి అనాలోచితంగా.
"అయితే ఇంకో కండిషన్ వుంది" అన్నాడు అన్వేషి.
"ఏమిటది?"
"నేను నీకు అప్పు ఇప్పిస్తాను. కానీ దాన్లో నాకు కమిషన్ కావాలి"
"అది ఆటోమేటిగ్గా జరిగిపోతుందిలే" అన్నాడు సర్వాధికారి రిలీఫ్ ఫీలవుతూ.
* * * *
టెలిస్కోప్ కొండ దగ్గర...
పైనుంచి బండలు ఒకదాని కింద ఒకటిగా జారిపడుతూ వున్నాయి.
"ఇంక మన పని ఫినిష్" అన్నాడు అంకుష్ కీచు గొంతుతో.
సరిగ్గా అదే క్షణంలో -
ఆ బండలన్నీ హఠాత్తుగా దొర్లడం ఆగిపోయాయి. వాళ్లకు కొద్దిదూరంలో ఎవరో మంత్రం వేసినట్లుగా ఆగిపోయాయి.
వెంటనే -
ఆకాశంలో పడమట కనబడుతున్న వెలుగు అతి తీక్షణంగా మారింది. ఆ ప్రాంతం అంతా పట్టపగలుగా అయిపోయింది.
ఆ వెనువెంటనే -
డప్పుల శబ్దం వినబడడం మొదలెట్టింది.
ముందు చిన్నగా -
తర్వాత పెద్దగా -
ఆకాశంలో వెలుగు ఎక్కువవుతున్న కొద్దీ డప్పుల శబ్దం కూడా మరింతగా ఎక్కువ కావడం మొదలెట్టింది.
"కమాన్! లెటజ్ గో అండ్ సీ" అన్నాడు సాహస్.
ఇద్దరూ కలసి రాళ్ళనీ రప్పలనీ బండలనీ దాటుకుంటూ ముందుకు వెళ్ళారు.
అక్కడ -
ఒక మలుపు తిరగ్గానే వాళ్లకి హఠాత్తుగా కనబడింది ఒక దృశ్యం.
ఒక పదిహేనుమంది -
ఆటవిక, అనాగరిక, అనాది మానవులు వున్నారు.
గడ్డితో చేసిన చిన్న స్కర్టులలాంటివి నడుము చుట్టూ చుట్టుకుని వున్నారు.
ఒళ్ళంతా నూనె రాసుకోవడం వల్ల కాబోలు ఆ చిత్రమైన కాంతితో మెరుస్తూ కనబడుతున్నాయి వాళ్ళ దేహాలు.
అందరూ లయబద్దంగా ఊగుతూ ఒక పాట పాడుతున్నారు.
