సుబ్బారావు అకస్మాత్తుగా సత్యంగారి చేతుల్ని పట్టుకొన్నాడు.
"మీలో దేవుడిని చూస్తున్నా సార్!"
"తప్పు! దేవుడు ప్రాణాలు తీసుకోడు. నేను తీసుకుంటాను. నాకు ఉపాసన వుంది. ఏమి దేవి? ఏమీ ఉపాసనా? ఆ వివరాలడక్కు. ఆ ఉపాసన పరిసమాప్తి కావాలంటే ఒక మనిషి ప్రాణాలవసరం. నా ఆజ్ఞను అనుసరించి నేను చెప్పినప్పుడు ఆ మనిషి తన ప్రాణాలు విడవాలి!" అన్నాడు సత్యం సుబ్బారావు చేతుల్ని విడిపించుకుంటూ...
"హు! చెల్లి పెళ్ళి చేయలేక చావాలనుకుంటున్న వాడిని. నా చావుతో నా చెల్లి పెళ్ళవుతుందంటే అంతకంటే కావల్సిందేమిటి? నేను సిద్ధంగా వున్నాను సార్!"
"త్రికరణ శుద్ధిగా చెబుతున్నావా?"
"ఇప్పటికిప్పుడు చావమంటే చస్తాను. ఆ డబ్బేదో మా ఇంటిలో ఇవ్వండి."
"నామీద అంత నమ్మకముందా?"
"చచ్చేవాడిని బతికించింది మీరు! మిమ్మల్ని నమ్మకపోవడమా చెప్పండి, చావనా?"
క్షణం ఆలోచించి అన్నాడు సత్యం...
"దేవికి కొత్త సంవత్సరం కానుకగా నీ ప్రాణాలివ్వాలనుకుంటున్నాను. అంచేత నీ చావు డిసెంబరు 31 అర్ధరాత్రి పెట్టాను. నీ అంతట నువ్వే చావాలి! ఈలోగా నీ చెల్లెలి పెళ్ళి చేసుకో."
"థేంక్యూ సర్!"
"పెళ్ళయ్యాక బతుకుమీద ఆశ పెట్టుకోకూడదు."
"అది మీరు ప్రత్యేకించి చెప్పక్కరలేదు."
"బతకాలనే యావతో యిచ్చినమాట తప్పితే నేనే నిన్ను చంపుతాను. ఎక్కడున్నా వెతికి మరీ చంపుతాను మైండిట్."
"మీకంత కష్టం రానివ్వను సర్! నా మాట నమ్మండి."
"వెల్ సెడ్! కాసేపు రెస్టు తీసుకో, ఒంటరిగానే-ఎల్లుండి సాయంత్రం నాలుగింటిక్కనిపించు, డబ్బు సిద్ధంగా ఉంటుంది! ఓ.కె?"
సుబ్బారావు చేతులు జోడించేడు.
సత్యం లేచేడు. దూరంగా పార్కుచేసిన కారువేపు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడుస్తున్నాడు.
26
కాలం కలసివస్తే కథకి బ్రేకులుండవుంటారు!
అదే ఈ కథలోకూడా జరిగింది.
లక్ష్మీపతి ఇంట్లో సుమతి, కోదండరాంల పెళ్ళి గొప్ప స్థాయిలోనే జరుగుతూంది. ఎక్కడ్నించి తెచ్చావు, ఎట్లా తెచ్చావని అడక్కుండానే అతను సుబ్బారావు ఇచ్చిన లక్షరూపాయలు పుచ్చుకున్నాడు.
ఆ తర్వాత ముహూర్తం పెట్టించాడు.
కట్నం పుచ్చుకుంటున్నట్టు అతనికిగానీ- ఇచ్చినట్టు సుబ్బారావుగానీ ఎక్కడా ఎవరితోనూ అనలేదు.
కట్నం తీసుకున్నట్టు తెలిస్తే జైలు పాలవుతానేమోనన్న భయము అతని నోరుమూసింది.
అంతడబ్బు తనకు ఏ షరతుమీద దొరికిందో తెలిస్తే కుటుంబ సభ్యులు అల్లాడిపోయి ఈ పెళ్ళికి అడ్డుపడతారనే ఆందోళనతో సుబ్బారావు కిక్కురుమనలేదు.
అంచేత...
పెద్ద విడ్డూరం జరిగిపోతున్నట్టు ఆ పెళ్ళి విచిత్రంగా జరిగిపోతోంది.
లక్ష్మీపతి కొడుకేమిటి? ఆఫ్ట్రాల్ సుబ్బారావు చెల్లెల్ని పెళ్ళి చేసుకోవట మేమిటి? అందునా కట్న కానుకలు ఏమీ లేకుండానే! ఇది ఎనిమిదో వింతగా పెళ్ళికొచ్చిన జనానికి అనిపించింది.
చెల్లెలి పెళ్ళి కన్నార్పకుండా చూస్తున్నాడు సుబ్బారావు.
సుమతి మెడలో కోదండం మూడుముళ్ళు వేశాక గుప్పెటలోవున్న అక్షింతలు ఆ నూతన వధూవరులమీద జల్లి దూరంగా నిలబడిన సత్యంగారికి ఎవరూ చూడకుండా సత్యం చేతికి ఒక కాగితం ముక్క యిచ్చి కళ్యాణమండపం వేపు కదిలేడు.
కాగితం ముక్క చూసేడు సత్యం.
అందులో రెండంటే రెండే ముక్కలున్నాయి...
"నాన్నా! నీదెంత గొప్ప మనసు, అయామ్ ప్రౌడాఫ్ మై ఫాదర్!"
అని చదువుకొని గర్వంగా గాలి పీల్చేడు సత్యం. ఈ జీవితకాలంలో ఎంతో ఆనందించిన ఘట్టాలలో అది కూడా ఒకటయిందతనికి.
సరిగ్గా అదే సమయానికి కోదండం క్లాసుమేట్ ఒకడు అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అతని చేతిలో పేపరుంది.
అతడు కళ్యాణమండపం ముందు బిగ్గరగా అరిచాడు...
"ఒరే కోదండం నువ్వు పాసయ్యావురా!"
ఆ మాట వినగానే బోలెడు ఆనందంతో కోదండం పెళ్ళిపీటల మీద నుండి లేచి నుంచున్నాడు.
గబగబా కృష్ణమూర్తిని చేరుకొని తన కృతజ్ఞతలు తెలియచేసుకోవాలని అతను ప్రయత్నిస్తుండగా...
అతనికంటే ముందు...
లక్ష్మీపతి గాలిలో తేలియాడుతూ వచ్చి కృష్ణమూర్తిని అమాంతం కావలించేసుకొని అన్నాడు...
"నువ్వు మామూలు మాస్టరువికావు పంతులూ! పరువు కాపాడావు. మావాడి భవిష్యత్తు బాగు చేశావు కోరుకో పంతులూ! అడిగింది ఇవ్వకపోతే చెప్పుతో కొట్టు?"
అంత హామీ ఇవ్వగానే అటు సత్యంగారు, ఇటు పద్మా ఎంతో సంబర పడిపోయారు.
కథ సుఖాంతమయ్యే ఘడియ వచ్చేసిందనుకున్నాడు సత్యం.
తమకి పెళ్ళయిపోయినట్టే అనుకుంది పద్మ.
కానీ...
కృష్ణమూర్తి సింపుల్ గా ఒక పొడిమాట "మీ అభిమానం చాలు" అనేసి సత్యంగార్నీ, పద్మనీ గొప్ప నిరుత్సాహ పరిచాడు.
"నన్ను మీ అల్లుడిగా చేసుకోండి" అనివుంటే అతని సొమ్మేమి పోయింది. ఇక్కడకూడా సస్పెన్సేనా అని విసుక్కుంది పద్మ.
శుభం పలికే కథకి కామా ఎందుకుపెట్టాడో సత్యంకు అర్ధంకాలేదు. అతనుకూడా అంతో యింతో విసుక్కున్నాడు.
అంతలో...
పసుపుబట్టల్లో వున్న కోదండరాం కృష్ణమూర్తి పాదాలు తాకేడు. కృష్ణమూర్తి అతన్ని ప్రేమగా లేవనెత్తాడు.
"మేస్టారూ! మీ మాట నిలబెట్టుకున్నారు" అన్నాడు కోదండం.
ఆ ఇంటిలో కృష్ణమూర్తి సంపాదించుకున్న స్థానానికి సత్యంగారు ఆనందించినా- కొడుకుయొక్క సుదీర్ఘమైన ప్లాను ఏమిటో తెలుసుకోవాలని కూడా ఆయన అనుకున్నారు.
* * *
సుమతీ కోదండరాం పెళ్ళయి మూడురోజులు గడిచాయో లేదో...కృష్ణమూర్తి మాటప్రకారం కొడుకునీ కోడల్నీ హనీమూన్ పంపడానికి (బోలెడు ఖర్చు) లక్ష్మీపతి రైలుస్టేషనుకు వెళ్ళడం కళ్ళారా చూసిన సత్యానికి కళ్ళు తిరిగినంత పనయింది.
