అవినాష్ తో పరిచయం. తొలిముద్దు... తొలికౌగిలి... అవినాష్ తనని భీమునిపట్నం తీసికెళ్ళి, తొలిసారిగా చీకట్లో సముద్రపు ఒడ్డున, తనని వివస్త్ర చేయడం, ఆక్రమించుకోవడం, తన గర్భం... అన్నీ... అన్నీ వరసగా తెరమీద కదులుతున్నట్లుగా ఆమె మనసులో కదులుతున్నాయి.
అదే సమయంలో అక్కడికి ఆరో వరసలో చీకట్లో ఆ చివర కూర్చున్న అవినాష్, రోష్ణీ చెవిలో ఏదో అన్నాడు.
రోష్ణీ కిలకిలా నవ్వింది.
* * * *
"సిన్మా అయిపోగానే మనం... నా రూం కెళ్దాం-" అన్నాడు అవినాష్.
"ఎందుకు-"
"ఎందుకో తెలీదా-" ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అవినాష్.
"తెలీదు-"
"తెలీదా-" అంటూ తన కుడిచేత్తో ఆమెను గిల్లుతూ, ఇందుకు అన్నాడు.
"అబ్బా... ఆశ... నా కిష్టంలేదు-" అవినాష్ వేపు చూసింది రోష్ణీ కొంటెగా.
* * * *
గౌతమిలో ఉద్రేకం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. సినిమాలో తెరమీద రాజ్ బబ్బర్! జీనత్ అమన్. రాజ్ బబ్బర్ ని చూస్తున్నంత సేపూ అవినాషే గుర్తుకొస్తున్నాడు...
అవినాష్... అవినాష్... అవినాష్...
మా డాడీని తీసుకొస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పిన అవినాష్...
రేపు పన్నెండు గంటలకే మన పెళ్ళంటూ తియ్యటి కబుర్లు చెప్పి, తనని కౌగిల్లోకి తీసుకున్న అవినాష్... కాఫీలో విషమనుకుని మార్ఫిన్ కలిపి తనని చంపడానికి ప్రయత్నించిన అవినాష్...
గౌతమిలో అణువణువులో ఆరాటం... గుండెల్లో ఎవరో గునపాలతో గుచ్చుతున్న సవ్వడి. తనకెదురుగా తన కధనే సినిమాగా చూడడం దుర్భరంగా ఉంది ఆమెకు.
కానీ ఆ హీరోయిన్ జీనత్ అమన్ - పగ తీర్చుకోవడం చేసే ప్రయత్నాలు ఉద్వేగంగా ఉన్నాయి.
* * * *
సినిమా అయిపోడానికి ఇంకా పావుగంట మాత్రమే సమయం ఉంది.
"ఈ ఒక్కసారికే... మళ్ళీ ఎప్పుడూ వద్దు- మళ్ళీ మన పెళ్ళి అయ్యాకే..." రోష్ణి నడుం ముడతల దగ్గర కితకితలు పెడుతూ అన్నాడు.
"ప్లీజ్... మా రూంకి వస్తావ్ నువ్వు-"
రోష్ణి అతని కళ్ళవేపు చూసి,
"వస్తాను... కానీ పావుగంటలో వెళ్ళిపోతాను... గంటలకొద్దీ ఉండమంటే- ఉండను... మా డాడీ ఊళ్ళో ఉన్నారు-"
"పావుగంట ఎందుకు... అయిదే అయిదు నిమిషాలు చాలు- అంతా అయిపోడానికి..."
"ఛీ... మోటు మనిషివి నువ్వు-" విసుక్కుంది రోష్ణి.
* * * *
సినిమా అయిపోయింది.
బయటికొస్తూ "ఎలా ఉంది సిన్మా" మాల అడిగింది.
"జీనత్ అమన్ హంటింగ్ చాలా బావుంది... ఇకనుంచి జీనత్ అమన్ పాత్రే నా గురువు... సిన్మాలో ఆ అమ్మాయి ఎలా వెంటాడిందో, అలాగే... అవినాష్ ని నేను వెంటాడి, వెంటాడి, వాడిని కటకటాల వెనక్కి పంపిస్తాను...
ఇద్దరూ సిన్మాధియేటర్ దాటి బయటికొచ్చి ఆటోకోసం నిలబడ్డారు.
అదే సమయంలో-
సిన్మాహాల్ కాంపౌండ్ లో మారుతీకారుని పార్కింగ్ ప్లేస్ నుంచి బయటికి తీస్తూ ఓ అమ్మాయి.
ఆ పక్కన నిలబడి సిగరెట్ కాలుస్తూ అవినాష్.
అవినాష్.
గౌతమి కళ్ళకు అవినాష్ స్పష్టంగా కన్పించాడు.
అంతే...
గౌతమిలో ఒక్కసారి ఆవేశం పొంగింది. పూనకం వచ్చినదానిలా అయిపోయింది.
"మాలా... కమ్ విత్ మి..." కేకేసినట్టుగా అని కాంపౌండ్ లోకి పరుగెత్తింది గౌతమి.
ఆ కాంపౌండ్ జనంతో కిటకిటలాడుతోందా సమయంలో. అప్పుడే కారెక్కడానికి ఒంగున్న అవినాష్, ఏదో చేయి తన కాలర్ ని గట్టిగా పట్టుకోవడంతో గాభరాగా తలతిప్పి, ఎదురుగా గౌతమిని చూసి షాక్ తిన్నాడు.
"మిస్టర్... అవినాష్... కమ్ ఔట్ సైట్..." అరిచింది గౌతమి.
అవినాష్ ఒక్కక్షణం బిత్తరపోయాడు. అతని వంటినిండా చెమట్లు పట్టేశాయి. కార్లో స్టీరింగు ముందు కూర్చున్న రోష్ణి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వేపూ చూస్తోంది.
గౌతమి ఒక్కక్షణం కిందకు వంగి కాలిచెప్పుని తీసి-
ఫట్... ఫట్... ఫట్... ఫట్... ఫట్...
అవినాష్ చెంపమీద తగులుతున్న ఆ చెప్పు దెబ్బలకు ఆ కాంపౌండ్ అంతా నిశ్శబ్దమైపోయింది.
"యూ బాస్టర్డ్... యూ రోగ్... నా చేతిలో ఇప్పుడు పిస్టల్ ఉంటే నిన్ను కాల్చి చంపేసేదానిని... మైండిట్..."
ఆమె నోట్లోంచి ఆ మాటలు చాలా తీవ్రంగా వచ్చాయి.
అప్పటికే కొన్ని వందల సంఖ్యలో ఉన్న జనం, ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
ఎవ్వరూ కదల్లేదు. ఎవరి నోటంటా మాటలేదు.
అవినాష్ కి ఏం మాట్లాడాలో తెలీడం లేదు. అతని ముఖం ఎర్రగా అయిపోయింది వళ్ళంతా చెమటతో తడిసిపోయింది.
కాలి జోడుని మళ్ళీ కాలికి తొడుక్కుని, కార్లోకి వంగి "వాటీజ్ యువర్ నేమ్..." కోపంగా అడిగింది గౌతమి.
ఆ ప్రశ్నకు తడబాటు పడింది రోష్ణి.
ఏవిటో, ఎవరో అస్సలు అర్ధం కావడంలేదామెకు.
"రోష్ణి" మెల్లగా చెప్పింది గౌతమి-
"పిచ్చిపిల్లా... వీడో మోసగాడు... నీకు ముందు నాతో తిరిగి కల్లబొల్లి కబుర్లు చెప్పి, నన్ను తల్లిని చేసి, నన్ను చంపాలని చూశాడు వీడు... నీ గతి కూడా అంతే అవుతుంది జాగ్రత్త-" గౌతమి తుపాకి తూటాల్లా దూసుకొచ్చాయి ఆ మాటలు గౌతమి పెదాల్లోంచి.
