3. "ఎల్ల రాక్షసుల - గృహములు వెదకితి
అంతఃపురముల - పరిశీలింతితి |
ఎందు వెదకినా - సీతను గాంచక
నిరాశ జెంది - కడు చింతించితి |
ఏమియు తోచక - తిరిగిన తావుల
తిరిగి తిరిగి తిరి | గి తిరిగి తావుల
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
4. "చూడ మరచిన అ | శోక వనమును
వెదక సాగితిని - చివరకు నేను |
మాసిన పీత వ | సనము దాల్చిన
కటిక నేలపై - కూర్చొని యున్న |
రాక్షస వనితల | క్రూర వలయమున
చిక్కి యుండిన - సీతను గాంచితి |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
5. "అశోక వనికి - రావణాసురుడు
సీతను జూడ | ఏతెంచినాడు |
చెంతకు జేరి కా | మాంధుడై నిలిచె
నోటికి వచ్చిన | దెల్లపలికె
సుడిగాలి బడిన | కదళీ తరువు వలె
కటిక నేలపై - జానకి తూలె |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
6. "శీఘ్రముగా నను - రాముని జేర్చుము
త్రికరణ శుద్ధిగా - శరణు వేడుము |
లేకున్న నీవు - నీ లంకయును
ఆనతి కాలమున - నాశన మౌను |
అని సీత పలికె - దివ్యస్వరమున
తృణము కన్న రా | వణుడే హీనమున |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
7. "నను వరించిన - నిను పూజింతును
నను కాదని - నిను వధింతును |
రెండు నెలల గడు | వున్నది ఇంకను
ఈ లోపుగ బా | గోగులు కనుగొను |
అని రావణుడు - గర్జన చేయుచు
మరలిపోయెను - మంటల గ్రక్కుచు | "
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
8. "అసురులచే బా | ధలు పడలేక
సీతా మాత - బ్రతక నోర్వక |
తన మెడ జడతో - ఉరిబోసుకుని
ప్రాణ త్యాగము - చేయుబూనెను |
అంతట రామా - నిన్నే దలచితి
తరువుపైనుండి - నీ కధ పలికితి |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
9. "తల్లి మనసు శాం | తింపగా గని
సూక్ష్మరూపమున - జేరబోతిని |
రామదూతనని - తెలుపుకొంటిని
అంగుళీయకము | ను అందజేసితిని |
ఆనందాశ్రులు - జారగ జానకి
అంగుళీయకము | ను కనుల కద్దుకొనే |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
10. "అంగుళీయకము | ను సీత గైకోనేను
నినుగని నటుల - ఆనందించెను |
చిత్రకూటమున - కాకాసురు కధ
కన్నీరోలుకగ - తెలిపెను గురుతుగ |
చెంగుముడి నున్న - చూడామణిని
ప్రేమ మీరగ - పంపెను గురుతుగ |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
__: 65 వ. స. సంపూర్ణము :__
66 వ. సర్గ
శ్రీరాముడు :-
1. "నీట బుట్టినది - పూజలందినది
చూడామణి యని - పేరు బొందినది |
యజ్ఞముచే సం | తృప్తిని జెంది
ఇంద్రుడు జనకుని - మెచ్చి ఇచ్చినది |
సీతారాముల - పెండ్లి సమయమున
జనకుడు ప్రీతిగ - సీతకొసగినది |"
అని రాముడు ఆ - చూడామణిని
అశ్రులు జారగ - స్వీకరించెను .... ||శ్రీ||
2. చూడామణిని - రాముడు గైకొని
తన హృదయానికి - చేర్చి హత్తుకొని |
మాటలురాని - ఆనందముతో
అశ్రులు నిండిన - నయనాలతో |
బహురీతుల హ | రీశుని బొగడి
"హనుమా ఇంకను - వినగోరుదు " నన |
హనుమంతుడు తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
__: 66 వ. స. సంపూర్ణము :__
