ఆ అనవసర కోపాన్ని అర్ధం చేసుకోలేక పోయాడు.
"క్షమించు , వసూ! నీకిష్టం లేకపోతె పోనీ." వదిలేశాడు.
వసంత ఆ ప్రక్కకు తిరిగింది.
"అసలు మీతో నాకీ పెళ్లి యిష్టం లేదు." ఆ మాటా ఎలా అనగలిగానా అని ఆశ్చర్య పోయింది తరువాత.
అర్ధం కాని అంతర్యం. విచిత్రమైన మనస్తత్వం. విపరీతపు మాటలు. ఎదుటి వారి హృదయాలకు సూటిగా బాణాన్ని వదిలే తత్వం అనుకొంటే అనర్దాలనే కలిగించ వచ్చు.
కఠినమైన జవాబు నే వినవలసి వస్తుందను కొంది వసంత. విచిత్రమైన దరహాసం అతని పెదాల పై విరిసింది.
"ఆ మాట ఇప్పుడు చెప్తే ప్రయోజన మేమిటి? ముందే చెప్పి ఉంటె నీకీ బాధ ఉండేది కాదు; నాకీ శ్రమా ఉండేది కాదు.'
"అంటే? మీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా?"
"అది నానోటి నుండి వినడం బాగుండదు. నీకిష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు సిద్ద పడ్డావు?"
"నాన్నగారి కోసం."
నమ్మలేని నిజం. నమ్మశక్యమైన సత్యం. నమ్మకోడని అంతరార్ధం . నమ్మలేని మనస్తత్వం నలిగిపోయాడు రాజ్.
"సంతోషం . మీ నాన్నగారి మనశ్శాంతి కోసం నువ్వు మన పెళ్ళికి ఒప్పుకోన్నావు. అందుకు అభినందించవలసిందే! అలాగే నీకిష్టమున్నా లేకపోయినా గుట్టుగా కాపురం చెయ్యాలి."
'అది అసాధ్యం . నాకూ కాపురం చెయ్యవలసిన ఖర్మ నాకేం పట్టలేదు.'
"అయితే నువ్వు చేసిన ఈ త్యాగానికి అర్ధం ఉండదేమో!"
"ఆ త్యాగాలు చేసేంత దానిని కాదు. కానీ మీరు చెప్పినట్లు నడుచుకోలేను."
అతని మొహంలోకి చూసింది. ఆశించిన మార్పు రాకపోవడంతో నిరుత్సాహ పడిపోయింది.
"మీ నాన్నగారి మనశ్శాంతి భంగం కలుగకుండా నీ యిష్టం వచ్చినట్లు ప్రవర్తించు.
"అయితే వినండి. నా స్వేచ్చకు అడ్డు రాకూడదు. నాకు కష్టం కలిగించే పనేది మీరు చెయ్యకూడదు."
చిన్నపిల్లల అర్ధింపో, పెద్దల అజ్ఞనో అర్ధం కాదు. రెండూ కావు. మొండి తనం , దాగి వున్న పట్టుదల తాండవీస్తున్నాయి. నవ్వుకొన్నాడు రాజ్.
"అలాగే! ధర్మ సమ్మతంగా నీకు ఇష్టం కలిగించే పనులు చెయ్యను."
ఏమైనా ఫలితం కనిపిస్తుందేమోనని చూశాడు. ప్రయోజనం కనుపించక పోవడంతో ప్రక్క పై పడుకొని కళ్ళు మూసుకొన్నాడు. అతని నిర్లిప్తత చూసి వసంత తనను తానే తిట్టుకోంది. ఆ ప్రక్కనే ఉన్న ప్రక్క పై కూర్చొంది.
అనవసరమైన కలతలు పెంచుకొని తన కాపురాన్ని నాశనం చేసుకొంటున్నానెమోననే భయం ఆవరించింది. అర్ధం లేని పగ, ప్రతీకారాలకు పోయి ఆనందమయం కావలసిన సంసారాన్ని దుఃఖ మయం చేసుకుంటున్నానని వాపోయింది ఆమె హృదయం. ఎంత ఆలోచించినా తప్పంతా తనదే నన్న నిజం తట్టుతుంది. తన తప్పుకు క్షమాపణ చెప్పుకోవాలి. కానీ లొంగి పోవడానికి అభిమానం అడ్డు వస్తుంది. అభిమానాన్ని మించిన బాధ మనసును కలవర పెడుతుంది. కలవరానికి తట్టుకోలేని మనసు విలవిల లాడుతుంది. ఆ విలవిలకు అవకాశాన్నిచ్చి ద్విగుణీకృతం చేసే మౌనం, రాత్రి - భరించలేక పోయింది.
మధురమైన అనుభవాలలో అనుభూతులు కరగి పోగా సుఖం లో ఓలలాడ వలసిన ఆ రాత్రి బాధగానూ, గాయపడిన మనసులతోనూ గడిచి పోయింది. ఊహించలేని పరిణామం -- చెప్పినా నమ్మని నిజం -- కళ్ళతో చూసిన అనుమానపడే సత్యం -- ఊహాతీతమై ఉద్భవిల్లిన సంఘటన -- ఆవేశం తెచ్చే అసందర్భం-- ఆవేదన నిలిపే ఆవేశం -- ఆవేదన తో మరిగిపోయిన మనసు -- మనసును అరికట్టలేని వయస్సు -- వయసుకు మించిన అనుభవం -- అనుభవం యివ్వలేని ఆలోచనా తరంగాలు-- వాటిలో కొట్టు మిట్టుకు లాడే హృదయపు బేలతనం-- పగవారి కైనా వద్దనుకొనే అ అనుభవం.
సృష్టి లో జరగరాని పనులెన్నో జరుగుతుంటాయి. అదే సృష్టి రహస్యం. దాన్ని చేదించే శక్తి మానవుడిలో లేదు. అలా చేయగలిగిన వాడు సృష్టే అంతం కావచ్చు.

ఉదయమే లేచాడు రాజ్. ప్రక్కన చూశాడు. నిశ్చింతగా నిద్ర పోతుంది వసంత. క్రిందికి దిగివచ్చాడు. దిగివస్తున్న అతన్ని చూసి ఆనందరావు గారికి దూరపు బంధువు లైనా దగ్గరి వారమే అని చెప్పుకొంటూ అక్కడే తిష్ట వేసిన కొందరు ముత్తేదువలు ముసిముసిగా నవ్వుకొంటూ అతన్ని పరీక్షించారు.
అది చూసి నవ్వుకొన్నాడు రాజ్. వారి అమాయకత్వానికో లేక తన స్థితికో అతనికే తెలియలేదు. "బాబూ" అంటూ నౌకరు టూత్ పేస్టూ బ్రస్షూ ఇచ్చాడు. అందుకొన్నాడు.
"రాత్రి బాగా నిద్ర పట్టిందటోయ్!" పేపరు చదువు కొంటున్న రాజ్, మామగారి మాటలు విని దాన్నక్కడ మడచి పెట్టేశాడు. సమాధానంగా చిరునవ్వుతో తల ఊపాడు. "నువ్వే అమ్మాయి కన్నా పెందలాడే లేచినట్లున్నావే!" ఉత్సాహంతో అడిగారు ఆనందరావు గారు.
జవాబు చెప్పలేని ప్రశ్న. అది ఆయనకు తెలుసు. కానీ అడిగించింది వారి అంతర్యం. వారిలో ఉత్సాహం, ఆనందం అధికంగానే ఉన్నాయి. అటువంటి సమయాల్లో కాక మరింకెప్పుడు మానవుడు సంతోషంగా ఉంటాడు?
"చూడమ్మా, లక్ష్మమ్మా. అమ్మాయి ఇంకా లేవనట్లుంది. వెళ్ళి కాస్త లేవు. అయినా ఈకాలం ఆడపిల్లలకు బద్ధకం ఎక్కువ!" అటుగా వస్తున్న ఒకావిడతో చెప్పారు.
"అలాగే అన్నయ్యా!" అని ఆవిడ మేడ పైకి నడిచింది.
కింద ఉన్నవారికి పై నుండి వసంత, ఆవిడను నిద్ర లేపినందుకు గానూ వేస్తున్న కేకలు వినిపించాయి. అప్పుడే కాఫీ త్రాగాబోతున్న ఆనంద రావు గారి కప్పు కాస్తా క్రింద పడిపోయోంది . క్రింద పడ్డ కప్పు రెండు ముక్కలయింది. దాన్ని బల్ల పై పెట్టి అతికించాలని ప్రయత్నించాడాయన.
"ప్రయోజనం లేదు, మామయ్యా! మీ రెంత ప్రయత్నించినా ఆ పగిలిన చోట ఆ సత్యం కనిపించక పోదు. వాటిని ఒకటిగా చేయాలను కోవడం మన పొరపాటే."
ఉలిక్కిపడ్డారు ఆనందరావు గారు, అల్లుడి మాటలు విని.
"అంతేనటోయ్ ?' బాధగా ప్రశ్నించాడాయన.
"లాభం లేదు. దాన్నేవ్వరూ కాదనలేరు."
ఇంతలో ఆ లక్ష్మమ్మ క్రిందికి దిగి వచ్చింది. ఆ మాటలు విన్నారని ఆమెకు తెలుసు. అందుకే ఒక్క క్షణం వారిని చూసి లోపలికి వెళ్ళిపోయింది.
"వెంకన్నా, కాఫీ!!' పై నుండి వసంత కంఠం వినబడింది.
ఆ ప్రయత్నంగా మేడ పైకి చూశాడు ఆనందరావు గారు. అక్కడేమీ లేదు. ఉండదని ఆయనకు తెలుసు. కానీ ఆ చూపులలోని అర్ధం, మనసులోని భావం అయన చేత ఆ పని చేయించాయి.
ఇక అక్కడ ఉండలేక లేచాడు రాజ్.
* * * *
"ఓ! క్రొత్త పెళ్లి కొడుకు గారా! రండి." ఆహ్వానించింది లత.
"లతా , మీకు గూడా నేను పరాయి వాడి నయ్యానా?" ఆ సంభోధన భరించలేక బాధ పడి అన్నాడు రాజ్.
"ఛ! ఆదేమిటి బావా! పొరపాటున అన్నాను. ఇంకెప్పుడూ ఆనను; బుద్ది వచ్చింది. నువ్వు బాధపడితే మాకు ఆనందమే కరువై పోతుంది."
చిరునవ్వు నవ్వాడు రాజ్. అదే తృప్తి లతకు.
"అక్కయ్యా , ఎవరోచ్చారో చూడు." కేకేసింది లత.
"ఏమిటి ? వదిన కూడా ఇక్కడే ఉందా! నువ్వెప్పుడొచ్చవు , వదినా?' ఇంట్లో నుండి వస్తున్నా ఇందిరను చూసి అడిగాడు.
'ప్రస్తుతం మన ఠికానా ఇక్కడే. ఇక రేపో మాపో లత కూడా అత్తగారింటికి వెళ్ళిపోతే అమ్మ ఈ వయసులో ఒంటరిగా ఉంటుంది. అందుకని అ ఇల్లు మార్చేసి ఇక్కడే ఉండి పోవాలనుకున్నాం."
"మంచిది. మరి మా మరదలు పిల్ల త్వరలో నోరు కట్టబడి పోతుందన్న మాట."
"ఫో బావా!"
అందులో ఇష్టంతో కూడిన అయిష్టత. బావ నోటి నుండి అటువంటి మాటలు వినాలంటే లత కిష్టం. ఆ ఇష్టాన్ని కప్పి పుచ్చడానికి సిగ్గనే ఆయుధం.
"సరే గానీ, లతా, ఎం.ఎ పాసయ్యావు గదా? మరి ఉద్యోగం చెయ్యదలచుకోలేదా?"
"ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు, బావా. ఇక మీదట ఏమో చెప్పలేను."
ఆ మాటల్లో ఒకరి ఇష్ట ప్రకారం నడుచు కోవాలనే భావన, వినయం గోచరిస్తున్నాయి. చదువు కొన్నందుకు గాను, ఆ చదువును సార్ధకం చేసుకొనేందుకుగాను ఉద్యోగం చేసి తీరవలెననే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి లత -- కాబోయే భర్త గారు అంటే గోపీ ఇష్టాయిష్టాల పైన ఆ పని చేయదలుచు కొంది స్వాతంత్యం కోసం ప్రాకులాడే వారు అనేకులు ఉండగా తను స్వాతంత్ర్యాన్ని మరొకరికి అప్పగించదలుచుకొనే వారు కూడా ఉన్నారు అనుకోని తృప్తిగా నిట్టూర్చాడు రాజ్.
"రాజూ, అమ్మ వసంత నూ, నిన్నూ ఇక్కడ కొద్ది రోజులు నిద్ర చేయించాలని అనుకొంటోంది. ఏమంటావు?"
"నాకేం అభ్యంతరం లేదు. కానీ వసంత ఇష్ట పడదేమోనని అనుమానంగా ఉంది. అయినా అడిగి చెపుతాలే."
'అదేమిటి బావా! ఆమె ఎందు కొప్పుకోదు?"
"లతా, అందరూ ఒకలా ఉండరు. వివిధ రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. వారిని బలవంతంగా మనం చెప్పినట్లు నడిపించడం కష్టం."
మందలించింది ఇందిర.
"పోనీలే వదినా. లతకు ఏమీ తెలియవు. ముందు ముందు తెలుసుకొంటుంది." నవ్వుతూ లతను చూసి చెప్పాడు రాజ్
వారి మాటల వల్ల వసంత స్వభావం ఎలాంటిదో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించింది లత. అందుకేనేమో బావ లో అంత గంబీరత్వం తొంగి చూస్తుంది. అతని మాటల్లో క్రొత్త దనం గోచరిస్తుంది. ఎవరి కోసమో గడిపే జీవితమన్నట్లు చెపుతున్నాయి చూపులు. ఛ! భగవంతునికి దయే లేదు-- అనుకోని నిట్టూర్చింది ఆ చిన్నారి హృదయం.
* * * *
"రాజ్, నువ్వు అన్య మనస్కుడవై అన్యాయం చెయ్యలేదు కదూ?"
"ఎవరికీ రజీ?"
"వసంతకు."
"నీకీ సందేహం ఎందుకొచ్చింది , రజీ?'
"సాధారణ బలహీనతకు నువ్వు కూడా లోబడతావనే భయం చేత."
"అలా ఎప్పటికీ చేయ్యనులే, రజీ."
"క్షమించు . తెలివి తక్కువగా అడిగేశాను."
"చెప్పరాని విషయమైనా నీతో చెప్పకుండా ఉండలేను, రజీ" అని అంతా చెప్పేసి నవ్వాడు రాజ్.
తాననుకోన్నది జరిగినా అది కూడా తన రాజ్ పైనే దెబ్బ తీసే విషయమే అని బాధపడింది రజియా. ఫలితం ఒకటే అయినా ప్రయత్నం విరుద్దంగా మారింది. రంగులు మారి కనిపించే దృశ్యం. కారంగా ఉంటుందనుకొని తింటే అది కాస్తా చేదు అయినట్లని పించింది. అందుకు సంతోషించాలా, బాధపడాలా?
"నువ్వు క్రొత్త విశేషాలు చెప్పి నవ్విస్తావనుకొన్నాను కానీ........"
"పోనీలే . రజీ . ఆ విషయాలు మరిచి పో . డిస్పేన్సరీ ఓపెన్ చేశావు కదూ? ప్రాక్టీసు ఎలా సాగుతోంది?"
"క్రొత్త కదూ? కుంటిగా ఉంది. అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు."
"ఎందుకని?"
"డాక్టర్ చదివే టప్పుడు డిస్పేన్సరీ తెరిచి ఏవేవో చెయ్యాలను కొన్నాను. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలని పించడం లేదు. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశ మిగిలి ఉంది. దాన్ని పూర్తీ చేద్దామను కున్నా సాధ్యం కావడం లేదు.'
చదువు కొనేప్పుడు ఆశలకు అంతు ఉండదు. ఆదర్శాలకు అడ్డు ఉండదు. పెద్ది దేశ సేవకులు కావాలను కొన్నవారు జైల్లో కూర్చున్నారు. ఎందుచేత? దేశ ద్రోహం చేత. డాక్టర్ అయి పేదలకు ఉచిత వైద్యం చేయాలనే అమృతపు ఆశ. కానీ ఆచరణ లో కాబూలీ వాలాలను మించిన కాఠీన్యం . ప్లీడరై న్యాయానికి పాటు పడాలనుకొని పక్కా అన్యాయపు కేసులను తీసుకొంటూ అదృష్టమనేదానికి ఆధారంగా డబ్బు సంపాదించుకోవడం. మంత్రి అయిపోయి నిస్వార్ధ పరుడు కావాలనుకొని ఒకవేళ అయినా నిస్వార్ధం అనేదాన్నే మరిచి పోతారు.
"రాజ్, నువ్వు ఐ.ఎ.ఎస్ పరీక్ష కు కట్ట కూడదూ?"
"నాకెందుకు, రజీ , అవంతా?"
"ఏం? నువ్వు తప్పకుండా కట్టాలి, నాకోసం."
"సరే. ప్రయత్నిస్తాను."
ఆ అంగీకారం లో భవిష్యత్తు పై ఆశ. ఆ ఆశలో ఆనందం. తన రాజ్ తప్పక పాసవుతాడు. తన రాజ్ జిల్లా కలెక్టరు. తన -- కాదు తన రాజ్ కాదు. రాజ్ వసంత కు అధీనం. బాధతో మెలికలు తిరిగిపోయింది. "పిచ్చిదానా! ఎందుకలా బాధపడతావు? అతడు వసంత కు కేవలం భర్త. కానీ నీకు దైవం. నీ మనస్సులో చెరగని ముద్ర. నువ్వు పూజించే ఆరాధ్య దైవం . అలాంటప్పుడు అతడు నీవాడు కాక మరేమవుతాడు? ఈ లోకాని కందని పవిత్ర ఆత్మలు మీవి. అవి కలిసిన తర్వాత ఈ ఐహిక వాంఛలకు ఆశించడమెందుకు?' ఊరడించింది అదే మనసు.
