Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 41


    అద్దంలో కట్టి? తాడు తగిలించి? అంటే ఏమర్ధం? నన్ను చంపినట్లేగా- అంటే ఉరితీసినట్లు! నేను చచ్చిపోయాను. ఈ మంచంలో ఎలా పడుకుంటాను? నేను చచ్చిపోయాను- నాకీలోకంలో స్థానంలేదు. నాకీ లోకంతో సంబంధంలేదు.
    నేను మౌనంగా నుంచున్నాను- గోడను చూస్తూ, నిమ్మో ప్రవేశించింది. నేను దొంగను పట్టానా? ఆనాటినుంచి నామీద కోపంగా ఉంది. ఇప్పుడు మాత్రం అలాలేదు. ధ్వనిలో కాస్త చక్కర కలుపుకుని వచ్చింది. ముందు నన్ను గోడ దగ్గరనుంచి కదలించడానికి ప్రయత్నించింది. తరవాత ఓటమిని అంగీకరించి నాదగ్గరికి వచ్చి కూర్చుంది. ఆమె సంప్రదించడానికి వచ్చింది-నన్ను-అతిముఖ్య విషయాల్లో! ఆమె నా పెన్షన్ను తన పెన్షన్ అంటున్నది. తన పిల్లల్ను నా పిల్లలు అంటుంది.  
    ఆమెకు ముప్పైవేలు కావాలి. అందుకు ఇల్లు అమ్మాలనుకుంటూంది. బ్యాంకులో ఉన్న డబ్బు తన దగ్గర ఉంచుకోవాలనుకుంటూంది. ఎంచేతంటే షమ్మీ పెండ్లికావాలి. ఇమ్తియాజ్ కు వాడి వాటా ఇచ్చి పంపించెయ్యాలి.
    నాకు పెన్షన్, బ్యాంకు అనే మాటలంటే బోరు. అయినా విన్నాను. భవిష్యత్తును గురించి ఆలోచించినట్లు నటించాను. అప్పుడు ఆమెను కోప్పడ్డాను. "నోర్ముయ్ నువ్వు చెప్పింది ఏదీ వినను. నువ్వు నన్ను చంపేశావు. మెడకు తాడు కట్టావు ఉరితీశావు"
    ఆమె అది విన్నది. నా కాళ్ళమీద పడ్డది. 'హమిద్! ఆనాటి రాత్రి విషయం మరిచిపో. నన్ను మన్నించు. ఇహ ఎప్పుడూ అలా చేయను. నీకు ద్రోహం తలపెట్టను'
    "బావుంది. ఎందుకు క్షమించాలి" అని ఆమెను బాదసాగాను. "నువ్వు నా సూర్యుని దొంగిలించావు. కాకుంటే లోకంలో ఇంత చీకటి ఉంటుందా? నా పిస్తోలు దాచిపెట్టావు-దొంగను కాల్చకుండా. ఈ ఇంట్లో మూల మూలకు దొంగలున్నారు. అది నీకు తెలుసా? ఎవరినని చూడమంటావు నన్ను. ఇది ఇల్లేనా? ఫిలిం స్టూడియో కాదుకదా? ఇక్కడ రొమాంటిక్ ఫిల్ములు షూట్ చేస్తున్నట్లున్నారు. ఉహుఁ - నేను ఈ ఉత్తుత్తి నాటకాల్లో వేషాలు వేయలేను."
    అమాంతంగా నా దృష్టి గోడకు తగిలించిన నా పటంమీద పడింది.
    "నన్నెవరు ఉరితీశారు? నువ్వు నన్ను ముక్కలుగా చేశావు. ఎలా ముఖం చూపించను-నలుగురికి!"
    నా చేతికి అందిందల్లా అందుకుంటున్నాను. నిమ్మోను కొడ్తున్నాను. ఆమె అరుస్తూంది. కేకలు పెడ్తూంది. నన్ను పట్టుకోడానికి వస్తున్నారు. వాళ్ళనూ బాదేస్తున్నాను. "ఇవ్వాళ అందరినీ చంపేస్తాను. షూట్ చేసేస్తాను" అని అరుస్తూ పెద్ద బండ అందుకున్నాను. కేకలు పెడ్తూ ఇల్లంతా తిరుగుతున్నాను.
    "చూడండి. ఈ మనిషి ఏంచేస్తున్నాడో" అని నిమ్మో కేకలేసి వీధివాళ్ళను పిలుస్తూంది. "ఇవ్వాళ ఈ ఆస్తి సాంతం నాపేర అయిపోవాలి"
    'సరే, అయితే నాన్నను నావెంట తీసికెళ్తా' ఇమ్తియాజ్ గదిలోంచి బయటపడి తగాదాకు తలపడ్డాడు.
    "వారిని ముట్టుకున్నావో మాటదక్కదు. వచ్చాడు అయ్యమీద అనురాగం ఒలికించేవాడు. ఆయనను వెంటతీసికెళ్లి ఏడువందల పెన్షన్ కాజేయాలనుకుంటున్నావ్. నాకు చిన్నచిన్న పిల్లలున్నారు. ఉన్నది ఒకే ఆధారం. వారిని ఇంటినుంచి తీసికెళ్ళే అధికారం ఎవరికీ లేదు' నిమ్మో చేతులు ఊపుతూ అరుస్తూంది.
    వాళ్లు గట్టిగా అరుస్తున్నారు. ఆ కేకల్లో నాకేమీ వినిపించలేదు. నేను రాయి పారేశాను. నిజంగా ఇమ్తియాజ్ నన్ను ఈ పరాయి ఇంటినుంచి తీసికెళ్తాడా? ఈ విషయం నా రెండో భాగానికి తెలియరాదు. వాణ్ణి ఇక్కడే వదిలేసి పోతాను. వాడే తలపడ్డాడు ఈ దుర్మార్గుల్తో.
    'చూఁచూఁ, 'రా మనం పారిపోదాం'
    'చూఁచూఁ వణికిపోతూంది. ఆమెను ఎత్తుకున్నాను. భుజంమీద కూర్చుండపెట్టుకున్నాను.
    "ఎక్కడికి వెళ్దాం" 'చూఁచూఁ తన బొమ్మనూ. బొమ్మకు స్నానం పోసే బకెట్టునూ విసిరేసి నా భుజం ఎక్కింది.
    'దూరం-చాలాదూరం. అదిగో సూర్యుని దగ్గరికి.'
    నేను గేటు తెరిచాను. బయటికి వచ్చాను. వాళ్లు పోట్లాటల్లో ఉన్నారు. ఆస్తి విభాగాల్ను గురించి తన్నుకుంటున్నారు. ఎవరూ నన్ను చూళ్ళేదు.
    వాళ్ళెందుకు పోట్లాడుకుంటున్నారు, వాళ్ళవాడు ఎవడన్నా చచ్చాడా? సూర్యుడు చచ్చినట్లున్నాడు కాదు, నా పెన్షన్ చచ్చిపోయిందా?
    "నాన్నా! మీ పెన్షన్ కోసం- అన్న అమ్మను కొడ్తున్నాడు" 'చూఁచూఁ అంటున్నది.
    "పెన్షన్ కోసం...ఇప్పుడేం చేయాలి....ఇమ్తియాజ్ నన్ను కొడ్తాడేమో?'
    "నాన్నా! మీరు మీ పెన్షన్ను ఆ ఏట్లో పారేయకూడదూ....అప్పుడే తగాదాలూ ఉండవు" 'చూఁచూఁ నాకు సలహా ఇచ్చింది...చప్పట్లు కొడ్తూంది. 'నాన్నా, చూడండి....సూర్యుడు దొరికాడు. ఆ నదిలో దాక్కున్నాడు'
    అరె నిజంగా సూర్యుడు వాడినెవరూ దొంగిలించలేదు. నన్ను చూచాడు. అదిగో దాక్కుంటున్నాడు- నీళ్ళలో. దిగిపోతున్నాడు.'
    'నాన్నా! త్వరగా నడవండి. అమ్మ వస్తూంది- పట్టుకోవడానికి.'
    'చూఁచూఁ నా భుజంమీద కూర్చొని నలువైపుల సమాచారాలు అందిస్తూంది. నేను మరింత వేగంగా ఉరుకుతున్నాను. అయినా నిమ్మోకు దొరక్కుండా ఎక్కడికి పోవడం? ఎక్కడ దాక్కోవడం?
    ఎదుట నీరు...జలం...అంతటా నీరే...జలం వ్యాపించి ఉంది.
    'చూఁచూఁ పద నీళ్ళల్లో దాక్కుందాం. చూద్దాం మనను ఎవడు పట్టగలడో!

                                              * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS