Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 41

"అన్వేషి, మై డియర్ ఫ్రెండ్...విను! ఏ పద్ధతివల్లనైతేనేమీ...ఇవాళ నేను ఈ దేశానికి పాలకుడిని అయ్యాను. దేశాన్ని పాలించాలంటే డబ్బు వుండాలి. కానీ ప్రభుత్వ ఖజానా ఖాళీ! కనీసం ఈ నెల ప్రభుత్వోద్యోగులకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. ఓ ఆర్నెల్లపాటు దేశాన్ని పాలించే డబ్బు కనుక ఉంటే నేను చేయదలుచుకున్నది ఏమైనా చేయగలను. ఫర్ దట్...ఐ నీడ్ మనీ...అన్ వేషీ! ఐ డెస్పరేట్ లీ నీడ్ మనీ"
"ఎంత?" అన్నాడు అన్వేషీ.
"కొన్ని బిలియన్ డాలర్లు"
"కొన్ని బిలియన్ డాలర్లు!" అని పరిహాసంగా నవ్వాడు అన్వేషి.
"ఈ బడుగు దేశాల్లో నిరంతరం ఏం జరుగుతూ వుంటుందో తెలుసా? ప్రభుత్వాలు పుట్టించగలిగినన్ని అప్పులు తెస్తాయి. వాటిలో ప్రజల కోసం ఖర్చు చేసేది రూపాయికి పదిహేను పైసలు కూడా వుండదు. మిగిలిన డబ్బంతా నేతల, ప్రభుత్వాధికార్ల, కాంట్రాక్టర్ల, బ్రోకర్ల జేబుల్లోకి లేదా నెంబర్ లులేని స్విస్ అక్కౌంట్ లలోకి చేరుతుంది. అంతే!"
"అన్వేషీ...నేను అలాంటివాడ్ని కానని నీకు తెలుసు."
బిగ్గరగా నవ్వాడు అన్వేషి.
"యా! యా! నువ్వు అందరిలాంటి వాడివి కావు. అందరూ నూటికి పదిహేను శాతం తింటే నువ్వు నూటికి నూరు శాతం తినెయ్యగల సమర్థుడివి" అని ఒక్కక్షణం ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఈసారి అతని గొంతులో అధికారం ధ్వనిస్తోంది. అది గమనించాడు ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి.
ఈ అన్వేషి ఇంకా పదవిలో ప్రమాణస్వీకారం చెయ్యనే లేదు. అప్పుడే మారిపోయాడు.
తన అహానికి దెబ్బతగిలే ఇంకో అంశం కూడా గుర్తొచ్చింది ఫీల్డ్ మార్షల్ సర్వాధికారికి.
తను నానా తిప్పలూ పడి ఇంత పెద్ద దేశానికి డిక్టేటరయ్యాడు.
తన చిన్నప్పటి ఫ్రెండు, ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసరూ అయిన ఈ అన్వేషినేమో యూనివర్శల్ బ్యాంకు అడ్వయిజర్ అయ్యాడు.
తను దేశాధినేత అయినా కూడా ఒక బ్యాంకు అధికారి ముందు డబ్బుకోసం దాసోహం అనవలసి వస్తోంది.
ఫ్రెండ్స్ అయినా సరే పొజిషన్ లోకి రాగానే మారిపోతారు కదా. కనీసం చాలా మంది. అలాగే ఈ అన్వేషి కూడా మారిపోయాడు. ఈ ప్రొఫెసర్ గొంతులో గర్వం ధ్వనిస్తోంది ఇప్పుడు.
అయినా అహాన్ని చంపుకుంటూ అడిగాడు ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి.
"అన్వేషీ! నువ్వు రేపు పదవీ స్వీకారం చేసిన తరువాత చెయ్యవలసిన మొదటి పని ఇదే! సరేనంటావా?"
"ఏమిటా మొదటిపని? ఇండియాకు ఇంకా కొన్ని బిలియన్ డాలర్ లు అప్పు ఇప్పించడం! మీ ఇండియా అప్పు తీసుకోవడానికి ఎవర్ రెడీనే. కానీ తీసుకున్న అప్పు ఎలా తీరుస్తుంది ఇండియా?"
"తప్పకుండా తీర్చే ఏర్పాటు చేస్తాను అన్వేషీ!"
పెద్దగా నవ్వాడు అన్వేషి. "నో యూస్ సర్వాధికారీ! నో యూస్"
"ఎందుకని?" అన్నాడు సర్వాధికారి.
అన్వేషి అన్నాడు-
"లుక్! నేను అపాయింట్ అయింది కేవలం యూనివర్శల్ బ్యాంక్ కి అడ్వయిజర్ గానే! చీఫ్ గా కాదు. యూనివర్శల్ బ్యాంక్ కి చీఫ్ జేమ్స్. అతనొక షైలాక్ లాంటి వాడు. రేపు నేను అతనికి ఈ అప్పు సంగతి చెప్పినా అతనూ ఇదే అడుగుతాడు. ఇండియాకు ఇచ్చిన అప్పు ఎలా తిరిగి వస్తుందని!"
"దేశాన్ని తాకట్టుపెట్టి అయినా తీరుస్తాను" అన్నాడు సర్వాధికారి.
నిరసనగా నవ్వాడు అన్వేషి.
"దేశం..ఏం మిగిలింది మీ దేశంలో? ఇండియా అంటే అవినీతి. ఇండియా అంటే అసమర్థత. ఇండియా అంటే అజ్ఞానం. నీకు తెలుసా సర్వాధికారి! ఒక అంచనా ప్రకారం ఈ ప్రపంచంలో అత్యంత అవినీతికరమైన దేశాలు మూడే వున్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఇండియా. ఆ తర్వాత వచ్చేది పాకిస్తాన్. ఆ తర్వాత స్థానం చైనాది. ఇండియాలో అవినీతే కాదు బద్ధకం కూడా వుంది. ఎవడూ ఏ పనీ చేయడు. చేసినా సరిగ్గా చెయ్యడు. మాటలు మాత్రం కోటలు దాటుతూ వుంటాయి" అని ఏదో గుర్తొచ్చినట్టు పెద్దగా నవ్వాడు అన్వేషి.
"ఏమిటి?" అన్నాడు సర్వాధికారి.
"ఏం లేదు. నీకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని గురించి తెలుసా సర్వాధికారీ?"
"గిన్నిస్ బుక్! తెలియకేం?"
"అనేక దేశాలకి చెందిన అనేకమంది వ్యక్తులు అనేకరకాలైనా సాహసకృత్యాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదిస్తారు. అంటే కొండ శిఖరాలని అధిరోహించడం, ఆకాశంలోంచి దూకడం, సాగరగర్భంలోకి సాహసయాత్రలు, ఇట్లాంటి వాటిలో రికార్డులు క్రియేట్ చేసారు చాలామంది.
కానీ, మీ ఇండియన్స్ ఉన్నారా వీళ్ళే పేర్లు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కుతూనే వుంటాయి. ఎందులో? పొడుగాటి గోళ్ళు పెంచడం, బవిరిగెడ్డం పెంచడం, బారెడు మీసాలు పెంచడం, ఆపకుండా చప్పట్లు కొట్టడం, నాన్ స్టాప్ గా మాట్లాడడం, తలమీద పాల సీసాలు పెట్టుకుని వెనక్కి నడవడం, ఇట్లాంటి వాటిల్లో రికార్డులు క్రియేట్ చేస్తారు. ఆ! ఇండియన్స్ కి ఒక్క విషయంలో మాత్రం ఎక్కడలేని ప్రజ్ఞ వుంది"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS