Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 41


    దిక్కుతోచని సుబ్బారావు ఆ బాపతు చూపుల్తోనే ఆ యిల్లి వదిలి వెళ్ళిపోతున్నాడు.

 

    ఆ గొడవ మొత్తం గుడ్లప్పగించి చూస్తున్న సత్యాన్ని గదిలోకి లాగేడు కృష్ణమూర్తి.

 

    గదిలోకి రాగానే ఆ తలుపు మూసేడు. సత్యం చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నట్టు నించున్నాడు.

 

    "సుబ్బారావు ఉంటున్న ఇంట్లోనే నేనుకూడ అద్దెకుంటున్నాను!" అన్నాడు కృష్ణమూర్తి.

 

    "తెలుసు"అన్నాడు సత్యం.

 

    "సుబ్బారావు చాలా మంచివాడు."

 

    "ఆ సంగతి అతన్నిచూస్తే అర్ధమవుతుంది!"

 

    "ఆ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిని అయ్యేను!"

 

    "అనుకున్నాను!"

 

    "వాళ్ళ క్షేమం నాక్కావాలి!"

 

    "అట్లా కోరుకోవడంలో తప్పులేదు!"

 

    కృష్ణమూర్తికి తండ్రి వరస నచ్చలేదు. ఆయన అంటీ అంటనట్టు మాట్లాడటం చికాకు కలిగించింది. అంచేత కృష్ణమూర్తి తాను చెప్పదలుచుకున్నది సీరియస్ గా చెప్పాలనుకున్నాడు. కానీ అతని గొంతులో ఆర్ద్రత చోటు చేసుకుంది.

 

    "నాకు తోబుట్టువుల్లేరు. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అమ్మనీ తోబుట్టువుల్నీ నేను వాళ్ళల్లో చూసుకుంటున్నాను. ఆ యింట్లో అద్దెకు దిగడం నా అదృష్టంగా ఎంచుకుంటున్నాను. వాళ్ళకే కష్టం కలిగినా సహించలేను. నాకు నువ్వేం సాయపడక్కర్లేదు. సాయం చేయమని అర్ధించను. కానీ... కానీ...సుబ్బారావుకి సాయపడు!"

 

    కృష్ణమూర్తి అభ్యర్ధన సత్యం విన్నాడేగాని విని కించిత్తు కూడా చలించలేదు. సమాధానంగా ఒక్కమాటా బదులివ్వలేదు.

 

    మళ్ళీ కృష్ణమూర్తే మాట్లాడేడు-

 

    "నేను అడిగింది నువ్వు ఏనాడూ కాదనలేరు. గుర్తుందా నాన్నా- నా చిన్నప్పుడు నా ఆట వస్తువులకోసం వేలకు వేలు ఖర్చుచేసేవు. తెలిసీ తెలీక వాటిని పాడుచేస్తే మందలించడం పోయి "పర్లేదు కన్నా కొత్తవి తెస్తాను ఆడుకో" మన్నావు. అట్లా ఎంచేత బుజ్జగించేవో చెప్పగలవా నాన్నా?-

 

    "చిన్నవాడివి! కోప్పడితే ఏడుస్తావని అట్లా అని ఉంటాను!"

 

    "అబద్ధం! నేను ఆడుకోడానికి మనింటిలో మనుషుల్లేరు. నాకేమో మనుషులు కావాలి. బొమ్మలిని తెచ్చి మనుషులు కన్నా-ఆడుకోమని మభ్యపెట్టేవు అవునా?"

 

    "కావచ్చు!"

 

    "నువ్వు చెప్పినట్టే ఆ బొమ్మల్తో ఆడుకున్నాను. ఆనందించేను. ఇవాళ... ఇవాళ మనుషుల మధ్య బతుకుతున్నాను నాన్నా! బొమ్మలకంటే విలువైన మనుషుల మధ్య ఎంతో ఆనందంగా బతుకుతున్నాను వాళ్ళు నాక్కావాలి! నా చిన్నతనంలో నాకు దక్కని అనుభూతి యిప్పుడిప్పుడే సొంతమవుతోంది. దయచేసి వాళ్ళని ఆదుకో!"

 

    "నాకోసం నాన్నా! నా ఆనందం కోసం!" అంటూ వచ్చే కన్నీటిని అదుపులో పెట్టుకుంటూ కృష్ణమూర్తి ఆ గది తలుపులు తెరిచాడు. వేగంగా అక్కడినుంచి వెళ్ళిపోయేడు.


                                     25


    పిచ్చెక్కినట్టు నడుస్తున్నాడు సుబ్బారావు.

 

    అతని కంటికి రోడ్డూ దానిమీద మనుషులూ, బళ్ళూ, కారులు-దాని పక్కన పెద్దపెద్ద ఇళ్ళూ ఏమీ కనిపించడం లేదు.

 

    అంతా శూన్యం! కాకపోతే పెద్ద ఎడారి?

 

    ఒక నిర్ణయానికి వచ్చిన మనిషల్లే అతను చాలా వేగంగా రోషంగా నడుస్తున్నాడు.

 

    అప్పటికే అతను ఊరికి దూరమయ్యేడు.

 

    సముద్రానికి దగ్గరవుతున్నాడు.

 

    చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి. సుబ్బారావు సముద్రంలో అడుగుపెట్టాడు. తనని ఎవరో పిలుస్తున్నట్టుగా-ఆ పిలుపు వినిపిస్తున్న వేపు చకచకా నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు.

 

    కెరటాల తాకిడికి అతను వెనుకంజ వేయడం లేదు. కనీసం తూలిపడటం కూడా లేదు.

 

    అప్పుడే ఛాతీ లోతుకు వచ్చేసేడు. మరొక్క అడుగువేస్తే చాలు- పాడు ప్రాణం చివరి శ్వాస తీసుకుంటుంది.

 

    ఆ అడుగుకూడా వేయబోయేడు.

 

    అకస్మాత్తుగా అతన్ని ఎవరో ఎత్తుకున్నట్లయింది.

 

    ఆ చేతుల్లోనుంచి తప్పుకునే ప్రయత్నం చేసాడుగానీ అందుకతని బలం చాల్లేదు.

 

    ఒడ్డుకి చేరుకున్న తరవాత ఎత్తుకు వచ్చిన మనిషి సుబ్బారావుని ఒక మూటలాగా నేలమీదికి విసిరేసేడు.

 

    సుబ్బారావు ఆ వ్యక్తివేపు చూసేడు.

 

    ఆకాశమంత ఎత్తు కనిపించేడు సత్యం!

 

    "మీరా?" అన్నాడు సుబ్బారావు లేచి కూర్చునే ప్రయత్నం చేస్తూ.

 

    "కూర్చో!" అని సత్యంకూడా కూర్చున్నాడు.

 

    "కొంచెమాలస్యమైతే చచ్చేవాడివి!" అన్నాడు సత్యం.

 

    సుబ్బారావు తలొంచుకుని అన్నాడు---

 

    "చావడానికే వచ్చేను!"

 

    "అట్లాచెప్పు నేను అనుకున్నది కరక్టే-అవునూ---ఎందుకు చావదలుచుకున్నావో చెప్పేందుకేమైనా అభ్యంతరమా?"

 

    "బ్రతికి ప్రయోజనం లేకపోయిన తర్వాత చావడమే మంచిది!"

 

    "వెరీగుడ్! నాక్కావలసింది నీలాంటివాడే!"

 

    "హాస్యమాడుతున్నారా?"

 

    "నా సీరియస్ నెస్ కి నువ్వే పేరు పెట్టినా ఫర్లేదు. కానీ నిజం చెప్పాలంటే చావాలనుకుని చావబోయే మనిషితో నాక్కొంచెం పనుంది"

 

    "ఏమిటది?"

 

    "ఆ చచ్చేవాడు నేను చావమన్నప్పుడు చావాలి!"

 

    "అంతవరకూ బ్రతికేందుకు ఓపిక ఉండద్దూ!"

 

    "ఆ టానిక్కు నేనిస్తాను!"

 

    "నాకు అర్ధం కావడం లేదు!"

 

    "ముందు నీ చావు సమస్య ఏమిటో చెప్పు?"

 

    "నా చెల్లి పెళ్ళికి లక్ష రూపాయలు కావాలి?"

 

    "ఓసంతేనా?"

 

    "మీ కదొక పెద్ద సమస్య కాకపోవచ్చు నాకది గొప్ప సమస్యే? జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా అంత పైకం సంపాయించలేను. నా చెల్లెలి పెళ్ళి నచ్చినవాడితో చెయ్యలేను. బతికి చూళ్ళేను గనుక చావాలనుకున్నాను తప్పా!"

 

    "నీ వరకు నువ్వు కరక్టే! ఆ లక్ష దొరికి నీ చెల్లికి పెళ్ళయితేనో?"

 

    "అది జరగని పని!"

 

    "జరగనిది జరిపించడం నా ప్రత్యేకత!"

 

    "సార్!"

 

    "కానీ-ఇందులో నా స్వార్ధంకూడా వుంది!"

 

    "అదేమైనా సరే! దాన్ని స్వార్ధమని నేను అనను"

 

    "థేంక్యూ! నీచావు కొన్నాళ్ళు వాయిదా వేసుకో! రెండు లక్షలిస్తాను!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS