"ఈ మధ్య నువ్వు 'డల్' గా ఉంటున్నావ్ - ఊళ్ళో ఏవైనా జరిగిందా గౌతమి." ఫ్లాస్కులోని కాఫీ కప్పుల్లో ఒంపుతూ, ఓ కప్పుని ఆమెకి ఇస్తూ అంది మాల.
జవాబు చెప్పలేదు గౌతమి.
నిశితంగా చూసింది మాల గౌతమి వేపు.
ఊరికెళ్ళి వచ్చిందగ్గర్నుంచి గౌతమి ప్రవర్తన కొత్తగా కన్పిస్తోందామెకు. ఇదివరలో 'జోక్స్' కట్ చేస్తూ, వచ్చినకొత్త సినిమానల్లా చూస్తూ, హుషారుగా ఉండే గౌతమి గత వారం రోజుల్నుంచి ఏదో పోగొట్టుకున్న దానిలా కన్పిస్తోంది. అప్పుడప్పుడు పిచ్చిదానిలా తనలో తనే ఏదో మాట్లాడు కుంటుంది- నవ్వుతుంది- ఏమైంది గౌతమికి-?
డాక్టర్ మాలలో ఎన్నో ప్రశ్నలు.
ఏం జరిగిందో తెల్సుకోవడం కోసం, అడిగి, అడిగి, విసుగుపుట్టి గౌతమి ఏం చెప్పక పోవడంతో ఊరుకుంది మాల.
కానీ ఏదో జరిగిందని నమ్ముతోంది మాల.
"అవినాష్, గౌతమిల మధ్య ఏమైనా వచ్చాయా" అలా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే- తను ఊరెళ్ళి వచ్చింది.
అవినాష్ ఎక్కడ ఉన్నాడు. మరి!
"ఏం గౌతమి... మీ పెళ్ళెప్పుడు-" గౌతమి ముఖంలోకి చూస్తూ అడిగింది మాల.
కాఫీ కప్పు పెదాల దగ్గర పెట్టుకోబోతూ, ఒక్కక్షణం ఆగి, మాలకేసి చూసి, మళ్ళీ చూపులు కిందకు దించుకుని నెమ్మదిగా కాఫీ తాగుతోంది గౌతమి. మాటల్లో చెప్పకుండానే, ఆ మౌనాన్ని అర్థం చేసుకుంది మాల.
"ఏం జరిగిందో... నాతోనైనా చెప్పొచ్చుకదా-" కొంచెం రెట్టిస్తూ అంది మాల.
అప్పటికి గౌతమిలో తెచ్చిపెట్టుకున్న నిగ్రహం ఒక్కసారిగా ఎగిరి పోయింది. ఆ క్షణం వరకూ పంటి బిగువున అదిమి పెట్టుకున్న దుఃఖం, కనురెప్పల మాటున దాచుకున్న కన్నీరు ఒక్కసారి బయటకొచ్చాయి.
వెక్కి వెక్కి ఏడుస్తూ గౌతమి చేతిలోని కప్పును దూరంగా విసిరి కొట్టేసింది.
గౌతమిలోని ఆ మార్పుకి మాల బిత్తరపోయింది.
"ప్లీజ్... గౌతమి- డోంట్ క్రై... ఏం జరిగింది-" కుర్చీలోంచి లేచి ఆ గది తలుపుల్ని దగ్గరగా వేసి, గౌతమి భుజాల్ని పట్టుకుని, తన పైట చెంగుతో ఆమె కళ్ళను తుడుస్తూ అడిగింది మాల.
గౌతమికి తన దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి చాలా సమయం పట్టింది.
ఆ తర్వాత-
"అవినాష్ పెళ్ళి చేసుకోనన్నాడా..." మాల అడిగింది.
"పెళ్ళి-" గౌతమి పెదాలు కదిలాయి భారంగా.
"మాలా... వాడు మనిషి కాడు - మృగం... ఆ మృగానికి ఆడపిల్ల ఓ అనందం- వాడు రాక్షసుడు మాలా..."
గౌతమి నోట్లోంచి జరిగిన కథ అంతా విన్న మాల ఆశ్చర్యపోయింది.
"ఇంత జరిగిందా-" కోపంగా అంది.
కొద్ది క్షణాల తర్వాత, ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా మాల అంది-
"నే వెళ్ళి మాట్లాడతాను... నిన్నెలా పెళ్ళి చేసుకోడో నేను చూస్తాను"
"వద్దు మాలా... వాడిమీద నాకేం ఇప్పుడు ప్రేమలేదు- నువ్వెళ్ళి మాట్లాడినా, వాడు మనసు మార్చుకుని నా దగ్గరకు వచ్చినా... వాడిని నేను పెళ్ళి చేసుకోలేను..." నెమ్మదిగా అంది గౌతమి.
"మరి... నీ కడుపులో బిడ్డ సంగతి-"
"దానికి నాకేం బాధలేదు. నా బిడ్డ నాకేం బరువు కాదు... వచ్చే అవమానాలంటావా-? వాటిని భరించటానికి సిద్ధంగా ఉన్నాను... నా బిడ్డను ధైర్యంగా కంటాను... ధైర్యంగా పెంచుతాను-"
"ఆ బిడ్డ పెద్దయ్యాక... తండ్రి గురించి అడిగితే-"
మాలవేపు సూటిగా చూసింది గౌతమి.
"చచ్చిపోయాడని చెప్తాను-"
కొద్దిక్షణాలు ఆ మాటకు ఎదురు మాట్లాడలేదు మాల.
"ఆ బిడ్డతో జీవితమంతా... బాధపడుతూ బతుకుతావా... చెప్పు నువ్వేం... పోగొట్టుకుంటున్నావో నీకిప్పుడు తెలీదు... పిచ్చి-పిచ్చి ఆలోచన్లు మానేసెయ్, నేను అవినాష్ తో మాట్లాడతా-"
"మాలా-" గట్టిగా అరిచింది.
"వాడిపేరు... నా దగ్గర మాట్లాడొద్దు... వాడితో పెళ్ళికాదు... వాడు నన్నెంత నరకయాతన పెట్టాడో, దానికి రెట్టింపు వాడిని నేను చిత్రహింసలు పెడతాను- అవసరమైతే వాడిని చంపడానికి కూడా నేను వెనుకాడను-" గౌతమి గొంతులోంచి ఉద్వేగంగా వచ్చాయి ఆ మాటలు.
చాలా సేపటి తర్వాత-
"మీ కజిన్ బ్రదర్ ఈ ఊళ్ళోనే ఉన్నాడా..." అని అడిగింది మాలని.
మాల కజిన్ బ్రదర్ పురోహిత్ పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్.
"అవును-"
"ఒక్కసారి ఆయనకు నన్ను పరిచయం చేస్తావా-"
"ఎందుకు-"
"ఎందుకో నీకే తెలుస్తుందిగా..."
భోజనాలు చేస్తున్నపుడు డైనింగ్ హాల్లో-
"నాకు నైట్ డ్యూటీ... రూంలో అలా ఏం కూర్చుంటాం... సిన్మాకెళ్దామా-"
"ఏ సిన్మా కెళ్తాం-"
"ఇన్ సాఫ్ కా తరాజు... చాలా బాగుందిట-"
"వెళ్దాం లే-" గౌతమి అంది.
అప్పటికి సమయం పన్నెండు గంటలైంది.
* * * *
ఇన్ సాఫ్ కా తరాజు.
గౌతమి థియేటర్లోకి అడుగుపెట్టే సమయానికి అప్పుడే టైటిల్స్ పూర్తయ్యాయి.
అమ్మాయిల్ని ప్రేమ పేరుతో బుట్టలో వేసుకోవడం, అవసరం తీరాక గుడారం ఎత్తేసే హీరోలకి, హీరోయిన్ గుణపాఠం చెప్పడం అందులో కథ.
ఆ సినిమా చూస్తుంటే గౌతమికి తన బతుకే తెరమీద కదలాడు తున్నట్టుగా ఉంది.
ఆమె కళ్ళల్లో నీళ్ళు చెక్కిళ్ళమీంచి జాలువారుతున్నాయి. తుడుచుకునే శక్తి కూడా లేక, నిస్త్రాణంగా ఉండిపోయింది గౌతమి.
