Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 40


    పెళ్ళి జరుగుతుంది. అంతా హడావుడి. పెళ్ళికి పెద్ద మనుషులు చాలా మంది వచ్చారు. ధనవంతులకు ఊరంతా బంధువులే. అందరూ స్నేహితులే. కావలసిన వారే. కానీ అందరూ చదివింపుల దగ్గరి బంధువులు కాదు.
    తలెత్తి చుట్టూ చూశాడు పెళ్లి కొడుకు. రజియా చిరునవ్వుతో అతనికి ధైర్యానిస్తుంది. గోపీ చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తున్నాడు. బహుశా అది మిత్రుడి పట్ల గల అభిమానపు చిహ్నం కావచ్చు. ఆనంద్ మొహం లో ఏ భావాలు తొంగి చూడడం లేదు. కానీ చూపులు స్నేహితుడి పట్ల జాలిని కురిపించాయి. ఇందిర మరదిని ఆశీర్వదించింది. లత అతనికి జోహార్లు అర్పిస్తుంది.
    ఏమీ తెలియని నారాయణరావు ఉత్సాహం తో చిలిపిగా తమ్ముడిని చూపులతో పలుకరించాడు. జరుగని దానికి విచారమేలనంటూ సుగుణ సంతృప్తి గా నవ్వుతూ అతిధులను ఆహ్వానించి కొంటె పనులు ఎలా చేయడమా అని ఆలోచిస్తుంది. మిత్రురాలికి జరిగిన అన్యాయానికి మగ జాతినే అసహ్యించు కొంది అరుణ. తృప్తిగా మెరుస్తున్నాయి ఆనందరావు గారి కళ్ళు. అల్లుణ్ణి పెళ్లి పీటలపై చూసి సంబర పడింది శాకుంతలమ్మ. ఒక్కగానొక్క మేనల్లుడ్ని తన చిన్న కూతురు లతకు భర్తగా చెయ్యాలనుకొన్న ఆమె కోరిక తీరక పోయినా ఒక యింటి వాడవు తున్నాడు కదా అని సంతోషించింది.
    వసంత క్లాస్ మేట్స్ చాలామంది వచ్చారు.  ఎందరో విద్యార్ధుల గుండెలలో దిగబడిన బాకు లాంటి వసంత అందరికీ దూరమై రాజ్ పరమైంది. వారినీ, వారి చూపులలోని భావాలనూ కనిపెట్టాడు రాజు. వారిలో ఎందరిని ఆడించిందో , ఎందరి చేత ఆడింప బడ్డదో ! పెళ్ళి కాబోతున్న వసంతను చూసిన వారికీ బాధ. వారిని చూసి గతించిన రోజులు జ్ఞప్తి కి తెచ్చుకొన్న వసంత మనసులో చింత. ఆది ఆలోచించిన రాజ్ మనసులో ఆవేదన. మొదట్లోనే నాకీ పరీక్ష ఏమిటి భగవాన్ అనుకోని మనసు చిక్క బట్టుకొని "మాంగల్యం కట్టండి" అన్న పురోహితుడి పిలుపు తో ఈ లోకంలోకి వచ్చాడు.
    ఆ రాత్రి డ్యాన్సు కార్యక్రమం. రజియా కోరి చేయించిందాపని. ఆమె ఉద్దేశ్యం లోని అంతరార్ధం ఆమెకూ, రాజ్ కూ తప్ప మరెవ్వరికీ అర్ధం కాదు. ఇదొక పరీక్ష కాబోలు అనుకోని వీటిని నెగ్గిన నాడే విజయం అనుకోని నిట్టూర్చాడు రాజ్.
    అందంగా అలంకరించుకొని నెత్తిన కుండతో తిరిగే రాధ చిలిపి కృష్ణయ్య కంట బడింది. సార్ధక నామదేయుడై ఆ కుండ లోనిది అరగించాడు. ఆ వెన్నతో తృప్తి పడే స్వభావం కాదతనిది. వెన్నవంటి ఆ కోమలాంగి మనసునే హరించాడు. ఇష్టమున్నా అయిష్టాన్నే ప్రదర్శించింది, అంతకు మించి మరేమీ చెప్పలేని చదువుకోలేని ప్రేమై క మూర్తి రాధ. హృదయాలను తస్కరించడమే నేర్చుకున్నాడు గానీ అర్పించడం నేర్చుకోలేదు భగవంతుడైన ఆ గోపాలుడు. అది అమాయకపు రాధకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరం కనిపించలేదు. ఆ నల్లనయ్య సమక్షంలో మైమరచి ఆనందాన్ని అనుభవించడమే తెలుసు ఆమెకు. ఆ ముగ్ధ మోహన మూర్తికి సంతృప్తి ని చేకూర్చడమే అతని నిత్య కృత్యం. కృష్ణుడేప్పుడూ రాధా లోలుడన్న నమ్మకాన్ని కలిగించాడు. ఆ నమ్మికలో మునిగి పోయింది. ఆ ఆనందానికి మురిసిపోయింది. ఆ అదృష్టానికి పొంగి పోయింది. తన మురిపాన్ని అ యుమునా నది తీరంలో చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు , పశు పక్ష్యాదులకు చెప్పి ఉబ్బి తబ్బిబ్బ యింది. అంతులేని ఆనందం ఎగిరిపోయి నప్పుడు మిగిలేది అరికట్టలేని దుఃఖమెగా?
    ఆ నమ్మికకూ, సత్యానికీ దూరం చాలా ఉందని తెలుసుకోనిన నాడు ఆమె పరిస్థితి ఎట్లుంట్లుందో రాధ వేషంలో ఉన్న రజియా హావ భావాలతో నాట్యం చేసి చూపించింది. కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కృష్ణుడు తిరిగి తనకు కనిపిస్తాడేమోనని ప్రపంచాన్నే మరిచి ఎదురు చూసింది. ఆ నిరీక్షణకు అంతం లేదా? అ కోరిక తీరదా? తీరని కోరికల మధ్య అంతం లేని నిరీక్షణ లలో నలిగి పోవలసిందేనా ఆ జీవితం? తన కృష్ణుడు భగవంతుని స్వరూపమని తెలుసుకొంది. భక్తీ తో ప్రేమించిన అతన్నే పూజించింది. ఎందుకు? మోక్ష ప్రదానానికి! ఆ భగవంతుని మనసులో స్థానాన్ని అపాదించుకొన్న ఆమెకే లభించదా మోక్షం. కాని లభించబోయే ఆ ముక్తికి ఎదురు చూడడంలోనే ఉంది అనుభవ పూర్వకమైన ఆనందం.
    ఆ నటన లోని రజియా ఆవేదనను అర్ధం చేసుకోకుండా ఉండలేక పోయాడు రాజ్. అతని మనస్సు అపూర్వమైన అనుభూతులతో నిండి పోయింది. అనుభవం కన్నీటిని మాత్రం ప్రసాదించగలిగింది. అతని ప్రక్కనే ఉన్న వసంత అది గమనించింది.

                             *    *    *    *
     మొదటి రాత్రి అనుభావం మధురం. యువతీ యువకులు కలలు కని ఎదురు చూసిన తియ్యని రాత్రి. నవదంపతులు తమ జీవితాన్ని సుస్థిరంగా ఏర్పరచుకొనే అచంచల మైన రాత్రి. విడదీసినా విడిపోని సంబంధాన్ని కలిగించే అమోఘమైన రాత్రి. జీవితాలకు పునాదులనే కాక భవంతులను కూడా కట్టించి శరీరాలనే కాక మనస్సు లను కూడా కలిపే రమ్యమైన రాత్రి.
    రాజ్ పట్టు పానుపు పై కుడిచేతిని నుదుటి కానించి పడుకొని ఉన్నాడు. అతని మెదడు లో అనేక రకాలైన ఆలోచనలు తిరుగుతున్నాయి. తను అనుకున్న సుఖాలను పొందలేక మరొకరి గొంతు కోశాడు. వసంత -- ఆమెను ద్వేషించి , ఆమెలోని బలహీనతకు జాలిపడ్డాడు. తనకు ఆమె భార్య అవుతుందని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడదే జరిగింది. ఆమె ప్రవర్తనా , గత చరిత్రా తనకు సుఖాన్ని ఇవ్వలేవు. గత చరిత్ర ను మరిచి పోవడానికి ప్రయత్నించ వచ్చు. ఆమె ప్రవర్తనను క్షమించవచ్చు. కానీ ఎంత వరకు? తనూ మానవుడే. తనలో మానవ సహజమైన బలహీనతలు ఉన్నాయి. ఎప్పటికీ ఆమెను క్షమిస్తూ కూర్చోవడానికి తన కెంత ఓపిక ఉంది? జరిగిన సంఘటనలు తన మదికి వచ్చి తనను బాధించవూ? వాటి మధ్య తను నలిగి పోకుండా నిలువ గలడా? ఆ ఆవేశంలో తను తప్పుదారి త్రోక్కితే? ఆ తప్పును దిద్దుకో బోయి విదివ శాత్తు అందులోనే అంతమైపోతే? మరి కొన్ని ప్రాణాలను కూడా బలి చేయవలసి వస్తుందేమోనని భయంగా ఉంది. వసంత ఎన్నో ఆశలతో తన దరి చేరుతుంది. తనకు సుఖం లేకపోయినా ఆమె కైనా ఆనందమివ్వగలిగితే అంతే చాలు. ఆమెకూ అన్యాయం చేయకూడదు.
    తలుపు దగ్గర నిలబడి రాజ్ ను చూసింది వసంత. సిల్కు లాల్చీ తో ఆ లైటు వెలుతురూ లో చంద్రుని మించిన ప్రకాశం కలిగిన మొహంతో నవ మన్మధుడిలా కనిపిస్తున్నాడు. అతడిని పొందుతావన్న ఆశ తను వదులు కొంది. కానీ నేడు తన కోరిక ఫలించింది. అతని జీవిత భాగస్వామిని యై , అతని మనసులో తిష్ట వేసుకొని ఎనలేని ఆనందాన్ని చవి చూడాలి అనుకోని ఉవ్విళ్ళూరుతున్న మనసుతో పానుపును చేరింది.
    భక్తితో అతని పాదాలను నమస్కరించింది. ఆ క్షణం లో ఆమె మనసులో గతించిన సంఘటన జరిగిపోయిన జ్ఞాపకాలను రేపింది. ఆ సంఘటన ఆమె మనసునే మార్చి వేసింది. భక్తీ స్థానం లో ద్వేషం బయలుదేరింది. ఆనాడు ఇవే కాళ్ళు పట్టుకొని తనకు ప్రేమ భిక్ష పెట్టమని అర్ధించింది. ఏడుస్తూ ప్రాధేయ పడింది. ఫలితం ---- కఠిన మనస్కుడై నిరాకరించి కాలదన్నాడు. పరిచిన హృదయం పై నడిచి పోయాడు. ఆనాడు ఆ హృదయం ఎంతగా గిలగిలలాడింది! తను ఎంతగా ఏడ్చింది! తన మనసును గాయపరిచి తన నేడిపించిన ఇతనితో తను సుఖంగా కాపురం చెయ్యాలా? ములుకుల్లాంటి మాటలని తన మదిలో శూలాలను గ్రుచ్చి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయిన ఇతనిని నేడు ఆనందంతో సేవించాలా? దయ, కరుణ లేకుండా తన మనసును దుఃఖానికి ఆహుతి చేసి ఆ దుఃఖ సముద్రంలో తనను విసిరి వేసి తనదారిన తను చక్కాపోయిన ఇతనితో జీవితమంతా సుఖంగా గడపాలా? మంచి చెడులు లేకుండా తనను విమర్శించి ఆ ప్రతి హితమైన గుండెల పై ఎదురుదెబ్బ తీసి వెళ్ళిపోయిన ఇతన్ని పతిగా ఎంచుకొని అన్నీ మరిచిపోయి జీవిత మంతా గడపాలా? తనను అర్ధం చేసుకోలేక ఆనందమంటే తెలియని ఈ జడ పదార్ధంతో జీవితాన్ని నిర్లిప్తంగా గడపడం అసాధ్యం. ఆనాడు ఇతను చేసిన దానికి తను ప్రతీకారం చెయ్యాలి. తనానాడు అనుభవించిన బాధ ఎలాంటిదో  తెలియ జెయ్యాలి. ' అంతవరకూ అతని హృదయాన్ని చిత్ర హింసలకు గురి చేస్తాను. కానీ, ఫలితం ఎలా ఉంటుందో?"
    "వసూ!" మెల్లిగా పిలిచాడు రాజ్ లేచి కూర్చుంటూ . ఆ పిలుపుకు లొంగి పోవాలనిపించింది వసంత కు. కానీ ఆ ప్రతీకారమే మనసులో మెదల కుంటే ఆపని చేసి ఉండేది.
    "వసూ , నువ్వు కూడా అలా సిగ్గు పడతావేం! నేను నీకు క్రొత్త కాదుగా?" లేచి ఆమె భుజాల పై చేతులు వేసి ఆ కళ్ళలోకి చూశాడు.
    ఆ స్పర్శతో పులకించింది వసంత శరీరం. ఆ స్పర్శ కి ఆమెను క్షణం సేపు వివశురాలీని చేసింది. ఆ మాటలలోని 'నువ్వు కూడా' అన్న పదం ఆ హృదయాన్ని కలుక్కుమనిపించింది . తన చరిత్ర ను ఎత్తి చూపించినట్లని పించింది. ఆ పట్టు విడిపించుకొని విసురుగా దూరం జరిగింది.
    అంతకు ముందు వరకూ భారత నారీ ధర్మాన్ని ఆచరించిన వసంత లో ఆ విసురును చూసి ఆశ్చర్యపడకుండా ఉండలేక పోయాడు రాజ్. చిరునవ్వుతో దాన్ని కప్పేశాడు. వసంత నడుము చుట్టూ చేతులు వేసి బంధించాడు.
    'అప్పుడే అలుకా!"
    "చూడండి. ఇటువంటి ఎగతాళి నాకు నచ్చదు. దయచేసి ఊరుకోండి."
    ఆ పట్టు విడిపించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.
    "ఈ రాత్రికి ఊరుకుంటే లోకం నన్ను పిచ్చి వాడిగా జమ కడుతుంది."
    చిరునవ్వుతో మరింత దగ్గరగా లాక్కొన్నాడు వసంత పెనుగు లాడలేదు.
    "మీకు, కాదూ చెప్పేది? సిగ్గు లేదూ? నన్ను వదలండి" కోపాన్ని అభినయించి విసురుగానే అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS