Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 40


    మొన్న ఒక పిచ్చివాడొచ్చాడు. అతనిది నకిలీ గడ్డం. అది మాటిమాటికి గాలిలో ఎగురుతుంది. అది ఊడుతుందేమోనని భయం. గుట్టురట్టవుతుందని నకిలీ గడ్డం పట్టుకొని కూర్చుంటాడు. నన్ను చూచాడు. అంతే గట్టిగా కావిలించుకున్నాడు-కలకాలపు మిత్రునిలా.
    'చెప్పు మిత్రమా! ఎలా వున్నావు? ఆరోగ్యం బావుంటుంది కదా!' అతను అడిగాడు.
    'నీకథ చెప్పవయ్యా! ఆ నకిలీ గడ్డం అమ్ముతావా?'
    ఆ మాట విన్నాడు వెనకడుగు వేశాడు. నేను లాగి కూర్చోపెట్టాను. కాసేపు పిచ్చివాడితో మాట్లాడ్డం తప్పేం, సరదాగా ఉంటుంది అనుకున్నాను.
    అతడు దూరం జరిగాడు. స్టూలుమీద కూర్చున్నాడు.
    "చాలాసార్లు అనుకున్నాను నిన్ను చూడాలని, నీవు గుర్తిస్తావో లేదో అని భయం. అందుకే రాలేదు" గడ్డం సర్దుకుంటూ అన్నాడు.
    'అవును పాపం! నీకు మెదడు జబ్బుగామరి. ప్చ్ చాలా మారిపోయావు'
    'అబ్బే అదేంలేదు. ఏంలేదే. లేందే.' అన్నాడు. నన్ను చూచి నవ్వుతున్నాడు. ఎందుకలా నవ్వుతాడు? పిచ్చివాళ్లు అంతేనట. ఎదుటివాణ్ణి పిచ్చివాడనుకుంటారట! వాడు పిచ్చివాడు. నన్ను పిచ్చివాడనుకుంటున్నట్లున్నాడు.
    'మిత్రమా! నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది. ఏంచేస్తాం-జబ్బు అలాంటిది.'
    'నాకు నీ నకిలీ గడ్డం ముద్దొస్తుంది. ఈ ఒక్కనాటికి అరువియ్యరాదూ! చూఁ చూఁతో  దొంగల ఆట ఆడుకుంటాం.'
    అతడు నామాట విన్నాడు. దర్వాజావైపు నడిచాడు. కొంతదూరం వెళ్లి నిలిచాడు. 'మిత్రమా! కాస్త తెలివిగా మాట్లాడు. వదిన నీ చికిత్సకోసం ఏర్పాటేమీ చేయలేదని విన్నాను. నీ పెన్షను సాంతం వీళ్లకే అర్పిస్తావా! నిన్ను గురించి జాగ్రత్తపడవా?'
    మళ్ళీ పెన్షన్ మాట! నా రెండోభాగం కూడా మాయం అయినట్లుంది. మిగిలింది నేనే-నా పేరు పెన్షన్. నేను మనిషిని కాను- పెన్షన్ను అన్నట్లు చూస్తున్నారంతా. వెధవ పెన్షన్! విసిరిపారెయ్యాలనిపిస్తుంది అవును. పారేస్తాను నిజమే. తరవాత నన్నెవడైనా లెక్కపెడ్తాడా ఈ ఇంట్లో? నన్ను కొనేవాడుంటాడా? ఏమంటారు?
    ఆ పిచ్చి వెధవను ఎప్పుడు వదిలించుకున్నానో గుర్తులేదు. ఫజ్లూ చెప్పిందేమంటే- నేను వాడి గడ్డం గుంజడానికి ప్రయత్నించానట. వాడు బెదిరి పారిపోయాడట.
    వాడు తల తిరిగిన పిచ్చివాడు. వాడితో ఇంకెలా ప్రవర్తించాలంటారు?
    అచ్ఛా అలాంటి మరో పెద్దమనిషి వచ్చాడు. మామూలు నాటకమంతా ఆడాడు. కలకాలంగా పరిచయం ఉన్నట్లు మాట్లాడాడు. ఏవో పాత కథలన్నీ చెప్పాడు. అన్నీ అబద్ధం. వాటిలో ఒక్కటి నిజంలేదు. కనుమరుగుచేసి నా పార్కర్ పెన్ను తన జేబులో వేసుకున్నాడు. నా సిగరెట్లన్నీ కాల్చేశాడు. పైగా తన అనుగ్రహం సాంతం వలకబోశాడు. నిమ్మోను ఓదారుస్తున్నాట్ట. నా జబ్బును గురించి ఆమె గుండె బద్దలు చేసుకునేట్టుందిట. అందుకేనట ఆ ఓదార్పు, అందుకే సమయం దొరకడం లేదట-నన్ను చూడ్డానికి. ఇంకా వినండి. ఆస్పత్రి నుంచి ఈ వింత ఇంటికి ఆయనే తెచ్చాట్ట! ఆ మాట విన్నానా ఇహ నేను వశం తప్పాను.
    "అచ్ఛా! నువ్వేనా నాయనా ఈ పరాయి కొంపలో నన్ను తోసింది-నరకంలో నన్ను నెట్టింది! ఏం నాయనా నన్ను ఇలా సతాయిస్తే నీకేమొచ్చింది?"
    "ఇంకా ఏమీరాలేదు, కాని వస్తుంది" అని తల ఊపాడు-చిరునవ్వు నవ్వాడు.
    'అదా సంగతి, అయితే ఇప్పుడే పోలీసును పిలుస్తాను. నీ వ్యవహారం తేలుస్తాను' అని టెలిఫోను డయల్ చేశాను. హలో...హలో.
    "నా ఫోను నాకిచ్చేయండి" చూఁ చూఁ వచ్చి తన చిన్ని ఫోను లాక్కుంది "చెప్పండి ఎవరికి ఫోన్ చేయాలో- నేను చేసి పెడ్తాగా" అంటుంది.
    "పోలీస్ స్టేషన్! చూఁ చూఁ పోలీస్ ను అర్జంటుగా పిలువ్-దొంగ పారిపోతాడు" నేను ఆతురతతో అన్నాను.
    "హలో చూఁ చూఁ టెలిఫోను చెవికి తాకించి, గంభీరంగా కూలబడ్డది "అర్జంటుగా రండి- మా నాన్నను సతాయిస్తున్నారు-అన్నం పెట్టడంలేదు" అంటూంది.
    కాసేపు అలా గడిచింది. ఆ ఆట విసుగొచ్చింది.
    "ఫోను అట అయిపోయింది. ఇహ దొంగను పట్టుకుందాం" అని బయల్దేరాం దొంగను వెదకటానికి.
    "ఉస్స్ మెల్లగా నడవండి" చూఁ చూఁ చేయి నోటికి అడ్డం పెట్టుకుంటుంది.
    మేమిద్దరం మోకాళ్లమీద దేకుతున్నాం. మంచాల కింద వెదకుతున్నాం. నా తల కోడుకు తగిలింది. చప్పుడు విని ఎవడో మంచంకింద దాక్కున్నాడు.
    "దొంగ దొంగ" నేను దొంగ కాలు పట్టుకున్నాను. అరచాను "నా పిస్తోలు తెండి. దొంగను పట్టుకున్నాను."
    "దొంగను పట్టేశాం. దొంగను పట్టేశాం" చూఁ చూఁ చప్పట్లు కొడ్తూ కేకలు పెట్టింది.
    "ఇతణ్ణి వదలండి! వదలండి. పిల్లలు వస్తారు. గొడవ చేయకండి." నిమ్మో మంచంమీద నుంచి లేచి అంటూంది. అప్పుడు నేను ధ్యానంగా చూచాను- ఎవడీ దొంగ అని. వాడే ఇందాక నాతో మాట్లాడినవాడు! మా గొడవ విన్నారు. ఇల్లంతా గదిలో కూడింది-షమ్మీ, ఫజ్లూ, పప్పూ, ఇమ్తియాజ్. అంతా ఆశ్చర్యంగా ఒకసారి నన్ను, ఒకసారి ఆ వ్యక్తిని చూస్తున్నారు. తరవాత అంతా తలలు వంచుకున్నారు. గదినుంచి వెళ్ళిపోయారు.
    పిరికిపందలు! దొంగను శిక్షించే ధైర్యం కూడా లేదు అనుకున్నాను.
    "ఆయనేం పిచ్చివాడుకాడు. అంతా నాటకం. తనను మరిచారు. నన్ను కాపుండటం మరువలేదు." అంటూ నిమ్మో రాత్రి సాంతం గునుస్తూనే ఉంది.
    ఒకనాడు విచిత్రం జరిగింది.
    రాత్రి గడిచింది. జనం మేల్కొన్నారు. నా గదిలోకి వెలుగువచ్చింది. కాని ఎండలేదు. రేయిదొంగ సూర్యుణ్ణి దొంగిలించలేదుగదా అని అనుమానం. నాకు ఆందోళనగా ఉంది. ఆతురతగా ఉంది. టెలిఫోనుతో గదిలోకి చూఁచూఁ వచ్చింది. ఈ వార్త వినిపించాను:-
    "రేయిదొంగ సూర్యుణ్ణి దొంగిలించాడు"
    చూఁచూఁ పాపం చాలా బాధపడ్డది, "ఎక్కడికి తీసికెళ్ళాడు?" అని గంభీరంగా అడిగింది. ఈ ఇంట్లో ఆ పిల్లను మించిన తెలివిమంతులు ఉన్నట్లు కనిపించలేదు.
    "ఎలా తెలుస్తుంది? చూస్తున్నావుగా చీకటి - చీకటి ఉంది. ఇహ నా సంపద సాంతం పోయినట్లే! సూర్యుడు లేడు. ఉదయం ఎలా అవుతుంది? నేను లేవడం ఎలా?" నాకు దుఃఖం పొంగింది. ఏడుపు సాగించాను. చూఁచూఁ చూచింది. బొమ్మలు పారేసింది. అలవాటు చొప్పున నా గుండెమీద వాలింది. బంగారు వెంట్రుకలు పరిచింది. "ఏడవకండి నాన్నా! నేనొక సూర్యుణ్ణి కొనితెస్తాను. నా దగ్గర రెండుపైసలున్నాయి" అన్నది.
    "పిచ్చిదానా! సూర్యుడు బజార్లో దొరుకుతాడా?" అని పాప వెర్రిదనానికి నవ్వాను.
    "అయితే మీ దగ్గరికి ఎలా వచ్చేవాడు?" కళ్లు పెద్దవిచేసి ప్రశ్నించింది.
    అదిగో-కొత్త సమస్య-అవును-సూర్యుడు నాదగ్గరకు ఎందుకు వచ్చాడు? వాడూ నా పెన్షన్ గురించి విన్నాడా? అయితే వాడికి నా రెండో భాగాన్ని గురించి కూడా తెలియాలి.
    "వాడెవడు?" చూఁచూఁను అడిగాను- వేలితో పైకి చూపించి.
    "ఎవరు? అతనా? అతను" చాలాసేపు తలెత్తి చూచింది. ఆలోచించింది. "వారు నాన్నగారు" అన్నది.
    నేను చాలా సంతోషించాను- మరొకడు కాలేదని- "ఎవరి నాన్న?" అడిగాను.
    "మా నాన్న" రెండు చిన్న చేతులు గుండెమీద పెట్టుకొని అన్నది, "వారు మీరే" అని.
    "నేనా?" చూచారా ఇంతింత పిల్లలకు కూడా తెలిసిపోయింది-నేను రెండు భాగాలు అయినానని.
    "చూఁచూఁ నీకు తెలుసా నన్ను అక్కడ ఎవరు తగిలించారో" అటూ ఇటూ చూచి స్వేచ్చగా అడిగాడు.
    "అమ్మ" ఆమెకూడా అంత జాగ్రత్తపడి చెవిలో అన్నది. 'ఒకనాడు అమ్మ మిమ్మల్ని అద్దంలో కట్టి-తాడుతో అక్కడ తగిలించింది.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS