మెదడుకి రంధ్రం చేస్తున్నట్లు, డ్రిల్లింగ్ చేస్తున్నట్లు అతి తీవ్రమైన శిరోవేదన!
ఆస్పిరిన్ వేసుకుంది.
పని చెయ్యలేదు.
నిద్ర పట్టడానికి తనకి తెలిసిన ఒక టెక్నిక్ ఉంది.
ఒక గొర్రెల మందని ఊహించుకుని గొర్రెలని లెక్కపెట్టడం!
అదే ట్రై చేసింది ప్రగతి.
చిత్రంగా -
ఊహలో గొర్రెలు నిలకడ లేకుండా పరిగెడుతున్నాయి.
ఒకటి -
రెండు -
మూడు-
వంద-
పరుగు...పరుగు...పరుగు...
వాటివెంట తను.
కొండల్లోకి-
కోనల్లోకి -
టెలిస్కోపు లాంటి కొండ -
మెదడుకి కన్నం వేస్తున్నట్లు ఫీలింగ్.
శిథిలాలు...శిథిలాలు...
ఇంక భరించ శక్యంగాక "గాడ్!" అని కేకపెట్టి ఒక్కసారిగా లేచి కూర్చుంది ప్రగతి.
"గాడ్! ఓ గాడ్! సేవ్ మీ!" గట్టిగా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది ప్రగతి.
అప్పుడు హఠాత్తుగా...
ప్రగతి మనసులో ఒక భావం మెదిలింది.
ఎవరో చెవి దగ్గర చెబుతున్నట్లుగా!
"ఒకటి గుర్తుంచుకో. దైవ ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫలానిది జరగాలి-ఫలానిది జరగకూడదు అని ప్రార్థించకు. ఫలానిది కావాలి - ఫలానిది వద్దు అని కూడా అడగకు. ఎప్పుడేమి జరగాలో, ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. ప్రార్థన చేసి లేచాక నువ్వు ఇంకాస్త మంచి మనిషిగా మారితే దేవుడు నీ ప్రార్థనని ఆలకించినట్టే!"
చాకితురాలయింది ప్రగతి.
నిజం చెప్పాలంటే తను పెద్దగా భావుకురాలు కాదు.
మరి..
ఇంత చక్కటి భావం తనకి ఎలా తట్టింది?
ఎవరో చెవిలో మంత్రోపదేశం చేసినట్లుగా...
చటుక్కున లేచి తన డైరీలో ఆ భావాన్ని నోట్ చేసుకుంది ప్రగతి.
దైవప్రార్థన అంటే ఎలా వుండాలో ఎవరో తన చెవిలో చెప్పినట్లుగా స్ఫురించి భావాన్ని డైరీలో నోట్ చేసుకున్న తరువాత చాలా నిర్మలమైన మనస్సుతో ఏ కోరికా లేకుండా భగవంతుడిని కొద్ది నిముషాలసేపు ప్రార్థిస్తూ వుండిపోయింది ప్రగతి.
ఆ తరువాత ఇక మళ్ళీ నిద్ర పట్టించుకునే ప్రయత్నం మానేసి బాత్ రూంలోకి వెళ్లి షవర్ బాత్ తీసుకుని ఫ్రెష్ గా యూనిఫారం వేసుకుని ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి ప్రెసిడెన్షియల్ పాలెస్ కి వెళ్ళింది ప్రగతి.
నామకార్థం ఒక్కసారి తలుపు తట్టి పర్మిషన్ కోసం చూడకుండానే లోపలకి వచ్చేసిన ప్రగతి వైపు తన ప్రత్యర్థిని చూసినట్లు చూసింది సర్వాధికారి భార్య చతుర.
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి ఫోనో మాట్లాడుతూ ఎంతో బిజీగా వున్నా కూడా ప్రగతి రాకను గమనించి కూర్చోమన్నట్లుగా సైగ చేస్తూ ప్రసన్నంగా తల పంకించాడు.
ప్రగతి కూర్చోగానే మళ్ళీ ఫోన్ లో మాట్లాడడం మొదలుపెట్టాడు సర్వాధికారి. లైన్లో అవతల వున్నది సైంటిస్టు అయిన ప్రొఫెసర్ అన్వేషీ.
ఎగ్జయిటెడ్ గా చెబుతున్నాడు ప్రొఫెసర్ అన్వేషీ.
"సర్వాధికారీ! ఓల్డ్ బాయ్! వింటున్నావా? చిన్నప్పుడు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకునేటప్పుడు నీ మిత్రుడు అన్వేషీ ఆ అన్వేషీ ఇప్పుడు యూనివర్శల్ బ్యాంక్ కి ఆనరరీ అడ్వయిజర్!"
"అన్వేషీ! ఓల్డ్ ఛాప్! గాడ్ ఈజ్ గ్రేట్! సరిగ్గా ఉండవలసిన స్థానంలో వుండవలసిన మనిషే వచ్చాడు" అన్నాడు సర్వాధికారి ఆనందంగా.
హఠాత్తుగా అన్వేషీ గొంతు మారింది.
అనుమానంగా అడిగాడు.
"నీ వాలకం చూస్తుంటే కొంపదీసి యూనివర్శల్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించమని అడగవు కదా!"
"సరిగ్గా అదే అడగబోతున్నాను" అన్నాడు సర్వాధికారి.
"ఏమని?"