Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 40


    ఆ వెర్రికేకకి అక్కడి కోలాహలం సద్దు మణిగింది. క్షణంపాటు నిశ్శబ్దం ఆవరించిందక్కడ.


            
    కోదండరాం చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు కృష్ణమూర్తి. విని నిట్టూర్చి అన్నాడు-

 

    "అయ్ సీ! ఇంతకీ నువ్వు ప్రేమించింది సుమతినా? మరిన్నాళ్ళూ ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?"

 

    కోదండం అమాయకంగానే జవాబు చెప్పేడు-

 

    "నేను పరీక్ష పాసైతే నా పెళ్ళి చేస్తానని మాటిచ్చేరు గదా! పాసయ్యేక అన్ని వివరాలు చెబ్దామనుకున్నాను. ఈలోగా సుబ్బారావుగారు తొందరపడి మమ్మల్ని చూసేసేరు. అసలే అతను దూకుడు మనిషి. సుమతిని చంపేస్తాడో ఏమో?"

 

    "ఆ విషయం నాకువదిలేయ్! నువ్వుమాత్రం పరీక్షలు బాగారాయి."

 

    "నా మాట నేను నిలబెట్టుకుంటాను మేస్టారూ! తప్పకుండా పాసవుతాను, మీ మాట..."


                                                          *  *  *


    కృష్ణమూర్తి కోదండరాం భుజం తట్టి లేచేడు.

 

    కృష్ణమూర్తి ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు సుబ్బారావు శివతాండవం చేస్తున్నాడు.

 

    శివుడు మూడో కన్ను తెరిచినట్టుంది అతని అవతారం. కేవలం నిప్పులే కురిపిస్తున్నాడు!

 

    సుబ్బారావు భార్య సుమతిని గదిలో పెట్టి దాచింది కాబోలు-ఆ గది వేపు సుబ్బారావుని వెళ్ళనీకుండా అతని కాళ్ళు పట్టుకుంటోంది.

 

    సుబ్బారావు పిచ్చెత్తినట్టు అరుస్తున్నాడు.

 

    నా పరువు తీసిందంటున్నాడు. నా తల నరికేసిందంటున్నాడు. వెతికి వెతికీ ఆ లక్ష్మీపతి గారబ్బాయినే వరించాలా అని అంటున్నాడు. దాని ప్రాణం తీస్తానంటున్నాడు అట్లా అరుస్తూనే చిందులు తొక్కుతున్నాడు.

 

    కృష్ణమూర్తి రంగప్రవేశం చేసేసరికి సుబ్బారావు కోపం తారాస్థాయికి చేరుకుంది? అతని పిల్లలు తండ్రి వరసకి భయపడి బల్లుల్లాగా గోడకి అతుక్కుపోయేరు.

 

    "మీరు తప్పుకోండి వదినగారూ!" అన్నాడు కృష్ణమూర్తి!

 

    కృష్ణమూర్తిని చూడగానే సుబ్బారావు ధైర్యం తెచ్చుకుంది. తాను తప్పుకుని సుబ్బారావుని శాంతపరిచే డ్యూటీ కృష్ణమూర్తికి వప్పగించింది.

 

    కృష్ణమూర్తి సుబ్బారావు ముందు నిలబడ్డాడు.

 

    "మీరు కొంచెం శాంతించండి!" అన్నాడు కృష్ణమూర్తి.

 

    "నో! నా పరువూ ప్రతిష్ట గంగలో కలిపిన తర్వాత నాకు శాంతెక్కడ? సుఖమెక్కడ? తప్పుకో!"

 

    "తప్పుకుంటే..."

 

    "దాన్ని చంపుతాను."

 

    "ఏం తప్పు చేసిందని చంపుతారు?"

 

    "ఏం చేసిందా? కృష్ణా-నీకేం తెలీదు. ముందు నువ్వు తప్పుకో!"

 

    "నాకన్నీ తెలుసు."

 

    "అంటే-అప్పుడే ఈ వార్త ఊరంతా పాకిపోయిందా? (భార్యతో) విన్నావా? ఇంక నిలబడ్డావేమే? తీసుకురా కిరసనాయిలు! ఇంటిల్లిపాదీ ఒకేసారి తగలబడి చద్దాం!"

 

    "అందరూ చావడమెందుకు? తప్పుచేసింది సుమతి! అందరం కలిసి సుమతిని పీకనులిమి చంపేద్దాం! ఓ.కే. కానీ సుమతి చేసిన తప్పేమిటో కూడా ఆలోచించాలి గదా! కోదండరాంని ప్రేమించింది, అదేగా నేరం? అంటే మీ దృష్టిలో ప్రేమించడం పెద్ద తప్పు! వినరాని బూతు! అవునా?" అడిగేడు కృష్ణమూర్తి.

 

    సుబ్బారావు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అన్నాడు-

 

    "నా బాధ కూడా అర్ధంచేసుకోవయ్యా! ఆ లక్ష్మీపతి కోడలయ్యే పిల్ల కట్నంగా లక్షలక్షలు గుమ్మరించాలయ్యా! అంత డబ్బు నాకెక్కడిది? అద్దె కట్టడానికే కాలూ చెయ్యీ ఆడని వాడ్ని అంతంత కట్నాలెక్కడ తేను? అడిగిన కట్నం ఇవ్వకపోతే అక్కర్లేదు పొమ్మంటాడు. వాళ్ళు పొమ్మన్న తర్వాత-ఇంత అల్లరీ జరిగేక-దీన్ని పెళ్ళిచేసుకోడానికి ఎవడు వస్తాడయ్యా? ఎవడొస్తాడు?"

 

    కృష్ణమూర్తి సుబ్బారావు చేతుల్ని తీసుకుంటూ అన్నాడు-

 

    "మీరేం అకారణంగా భయపడటం లేదు. అయ్ నో ఇట్! కోదండరాం నా స్టూడెంట్. మంచివాడు. సుమతి అంటే ప్రాణం పెడతాడు. అవసరమైతే తండ్రిని కూడా ఎదిరించి పెళ్ళాడగలడు. అదట్లా వుంచండి... కథ ఇంతవరకూ వచ్చింది గనక-ముందు మీరు లక్ష్మీపతిని కలుసుకోండి. పిల్లల ప్రేమ గురించి చెప్పండి."

 

    "లక్షలు పట్టుకు రమ్మంటాడు!"

 

    "సమస్య అక్కడికి ఎదిగినప్పుడు అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం! ఓ.కె.!" అన్నాడు కృష్ణమూర్తి.

 

    "అవునండి. అబ్బాయి చెబుతున్నది నాక్కూడా సబబుగానే వుంది" అన్నది సుబ్బారావు భార్య.

 

    అప్పటికి సుబ్బారావు కోపం కొంచెం చల్లబడింది. కృష్ణమూర్తి సుబ్బారావు భార్యకి సైగచేసేడు.

 

    ఉత్తర క్షణంలో సుమతిని గదిలోంచి తీసుకొచ్చింది సుబ్బారావు భార్య. సుమతి "అన్నయ్యా" అంటూ సుబ్బారావు కాళ్ళమీద పడిపోయింది.

 

    సుబ్బారావు సుమతిని లేవదీసి గుండెలకు హత్తుకుని గొల్లున ఏడ్చేసేడు.


                                                              *  *  *


    లక్ష్మీపతి ఇంటిలో...

 

    సుబ్బారావు మీద ఎగిరెగిరి పడుతున్నాడు లక్ష్మీపతి. సత్యం గదిపక్కనే నిలబడి ఆ ఘట్టం చూస్తున్నాడు కృష్ణమూర్తి.

 

    "ప్రేమలూ గీమలూ జాన్తానై! మా అబ్బాయిక్కావల్సింది పెళ్ళి. వాడికి పెళ్ళి చేయాలంటే హీన పక్షం లక్ష కావాలి. ఎంత? లక్ష! అర్ధమైందా?" అన్నాడు లక్ష్మీపతి.

 

    బిక్క చచ్చిపోతూ అన్నాడు సుబ్బారావు.

 

    "అంత స్థోమతే వుంటే లగ్నపత్రికలు రాయించుకునే వచ్చేవాడ్ని. మీరు కొంచెం కనికరించాలి!"

 

    "అనవసరం! చేసిన కుట్రేదో చేసేసి కనికరం ఉప్పుకారమని చదువుతే కరిగి పోతాననుకున్నావా?"

 

    "కుట్రా"

 

    "కాక మరేమిటీ? పచ్చగా వున్నాడు గదాని వుచ్చు వేసేవ్. చెల్లెల్ని వాడి మీదికి విసిరేవ్. ఆ విధంగా ఆటోమేటిగ్గా ఆస్తిపరుడు కావాలని ఆశపడ్డావ్!"

 

    "లక్ష్మీపతిగారూ?"

 

    "అరవకు ఆడపిల్ల వాళ్ళు అరిస్తే అప్రతిష్టపాలై పోతారు, జరిగిందేదో జరిగింది. మరిచిపో నీకు తగ్గ సంబంధమేదో చూసుకుని గుట్టుగా పెళ్ళిచేసి అఘోరించు వెళ్ళింక!" అన్నాడు లక్ష్మీపతి.

 

    ఆఖరి అస్త్రంగా సుబ్బారావు తన రెండు చేతులు చాచి అర్ధించేడు.

 

    "ఉన్న ఆ ఒక్క చెల్లెలి భవిష్యత్తుకోసం- నేనూ నా భార్యా పిల్లలు మీ ఇంటిలో జీవితాంతం ఊడిగం చేసుకుంటాం. ఈ పెళ్ళి జరిపించండి."

 

    "నా ఇంటిలో ఊడిగం చేసే కూలీ వెధవల్తో నేను వియ్యమొందడమా? సుబ్బారావ్-వళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అసలింతసేపూ నీతో ఓపిగ్గా మాట్లాడటమే నా స్టేటస్ కి భంగం. నువ్వంటే పిసరంత జాలి వున్నవాడిని గనుక నువ్వు చెప్పే దరిద్రగొట్టు కథని వింటూ నీకింత టైమిచ్చేను. ఇంకా ఎక్కువ మాట్లాడేవంటే చెయ్యే వాడుతానో కాలే వాడుతానో నాకే తెలీదు. దమ్ముంటే దర్జాగా లక్ష తీసుకురా! నన్నడక్కుండానే లగ్నం పెట్టుకుని పెళ్ళి చేసుకో! లేదూ- నీ చావు నువ్వు చావు." అని లక్ష్మీపతి అక్కడ్నించి కదిలేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS