Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 41


    
    ఒకింతసేపు మౌనం తరువాత తిరిగి అన్నాడు- "నేర పరిశోధనలో ఒక్కోసారి అతి చిన్న ఆధారమే కేసు మొత్తాన్ని కదిలించి వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నేనిప్పుడు కొండకు వెంట్రుకను కట్టి లాగుతున్నాను. ముడి కరెక్ట్ గా పడితే కొండంతా కదిలిపోతుంది. నేర పరిశోధనలో నేను తొలిసారి ఎక్కువగా ఫోరెన్ మెడిసన్ మీద ఆధారపడుతున్న సందర్భం ఇదే..."
    
    ఎక్స్ పార్ట్ కొద్దిక్షణాల మౌనం తరువాత తన వివరణ అందించటం ప్రారంభించాడు.
    
    "ఆగస్ట్ 1951లో అమెరికాలోని నొట్టింగ్ హోమ్ నగర సరిహద్దుల్లో మాబెల్ టట్టర్ షా అనే 45 ఏండ్ల మధ్య వయస్కురాలు తన ఇంటిలోనే హత్యా కావింపబడింది. ఎఫ్.బి.ఐ. సిబ్బంది ఆమె మృతశరీరాన్ని సయితం సూక్ష్మంగా శోధించి కొన్ని తల వెంట్రుకలను కనుగొని ఫోరెన్ సిక్ లేబ్ కి పంపించి మైక్రోస్కోపిక్ పరీక్ష జరిపి- ఆపైన ఆ ఇంట్లో పనిచేస్తున్న లియోనార్డ్ మిల్స్ హెయిర్ తో పోల్చగా రెండూ ఐడెంటికల అని ప్రూవ్ అయింది. పద్దెనిమిదేండ్ల లియోనార్డ్ ని ఎఫ్.బి.ఐ. ఆఫీసర్స్ అనుమానించినా ఆధారం లేక వెంటనే అరెస్ట్ చేయలేక పోయారు. హెయిర్ ఎగ్జామిన్ తరువాతే అతన్ని కస్టడీలోకి తీసుకోవటం జరిగింది. మనిషి తల వెంట్రుకలకు రాలిపోయే గుణం వుంటుంది. తల వెంట్రుకలకు ఏమాత్రం ఒత్తిడి తగిలినా కొన్నయినా వెంట్రుకలు రాలిపోవటం ఖాయం.
    
    వెంట్రుకల పొడవు, రంగు, మృదుత్వాన్ని రెండువందల రెట్లు పెద్దది చేసి చూపించగల భూతద్దం ద్వారా స్పష్టంగా చూడవచ్చు. అద్భుతమైన, చిత్రవిచిత్రమైన రసాయన సమ్మేళనాలను చూడవచ్చు. ఒక విడి వెంట్రుక సాలిడ్ గా, గరుకుగా, రూళ్ళకర్ర ఆకారంలో ఉంటుంది. వేలిముద్రల మాదిరిగానే ఏ ఇద్దరి వ్యక్తుల వెంట్రుకలు ఒకే మాదిరిగా ఉండవు. దేని ప్రత్యేకతలు దానికే విడిగా డిఫరెంట్ గా ఉంటాయి. ఫోరెన్ సిక్ సైన్స్ లేబొరేటరీలో పొడిగావున్న గ్లాస్ స్లయిడ్ మీద వెంట్రుకను మౌంట్ చేసి కంపేరిజన్ మైక్రోస్కోప్ ద్వారా చూస్తే కొన్ని తేడాలు కనిపిస్తాయి. ఆ తరువాత ఆ వెంట్రుకను ముక్కలుగా కట్ చేసి వాటి అంతర్భాగాన్ని పరీక్షిస్తే మరిన్ని వివరాలు తెలిసివస్తాయి. దీన్నే క్రాస్ సెక్షన్ అంటారు.
    
    అయితే ఒక విషయాన్ని నేర పరిశోధకులు స్పష్టంగా గమనించవలసి వుంది. ఫింగర్ ప్రింట్స్ అంత స్పష్టత హెయిర్ విషయంలో కూడా కావాలంటే ఇండియన్ ఫోరెన్ సిక్ సైన్స్ లేబ్స్ లో యిప్పుడప్పుడే సాధ్యంకాదు.
    
    న్యూట్రాన్ ఏక్టివేషన్ అనాలసిస్ రోజురోజుకి అభివృద్ధి చెందిన దేశాల్లో డెవలప్ అవుతుందే తప్ప మనదేశంలో ఏమాత్రం ప్రగతి కనిపించటం లేదు.
    
    ఫోరెన్ సిక్ ఇన్వెస్టిగేషన్ కి న్యూట్రాన్ ఏక్టివేషన్ అనాలసిస్ ఉపయోగపడినంతగా మరేదీ ఉపయోగపడదు."
    
    ఫోరెన్ సిక్ ఎక్స్ పర్టు చెప్పిన వివరాల్ని తన ఫోటోగ్రాఫిక్ మెమొరీలో నిక్షిప్తం చేసుకొని హెడ్ కి కొన్ని సూచనలు ఇచ్చి సిద్దేశ్వర్ బయటకు సాగిపోయాడు వేగంగా.
    
    "వృత్తిపట్ల ఇంత సిన్సియారిటీ, పట్టుదల, గౌరవం ప్రతి పోలీసు ఆఫీసర్ కి ఉండి వుంటే దేశంలో యిన్ని నేరాలు జరగవు, మరెన్నో కేసులు మిస్టరీస్ గా మిగిలిపోవు. సిద్దేశ్వర్ జీని చూస్తుంటే నాకు గర్వంగా కూడా వుంటుంది" వెళ్తోన్న సిద్దేశ్వర్ కేసి చూస్తూ ప్రశంసగా అన్నాడు హెడ్.
    
    "భారతదేశంలో మెదడు మోకాళ్ళలో వుండే వ్యక్తులు ఎక్కువగా ఏ డిపార్టుమెంట్ లో ఉన్నారో తెలుసా సార్? పోలీస్ డిపార్టుమెంట్ లో మెదడు అరికాళ్ళలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఏ రంగంలో వున్నారో తెలుసా సార్.....భారత రాజకీయాల్లో వీళ్ళకు అహంభావం, అధికార దాహం, స్వార్ధం మాత్రం మెదళ్ళలోనే వుంటాయి. ఎప్పటి ఇండియన్ పీనల్ కోడ్ సార్ మన పోలీసులు ఫాలో అయ్యేది? నేరాలు పెరిగిపోయాయి. నేరస్తులు తెలివి మీరిపోయారు. కొత్త కొత్త పద్దతుల్లో, మిస్టీరియస్ గా నేరాలు జరుగుతున్నా చట్టాల్ని పదునెక్కించి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐ.పి.సి.ని పదునెక్కించే ప్రయత్నం కాని, పోలీసుశాఖ పరిశోధనా పద్ధతుల్ని మార్చే ఆలోచనగాని మన దేశ నాయకులకు, మేధావులకు లేదు.
    
    నేరస్తుల్ని పట్టుకొనే తెలివితేటలు, కామన్ సైన్స్ మన పోలీస్ వ్యవస్థకు లేవు. ఎక్కడన్నా హత్య జరిగితే ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ కి తెలియపర్చిన వాడ్ని పట్టుకొనే శ్రద్ద హంతకుడ్ని పట్టుకొనే విషయంలో వుండదు. హత్య జరిగిందని తెలిసినా శవం కుళ్ళిపోయే సమయానికి ఆర్చుకొని, తీర్చుకొనిగాని రారు. మనదేశ పోలీసులు ఎందుకు పనికి వస్తారో తెలుసా సార్.... ట్రాఫిక్ సిగ్నల్స్ మలుపుల్లో దొంగల్లా దాక్కుని ఫైన్స్ వేయటానికి, వీలయినంతవరకు పదీ పరకా తీసుకొని వదిలేయటానికి విదేశాల్లో చట్టాలు ప్రజల్ని సక్రమమార్గంలో పెట్టటానికయితే- మనదేశంలో మాత్రం ఆ చట్టాల్ని అమలుపర్చేవారు బాగుపడటానికి పాకిస్తాహన్ నుంచి ఇండియా వచ్చి వీసా గడువు అయిపోయినా తమ దేశం వెళ్ళక దొంగల్లా తిరిగే పాకిస్థానీయులు ఇండియాలో కొన్ని వేలమందున్నారట. పాపం మన పోలీసులకు జేబు దొంగల్ని పట్టుకుని వాళ్ళతో లాలూచీపడి దొంగ సొమ్మును పంచుకోవటానికే సమయం చాలటంలేదు ఇంకిలాంటి పెద్ద వ్యవహారాల్ని పట్టించుకునే వీలెక్కడుంది? ఛీ....ఛీ.... నేస్టీ ఇండియన్ పోలీస్ డిపార్టు మెంట్.... పొట్ట కూటికోసం హోటల్ గదుల్లోకి రాత్రిళ్ళు వెళ్ళే అభాగినులైన పడుపుగత్తెల్ని అరెస్ట్ చేసి శాంతిభద్రతల్ని కాపాడుతున్నట్లు ఫోజులు కొట్టటం.... ఒక పడుపు గత్తె డబ్బిచ్చే విటుడితో పడుకుంటే దేశ అంతరంగిక శాంతిభద్రతలెలా విచ్చిన్నమవుతాయి? వాళ్ళిద్దరూ ఒకరి అవసరం కోసం మరొకరు పడుకుంటే పోలీసులకేమిటి నష్టం? నైతికంగా, సామాజికంగా అది తప్పా ఒప్పా అన్న మీమాంస అటుంచి ఆలోచించండి. టెన్త్ క్లాస్ కూడా పాస్ కాని అర్భకుడు కానిస్టేబుల్ అయితే చాలు సంఘంలో పరువు ప్రతిష్టలున్న పెద్దమనిషిని సయితం ఏంటిబే నీ యవ్వారం అని అనేస్తాడు. సంస్కారం అంటే బొత్తిగా తెలియని మూర్ఖులు కూడా ఈ డిపార్టు మెంట్ లోనే ఎక్కువ. ఏది ఏమైనా బ్రెయిన్ ఉన్న అధికారిని పోలీస్ వ్యవస్థను పూర్తిగా ఛీ కొట్టకుండా దాని గౌరవాన్ని కొంతయిన కాపాడే అధికారిని చూడగలగటం, వారితో కలిసి పనిచేసే అవకాశం రావటం మన అదృష్టం సార్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS