Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 40


    
    రైఫిల్ద్ వెపన్స్ నుండి రిలీజ్ అయ్యే బుల్లెట్స్ క్షణానికి రెండువేల నుండి మూడువేలసార్లు వరకు గుండ్రంగా తిరుగుతూ లక్ష్యంకేసి దూసుకుపోతాయి.
    
    వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కంపేరిజన్ మైక్రోస్కోప్ ద్వారా మీకు దొరికిన బుల్లెట్ ని, అదే తరహాకి చెందిన మరో బుల్లెట్ ని మేచ్ చేసి చూశాను. ఆపైన రెండింటిని ఐడెంటిఫై చేశాను. నా అనుమానం నిజమైంది.
    
    థాంప్సన్ మెషిన్ గన్ అమెరికాకి చెందిన కోల్డ్స్ పేటెంట్ ఫైర్ ఆర్మ్స్ మేన్యూఫాక్చరింగ్ కంపెనీ తయారుచేసిందని కూడా ఖచ్చితంగా చెప్పగలను...." అన్నాడు తన వివరణను ముగిస్తూ ఎక్స్ పర్ట్.
    
    సిద్దేశ్వర్ ఎక్స్ పర్టువేపు ప్రశంసగా చూశాడు. "మనకు ఆ మామిడి చెట్టు కొమ్మలపై దొరికిన హెయిర్ మూలంగా ఏమైనా వివరాలు లభ్యమవుతాయా?" సిద్దేశ్వర్ తిరిగి అడిగాడు.
    
    "ఇంకాలేదు సార్..."
    
    "ఆ వెంట్రుకల ద్వారా ఏ వివరాలు మీరు నాకందించగలరు?"
    
    "ఆ ట్రిగ్గర్ మెన్ జాతిని, సెక్స్ ని, వయస్సుని తెలిపే వీలుంది."
    
    "వ్వాట్?!" ఎగ్జయిట్ మెంటుకి గురవుతూ అన్నాడు సిద్దేశ్వర్.
    
    "ఎస్ సర్ మనకు దొరికిన వెంట్రుకలు పురుషుడివా, స్త్రీవా అని చెప్పే వీలుంది. తల వెంట్రుకలు స్త్రీలకు పొడవుగా వుంటాయి. పురుషులకు పొట్టిగా వుంటాయి. ఆ హెయిర్ ని ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి ఐమీన్ బ్లీచ్ చేయటాన్ని బట్టి, హెయిర్ డై చేయటాన్ని బట్టి, వాడిన హెయిర్ ఆయిల్ ని బట్టి, కమిలిన దాన్నిబట్టి, ఉంగరాలుగా తిరిగే పద్దతినిబట్టి ఖచ్చితంగా ఆ హెయిర్ స్త్రీదో, పురుషుడిదో చెప్పవచ్చు.
    
    అలాగే ఆ హెయిర్ తాలూకు వ్యక్తి వయస్సుని కూడా చెప్పవచ్చు. ఒక వ్యక్తి వయస్సు పెరగటాన్ని బట్టి ఆ వ్యక్తి తల వెంట్రుకలు వివిధ రసాయనిక ప్రక్రియకు లోనవుతాయి. చిన్నపిల్లల తలవెంట్రుకలకు పెద్దవాళ్ళ తల వెంట్రుకలకు చాలా తేడాలుంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్ది తల వెంట్రుకలు బిరుసుగా, మందంగా తయారవుతాయి. వీటన్నిటిబట్టి వయస్సుని ఖచ్చితంగా చెప్పవచ్చు...." ఎక్స్ పర్టు చెప్పటం పూర్తి చేసాడు.
    
    ఓబరాయ్ ఆలోచించసాగాడు.
    
    లేబ్ హెడ్, ఎక్స్ పార్ట్ మౌనంగా సిద్దేశ్వర్ ఆజ్ఞల కోసం ఎదురుచూడసాగారు.
    
    క్షణాలు నిమిషాలు గడిచిపోతున్నాయి.
    
    సిద్దేశ్వర్ ఆలోచనలు పదును దేరుతున్నాయి క్రమంగా.
    
    "మాస్టర్ ని అసాసినేట్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి సాధారణమైన వాడో ఆమెచ్యూర్ కిల్లరో అయి వుండడు. మిల్లర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆ సాహసం చేయలేరు. అసాసినేషన్ పధకం చాలా పకడ్బందీగా పన్నబడింది. దీన్నిబట్టి అంతర్జాతీయ స్థాయి కిరాయి హంతకుడే రంగప్రవేశం చేసి వుండాలి. బిలియనీర్ అయిన మాస్టర్ ని చంపటం అన్నది చిన్న ఇష్యూ కాదు. మిల్లర్ వ్యూహం మధ్య రక్షింపబడే మాస్టర్ ని లోకల్ కిల్లర్ ఏమీ చేయలేరు. పైపెచ్చు మాస్టర్ కి బొంబాయిలో మిత్రులే కాని శత్రువులు లేరు సో.... మాస్టర్ అసాసినేషన్ పథక రచన వేరే దేశంలో జరిగివుండాలి. బహుశా అది హాంకాంగ్, సింగపూర్, మకావ్ ఐలాండ్స్ లో జరిగి వుండాలి. తీగలాగితే డొంక కదలటం సహజం. అయితే ఇప్పుడు వెంట్రుకను లాగితే డొంకంతా కదిలిపోతుంది. ఖలీల్ చాలా ప్రమాదకరమైన పైస్థాయి నేరప్రపంచపు వ్యక్తి. వీటన్నింటిని బట్టి మీరు ఆ హెయిర్ ద్వారా సరయిన వివరాల్ని అందించగలిగే అతనెవరయింది తెలుసుకొనే వీలుంది అదీ ఆ వ్యక్తి అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ కిల్లర్ అయితేనే...." సిద్దేశ్వర్ సిగార్ పీలుస్తూ సాలోచనగా అన్నాడు.
    
    "ఒకవేళ ఈ ట్రిగ్గర్ మెన్ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుంటే ఎలా అతనెవరయింది కనుగొనటం....!?" లేబ్ హెడ్ కేవలం ఆసక్తి కోసం అడిగాడు.
    
    కొద్దిక్షణాల మౌనం తరువాత సిద్దేశ్వర్ చెప్పటం ప్రారంభించాడు.
    
    "ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి (క్రైమ్ డిటెక్షన్ ఫెసిలిటీస్ ఉన్న) ఫోరెన్ సిక్ లాబ్ అమెరికా దేశపు న్యాయవ్యవస్థకు చెందిన ఎఫ్.బి.ఐ.దే అవుతుంది.
    
    ఎఫ్.బి.ఐ.సొంతంగా 24, నవంబర్ 1932లో వాషింగ్టన్ లో ఏర్పాటు చేసుకున్న ఫోరెన్ సిక్ లేబొరేటరీ, ఐడెంటిఫికేషన్ డివిజన్ కి సరిపోయే ఆ తరహా సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవు.
    
    ఫిజిక్స్, కెమిస్ట్రీ సహాయంతో నేరం జరిగిన స్థలంలో దొరికే రక్తం, విషం, ఫైబర్, లోహాలనుబట్టి, చేతివ్రాత, ఇంక్స్, వాటర్ మార్క్స్ (పేపర్ మీద), షూస్, టైర్ గుర్తులు, ఫోర్జరీ లాంటి కేసుల్ని తేలిగ్గా శోధించి ఫైల్ చేస్తారక్కడ.
    
    ప్రపంచంలో ఏ దేశంలో, ఏ మారుమూల తయారయ్యే మారణాయుధమైనా ఎఫ్.బి.ఐ. లేబ్ లో ఫెయిర్ ఆర్మ్స్ కలెక్షన్ డిపార్ట్ మెంట్ లో భద్రపరుస్తారు. భవిష్యత్ లో వాటిని అనవసరమయినప్పుడు సరిపోల్చుకునేందుకు.
    
     ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా జరిగే అతి పెద్ద నేరాల వివరాలు ఎఫ్.బి.ఐ.కి చేరుతుంటాయి. వాటిని కూడా కంప్యూటర్స్ లో భద్రపరచి ఎవరికి అవసరం వచ్చినా వెంటనే అందిస్తుంటారు.
    
    క్రైమ్ రికార్డ్స్, నేరస్తుల వ్యక్తిగత వివరాలు అన్నీ అక్కడ భద్రపరచి ఉంటాయి. సో... మాస్టర్ ని అసాసినేట్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయి క్రిమినలే అయితే- అతను కనీసం ప్రపంచంలో ఏ మూలయినా, ఒక్కసారి అరెస్ట్ అయి వున్నా అతని వేలిముద్రలు, ఎత్తు, లావు, రంగు, పుట్టుమచ్చలు, ప్రత్యేకమైన యితర గుర్తులు, శారీరక లోపాలు, బ్లడ్ గ్రూప్, చేతివ్రాత, బలహీనతలు, హెయిర్ అనాలసిస్ మొదలైనవన్నీ కంప్యూటర్ కి ఫీడ్ చేసి ఎఫ్.బి.ఐ. లాబ్ శాశ్వతంగా భద్రపరుస్తుంది.
    
    మనకు దొరికిన హెయిర్ ఫలానా వ్యక్తిదే అని చెప్పే అవకాశం మనకు లేకపోయినా, మన దగ్గరున్న హెయిర్ ని ఎఫ్.బి.ఐ. లేబ్ కి పంపిస్తే దీన్ని అనలైజ్ చేసి ఈ వివరాలను కంపేరిజన్ కంప్యూటర్ కి ఫీడ్ చేస్తే ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతాయి. వాళ్ళు ఆ హెయిర్ ఎవరిదయిందీ చెప్పగలరు. అయితే హెయిర్ కి సంబంధించిన ఎన్నో లక్షణాలను తెలుసుకొనే వీలుందనే దాన్ని బట్టే దీని ఫలితం ఉంటుంది" చెప్పటం ముగించాడు సిద్దేశ్వర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS