Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 42


    పోలీస్ కమీషనర్ సిద్దేశ్వర్ ఓబరాయ్-జాయింట్ కమీషనర్ అరవింద్ ఐనాందార్ గార్లు బొంబాయి నగరంలో ఇటీవలే పుట్టుకొచ్చిన ఆ కిరాయిహంతకుల శిబిరాన్ని మట్టుబెట్టందే నిద్రపోరు. మనకు చేతినిండా పని మనం తీసుకొనే జీతాలకు న్యాయం చేకూర్చగల అవకాశం మనకు వచ్చింది. నేర పరిశోధనలో ఫోరెన్ సిక్ ప్రాముఖ్యత ఏమిటో తెలియజెప్పి, మన వృత్తిపట్ల మన గౌరవాన్ని, భక్తి భావాన్ని తెలియపర్చుకొనే ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపర్చు కోవాలి సార్...." అన్నాడు ఫోరెన్ సిక్ ఎక్స్ పర్ట్ ఎంతో ఆవేశంగా.
    
    లేబ్ హెడ్ తన కుడిచేతిని చాపి, ఎక్స్ పర్ట్ కి షేక్ హేండ్ ఇచ్చి, అభినందనా పూర్వకంగా చూసాడు.
    
                                                    *    *    *    *    *
    
    (పోలీస్ కమీషనర్ సిద్దేశ్వర్ ఓబరాయ్ కి ఇన్ స్పిరేషన్ ప్రస్తుతం బొంబాయి నగర పోలీసు కమీషనర్ అయిన 55 యేండ్ల శ్రీ వసంత కేశవరావు సరాఫ్ అయితే నవలలో ముందు ముందు రానున్న జాయింట్ కమీషనర్ అరవింద్ ఐనాందారీ పాత్రకు ప్రస్తుతం బొంబాయి నగర జాయింట్ పోలీస్ కమీషనర్ శ్రీ అరవింద్ ఎస్.ఐనాందారీ (48) ఇన్ స్పిరేషన్ అయ్యారు. వీరిద్దరే బొంబాయి డైయింగ్ అధినేత నస్లీవాడియా అసాసినేషన్ పథకాన్ని పసిగట్టి, సుపారీ కాంట్రాక్టు అనే కిరాయి హంతకుల శిబిరాన్ని మట్టుబెట్టింది. ఈ అద్భుతమైన సంఘటన 1989లో బొంబాయిలో జరిగి దేశవ్యాప్తంగా గొప్ప సంచలనాన్ని సృష్టించింది. సుపారీ కాంట్రాక్టు పేరిట కిరాయి హంతకుల ముఠా ఒకటి నవంబర్ 1988లో బొంబాయిలో ప్రారంభించబడింది. బొంబాయి నగరానికి కిరాయి హంతకులు చేసే హత్యలు కొత్తేమికావు. కాకపోతే బొంబాయి డైయింగ్ అధినేతను అసాసినేట్ చేసేందుకు బొంబాయిలోకి కిరాయి హంతక ముఠాతో ఏర్పాట్లు జరగటంతో, దీనివెనుక రిలయన్స్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం జనరల్ మేనేజర్ కీర్తి అంబానీ హస్తముందని తెలియటంతో అంత సంచలనం రేగింది.
    
    ఈ సంఘటనలో కిరాయి హంతకుడ్ని కుదిర్చిన వ్యక్తి పేరు అర్జున్ వాగ్ జీ బబారియా. ఇతను నైట్ క్లబ్స్ లో డ్రమ్స్ వాయిస్తుంటాడు. ఇతనికి ఇతను పెట్టుకున్న పేరు ప్రిన్స్ బబారియా. కిరాయి హంతకుల్ని కుదిర్చి పెట్టడం అన్నది ఇతని రహస్య వృత్తి.
    
    సీనియర్ క్రైం బ్రాంచీ ఇన్ స్పెక్టర్ ఒకరు ప్రాణాలకు తెగించి తొలిసారి ఈ కిరాయి హంతకుల శిబిరాన్ని పసిగట్టాడు. దాన్ని కమీషనర్, జాయింట్ కమీషనర్ లు సమగ్రంగా శోధించటం ప్రారంభం కావటంతో చాలా విషయాలు బయటికొచ్చేసాయి.
    
    1985 నుంచి కీర్తి అంబానీకి బబారియాతో సంబంధాలున్నాయట. బెండీ బజార్ పోలీస్ క్వార్టర్స్ వెనుకవైపు ఉన్న బబారియా రేకుల ఇంట్లో పోలీసులకు ఒక ఆల్బమ్ దొరికింది. దానిలో కీర్తి, బబారియా కలిసి దిగిన ఫోటో ఉంది. వార్తాపత్రికలు ప్రచురించే సస్లీవాడియా ఫోటో, ఆయన వాడే నల్ల బ్యూక్ కారు ఫోటో కూడా వుంది.
    
    బొంబాయి పోలీసుల కధనం ప్రకారం 1989 ప్రారంభంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుని అసాసినేట్ చేయాలని, అందుకు ఒక ప్రొఫెషనల్ ట్రిగ్గర్ మెన్ ని చూడమని, ప్రతిఫలంగా యాభై లక్షలు ఇస్తానని కీర్తి, బబారియాని కోరటం జరిగిందట. బబారియాలో కిరాయి హంతకుల ముఠాతో చాలా కాలంగా మంచి సంబంధాలున్నాయి. (ఇతన్నే నేను నవలలో థర్డ్ పార్టీ లేక మిడిల్ మెన్ అని ఉదహరించాను. ఈ నవలలో ఫస్ట్ పార్టీ హాన్ సోదరులైతే, సెకండ్ పార్టీ మాస్టర్ అయితే, థర్డ్ పార్టీ ఖలీల్.)
    
    బబారియా అప్పటికే కొందరు వ్యక్తులకు కిరాయి హంతకుల్ని సమకూర్చిపెట్టి, అనుసంధాన కర్తగా లక్షలు సంపాదించుకున్నాడు. పోలీసులు అతని యింటిని సోదా చేసే సమయానికి అతనికో పద్మిని కారు, కలర్ టి.వి., వి.సి.ఆర్., కొన్ని నగలు, నగదు ఉన్నట్లు తెలిసింది.
    
    కీర్తి ఒక కిల్లర్ కావాలని కోరగా బబారియా షాను అనే యువహంతకుడ్ని పరిచయం చేసాడు. అతను అప్పటికి రెండు హత్యలు చేసి కొద్దిపాటి అనుభవాన్ని గడించుకొని ఉన్నాడు. బబారియా అతని పేరును షకీల్ గా మార్చి కీర్తిని పరిచయం చేసాడు. షకీల్ అనే వ్యక్తి వేరే ఉన్నాడు. అతను ప్రొఫెషనల్ కిల్లర్. చాలా ప్రమాదకరమైన హంతకుడు. షకీల్ దావూద్ ఇబ్రహీం ట్రిగ్గర్ మెన్. కీర్తి, షానుని చూసి షకీలేనని నమ్మాడు. షకీల్ అంతటి పెద్ద కిల్లర్ ని కుదిర్చి పెట్టినందుకు కీర్తి, బబారియాని  అభినందించాడు.
    
    బబారియా, షానులు చాలాసార్లు హోరైజన్, రామా ఇన్ పామ్ గ్రోవ్ హోటళ్ళలో కీర్తిని కలుసుకునేవారట. హత్యా విధానం గురించి చర్చించుకునే వారట.
    
    హత్యా విధానాలు నిర్ణయమయ్యాక షాను రెండు రివాల్వర్లను, ఒక రైఫిల్ ని అద్దెకు తీసుకున్నాడు. బబారియా నివసించే ప్రాంతంలో ఒక గారేజ్ లో పనిచేస్తున్న వర్మ అనే వ్యక్తికి యాభైవేలు ఇచ్చి ఫైర్ ఆర్మ్స్, కారు నడపటానికి ఆ మొత్తాన్ని కేటాయించమని చెప్పారట. ఎందుకయినా మంచిదని రివాల్వర్ ని గురిచూసి కాల్చగల మరో వ్యక్తి కోసం ప్రయత్నించగా వెంటనే దొరకలేదు. దీని మూలంగాను, హత్య చేసి, తప్పించుకుపోయే విధానాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోలేక డెడ్ లైన్ ని సెట్ చేసుకోలేక పోయారు.
    
    నస్లీవాడియా తరుచూ విదేశాలని వెళుతుండటం అతని హత్యాయత్న జాప్యానికి మరొక కారణమయింది.
    
    ఎట్టకేలకు....చివరకు వాదియాని అసాసినేట్ చేసే తారీఖు నిర్ణయించబడింది.
    
    అది 24-7-1989.
    
    అయితే ఈలోపే నాటకీయంగా హత్యా పథకంలో భాగస్వాములయిన కీర్తిని, బబారియాని బొంబాయి పోలీసులు అరెస్టు చేసారు. ఆ తరువాత కేసు రాజకీయంలో ఇరుక్కొని అసలు నేరస్థులు తెరవెనుక నుంచే అదృశ్యమై పోయారు. షాను పోలీసులు రంగప్రవేశం చేసారనే విషయాన్ని పసిగట్టి అదృశ్యమైపోయాడు. బొంబాయిలోనే ఉంటున్నాడు గాని ఇంతవరకు పోలీసులకు దొరకలేదు మరే పేరుతో పెద్దమనిషిగా చెలామణి అవుతున్నాడో ఎవరికీ తెలీదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS