57 వ. సర్గ
1. "అరిష్ట మను - గిరిపై నిలిచి
మారుతి ఎగసెను - కాయము బెంచి |
పవన కుమారుని - పదఘట్టనకే
పర్వతమంతయు - పుడమిని క్రుంగే |
సీతను గాంచిన - శుభవార్త వేగ
శ్రీరామునకు - తెలియజేయగ
మారుతి మరలెను - అతి వేగముగ
ఉత్తర దిశగా - వారిధి దాటగ .... ||శ్రీ||
2. గరుడిని వోలె - శరవేగముగొని
పెద్ద పెద్ద మే | ఘాలు దాటుకొని |
మార్గ మధ్యమున - మైనాకునిగని
ప్రేమ మీరగ - క్షేమము కనుగొని |
దూరము నుండి మ | హేంద్ర శిఖరిని
ఉత్సాహమున - ముందుగా గని |
విజయ సూచనగ - గర్జన చేయుచు
మారుతి సాగెను - వేగము పెంచుచు .... ||శ్రీ||
3. మహేంద్రగిరి - శిఖరాగ్రమున
బారులు తీరిచి - వానరులుండిరి |
జాంబవదాది - వీరులందరు
ఎదురు తెన్నులు - కాయుచుండిరి |
మారుతి జేసిన - సింహనాదమును
విని గుర్తించి హ | ర్షించి హసించిరి |
తరుశాఖలపై | పైకి ఎగసిరి
జెండాల వోలె - రెమ్మల నూపిరి .... ||శ్రీ||
4. కపి వీరులను - చేర రమ్మని
జాంబవంతుడు - పలికెను ప్రీతిని |
"ఆ వినుపించెడు భీకర నాదము
మారుతి చేసెడు - సింహ నాదము |
ఊరక చేయడు - ఇంతటి నాదము
సీతను కనుగొని - యుండుట ఖాయము |"
అని తీరుగ బ | ల్కె జాంబవంతుడు
అందరిలోను - అనుభవజ్ఞుడు .... ||శ్రీ||
5. సుందరమైన మ | హేంద్రగిరిపైన
సెలఏట దిగి - తానమాడి |
జాంబవదాది - పెద్దలందరికి
వాయు నందనుడు - వందనములిడి |
"చూచితి సీతను - చూచితి సీతను"
అను శుభవార్తను - ముందుగ బలికెను |
కపివీరులు హను | మంతుని బొగడిరి
ఫలముల నొసగి - సత్కరించిరి ..... ||శ్రీ||
6. "హనుమా నీవు | మహాశూరుడవు
స్వామి భక్తి ప | రాయణుండవు |
వారిధి దాటి - లంకకు జేరి
సీతను జూచి - మరలి వచ్చితివి |
ఒంటిగ ఇంతటి - సాహస కార్యము
ఎటు చేసితివో - విన గోరుదుము"
అని కోర్కెబడిరి - అంగదాదులు
పరివేష్టించిరి - వానర వీరులు ... ||శ్రీ||
__: 57 వ. స. సంపూర్ణము :__
58, 59, 60 వ. సర్గలు
1. మారుతి తన లం | కా యానమును
వానరులకు వివ | రించి తెల్పెను |
అంగదాదులు - ఆలకించిరి
ఆనందముతో - పొంగిపోయిరి |
రామ లక్ష్మణ సు | గ్రీవాదులకు
ఈ శుభవార్తను - వేగదేల్పుటకు |
కపికుంజరుని - ముందు నిడుకొని
కపులందరు కి | ష్కింధకు సాగిరి .... ||శ్రీ||
__: 58, 59, 60 వ. స. సంపూర్ణము :__
61 వ. సర్గ
1. సుగ్రీవుని మే | న మామ కలడు
దధిముఖుండను - వానరోత్తముడు |
అతనిచే కా | పాడు బడునది
కపిరాజునకు - కడు ప్రియమైనది |
దివ్యమైనది వి | శాలమైనది
ఒరులు చొరరాని - మధువనమ్మది |
అంగదాదులా - వనమున బడిరి
అదుపాజ్ఞ లేక - అల్లరి చేసిరి .... ||శ్రీ||
2. మధువు గ్రోలి గ్రో | లి పారబోసిరి
మధువనమునంత - బీడు చేసిరి |
అడ్డగించిన - దధిముఖాదులను
అడలబాది మరి - వెడల గొట్టిరి |
ఆడిరి పాడిరి - గంతులు వేసిరి
శాఖల విరిచి - తరువుల గూల్చిరి |
మధువనమును కపు | లందరు చేరి
అదుపాజ్ఞ లేక - ధ్వంసము చేసిరి ... ||శ్రీ||
__: 61 వ. స. సంపూర్ణము :__
