3. "పాము కుబుసమును - దిగవిడిచినటుల
నరుడు కోపమును - వదలుకో వలె |
జలముచేత అ | గ్ని నార్పినటుల
బుద్ధి చేత కో | పాగ్ని నణచవలె
కోపములేని ప్ర | శాంత చిత్తులు
ఉత్తమ పురుషులు - ధన్యజీవు" లని
మారుతి వగచె తా - చేసిన పని గని
తన కోపమె తన - శత్రువాయేనని .... ||శ్రీ||
4. "సీతా మాత - క్షేమము మరచితి
కోప తాపమున - లంక దాహించితి |
లంకాపురము - సర్వము పోగా
ఇంకా జానకి - మిగిలి యుందునా
సిగ్గుమాలిన - స్వామిద్రోహిని
సీతను జంపిన | మహాపాపి" నని
మారుతి వగచె తా - చేసిన పని గని
తన కోపమె తన - శత్రువాయేనని .... ||శ్రీ||
5. "సీతలేనిదే - రాముడుండడు
రాముడు లేనిదే - లక్ష్మణుడుండడు |
భరత శతృఘ్న - సుగ్రీవాదులు
ఈ దుర్వార్త వి | ని బ్రతుక జాలరు |
ఈ ఘోరమునకు - కారణమైతిని
నాకు మరణమే - శరణ్య" మని
మారుతి వగచె తా - చేసిన పని గని
తన కోపమె తన - శత్రువాయేనని .... ||శ్రీ||
6. "శ్రీరఘురాముని - ప్రియసతి సీత
అగ్ని వంటి మ | హా పతివ్రత |
అగ్నిని అగ్ని ద | హింప నేర్చునా
అయోనిజను - అగ్ని దహించునా ?
నను కరుణించిన - అగ్నిదేవుడు
సీతను చల్లగ - చూడకుండునా ?"
అని హనుమంతుడు - తలచుచుండగ
శుభ శకునములు - తోచె ప్రీతిగ .... ||శ్రీ||
7. ఎల్ల రాక్షసుల - సిరిసంపదలు
మంటల పాలై - దహన మాయెనని |
అశోక వనము - ధ్వంసమైనను
జానకి మాత్రము - క్షేమమేనని |
లంకాపురము - రూపు మాసినను
విభీషణు గృహ | ము నిలచి యుండెనని |
అంబర వీధిని - సిద్ధ చారణులు
పలుకగా విని - మారుతి పొంగె ..... ||శ్రీ||
__: 55 వ. సంపూర్ణము :__
56 వ. సర్గ
1. అశోక వనము - మారుతి చేరెను
ఆనందాశ్రుల - సీతను గాంచెను |
తల్లీ నీవు నా - భాగ్యవశమున
క్షేమముంటివని - పదముల వ్రాలెను |
పోయివత్తునిక - సెలవు నిమ్మని |
అంజలి ఘటించి - చెంత నిలచెను |
సీతామాత - హనుమంతునితో
ప్రీతిగ పలికెను - ఆనందముతో .... ||శ్రీ||
సీత మారుతితో ;
2. "హనుమా ! అతులిత - బలధామా
శత్రు కర్శనా - శాంతి నిదానా |
ఇందుండి నన్ను - ఈ క్షణమందే
కొని పోగల స | మర్దుడ నీవె |
రాముని వేగమె - తోడ్కొని రమ్ము
రాక్షస చర నా | కు తొలగింపుము |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమై | న విశ్వాసముతో .... ||శ్రీ||
3. "పోనీ హనుమా - నేటికి నిలుమా
బడలిక తీరగ - రేపు పొమ్మా |
నీ విందుండిన - స్వల్ప కాలము
నాలో తరిగెను - శోకభారము |
నిన్నంపుట నా | కు మరో దుఃఖము
ఎటు భరింతునో - ఈ పరితాపము |"
అని పల్కె సీత - హనుమంతునితో
సంపూర్ణమై | న విశ్వాసముతో .... ||శ్రీ||
మారుతి సీతతో :
4. "తల్లీ నిన్ను - చూచిన దాదిగ
త్వరపడు చుంటిని - మరలిపోవగ |
భీతి నొందకుము - నెమ్మది నుండుము
త్వరలో నీకు - శుభములు కలుగు
రామ లక్ష్మణ సు | గ్రీ వాదులను
అతి శీఘ్రముగా - కొని రాగలను |"
అని మారుతి సీ | త పదముల వ్రాలె
సెలవు గైకొని | రివ్వున మరలె .... ||శ్రీ||
__: 56 వ. స. సంపూర్ణము :__
