
27
అందమైన చిలుక ఆనందంతో తిరిగింది. అన్నింటినీ అనుభవించాలనే ఆశ . కానీ చేతకాదనే నిరాశ. ఒంటరిదానివనే బాధ. తోడు తెచ్చుకోవడానికి భయం. అదృష్టాన్ని త్రాచుతో తూచింది. తన వైపే ముల్లు మ్రొగ్గింది. మంచి నేస్తమైన గోరువంక తోడయింది. అంతులేని ఆనందంతో, పట్టలేని సంతోషంతో , చెప్పలేని భాషతో ఆకాశాన్ని సవాలు చేసి విర్ర వీగింది. తెలిసీ తెలియని భావాలను కలిపి లోకానికి ఏమేమో చెప్పింది. అది చూసిన గోరువంక అ చిలుక భావాలకు ఒక రూపాన్నిచ్చింది. అంతకన్నా కావాల్సిన దేముంది? ఎవరికీ అందని ఊహ సాగరాలలో తేలిపోయింది. భయం అనేదాన్నే మరిచిపోయి తిరిగింది. ఆ చిలుక నిర్లక్ష్యానికి కోపగించింది విధి. ఆమె ఆనందానికి ఈసు చెందింది. అంతే తుఫాను సృష్టించబడింది. ఆ తుఫాను లో గోరువంక కొట్టుకొని పోతుంది. నిస్సహాయురాలై చూస్తూ ఉండడం మినహా ఏం చేయలేక పోయింది. తనూ ఆ తుఫాను తోనే వెళ్లి పోదామని పించింది. కానీ అది చేతకాలేక పోయింది. బాధతో విలవిలలాడిపోయింది. ఆ బాధను భరించలేక ఆ శారీరాన్నే త్యజించాలను కొంది పాపమా నిస్సహాయురాలైన చిలుక. కానీ గోరువంక దాన్ని చావనివ్వ లేదు. ఏదారీ కానరాని చిలుక అలాగే బాధతో ఏనాడైనా తన బాధకు విముక్తి కలగదా అని కన్నీరు ను తుడుచుకొని లోలోపలే కుమిలిపోతూ జీవితం గడపాలని నిశ్చయించుకొంది.
దాని ఆనందాన్ని చూసి ఈర్ష్య పడిన తోడి చిలుకలు అపహసించాయి. లోకం వెక్కిరించింది. ఆ అపహసాలను , వెక్కిరింతలను భరించే ధైర్యం , శక్తి దానికి ఎక్కడి నుండి వచ్చాయి? ఆ గోరు వంక నేర్పిందా? ఏమో?
* * * *
"ఏమిట్రా ఇది?" గర్జించి నట్లుగా అడిగాడు గోపీ, రాజ్ ఇచ్చిన పెళ్లి పత్రికను చదివి.
"నా పెళ్లి." తలవంచుకొని చెప్పాడు రాజ్.
'అది నాకూ తెలుసు. ఎవరితో అని అడుగుతున్నాను."
"........"
"నీకేమైనా మతి పోయిందట్రా!"
"మతి ఉండే ఈపని చేశాను."
"ఏమిటి, బావా, ఇంతలో ఈ మార్పు?" అడిగింది లత. కారణం చెప్పే స్థితిలో లేడు రాజ్.
"ఒక అమాయకురాలీని మోసం చేయడం నీకు బాగుందా?"
"నేను నిస్సహాయుణ్ణిరా, గోపీ!"
"ఏడిశావ్ ! నిన్ను పోషించాడని నీ జీవితాన్ని అమ్ముకొంటావా? ఇలా నిండు జీవితాలతో ఎందుకాడుకుంటున్నాడో ఆయన్నే అడుగుతానుండు."
"అది వారి తప్పు కాదు. నా యిష్టం మీదనే ఈ పెళ్లి జరుగుతోంది."
"అదే ఏం చూసి ఇష్టపడ్డావు? రజియా నీకు అయిష్ట మయిందా! ఆమె నీకు ఏం అన్యాయం చేసిందని ఆమె జీవితానికి ఈ అపకారం తలపెట్టావు?"
"ఆ ప్రశ్నకే జవాబు చెప్పగలిగి ఉంటె ఈనాడి లాంటి పరిస్థితులలో ఉండేవాడిని కాదు' అనుకొన్నాడు రాజ్ మనసులో.
"అంతగా అయితే వారు నీకై ఖర్చు పెట్టిన డబ్బు ఇచ్చేయ్యలేక పోయావా?"
"అవును , బావా, అలా చెయ్యకూడదా?"
"లతా , మీకు నామీద ఉన్న ప్రేమచేత ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. ఇంకా మనం చిన్న పిల్లలం అనుకున్నావా? చిన్నప్పుడు తాయిలం తెచ్చుకోనీ ఎదుటి వారి తాయిలం తీసుకొని మనది వారికివ్వ వలసి వచ్చినప్పుడు ఇష్టం లేక వారిది వారికి తిరిగి ఇచ్చేస్తాం. అది పసితనం. అమాయకత్వం, మనం అజ్ఞానంగా ప్రవర్తించడానికి కాదు విజ్ఞానాన్ని నేర్చుకున్నది."
'అయితే రజియా విషయం లో నీ విజ్ఞాన మంతా ఎక్కడేడిచిందోయ్?"
"మీకు నేను నచ్చ చెప్పలేను" అని భారంగా తలపట్టుకొని సోఫాలో కూలబడ్డాడు రాజ్.
మానవులందరి కోరికలు నెరవేరవు. కోర్టు లో వాది ప్రతివాదుల కిద్దరికీ న్యాయం చెప్పబడదు. ఒకరి న్యాయం, మరొకరి పాలిటి అన్యాయం కాక తప్పదు. వాదన లో కానీ ఆటలో కానీ ఇరువురూ గెల్వరు. అలాగే అన్ని విషయాల లోనూ మానవ జీవితానికి అనుకొన్న సుఖం అతనికున్న చిన్న కాలం లో చేకూరడం దుర్లభమే అవుతుంది.
"పోనీ , ఒక విషయం అడుగుతాను చెప్పరా! వసంత స్వభావం ఎలాంటిదో నీకు తెలుసు కదా! ఆమెతో నువ్వు ఎలాగూ సుఖంగా గడప లేవు గదా! అన్నీ తెలిసి ఉండి లేనిపోని కలతలూ, మనస్తాపాలూ, అవమానాలూ కలిగే ఆ జీవితాన్నే ఎందుకు తెచ్చుకుంటున్నావు?"
"గోపీ, బాల్యంలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. అవి తప్పని తెలుసుకొనే వయసు వచ్చినప్పుడు తిరిగి చెయ్యం. ఆమె అంతే. తన ప్రవర్తన తప్పని తెలుసుకొన్న నాడు తన జీవితాన్నే చక్కదిద్దు కోగలదు. అయినా వెలుగుకు దూరమైననాడు చీకటిని గురించి భయపడితే ఎలా?"
"ఛ. నీతో మాట్లాడడమే తప్పు. అసలు నీ పెళ్లికే రాను ఫో! అని గోపీ అక్కడి నుండి బాధతో వెళ్ళిపోయాడు. లత ఏమీ మాట్లాడలేక పోయి రాజ్ ను చూస్తుండి పోయింది.
"వదినా, కనీసం నువ్వయినా నన్ను అర్ధం చేసుకోలేవా?"
"వారి మాటలు మనసులో పెట్టుకోకులే, రాజూ. నువ్వు నీ పనులు చూసుకో."
"కొంతవరకూ అదృష్ట వంతుడ్నీ."
* * * *
"హు, ఆఖరుకు ఇలాగయిందన్నమాట. నీ జీవితాన్ని కూడా పొట్టన పెట్టుకోవడానికి సిద్దమయింది విధి. " తలపట్టుకున్నాడు ఖాన్ గారు.
తండ్రి పరిస్థితి చూసి నోరు మెదపలేక పోయింది రజియా. ఆయనను ఒదార్చాలా? ఏమని? ఏ ధైర్యం ఇవ్వగలదు? కూతురి సుఖం కూకటి వేళ్ళతో సహా ఊగి పోయినప్పుడు చూచిన ఏ తండ్రి ని ఎవరు ఒదార్చ గలరు?
ఎదురుగా కూర్చొని ఆలోచనల లో మునిగి ఉన్న సరోజినీ దేవిని చూసింది.
అ మౌనం రంపపు కోతే అయింది. అనుకుంటే ఆవేశాలను తెచ్చి గుండెలు బ్రద్దలు గొట్టే విషయం. పగ ప్రతీకార వాంఛలు రగిలే సమయం. అపోహలు, అంతర్యుద్దాలూ కలిగించే సమయం. లోకం పై , జీవితం పై విరక్తి ని నిరాశా నిస్పృహలకు దారి తీసే సంఘటన. మానవుడి లోని బలహీనాన్ని లోకానికి చూపించగలననే సమస్య. భవిష్యత్తంటేనే భయం. తమపై తమకే అసహ్యం. విధికి నిందాలాపాలు , భగవంతునికి దూషణలు విరివిగా లభించే తిరిగి రాని సమయం. ఎదుటి వారి పై అర్ధం లేని కోపం.
వీటన్నింటినీ ఎదురించి నిలువ గలిగిన నాడు ఆ జీవితానికే ఆ సమయంలో ఒక సార్ధకత , సామాన్యుంకందని తృప్తి కలుగుతాయి.
"మనుష్యుల ఆకారాలను చూసి అప్పుడప్పుడూ మోసపోతుంటాం.' సరోజినీ దేవి నోటి నుండి భారంగా వెలువడ్డాయా మాటలు.
"పొరపడ్డానమ్మా! ప్రస్తుత పరిస్థితులను చూసి భ్రమతో మోసపోయామనుకుంటున్నావు. అంతే కానీ రాజ్ ను ఏమన్నా అది నిజం కాదు; నేను భరించలేను."
నిట్టూర్చింది సరోజినీ దేవి. దుఃఖానికి బదులుగా ఆ నిట్టుర్పు వచ్చిందని రజియాకు తెలుసు. తండ్రి ఒక వైపు చింతిస్తున్నాడు. తల్లి మరో వైపు బాధ పడుతుంది. మరి తనో? నవ్వుతుంది. ఎవరిని చూసి? వారిని చూచి నవ్వుతుందా? కాదు. విధి విచిత్ర వక్రగతిని తలుచుకొని ఏడవలేక నవ్వుతుంది. దాన్ని జయించాలంటే నవ్వాలి అనే రాజ్ తనకు నేర్పాడు. అదే తను చేస్తుంది.
* * * *
