"ఇవ్వను. ఈ రూపాయలతో నా రెండోభాగం కొనుక్కుంటాను. ఎప్పుడూ సగంగా ఉండాలనా నీ ఉద్దేశం. ఎప్పుడూ నేను రెండుగా ఉండాలనా నీ నాటకం"
నా గద్దింపు విని నిమ్మో నిలిచిపోయింది బొమ్మలా.
"పిల్లలూ నడవండి బయటికి. మీ నాన్నకు మళ్లీ వచ్చేట్లుంది"
నిమ్మో గది తలుపులు వేసింది. వెళ్లిపోయింది.
ఇవ్వాళ పేపర్లో వార్త వచ్చింది-రాబర్ట్ కెన్నడీని ఎవరో కాల్చేశారట- హత్య చేశారట!
నేను నా శత్రువులందరినీ లెక్కపెట్టి కాల్చేస్తాను. కాని నాపిస్తోలేది? వాడు ఎవడు? కెన్నడీని చంపినవాడు అరువు తీసుకున్నాడు! ఏమిటి? నా పిస్తోలు. అలా కాకుంటే ఈ దుర్మార్గుల్ని బతకనిచ్చేవాణ్ణా! ముఖ్యంగా నిమ్మో, ఫజ్లూ, ఇమ్తియాజ్ వీళ్లను షూట్ చేసేవాణ్ణి- కాల్చిపారేసేవాణ్ణి. ఓహ్! ఆనాడు సూర్యుడు పూర్తిగా వెలుగుతాడు. జనం గుండెలిచ్చి నవ్వుతారు.
రప్. రప్. రప్. నా చేతికి బందూకు వచ్చింది. ఇదిగో పేలుస్తున్నాను. కాలుస్తున్నాను. నా గురి సరిగ్గా తాకుతూంది. ఒక్కొక్కడూ ఒరుగుతున్నాడు. ధన్ ధన్ ధన్. అంతా పడిపోతున్నారు. నిమ్మో, ఫజ్లూ-నన్ను ఈ ఇంట్లోకి బలవంతంగా నెట్టిన డాక్టరు, నన్నుచూచి ప్రతినెలా నవ్వే పెన్షన్ ఆఫీసు క్లార్కు - అంతా పడిపోయారు. అహ్హహ. బావుంది. ఖుషీగా ఉంది. ఇహ మజా ఉడాయించు-కబాబులు తిను-
ఏమిటివాళ ఇంత ఆకలి. ఆకలి. ఆకలి. దహించుకు పోతూంది. ఏడాది నుంచి తిండిలేదు. ఇవ్వాళ కబాబులు తింటాను- మిర్చిమసాలా దట్టించినవి తింటాను. కవాబులు దొరక్కుంటే ఇమ్తియాజ్ ను కాల్చుకు తినేస్తాను.
"కవాబులు కావాలి, త్వరగా కవాబ్ వాంటెడ్"
కవాబులు రాలేదు. ఇమ్తియాజ్ వచ్చాడు.
ఇతడూ ఈ కుటుంబ సభ్యుడే. ఈ కుమార శేఖరుడు నా సంతానమేనని ఇతని తల్లి-మహామాత- ఎప్పటికీ నాకు జ్ఞాపకం చేస్తుంటుంది. గతజన్మలో కూడా మేమిద్దరం శత్రువులమేమో! ఎందుకంటారా? ఇప్పటికీ ఇమ్తియాజ్ నన్ను ద్వేషదృష్టితో చూస్తాడు. అతని చూపులో అసభ్యత కనిపిస్తుంది. నేను అతన్ని చూస్తే "బిడ్డా! చూసుకుందాంలే" అనాలనిపిస్తుంది.
ఏమిటీ వీడి టెక్కు? ఎవడి ఆస్తి చూసుకుని వీడి నిక్కు! సిగరెట్టు పొగ ముఖంమీద ఊదుతుంటాడు. తల్లీ కొడుకులకు ఎప్పుడూ డబ్బు గురించి తగాదాలే! వాడు రావడం రాత్రికో అర్దరాత్రికో! ఆ రావడమూ తాగి తూలుతూ పిలుస్తాడు. వాడేమనుకుంటాడు- నేను సారా కంపు గుర్తించలేకనా? వాడి తల్లి ధైర్యానికీ గుండె నిబ్బరానికీ ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ధైర్యం ఆమెకు? ఆ వెధవను నా కొడుకును చేసింది.
ఇప్పుడంటారా నేను ముసలివాణ్ణి అయిపోయాను. నేనూ చూచాను లోకాన్ని! ఇమ్తియాజ్ ను లాగి చెంపదెబ్బలు కొట్టాలనిపిస్తుంది. వాడి నిజపు తండ్రి గుర్తువచ్చేదాకా బాదాలనిపిస్తుంది. కాని అమ్మో వాడు ఎలా ఉన్నాడు దుంగలా. వాడి శరీరం ఎలా ఉంది? ఇనుపముక్కలా! అందుకే వాడంటే భయం. ఏమీచేయలేను. ఆ తండ్రి దురదృష్టవంతుడు-వాడి ముఖాన ఇలాంటి సంతానం రాసిపెట్టాడు దేవుడు!
ఇవ్వాళా అంతే, గదిలోకి వచ్చాడా-రాగానే హుకుం జారీ చేశాడు.
"త్వరగా తయారుకండి. ఇవ్వాళ 7వ తేదీ. పెన్షన్ తేవడానికి నావెంట రావాలి"
పెన్షన్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళడమంటే నాకు భలే సరదా. ఎంచేతంటారా? వీధుల్లో స్వేచ్చగా తిరగొచ్చు. పెన్షన్ డబ్బు- అంత మొత్తం- నా జేబులో ఉంటే ఎంత ఖుషీ! కాని ఇమ్తియాజ్ ఉండనివ్వడు. ఆ డబ్బుతో ఐస్ క్రీమ్ తెచ్చిపెడ్తాడు- నన్ను ఇంటికి తెచ్చి విడిచేస్తాడు. తరవాత తల్లి అతనిమీద కేకలు వేస్తుంది.
7వ తేదీ విచిత్రం అయింది. ఆరోజు నేను అందరికీ కావాలి. నిమ్మో నేను ఆవిడవాన్నంటుంది. తానే నన్ను పెన్షను కోసం తీసికెళ్తానంటుంది. ఇమ్తియాజ్ నామీద తన అధికారం ఉందంటాడు. తానే తీసికెళ్తానంటాడు.
ఇవ్వాళ నేను ఇమ్తియాజ్ ను విడిపించాలనుకున్నాను. అతనిమాట వినినట్లే 'నాకు కవాబులు కావాలి. ఏవి? త్వరగా తే. ఆకలి మండిపోతూంది' అన్నాను.
ఇమ్తియాజ్ అతిప్రేమతో అన్నాడు.
"మీరు బట్టలు మార్చుకోండి. ఇవాళ పెన్షను డబ్బు సాంతం కవాబులకే ఖర్చుచేస్తాను, మీకే తినిపిస్తాను"
ఇమ్తియాజ్ ఎంత మంచివాడైనాడు! ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు! నన్ను గద్దించడం లేదు- దెబ్బలు కొట్టి బట్టలు కట్టించడంలేదు! అబ్బ! ఇమ్తియాజ్ ఎంత మంచివాడు!
యా అల్లా! కవాబులు ఎంత మండిపోతున్నాయి! ఏడువందలకు ప్లేటు కవాబులు. వద్దు. నాకొద్దు. తీసెయండి. నేను కవాబులు తినను. ఇమ్తియాజ్ వెంట బజారుకు వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి నేను పెన్షను తేవడానికి? నాకేంపని? దుప్పటి కప్పుకొని పడుకుంటాను. మళ్ళీ కళ్ళు తెరవను అంతే. ఇహ కదలను.
మనం బట్టలు మార్చడం-బయటికి వెళ్ళడం ప్రళయంలాంటివి. ఇల్లు సాంతం కదుల్తుంది. ఒకడు గడ్డం గీయిస్తాడు. ఒకడు ముఖం కడిగిస్తాడు. చూడండి ఇమ్తియాజ్ స్వయంగా ఇస్త్రీచేసి తెస్తున్నాడు బట్టలు. ఇలాంటి నన్ను చూచి లోకం ఏమనుకుంటుంది?
లోకం...లోకులు...ఏమిటి వారంటే అంత భయం. ఈ ఇంటి వాళ్ళెందుకు అలా జడుస్తారు! ఏరి ఆలోకులు-ఏరి ఆ జనం? వారు నాక్కనిపిస్తే బావుణ్ణు కథలన్నీ చెప్పేసేవాణ్ణి, నిమ్మో లేనప్పుడు ఇమ్తియాజ్ మారు తాళంచెవితో అల్మారీ తెరిచి నగలు ఎత్తుకుపోయాడు. హమ్మి అందినకాడికి అందుకుని ఆ కుర్రాడితో లేచిపోతుంది. నేను తెరచాటు నుంచి అన్నీ చూస్తుంటాను. ఒకనాడు పప్పు గిన్నెలోని ఎముకల్ని ఏరుకొని తింటున్నాడు. నేను వాణ్ణి అదిలించాను. అదిచూచి అంతా ఆశ్చర్యపోయారు- అసలు నేను వంటింట్లోకి ఎలా వచ్చానా అని- వస్తే అక్కడ ఎంతసేపు నుంచి నుంచున్నానో అని.
ఫజ్లూ ఉన్నాడే- వాడిది అతి తెలివి. నాకోసం భోజనం తెస్తాడు. స్టూలు మీద పెడ్తాడు. తానే తినేస్తాడు. ఒకనాడు వాడు వెళ్ళిపోయాడు. నిమ్మోతో అంటున్నాడు నాకు భోజనం పెట్టానని. నేను చాటుగా విన్నాను "కాదు. అబద్ధం. నేను తినలేదు నాకు ఆకలిగా ఉంది. నాకు అన్నం కావాలి" అని వంటింట్లోకి వెళ్ళి అరచాను.
"ఇదేం ఖర్మ! ఇప్పుడే ఫజ్లూ అన్నం పెట్టాడు మళ్ళీ ఆకలి అని ఊడిపడ్డాడు!" నిమ్మో షమ్మీతో అన్నది.
"ఎక్కువ తింటే మీ ఆరోగ్యం పాడవుతుంది. వెళ్లండి గదిలో పడుకోండి" షమ్మీ నన్ను గదివైపు నెడుతూంది.
"నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టండి. కావాలంటే ఫజ్లూనే అడగండి, నేను తినలేదు"
ఫజ్లూ మాట్లాడడు. నిమ్మోను చూస్తాడు, నవ్వుతాడు.
"అయినా మీరిక్కడికి ఎందుకు వచ్చారు. టేబుల్ పాడుచేస్తారు. నడవండి గదిలోకి, అక్కడికే పంపిస్తాను" నిమ్మో నన్ను లాక్కెళ్ళింది. గదిలో పడేసింది. బయటినుంచి గొళ్ళెం పెట్టింది.
'నాన్నను కొట్టకండి....కొట్టకండి' మున్నీ అరుస్తూంది-ఏడుస్తూంది.
"నోర్ముయ్....వచ్చింది....పెద్ద-నాన్న కూతురు" నిమ్మో మున్నీని బాదుతూంది. మున్నీ ఏడుస్తూంది.
'తలుపు తియ్యండి' నేను తలుపుకు తలబాదుతూ అరచాను.
తలుపు తెరుచుకుంది.
'చూఁచూఁను చంపేశారా?' నా నొసటి రక్తం తుడుచుకుంటూ చూచాను.
మున్నీ మూలకు నుంచుంది. ఎక్కెక్కి ఏడుస్తూంది. మున్నీ చేతులు చాచింది. నేను చేతులు చాచాను. ఇద్దరం ఒకరిమీద ఒకరం పడిపోయాం.
నన్ను గదిలో ఉంచడానికి నిమ్మో ఒక ఉపాయం చేసింది. ఆమె రకరకాల వ్యక్తులను నా దగ్గరికి పంపుతుంది. నేను వారితో మాట్లాడితే ఉల్లాసంగా ఉంటానని ఆమె ఉద్దేశం.
