పరమేశ్వరుడు పాట పాడుచుండగనే రాజారావక్కడకు వచ్చినాడు. ఆలము పాట ముగిసిన వెనుక వచ్చినాడు. అతడు పరమేశ్వరుని మరల పాడమన్నాడు. పరమేశ్వరుడు మరల పాడినాడు.
సంధ్యారుణమధురిమలో పరమేశ్వరుని గొంతుక తారాశ్రుతిలో విరిసిపోయినది. పల్లెటూళ్ళలో వివిధ వేషాల తీరుగాడు బిచ్చగాళ్ళ గుంపును వారి కనులయెదుట నిలిచినట్లయినవి. బిచ్చమెత్తుకొను జాతులెన్ని శతాబ్దముల నుండియో బిచ్చములెత్తుకొనుచూనే యున్నవి. జంగములు, బుడబుక్కలవారు, బైరాగులు, గంగిరెడ్ల దాసరి వారు, కొమ్మదాసరులు, కోయవారు, ఎరుకలవారు, పగటివేషగాండ్రు, విప్రవినోదులు, మంత్రగాండ్లు, అడవిచెంచులు, యానాది భాగవతులు, రామదాసులు, నూనెగుడ్డలవారు, అమ్మవారి దేవరలు, దాసులు, తోలుబొమ్మలవారు, దొమ్మిరివాండ్లు రుంజలవారు, కాశీపటములవారు, భటరాజులు, బీబీనాంచారి వారలు, గంగానమ్మ భక్తులు, జంగాలు మొదలైన బిచ్చగాండ్రు వారి మనస్సీమలో జట్టు జట్టులుగా బ్రయాణము చేయుచు తోచినారు.
రాజా: నారాయణరావు! మనదేశానికి ఈ బిచ్చగాళ్ళు చెదపురుగులురా!
నారా: అది నేను ఒప్పుకోనోయి.
ఆలం: నేనూను.
నారా: ఎందుకంటావా? అసలు వీళ్ళలో పూర్వం నుంచీ మనస్సులకు వినోదము కలిగించేవారు కొందరు, కొందరు దేశదిమ్మరిజాతులు, అడవిజాతులు. వారివల్ల భూతవైద్యం ఎరుక చెప్పించుకోవడం మొదలయిన లాభాలు పొందుతున్నాం మనం.
రాజా: అయితే ఆ భూతవైద్యం, ఎరుకచెప్పడం నీకిప్పుడు నమ్మకమేనా?
నారా: నేను బిచ్చగాళ్ళ చరిత్ర చేపుతున్నానేగాని నాకు నమ్మకం అన్నానా మరి. విను! వీళ్ళంతా మనకు ఏదో లాభం కలుగజేసి, మనవల్ల లాభము పొందేవాళ్లు. రానురాను మనకు పాశ్చాత్య నాగరికత వచ్చి ఈ బిచ్చగాళ్ళ జాతులలో ఉండే కళాసౌందర్యము అనుభవించడము రూపుమాసింది. జంగాలు పాడే బొబ్బిలిపాట, దేశింగురాజుకథ, సర్వాయి పాపడు కథ, బాలనాగమ్మ కథ, మరాఠీ కథ, చెన్నప్పరెడ్డి కథ, కామమ్మ కథ మనము వింటున్నామా? ఆ కథలలో చమత్కృతీ కళాధిక్యత గమనిస్తున్నామా? పాటక జనం మాత్రం నేటికీ ఆ కథలు విని ఒక అనిర్వచనీయానందం పొందుతూ, వారికి తోచిన బహుమతులు ఇస్తున్నారు.
ఆలం: మా మతం ఎప్పుడూ ధర్మం చేయమంటుందిరా!
రాజా: అసలే మనదేశం బీదదేశం. ఇప్పటికైనా వీళ్ళు వదలకపోవడం ఏమిటని?
పరం: వాళ్లెలా వదులుతారోయి? వాళ్లకి ఆధారం ఏదయినా చూపించూ. వాళ్ళకీ వృత్తి మహాసౌఖ్యమా ఏమిటి? వాళ్ళ పాట వినో, ఆట చూసో, మాటకు ఆనందించో ప్రతిఫలం క్రింద గుప్పెడు గింజలిస్తున్నాం. అంతేనా?
రాజా: అలా మనకు నువ్వు చెప్పే ప్రతిఫలం ఇవ్వకపోతే?
పరం: ప్రతిఫలం ఇవ్వకుండా ఉట్టి ముష్టి ఎత్తుకునేవాళ్ళు చాలా తక్కువ కాదటోయి. వాళ్ళయినా ప్రపథమంలో ఏదో ప్రతిఫలం ఇవ్వకుండా ఉండిఉండరు.
రాజా: నేను చెప్పే విషయం ఇద్దరూ గ్రహించలేదు.
నారా: ఉండరా పరమం! నువ్వనేది, రాజారావు! వాళ్ళిచ్చే ప్రతిఫలం ఇవ్వనిదానితో సమం. కాబట్టి బీద దేశమయిన మనదేశానికి వీళ్ళ బరువు చేటు. కనుక యా ముష్టి యెత్తడం మానిపించి వెయ్యాలని. అదేనా నీవాదన?
రాజా: అవును.
నారా: సరే, బిచ్చగాళ్ళకు నువ్విప్పుడేదైనా పని చూపిస్తావా?
రాజా: పని చూపించే, వాళ్ళని మాన్పించివెయ్యాలని.
నారా: అదే దోషం. పిచ్చి కుదిరితేగాని పెళ్ళి కుదరదు, పెళ్ళి కుదిరితేనేగాని పిచ్చి కుదరదు. ఇప్పుడు వ్యవసాయంలోనూ, గోడకట్టు బండి తోలడం మొదలైన చిన్న చిన్న కూలి పనులలోనూ, పట్టణవాసంలో ఫ్యాక్టరీ కూలిమోత మొదలైన పనులలోనూ కావలసినంతమంది జనం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముష్టియెత్తుకునేవాళ్ళకి పనులిచ్చేందుకు పనులు లేవు. అదికాకుండా ఇదివరకు పనులు చేసే సర్వవిధములైన పాటకజనములోనే అందరికీ కడుపునింపే పనిలేక, పోటీలతో ఏదోరకంగా ఒకవిధమైన సగటు కూలి అందరికీ దక్కుతోంది. ఆ సగటు కూలీ వల్ల పాటకపు మనిషికి ఏడాదిలో ఆరోవంతు రోజులకు పూర్తియైన తిండి, అనగా రోజుకు ఆరోవంతు తిండి దక్కుతోంది. ఇంక ఈ బిచ్చగాళ్ళు కూడా పనికి దిగితే. మనిషికి ఒక నెల తిండే సగటున వస్తుంది. ఎందుకంటే కూలిజనం ఎంతమంది ఉన్నారో అంతమంది బిచ్చగాళ్ళ జనం ఉన్నారు.
రాజా: అదంతా నేనూ ఒప్పుకున్నాను. కాని మనదేశంలో ఇంకా వ్యవసాయానికి రావలసిన భూమెంత ఉన్నది?
నారా: సుమారు ఇప్పుడున్న దానిలో నాలుగుపాళ్ళలో మూడువంతులు వ్యవసాయానికి వచ్చేటందుకు వీలైనభూమి మిగిలింది. అలా వీలులేని కొండా, అడవి, ఎడారి భూమినీ.
రాజా: మూడు పాళ్లైనా ఉందా లేదా?
నారా: ఉంది. కానీ ఈ భూమిని వ్యవసాయానికి తీసుకువచ్చేటందుకు కొన్ని వందలకోట్లు ఖర్చవుతాయి. అది ఎక్కడ? ఇప్పటి గవర్నమెంటు ఇవ్వలేదు. లక్షాధికారులు తక్కువ, వారూ ఇవ్వడం కష్టం. దేశం మొత్తంలో డబ్బు హుళక్కి.
రాజా: నువ్వు చెప్పింది, పాటక జనమే వీళ్ళ కళా ఉత్కృష్టత కానందిస్తున్నారు అన్నావు. వాళ్ళు ముష్టివేసి వాళ్ళ రాబడి సగాన్ చేసుకుంటున్నారుగా ఎలాగూనూ.
నారా: కాని ఆ బిచ్చగాళ్ళు పాటక జనం దగ్గిరపొందే బిచ్చం ఉన్నదే, అది డబ్బుగలవాళ్లదగ్గిర సంపాదించే బిచ్చంలో మూటిలో ఒకపాలే ఉంటుంది.
రాజా: మన స్త్రీలు పాశ్చాత్య విద్యాధికులు కానంతకాలం బిచ్చగాళ్లకు భయంలేదు. పాశ్చాత్యవిద్య కూడా మన యీ పూర్వ సంప్రదాయ వాసనను మార్చలేదెప్పుడును.
పరం: మీరిద్దరేమన్నా సరేగాని, బిచ్చగాళ్ళు కళాభాగం. వాళ్ళలో ఉన్న రసాభిజ్ఞత మనలోలేదు. తోలుబొమ్మలవాళ్లలో చిత్రకారులున్నారు, రామదాసులలో పాటగాళ్ళున్నారు, జంగాలలో కథకులున్నారు. టిక్కెట్లు పెట్టి గారడీ చేసి డబ్బు సంపాదిస్తే మాంత్రికుడు, వీధిలో డోలు వాయిస్తూ బుట్టలో మనిషిని మాయం చేయిస్తే బిచ్చగాడూనా? నా ఉద్దేశమునకు స్వరాజ్యము వచ్చి దేశం బాగుపడ్డాక ఈ బిచ్చగాళ్లని బాగుచేసి, వాళ్ళ కళా సంబంధమైన వృత్తులలోకి ప్రవేశించిన దోషాలు మాయముచేసి, ఆ వృత్తులు వృద్ధి పొందేందుకు కళాశాలలు ఏర్పరచాలని. ఆ ఆశయము నన్ను పులకరాలతో నింపుతూ ఉంటుంది.
రాజా: మన పరమేశ్వరుడు ఏదో కలలు కంటూ ఉంటాడు.
నారాయణరావు బిచ్చగాళ్ళను తలచుకొని మనవారి ధార్మికత సార్వజనీనముగ దేశములోని ధనము పంచుచున్న విధము ఊహించెను. హిందూదేశములో రష్యా రాజ్య పద్ధతి యవసరములేదు. అది ప్రాపంచిక సంబంధమైనది. మనదేశ మాత్మోపలబ్దికై పాటుపడినది. కావున రష్యా పద్ధతి నవలంబింప జాలదు. రెండు రాజ్యములూ ముఖ్యముగా వ్యవసాయదేశములేయైనను మనుష్యుని యాత్మవికాసమునకు దోడుపడని పద్ధతులేవియును భారత వర్షమునకు బనికిరావు. ఏ దేశమునకును పనికిరావు. భరతఖండము సర్వ ప్రపంచమునకును ధారబోయు బోధన మిదియే. జపాను దేశము నిమిషమాత్రమున పాశ్చాత్య మార్గమవలంబించినది. టర్కీ అనుకరించుచున్నది. పెరిసియా యా మార్గము వెంట నడువనున్నది. కాని నూటయేబది సంవత్సరముల నుండి పాశ్చాత్య నాగరికతా సారము మన రక్తనాళములలోనికి ఇంజక్షన్ చేయబడుచుండినను, మనలోనున్న పూర్వ సంప్రదాయవాసనలనది నశింపజేయలేకున్నది. 'అయ్యో. నా తల్లీ! నీకీ పాశ్చాత్య నాగరికతా విమోచనమెప్పుడోగదా' అనుకొనుచు నారాయణరావు నిమీలితలోచనుడైనాడు.
పరమేశ్వరుడు 'ఏమర్రా! మీరిద్దరూ ఆలోచనలలో పడ్డారు. ఆలం మాట్లాడడు. నా పాటను గురించి మంచీ చెడ్డా చెప్పారు కారు. కష్టపడి తయారుచేశాను. కోకిల్లా పాడాను' అని మిత్రుల నిరువురిని బ్రశ్నించెను. ఆలం నవ్వుచు 'నిన్ను మా పారశీక కవి ఒమారు ఖయ్యాముతో పోల్చానురా, పో' అన్నాడు.
నారాయణరావు 'కారు వాడికి కబురుపంపినాను. వాడు కారు పట్టుకు వస్తాడు. కాస్త కాఫీ పుచ్చుకోండి. రాజారావు సిగరెట్లు కాల్చడు. మనకు త్రీకాజీల్సు ఉన్నాయి. పదండిరా సినిమాకు, డగ్లాసు ఫిల్మ్ 'త్రీమస్కెటీర్లు' వచ్చిందిరా పదండి. సుబ్బయ్యా కాఫీ పట్టుకురా!' యని కేక వేసెను.
ఆలం: నాకు పరాటాలు, కోడిగుడ్లు కావాలిరా.
పరం: ఈ కుంకాయికి ఒక జందెం తగిలించరా నారాయుడూ.
ఆలం: మీకందరికీ ముస్లీం మతం ఇద్దామని చూస్తూంటే!
నారా: తెలుగు తురకలకు, అరవ తురకలకు హిందువులతో దెబ్బలాట లేనేలేదు కాదట్రా! మీకందరికి హిందూమతం ఇద్దామని మేము చూస్తున్నాం.
