జగన్మోహనరావు
శ్రీ రాజా క్రొవ్విడి బసవరాజ రాజేశ్వర శ్రీ జగన్మోహనరావు బహద్దరుగారు గంజాంజిల్లాలోని నారికేళివలస జమీందారుగారు. నారికేళివలస బరంపురమునకు గొలది మైళ్ళదూరములో నున్నది. జమీయంతయు బది గ్రామములు, సాలుకు ముప్పదివేలు రాబడి.
కాని జగన్మోహనరావు బహద్దరుగారు మహోదార పురుషులు. ధనమొకచోట కూడియుండుట వారికి బడదు. ఏ రీతినైననేమి ధనము ప్రపంచములోనికి బంపుట లోక కళ్యాణప్రదము. భోగకాంతలు, బ్రాందీ షాపు యజమానులు, జూదరులైన స్నేహితులు మొదలగువారు ధూమశకటములవంటివారు. ధనమును దేశములో వెదజల్లుటలో వారు ప్రసిద్ధులు. వారి సహాయము లేనిచో, నొకచోటనే పాదుకొని పనికిమాలినదగును. ఇదీ వారి అర్ధనీతి. పరదేశముల నుండి వచ్చు చాంపేను బోర్డియా, ఎక్షా బ్రాంది, విస్కీలు సేవించితిమేని మనకు విశ్వసౌందర్యమలవడును. సిగరెట్లు మెదడును శుభ్రపరచి జ్ఞానాభివృద్ధిని జేయును. నాట్యస్త్రీలను బ్రోత్సహించుట లలితకళాభివృద్దికే.
జమీలలో జమీరైతుల క్షేమము ముఖ్యము అని వారిముందు ఎవరయిన పలికినా ఆయన పకాలున నవ్వును. అట్లయినచో ప్రభుత్వము వారేల జమీందారీ పద్ధతి ప్రవేశపెట్టెదరు? రైతువారీ పద్ధతినే యుంచియుందురు. కాబట్టి జమీధనము చిత్తము వచ్చినట్లు జమిందారుపయోగపరచుకొనవలయును. అప్పులు చేసిన జమీ పాడగుట యేల సంభవించును? జమీలు జమీందారుల పాలినుండి తప్పింపకూడదట! జమీందారులు శాశ్వత బ్రహ్మకల్పముగ జమీల గట్టుకొని యూరేగెదరా? బ్రతికియున్నన్నాళ్ళు ననుభవించవలెను. తరువాత వేరొకరికి బోవుగాక! ఈ సంపద ఎల్లకాలము నొక్కరే యేల అనుభవింపవలెను? జమీలమ్మకూడదని శాసనమెందుకయ్యా? అని జగన్మోహనరావు వాదించుకొని తన్ను తాను సమాధాన పెట్టుకొనుచుండును. 'ధనము ననుభవించుట నెరుగని కాశ్మీరగార్దభములు, అనుభవించునాబోట్లను భోగలాలసులనియు, విలాస పురుషులనియు నిందింతురు. దూషణ భూషణ తిరస్కారములు దేహమునకు గాని యాత్మకు గావు. నేను బహుసహస్రనారీ పరివేష్టితుడగు గోపాలకృష్ణుడను' అని యనుకొనుచు జగన్మోహనరావు విశాఖపట్టణములోని తన మేడనుండి దిగి, వీథిలో వేచియున్న కారులోనికి నెక్కెను. వారు వేగముతో నా శకటము సముద్రతీరమున 'డాల్ఫిను ముక్కు' వైపున నున్న మాక్లిన్ జేమ్సు అను నొక యూరేషియను గృహస్థునింటికాడ ఆగెను. జగన్మోహనరావు పాలిపోయిన తెలుపునగలియు పసిమివర్ణమువాడు. సున్నితమగు పలుచని మేనివాడు. కోలనగు మోము, కొంచెము బుర్రముక్కు, ఫ్రెంచి మీసములు, పెద్దనోరు, చిన్న చెవులు, సూదివలెనున్న గడ్డము, ఉంగరములు చుట్టియున్న తుమ్మెద రెక్కలవంటి జుట్టు, విపరీతముగా నెత్తెన ఫాలము నా యువకునకు వింత సొగసు సమకూర్చినవి. అతనికాడ జమీందారీ ఠీవి యున్నది. జమీందారీ హృదయమున్నది. ఇంగ్లండు దేశములోనున్న ప్రభువుల వలె దానుండవలయునని యతనికోర్కె. డైమర్లు కారు, పియానో వాద్యము, గిండీ పోటీ పందెములకు నొక యరబ్బీ గుఱ్ఱము, నెలకు డెబ్బది రూపికలకొక యాంతరంగిక మంత్రి, వేసవి కాలములో ఊటీ ప్రయాణము, గోల్ఫ్ ఆట, ఇంగ్లీషు నాట్యము, పాశ్చాత్య వేషము..... ఇది వారి రాచ ఠీవి.
విశాఖపట్టణములో ఆగష్టు నెలలో ఆనాటి సాయంవేళ తన డైమ్లరు కారు నుండి మాక్లిన్ జేమ్సుగారి ఇంటిలోనికి బోవగనె, యతని సహోదరి డయానా జేమ్సు జగన్మోహను నెదుర్కొని తన రెండు చేతులతని కందియ జగన్మోహనుడా యువతిని బిగియార కౌగిలించి తనివోవ ముద్దుగొనెను.
'మోహన్! కొంచెం ఆలస్యం అయిందే! నువ్వు సరిగా వేళకు వచ్చేవాడవు, ప్రాణప్రియా?'
'ఒక చిన్న వ్యాపారం వల్ల ఆలస్యం అయింది. ప్రియతమమైన డయన్! క్షమించు. ఎప్పుడు నీ పెదవుల ద్రాక్షసుధారసము త్రాగుదామా అని ఉవ్విళ్ళూరుతూ నిముషానికొక యుగంగా లెక్కచూసుకుంటూ చెన్నపట్టణం నుంచి వచ్చాను. రెక్కలు కట్టుకొని నీ దగ్గర వాలా!'
'నీ గుఱ్ఱం బొబ్బిలి పందెములో మూడవదిగా వచ్చినందుకు చాలా సంతోషం అయింది. నీకప్పుడే తంతినిచ్చా! ముందు సంవత్సరం 'గవర్నరు' పందెములో మొదటిదిగా వస్తుంది.'
'ఆ! ఈ యేడు గవర్నరు పందెంలో మొదటిదిగా వచ్చిన 'హ్యాపీ వారియర్' గుఱ్ఱాన్ని స్వారీచేసిన బ్రౌను కిప్పుడే కాంట్రాక్టు ఇచ్చాను. ప్రసిద్ధికెక్కిన రెయినాల్డ్సుకు గుఱ్ఱాన్ని తయారుచేయుటకు అప్పజెప్పివచ్చాను షికారు. రా! డయిన్.'
మరల నామె నతడు గ్రుచ్చి కౌగిలించుకొని, గబగబ పెదవి, కన్నులు, మెడ, చెవులు ముద్దిడుకొనెను.
వారిరువురు కారులోనికి బోయి కూర్చుండబోవుచుండ జేమ్సు తల్లి లోపలినుండి వచ్చి త్వరితముగ దిరిగి రండని చెప్పి పంపినది. జేమ్సింకను వివాహము చేసికొనలేదు. తల్లిదే ఇంటి పెత్తనము. ఆమెయే డయానా జగన్మోహనులకు సంబంధము కలిపి యద్దాని నానాటికీ వృద్ధి చేసినది. జగన్మోహనుడు డయానాకు నెలకు రెండువందలు జీతమిచ్చును. అప్పుడప్పుడతడిచ్చు బహుమతులు మొత్తము సాలుకు మూడు నాలుగువేల రూపాయల ఖరీదుండును. డయానాకన్య సుందరి. ఆమె దేహకాంతి దంతమువలె స్నిగ్ధమైన తెలిపసిమి కలది. ఆమె పెదవులు రంగులేకయే ప్రవాళములవలె నెఱ్ఱనై తేనె లూరుచుండును. పొట్టియైనను, మంచి యవయవస్పుటత కలిగి 'చక్కని జంతువు' అని యూరేషియను యువకులచే బొగడ్తలందినదామె. ఈతలో, టెన్నిస్ బంతి ఆటలో, నాట్యములో నామెదే ముందంజ. పియానో అద్భుతముగ వాయించగలదు. ఆమె గొంతు---మగు 'సోప్రానో' స్వరము కలదియట. వాల్టేరులో జరుగు క్రిస్మస్ వేడుకలలో నామెయే నాయకురాలి వేషము వేయును. సంగీత ప్రదర్శనములో నామెదే ముందంజ. వాల్టేరు విశాఖపట్టణముల పాశ్చాత్యులలో యూరేషియనులలో నవనాగరికులలో నామె నాసించని పురుషుడొక్కడును లేడు. అట్టి తరుణమున నామె శ్రీమంతుడగు జగన్మోహనుని వరించినది.
వారి కారు సింహాచలము రాచబాటపై నలమండ మొదలగు గ్రామములు దాటి భీముని పట్టణము వెళ్ళినది. వారు బండి దిగి సముద్రతీరమున నడుచుచూ ఏకాంత ప్రదేశమునకు జని యా సైకతముపై నధివసించిరి. వారపరిమిత మోహావేశులై యా చీకటిలో తారకా కాంతులలో సముద్రము గంభీర సంగీతము పాడుకొనుచుండునప్పుడు సర్వము మరచిపోయిరి.
కొంతసేపటికి వారు నర్మసంభాషణము లాడుకొనుచు మందహాసముతో మరల బండినెక్కి యెనిమిది గంటలకు విశాఖపట్టణము వచ్చిచేరుచు, వాల్టేరులో రొజారియో యను గార్డు గృహము కాడ నాగి గార్డు దంపతులను వారి బాలికను కనుగొనివచ్చిరి. ఆ రోజున జేమ్సు ఇంటికడ జగన్మోహనునకు విందు. జగన్మోహనునకు గొడ్డు మాంసముతప్ప తక్కిన మాంసాహారము భక్షించు నలవాటు లేదు. మాక్లీను దన హృదయము చూరగొన్న రొజరియో కూతురు, ఆమె తల్లిదండ్రులను వాల్టేరు నుండి విందుకు బిలిచినాడు. వారికి మాక్లీను నతని తల్లియు నుచిత వేషములతో నెదురుచూచుచుండిరి.
జేమ్సు మాక్లీను ఇంటి ముందరి వసారాలో గోడలకు నీటిరంగు చిత్రములు, పెద్దపులి తలలు, బల్లెములు, బాణములు తగిలించియున్నవి. పరుపు, కుర్చీలు, బల్లలు, బల్లలపై చైనా దేశపు ఇత్తడి కూజాలు, కూజాలలో పుష్పములున్న కొమ్మలు అలంకరింపబడి యున్నవి. గుమ్మములకు డమాస్కసు తెరలు వేలాడదీయబడియున్నవి. దూరముగా నా వసారాలో బల్లలపై దీపము లిరుప్రక్కల వెలుగుచున్నవి. మనవారందరూ కుర్చీలపై నధివసించిరి. ఆ రోజు మెయిలులో జరిగిన యొక వింతను గూర్చి మిస్టర్ రొజారియో చిరునవ్వుతో డయానా వైపు తిరిగి చెప్పుచుండెను. డయానా తల్లియు, మిసెస్ రొజారియోయు దక్కినవారికి వినబడకుండ నేదియో చెప్పుకొనుచుండిరి. జేమ్సు తన బాలిక ఫ్రాన్సిస్ ను దీసికొని తోటలోనికి నాలుగడుగులు పచారు చేయుటకు వెళ్లి యా నడకలో నామె చెవిలో 'నా హృదయం నీకర్పించాను. ఏమి చేసినా నీదే 'భార'మని యస్పష్టముగ గాఢవాంఛాగద్గదికమైన స్వరమున జెప్పచుండెను. జగన్మోహనుడు డయానా యందము కన్నులార గ్రోలుచు తన్మయుడగుచుండెను.
