నారాయణరావు గంభీరహృదయుడు. పరమేశ్వరుడు దర్పణ ప్రతిమాన హృదయుడు. ఒక రహస్యము దాచలేడు. ఒక భావము గుప్తపరచుకొనలేడు. అయినను అతని జ్ఞానము సర్వతోముఖము. అతని జన్మలగ్నమున బుధుడున్నాడు.
పరమేశ్వరుడు లతవలె నెల్లకాలము నెవరో యొక ధీశాలియగు స్నేహితుని జుట్టియుండును. స్నేహితులేని నడతడు ప్రపంచమున నొంటియై యుంటినని భావించును. కాని పెక్కుఘంటిక లతడొక్కరుడు ధ్యాన స్థిమితుడై యుండగలడు. ధీరత్వమునగూడ పరమేశ్వరుడు తక్కువవాడు కాడు. కారాగృహవాసమన్న వెనుకంజ నిడలేదు. ఒక్కడు గోదావరిలో బాతువలె నీదుకొనుచు మైళ్ళకొలది పోగలడు.
పరమేశ్వరుని హృదయము వెన్న వంటిది. స్త్రీలలో స్త్రీవలె మెలగగలడు. ఆడువారికున్న నాజూకులన్నిటిలోను నతడు నిధి. అన్నిరకముల పాటలు పాడగలడు. అభినయము చేయగలడు. ఆడవేషము వేసినచో సుందర స్త్రీమూర్తియై వనితలనే భ్రమింపజేయగలడు.
అతని మనస్సు మైనము వంటిది. ప్రాపంచిక సాధక బాధకము లతని మనస్సు నెక్కువ కలత బెట్టినను, అవి తాత్కాలికములై, క్షణభంగురములై మఱుని మేషమున నంతరించిపోవును. అతని మనసు యథాసంతోషస్థితి నందును.
నారాయణరావు తన హృదయమునకు నచ్చినవారితోడ స్నేహమొనరించును; పరమేశ్వరు డందరకు స్నేహితుడే. కాని పరమేశ్వరుడు కొలది మందికే తన సంపూర్ణహృదయము ధారపోయును. ఇరువురును గాఢముగ ప్రేమింపగలరు. నారాయణరావు ప్రేమ యతని బ్రతుకును మూలమంట గదల్చి యాజన్మాంతము దివ్యజ్యోతివలె వెలుగుచుండవలసినదే. పరమేశ్వరుడు స్నేహితుడొకసారి తన్ను మరచినచో తానును మరచిపోగలడు.
నారాయణరావు స్నేహము తనకు లభించినందులకు బరమేశ్వరుడు సంతతము భగవంతునికి కృతజ్ఞత తెల్పుచుండును; ఆనందము నొందును. కన్నులారమోసి తన్మయుడగును. నారాయణుడు నిజమా కాదా యన్న ప్రేమచే నతని యొడలంటును, అతని యొడిలో దలనుంచి యంతర్దృష్టి వహించును. 'మీకు నారాయణరావు అన్నగారు భర్తగారా, భార్యగారా?' యని రుక్మిణి పతిని మేలమాడును.
కవిత్వము
పరమేశ్వరునకు భారతి పత్రికలో నేబది రూపాయల జీతమును గరుణార్దృహృదయుడగు నాగేశ్వరరాయడేర్పరచెను. తన భార్యను దీసికొని వచ్చి, పరమేశ్వరమూర్తి మాంబళంలో గాపురము పెట్టెను. మంచి నెయ్యి రాజమహేంద్రవరము నుండి వచ్చినదని, తనతండ్రిగారు కొత్తపేట నుండి కమ్మని పప్పు,నూనెయు, గొబ్బరినూనెయు బంపించినారని, నారాయణరావు పరమేశ్వరున కెన్నియో వస్తువులందించుచుండును. రుక్మిణమ్మకు పట్టణము చూపించమని, సినిమాకని నారాయణరావు తన మోటారును పరమేశ్వరునికి నతని సెలవు దినములలో బంపుచుండును. పరమేశ్వరుని మంచి గృహము నద్దెకు తీసుకొనుమని బ్రేరేపించి నారాయణుడా గృహమున వారికి వలయు మంచములు పీఠములు వంట సామానులు మొదలగునవి కొనిచ్చినాడు.
రాజారావు తనకున్న కొద్ది తీరుబడి కాలములో నారాయణరావు తోడనో, పరమేశ్వరునింటనో, పరమేశ్వరునితో నారాయణరావింటిలోనో, స్నేహితులతో నానందము ననుభవించువాడు. ఏ స్నేహితుడు కావలయునన్నను నారాయణరావు తన మోటారులో పోయి యతని గొనివచ్చువాడు. ఆలం నారాయణరావును కలిసికొనని దినమే లేదు. రాజారావు, ఆలం, పరమేశ్వరమూర్తి, నారాయణరావులు ఒకరికొకరు గాఢమిత్రులైనారు.
పరమేశ్వరుడు ఆనాటి యువ కవులు రచించిన పాటలు, పద్యములు కలకంఠముతో మధురముగ బాడుచుండెను. అతడెన్ని సభలలోనో పాటలు పాడువాడు. తాను పాటలను పద్యములను రచించును. చిన్న కథలను వ్రాయుచుండును. తన రచనముల 'భారతి'లో బ్రకటించుచుండును.
ఒకనాడు పాట నొకదాని రచించి పరమేశ్వరుడు నారాయణరావు కడకు గొనివచ్చెను.
'ఓహో తాతా నీ దేవూరు?
నీ వేడపోతవోయ్?
ఊరులేదు వాడలేదు
దేశమంతా నీదే వూరు
ఊరిబైట చెరువుకాడ
చేరుతోనే పాదుకొంటవ్.
తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?
గిత్త పైన ఇల్లుచుట్తావ్
ఇంటి సామానంతా కట్తావ్
బిడ్డా పాపలు కూడా నడుస్తే
యిడ్డూరాలే రాజ్యాలన్నీ.
తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?
బిచ్చమేసేతల్లి ఉంటే
విచ్చిపోయిన పూవే బతుకు
యేసాలేసి బైరాగవుతవు
సేతులు సూసి సుద్దులు సెపుతావు.
తాతా నీ దేవూరు
నీ వేడపోతవోయ్?
