"అంటే వేదకాలంలోనూ, ప్రళయానికి ముందు వుండిన ఆకాశయానం, అణువిచ్చిత్తి, అలాంటివన్నీ ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా నేర్చుకుంటున్నామంటావా?"
"ఎగ్జాక్ట్ లీ! పోతే ప్రళయం తరువాత మిగిలిన నాగరికత నశించడం కేవలం వ్యక్తులు మరణించడం వల్లనే కాదు. మత మౌఢ్యం, అజ్ఞానం ఇవికూడా కారణాలు అయి వుండవచ్చును."
"అదెలాగా?"
"ఉదాహరణకి చెప్పుకోవాలంటే ప్రాచీన అలెగ్జాండ్రియాలో ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప గ్రంథాలయం ఒకటి వుండేది. అందులో అపురూపమైన ప్రాచీన గ్రంథాలు అనేకం ఉండేవి. అలెగ్జాండ్రియా మీద దండయాత్రలు జరిగాయి. ఆ లైబ్రరీని ఆరునెలలపాటు ధ్వంసం చేసేశారు. అందులోంచి అపురూపమైన పుస్తకాలను ఎత్తుకెళ్ళిపోయి బాయిలర్ లలో వేసి వేడినీళ్ళు కాచుకోవడానికి ఉపయోగించారు."
"ఎంత ఘోరం!" అన్నాడు అంకుష్.
కొంచెంసేపు ఆగి అన్నాడు సాహస్.
"వేదకాలంలో టెక్నాలజీ వుండడం ఎలా సంభవం అయిందీ అన్నదానికి ఇదొక వివరణ! పోతే దీనికి ఇంకో యాంగిల్ కూడా వుంది"
"ఏమిటదీ?"
"ఒకవేళ వేదకాలంలో వుండిన విజ్ఞానం గత ప్రళయానికి ముందు వుండిన నాగరికత తాలూకుది కాదనుకుంటే ఆ విజ్ఞానం వేదకాల ప్రజలకు హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఎలా అబ్బిందీ?"
"అవును! ఎలా అబ్బిందీ?" అన్నాడు అంకుష్.
"ఎలా వచ్చిందీ అంటే నిజంగా ఆకాశం నుంచి ఊడిపడడం వల్లే" అన్నాడు సాహస్ డ్రమెటిక్ గా.
"అంటే?" అన్నాడు అంకుష్.
"అంటే గ్రహాంతర వాసులయిన బుద్ధిజీవులు ఎవరో వచ్చి వాళ్ళ హైటెక్నాలజీ తాలూకు రహస్యాలు మన వేదకాలపు ప్రజలకు చెప్పి వుండాలి".
"దిసీజ్ ఫాంటాస్టిక్ నాన్సెన్స్" అన్నాడు అంకుష్.
"అలా కొట్టి పారేయడానికి వీల్లేదు! ఉదాహరణకు వేదాలే తీసుకో. మన నమ్మకం ప్రకారం వేదాలని ఎవరూ రాయలేదు. దేవుడు చెబితే వినబడినవి వేదాలు. దేవుళ్ళు, దేవతలూ అంటే వాళ్ళెవరో కాదు - అంతరిక్ష యాత్రికులయిన గ్రహాంతర వాసులనడానికి చాలా ఆధారాలు కనబడుతున్నాయి."
"ఏమిటా ఆధారాలు?" అని అంకుష్ ఆశ్చర్యంగా అడిగే లోపలే -పడమటి దిక్కున సూర్యోదయం అవుతున్నట్టు ఆకాశం లేత నారింజ రంగులోకి మారింది.
అదే క్షణంలో -
పైనుంచి ఇంకో బండ కదిలి వాళ్ళవైపు రావడం మొదలుపెట్టింది.
దాని వెనుక మరో బండ...
మరో బండ...
రెండో వైపు చూస్తే...
తూరుపు అప్పుడు తెలతెలవారుతోంది.
తూర్పూ, పడమర రెండు వైపులా వెలుగు...
"సాహస్! ఇది ఇంకో ప్రళయానికి ప్రారంభం కాదు కదా?" అన్నాడు అంకుష్.
"మేబీ! ఆర్ మే నాట్ బీ" అన్నాడు సాహస్.
అయితే ఇంక మనం దైవప్రార్థన మొదలుపెట్టడం మంచిది" అన్నాడు అంకుష్.
"ఏమని?"
"ప్రళయం రాకుండా వుండాలని"
చిన్నగా నవ్వాడు సాహస్.
"అంకుష్! ఒకటి గుర్తుంచుకో. దైవప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫలానిది జరగాలి - ఫలానిది జరగకూడదు అని ప్రార్థించకూడదు. ఫలానిది కావాలి. ఫలానిది వద్దు అని కూడా ప్రార్థించకు. ఎప్పుడేమి జరగాలో ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ప్రార్థన చేసి లేచాక నువ్వు ఇంకాస్త మంచి మనిషిగా మారితే దేవుడు నీ ప్రార్థన ఆలకించినట్లే! అది చాలు" అన్నాడు.
సరిగ్గా అదే టైంలో
రాజధానిలో -
చాలాసేపటి నుంచి నిద్ర పట్టక పక్కమీద అశాంతిగా అటూ ఇటూ దొర్లుతోంది ప్రగతి.
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి తనకు ఊపిరి సలపని పని!
ఇవాళే కాస్త నడుం వాల్చడానికి తనకు వీలు చిక్కింది.
కానీ -
పడుకున్నప్పటి నుంచీ ఏవేవో ఆలోచనలు!
ఒక్క ఆలోచనకీ నిర్ధిష్ట రూపం లేదు.
సరిగ్గా ట్యూన్ కాని టీవీలో దృశ్యాలలాగా గజిబిజిగా దృశ్యాలు!
