సత్యం చిద్విలాసంగా నవ్వుకుంటూ ఆల్బమ్ తెరిచాడు.
ఆశ్చర్యం!
అక్కడ కృష్ణమూర్తి పద్మలు కలిసి దిగిన ఫోటో కనిపించింది.
సత్యం మొదట కలవరపడ్డాడు. ఆనక ఆనందించాడు.
"ఇది-" అంటూ ఆమెను ఏదో అడగబోయేడు.
"నాకు పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలి!" అన్నదామె.
"అది సరేనమ్మా! ఇతను మనింట్లో..."
"ప్రైవేటు మేష్టారు, అతన్నే నేను మనసారా ప్రేమించాను!"
"చూస్తూ చూస్తూ ఒక ప్రైవేటు మాస్టర్ని పెళ్లాడుతానంటే మీనాన్న ఊరుకొంటాడా?"
"అందుకే మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. మీ మాట మా నాన్నకి వేదవాక్కు. మీరేం చెబితే దానికి తల ఊపుతారు. దయచేసి మీరే మా పెళ్ళి చెయ్యాలి. కాదనకండి ప్లీజ్!"
సత్యం ఆల్బమ్ చూస్తూ అన్నాడు.
"నేనేం చేస్తానో, చేయగలనో ఇప్పుడు అనవసరం. ఇతన్ని పెళ్లాడి నువ్వేం సుఖపడగలవ్?"
"సుఖమంటే మీకు తెలిసిన అర్ధమేమిటో చెప్పగలరా?"
"ఏముందీ సింపుల్! సుఖమంటే సుఖమే! కారూ, మేడా, ఇంట్లో నౌకర్లు, కుక్కలూ, క్లబ్బులూ, షికార్లూ... నెలకోసారి విదేశీయానం-
"అయ్ పిటీ యూ సర్!" అన్నదామె సీరియస్ గా.
ఆ మాటకి సత్యం నిలువు గుడ్లువేశాడు.
పద్మ చెప్పింది --
"ఇంత తెలిసినవారు సుఖమంటే మీరు చెప్పే అర్ధం ఇదా? సుఖమనేది మేడల్లో, విదేశీయానాల్లో లేదండీ! సుఖమనేది గుండెల్లో గూడు కట్టుకొని ఉంటుంది. గుండెల్లో లేని సుఖం మీరు చెప్పే సిరిసంపదల్లో ఉండదు. కృష్ణమూర్తి నాకు నచ్చాడు. నచ్చిన వాడితో పూరిగుడిసెలో వున్నా సుఖమే. గంజినీళ్ళు తాగినా సుఖమే!"
ఆమె చెప్పిందంతా విని సత్యం ఆమెను సూటిగా ప్రశ్నించాడు.
"అసలింతకీ ఈ కృష్ణమూర్తి ఎవరో, ఏమిటో నీకు తెలుసా?"
"తెలీదు తెలుసుకోవలసిన అవసరంకూడా నాకులేదు. మీకో రహస్యం చెప్పాలనుకుంటున్నాను."
సత్యం కుతూహలంగా అడిగాడు-
"చెప్పు!"
"కృష్ణమూర్తి నాకోసమే ఈ ప్రైవేటు మేస్టారు అవతారం ఎత్తాడు. ఈ ఇంట్లో జీతం బత్తెంలేని మనిషిగా బతుకుతున్నాడు."
"రామ రామ! ఎంత దీనస్థితికి పడిపోయాడు."
"ఆ మాటంటే ఒప్పుకోడు. తన కష్టంతో మా నాన్నని మెప్పించి నన్ను పెళ్ళి చేసుకుంటాట్ట!"
"మరి దానికి పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దూ?"
"ఏం పెద్దవాళ్ళో? అతనికో తండ్రి ఉన్నాడు. ఉత్తవెర్రి మాలోకం!"
"అతని తండ్రిని నువ్వు చూశావా!"
"చూళ్ళేదు."
"చూడకుండానే వెర్రిమాలోకమని ఎట్లా అంటున్నావ్?"
"వేరే చూడాలేమిటి? మా పెళ్ళికి ఆ వెర్రి మహాశయుడు కొన్ని తిక్క షరతులు పెట్టాట్ట!"
"ఏం షరతులు?"
"తిక్క షరతులు! ఆ షరతులు వింటే వళ్ళుమండి మీరే అంటారు. పరమ తిక్క మనిషని, గొప్ప వెర్రిమేళమని! ఆ వెర్రి తండ్రిగారి తిక్క షరతులతో కృష్ణమూర్తి మా ఇంట్లో నౌకరులాగా బతుకుతున్నాడు. నా తండ్రి లౌక్యంలో నాకు సుఖం లేనట్టే-ఆ తండ్రిగారి వెర్రి చేష్టలతో కృష్ణమూర్తి కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఇల్లాంటి పరిస్థితుల్లో మీరే మమ్మల్ని ఆదుకోవాలి. మా ఇంటికి దేవుడిలాగా వచ్చారు. మా నాన్నని శాసించే హక్కు అధికారాలూ మీకే ఉన్నాయి. మీ చేతులమీద మా పెళ్ళి జరిపించండి. మీ మేలు జన్మజన్మలకీ మరిచిపోలేం" అన్నది పద్మ.
సత్యం అవునూ కాదని చెప్పలేదు. తలాడించాడు.
తనని వెర్రివెధవనీ తిక్కసన్నాసనీ తిట్టినందుకు బాధపడాలో-తన ప్రయోజకత్వాన్ని మెచ్చుకొంటూ తమ పెళ్ళి చేసి పెట్టమని ప్రాధేయ పడుతున్నందుకు సంతోషించాలో అతనికి అర్ధంకాలేదు.
అందుకే సింపుల్ గా తలాడించి ఊరుకొన్నాడు.
తాను చెప్పవలసిందంతా చెప్పానన్న తృప్తితో పద్మ అక్కడినుంచి కదిలింది.
24
చిలకలపూడి పాండురంగని ఉత్సవాలు జరుగుతున్నాయి.
ప్రతి ఏడాదీ బందర్లో ఆ ఉత్సవాలు కన్నుల పండుగ్గానే జరుగుతాయి. ఆ రోజుల్లో పాండురంగని దర్శించడానికి చుట్టుపక్కల ఊళ్లనుంచే గాకుండా- పొరుగు రాష్ట్రాలనుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తుంటారు.
మంగినిపూడిలో సముద్రస్నానం చేసి చిలకలపూడిలో పాండురంగ విఠల్ దర్శనం చేసుకోడం ఒక ఆచారం.
ఉత్సవమనగానే అక్కడ కోలాహలం గురించి చెప్పనక్కరలేదు. ఆ ఉత్సవాలకు ఇంట్లో చెప్పకుండా సుమతి కోదండంతో కలిసివచ్చింది.
ఇద్దరూ ఆ విఠల్ స్వామిని భక్తిగానే కొలిచారు. ఇద్దరూ కూడబలుక్కొని కోరకపోయినా విడివిడిగానే మొక్కుకున్నారు.
ఏవని... "స్వామీ! మా ఇద్దరికీ పెళ్ళి చేసి పెట్టు...!"
అంతవరకూ బాగానే వుంది.
ఆ పైన కోదండరాం సుమతిని రంగులరాట్నం ఎక్కించాడు. ఆ పిల్ల నొక్కదాన్నే ఎక్కించి తాను నేలమీద ఉండిపోతే బావుండిపోను. తాను కూడా సుమతి పక్కనే కూచున్నాడు.
అంటే-ఆ కొంచెం చోటులో ఆ ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయి కూచున్నారనే చెప్పాలి.
రంగులరాట్నం తిరుగుతోంది. సుమతీ కోదండరాంలు పసిపిల్లల్లాగా కేరింతలు కొడుతున్నారు.
సరిగ్గా ఆ సమయానికే దిగింది ఆర్టీసీ పటాలం. వాళ్ళంతా ఒక స్పెషల్ బస్సులో వచ్చారక్కడికి. వాళ్ళల్లో సుబ్బారావు కూడా ఉన్నాడు.
అదీ ఇదీ చూసుకుంటూ ఆర్టీసీ బృందం రంగులరాట్నం చేరుకుంది.
అప్పుడు చూశాడు సుబ్బారావు-తన చెల్లెలి వైభవం!
ఆ పిల్ల తన తలని కోదండరాం భుజంమీద వాల్చి అతని కళ్ళల్లోకి చూస్తూ ఏమిటేమిటో చెబుతోంది.
ఆ దృశ్యం చూడగానే సుబ్బారావుకి రంగులరాట్నం ఎక్కకుండానే తల తిరిగినంత పనయింది.
అతని తల తిరుగుతుండగానే అతని కొలీగ్ ఒకడు అతనితో కొంచెం వ్యంగ్య ధోరణితో అన్నాడు.
"గురూగారూ-ఆ పిల్ల మన సిస్టరే కదూ! మరి ఆ పక్కనున్న అబ్బాయో?"
"లక్ష్మీపతి గారబ్బాయి!" అన్నాడు సుబ్బారావు వళ్ళు మండిపోగా.
ఆ తర్వాత చుట్టుపక్కల పరిస్థితులను మరిచిపోయి సుమతీ అని గాండ్రించాడు సుబ్బారావు.
