Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 40


    ఆ ఊబిని సిద్ధం చేసిన సామంత్ మాత్రం ఇప్పుడు ఫుల్ సూట్ లో అరిస్టోక్రాటిక్ సొసైటీకి చెందిన యువకుడిలా తయారయి దర్గాలో కారెక్కాడు.

 

    ఆ వెంటనే అది నాగమ్మ ఎస్టేట్ కి దూసుకుపోయింది.


                                *    *    *    *


    "ఐదు పైసలు ఆస్థి కూడా లేని అతన్ని పాపకు భర్తగా ఎన్నుకోవడం నాకెందుకో నచ్చలేదు." అర్జునరావు సూటిగా నాగమ్మకేసి చూడకుండా ఎటో చూస్తూ అన్నాడు.

 

    తన సలహాలంతగా నాగామ్మకు నచ్చవనే అర్జునరావు ఆ మాటలన్నాడు.

 

    "ఒక మనిషికి ఆస్థిపాస్తుల కన్నా నైతిక విలువలు ముఖ్యమని నా అభిప్రాయం. రోజుకో వంద మాటలంటే అందులో తొంభై ఎనిమిది అసత్యాలు చెప్పేవాడికి, ప్రతిక్షణం ఆడిన మాట తప్పేవాడికి, తిన్నచేతనే కరిచేవాడికి, ప్రేమాభిమానాలకు, ఆప్యాయతానుబంధాలకు విలువ తెలీని వాడికీ, అవతల మనిషి నష్టపోతున్నా, బాధపడుతున్నా, నోటి ముందు కూడు పోగొట్టుకుంటున్నా చూసి ఆనందించేవాడికి, కోట్లకు కోట్లు ఆస్తులున్నా ఎం ప్రయోజనం? బ్యాంక్ పాస్ బుక్ లో బ్యాలన్స్ లేకపోయినా ఒక మనిషి బ్రతగ్గలడు. పరువు ప్రతిష్టలు, మంచితనం జమచేసే పాస్ బుక్ లో బ్యాలన్స్ నిల్ అయితే ఒక్క క్షణం ఈ ప్రపంచంలో మనిషి బ్రతకలేడు. బ్రతికినా అది బ్రతుకు కాదు నా దృష్టిలో" నాగమ్మ ఆవేశంగా అంది.

 

    అదే కావాలి అర్జునరావుకి.

 

    "అతనికి చెడు అలవాట్లున్నాయేమో? ఐమీన్ సిగరెట్, మందు వగైరా..." సామంత్ ని మరింత ఖాయం చేసేందుకు నాగమ్మను రెచ్చగొడుతున్నాడు అర్జునరావు.

 

    "ఒక మనిషికి నువ్వన్న అలవాట్లే వున్నా, అవి అతని ఆరోగ్యానికే హాని కలిగిస్తాయి. కాని మనిషిగా దిగజారిపోయి, మానవత్వాన్ని మరచిపోయి మానసిక వైరస్ ల్ని అంటించుకున్న దౌర్భాగ్యుడి మూలంగా ఇతరుల జీవితాలు నాశనమై పోతాయి చెడు అలవాట్లు అంటే ఇవే నా దృష్టిలో. సిగరెట్లు, మందు చెడు అలవాట్లు కాదు. బలహీనతలు, ఈ బలహీనతలు లేనివాడు తనను తాను మంచి వాడనుకుంటే చూసి జాలి పడాలనిపిస్తుంది. ఈ బలహీనతలున్నా సమర్ధుడైన వ్యక్తిని చూసి అభినందించాలనిపిస్తుంది. శ్రీశ్రీ తాగేవాడు - బాపు పైపు పీలుస్తాడు - సత్యజిత్ రే నసీం పీలుస్తాడట అప్పుడప్పుడు. రాజ్ కపూర్ రేసులాడేవాడట. ఒకప్పుడు దిలీప్ కుమార్ రమ్మీ ఆడేవాడట- మరి వీళ్ళు గొప్పవాళ్ళు కాకుండా పోయారా? ఏ గాడిదైనా వీళ్ళను ఎద్దేవా చేయగలరా?

 

    చార్లెస్ శోభరాజ్ సిగరెట్లు తాగడట- కుమార్ నారాయణ్ మందు తాగడట- అంత మాత్రాన మంచి వాళ్ళయిపోయారా? ఏ గొప్ప పనినైనా సాధించగలిగారా? లేదు"

 

    జీవితంపై నాగమ్మకున్న నిర్దుష్టమైన అభిప్రాయాల్ని అప్పుడప్పుడు వింటూ అచ్చెరు వందుతుంటాడు అర్జునరావు.

 

    కాని ఇప్పుడు మాత్రం పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.

 

    "మీ ఎస్టేట్ ని- ఆస్థిపాస్థుల్ని, వంశపారంపర్య పరువు ప్రతిష్టల్ని దెబ్బతీస్తాడేమో..."

 

    నాగమ్మ అర్జునరావు మాటలు విని నవ్వింది. ఆ నవ్వులో పూర్వపు జీవం లేదు.

 

    "పిచ్చివాడా... ఒక మంచి పని చేయడానికి, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక మనిషికి ఎంత శక్తి సామర్ధ్యాలు కావాలో, ఎన్ని తెలివితేటలు కావాలో, చెడు పనులు చేయడానికి, తాను పనిచేసే సంస్థకిగాని, తానుండే ఇంటికి గాని చెడు తేవాలంటే అంతకంటే ఎక్కువ తెలివితేటలు కావాలి. వాటినే చావు తెలివితేటలనేది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో నిరంతర శోధనలో మునిగి వుండే సామంత్ కి తెలివితేటలుండవచ్చేమో కాని, చావు తెలివితేటలు మాత్రం వుండవని నా ఆశాభావం. ఒకవేళ వున్నా నా మంచితనం, నా మనుమరాలి మంచితనం ముందు, మానవత్వం ముందు తలవంచక తప్పదు.

 

    మనిషే అయితే మారక తప్పదు అది మా అదృష్టం. రాక్షసుడే అయితే ఎప్పటికీ మారకపోవచ్చు. అది మా దురదృష్టం. నాకు తెలిసి అందరికీ మేలే చేశాను. అన్నివేళలా మంచి పనులే చేశాను. కనుక మా కుటుంబానికంత అన్యాయం జరుగుతుందని అనుకోను. ఇప్పుడిక ఈ మీమాంస వద్దు. పెళ్ళిచూపులు అరేంజ్ చేయడం మంచిది" అంది నాగమ్మ సోఫాలోంచి లేస్తూ.


                                *    *    *    *


    "నువ్వు ఎక్కువ మాట్లాడతావు. లొడలొడా ఎప్పుడూ మాట్లాడుతూనే వుంటావు. అదిప్పుడు మంచిది కాదని పీటర్ సాబ్ చెప్పాడు. అదీ నిజమే- పొరబాటుగా ఒక్కమాట మాట్లాడినా మన పథకం తల్లక్రిందులయిపోతుంది. అందుకే నువ్వు తక్కువ మాట్లాడు. గంభీరంగా వుండు. పథకం సవ్యంగా పారేలా అర్జునరావు సాబ్ అన్ని ఏర్పాట్లూ చేశారు. అర్థమైందా...?" కనకారావు సీరియస్ గా అన్నాడు.

 

    అప్పటివరకు తన ఒంటిమీదున్న ఖరీదైన సూట్ నే పట్టి పట్టి చూసుకుంటున్న సామంత్ గిరుక్కున తలతిప్పి - "ఏమిటదీ...?" అన్నాడు.

 

    కనకారావు అంతకు ముందు చెప్పిన సూచనల్నే మరలా చెప్పాడు.

 

    సామంత్ ఈసారి కూడా విననట్లే చేతికున్న రాడో వాచీని మురిపెంగా చూసుకున్నాడు.

 

    "వినపడిందా?" కనకారావు విసురుగా అడిగాడు.

 

    లేదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు సామంత్.

 

    చిరాకు పడుతూనే తిరిగి మూడోసారి చెప్పాడు.

 

    "నన్ను లొడ లొడా మాట్లాడవద్దని నువ్వెందుకలా మాట్లాడతావు..." సీరియస్ గా ప్రశ్నించాడు సామంత్.

 

    కనకారావు బిత్తరపోయాడు.

 

    కారు ముందు సీట్లో వున్న సెక్రటరీ పెద్దగా నవ్వాడు.

 

    పుండు మీద కారం జల్లినట్లనిపించింది కనకారావుకి సెక్రటరీ నవ్వు.

 

    'ఎందుకయ్యా పెద్ద మనిషీ, అలా ఒక్కసారి నవ్వావు..." కోపంగా అడిగాడు కనకారావు.

 

    "ఆయనకి చెప్పి, నువ్వు చేసిందేమిటి...?" సెక్రటరీ రాబోతున్న నవ్వు బలవంతాన ఆపుకుంటూ అన్నాడు.

 

    "ఆగాగు... కొన్ని రోజులు పోతే గాని హింస ఎన్ని రకాలు అన్నది అర్థం కాదు. అప్పుడు ఈ సామంతేమిటో నీకు తెలిసిరాదు" అన్నాడు కనకారావు ఉక్రోషంగా.

 

    "ఏదో సరదాకి నవ్వాను. అంత కోపమెందుకయ్యా చిన్న మనిషీ...?" సెక్రటరీ చిన్నబుచ్చుకుంటూ అన్నాడు.

 

    "వీడు పచ్చగా వున్న మనుష్యుల్ని చూసి తట్టుకోలేడు. అసూయ ఒక మనిషి నెంత నాశనం చేస్తుందన్నది వీడ్ని చూసే తెలుసుకోవచ్చు..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS