ఒకింత నిశ్చలంగా వుండి మరలా ఫోన్ ని చేతిలోకి తీసుకుని అమలాపురం నెంబర్ కి కాల్ బుక్ చేసింది. క్షణాల్లో లైన్ దొరికింది.
అతను కొబ్బరి పీచు వ్యాపారం చేస్తుంటాడు. ఆ వ్యాపారం గురించి అతనితో మరో 20 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
ఆ తరువాత జ్యోతిచిత్ర టెలిఫోన్ పాకెట్ డైరెక్టరీ తీసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి రింగ్ చేసి చిరంజీవి కావాలని అడిగింది.
చిరంజీవి, అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళారని చెప్పడంతో ఆయన కూతురు హనీ కావాలని అడిగింది మధుమతి.
కొద్దిక్షణాల తర్వాత చిన్న పాప కంఠం ఫోన్ లో వినిపించింది "హలో..." అంటూ.
"నేను మీ నాన్నగారి అభిమానిని..." అంటూ పావుగంట మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
ఆ తరువాత వరుసగా సినీస్టార్స్ అందరికీ ఫోన్ చేయటం, పది నిమిషాలు మాట్లాడటం. ఫోన్ పెట్టేయడం - అలా ఓ గంటసేపు ఆ వ్యవహారం నడిచింది.
ఆ తరువాత బొంబాయి కోడ్ తెలుసుకుని రేఖ ఇంటికి ఫోన్ చేసింది.
నలభై దాటుతున్నా మీ శరీరాన్ని నవ యౌవనంతో ఎలా కాపాడుకోగలుగుతున్నారంటూ మొదలెట్టి పావుగంట మాట్లాడింది.
ఆ తరువాత మాధురీ దీక్షిత్ కి, సంగీత బిజిలానికి, మందాకినికి వరుసగా ఫోన్ చేసి మాట్లాడింది. దిలీప్ కుమార్ తో మాట్లాడుతుండగా మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది.
చటుక్కున పెట్టేసి టార్చ్ వెలుగులో ఎలక్ట్రిక్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి ఒక ఫీజ్ ని బయటకు తీసి దానిలోని రాగి తీగను కట్ చేసి తిరిగి దాన్ని యధాస్థానంలో వుంచి, వేగంగా వచ్చి సోఫాలో కూర్చుండి పోయింది.
నరసింహం లోపలకు వస్తూండగానే...
"ఫీజ్ పోయినట్టుంది. కరెంట్ లేదు. అరగంట నుంచి ఒక్కదాన్ని భయంతో చచ్చిపోతున్నాను" అంది.
ఆ వెంటనే ఆమె చేతిలోని టార్చ్ వెలిగింది. "ఎందుకు భయం? నేనున్నానుగా...?" అంటూ నరసింహం పెన్ టార్చ్ వెలుగులో మధుమతి దగ్గరకు వచ్చాడు. ఆమె చటుక్కున అతని ఎదపై వాలిపోయింది.
ఆ చర్యకు అతని శరీరం వేడెక్కిపోయింది.
అతని నరాలు జివ్వుమన్నాయి.
అతని చేహ్తులు ఆమెను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా "ముందు ఫీజు వేయండి" అంది మృదువుగా అతని నుంచి విడివడుతూ.
అతను నిస్పృహగా తల విదిలిస్తూ ఆమె చేతిలోని టార్చ్ తీసుకుని, స్విచ్ బోర్డ్ వేపుకి వెళ్ళి ఫీజు వేసి, ఆపైన లైట్స్ వేసాడు.
"ఇంట్లోకి మరలా వెళ్ళి లైట్స్ వేసినట్లున్నాడు"
ప్రక్కింటిలోని వ్యక్తి తన భార్యతో అన్నాడు.
"ఎంతొచ్చింది..." మధుమతి గోముగా అడిగింది.
"మర్చేపోయా... మొత్తం యాభైరెండువేలు వచ్చింది" అన్నాడు నరసింహం కేష్ ఉన్న బ్యాగ్ ను ఆమెకు అందిస్తూ.
"నాకిస్తారెందుకు...?"
"ఇది నీ డబ్బు"
"మన డబ్బు అనండి" మధుమతి ఒకింత నిష్ఠూరంగా అంది.
అతను నవ్వాడు - తన అదృష్టానికి తానే మురిసిపోయాడు.
"రేపు మా బంధువులొస్తున్నారు. ఎల్లుండి ఇద్దరం వెళ్ళి కొత్త ఫర్నిచర్ తెచ్చుకుందాం. అందాకా ఆ డబ్బు మీదగ్గరే వుంచండి" అంది అతన్ని బయటికెలా పంపించాలని యోచిస్తూ.
తన మీద మధుమతి అంత నమ్మకం వుంచడంతో అతను గర్వపడ్డాడు.
ఆపైన ఆమెకేసి కాంక్షగా చూస్తూ ఒక్కో అడుగే వేయసాగాడు.
అతన్నించి ఆ రాత్రికెలా తప్పించుకోవాలా అని మధుమతి మధనపడుతుండగా ఫోన్ రింగయింది.
మధుమతి చటుక్కున ఫోనందుకుంది.
ఫోన్ లో ఆవేపు నుంచి ఎవరో 'డి.ఐ.జి. గారున్నారా" అని అడగడం వినిపించింది.
"ఇప్పుడా? మరో పదినిముషాలా? చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారేం?..." విసుగును ప్రదర్శిస్తూ అంది మధుమతి.
ఫోన్ కి ఆవేపు నున్న వ్యక్తి మధుమతి మాటలకు బిత్తరపోయాడు.
"సరే... రండి... ఎం చేస్తాను? తప్పుద్దా ఆతిధ్యం ఇవ్వడం? ఎదురు చూస్తుంటాను..." అని ఫోన్ పెట్టేసి నరసింహం వేపు విచారంగా చూసింది.
"ఏముంది? ఎక్కడ నుంచి ఫోన్?" నరసింహం అనుమానంగా అడిగాడు.
"మా బంధువులు, ఔరంగాబాద్ నుంచి తగలడ్డారు" చిరాకు నటిస్తూ అంది.
"ఇప్పుడెలా?" నిరాశగా అన్నాడు నరసింహం.
"వాళ్ళు వస్తే ఓ పట్టాన వెళ్ళిచావరు. ఓ పని చేద్దాం. మీరు బయట తాళం వేసుకుని వెంటనే వెళ్ళిపోండి నేను హాయిగా నిద్రపోతాను. వాళ్లు వచ్చి ఇంటికి తాళం వేసుండడం చూసి, హర్ట్ అయి ఏదైనా హోటల్ కి వెళ్ళిపోతారు. ఆ కోపంతో మరలా రారు. ఎల్లుండి మీరు వచ్చేస్తే మనం షాపింగ్ కి వెళ్ళి... ఆ పైన... చెప్పలేను... సిగ్గేస్తోంది-" అంది మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటూ.
అతను ఆనందంగా తలూపి చటుక్కున ఆమె వేపుకు గెంతి ఆమె ఎదపై ముద్దెట్టుకుని వేగంగా బయటికెళ్ళిపోయాడు.
అతని చర్యకు ఆమె కోపగించుకోలేదు.
నవ్వుకుంది.
తన అందం, ఆ వెనుక దాగిన ఆకర్షణ ఏ మగాడ్నీ మంచి బాలుడిగా వుంచవని తనకు బాగా తెలుసు.
ఆపైన ఇంటిలోని లైట్స్ అన్నింటిని ఆర్పి వేసింది. చీకట్లోనే నించుని ఆలోచించ సాగింది. సామంత్ చెప్పిన పనులన్నింటిని తను సక్రమంగా నిర్వహించింది. ఏదైనా పొరపాటు జరిగిందా అని తనను తాను తరచి ప్రశ్నించుకుంది. ఒకింతసేపటికి అలాంటిదేమీ లేదని సమాధానపడింది.
ఆ తరువాత మరికొన్ని ట్రంకాల్స్, ఎస్.టి.డి.లు చేసుకొని ఆ ఇంటినుంచి బయటపడింది.
నరరూప రాక్షసుడిగా, కర్కోటకుడిగా, దుర్మార్గుడిగా, శాడిస్టుగా పేరుబడ్డ నరసింహం - తెలివి కలవాడిగా చట్టాన్ని, ఐ.పి.సి.ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోగల అవకాశవాదిగా పేరుపడ్డ నరసింహం, తన పోలీస్ స్టేషన్ జ్యూరిస్ డిక్షన్ లోని ప్రజల్ని గడగడలాడించగల నరసింహం మొట్టమొదటిసారి మెడలోతు ఊబిలోకి దిగిపోయాడు.
