Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 41


    "నన్నా...? నేను పచ్చగా వున్న మనుష్యుల్ని చూసి అసూయపడతానా?" కనకారావు కోపంగా అడిగాడు.

 

    "అవును..."

 

    "పచ్చగా ఎవరున్నారిప్పుడు..."

 

    "నేనే..."

 

    "నువ్వా...?"

 

    "అవును... కనబడడం లేదా? ఈ సూటు రంగేమిటి? ఇది పచ్చగా లేదా? ఆకుపచ్చగా లేదా...?"

 

    సామంత్ వేసుకున్న సూట్ నిజంగానే ఆకుపచ్చ రంగులో వుంది.

 

    సెక్రటరీ ఈసారి మరింత పెద్దగా నవ్వాడు. అతనితో జత కలిపాడు డ్రైవర్.

 

    కనకారావుకి ఏడుపొచ్చినంత పనయింది.

 

    "ఓరి నాయనో..." అన్నాడు కనకారావు తన సహజ ధోరణిలో.

 

    "పైకెళ్ళి స్వర్గాన్ని వున్న మీ నాయన్ని కూడా సుఖంగా వుండనివ్వవా? రోజుకు వందసార్లు ఓర్నాయనో అంటూ ఆయన్ని పిలుస్తావెందుకు? అయినా నాయన్ని ఓరినాయనో అని గౌరవం లేకుండా తలుచుకోవచ్చా..." సామంత్ మాటలకి సెక్రటరీ, డ్రైవర్ నవ్వలేక చచ్చిపోతున్నారు.

 

    కనకారావుకి ఏం మాట్లాడాలో... ఎలా మాట్లాడాలో తెలీక సామంత్ కేసి పిచ్చిచూపులు చూశాడు.

 

    "ఏమిటా చూపులు...? దెయ్యం కాని పట్టిందా...? బుద్ధిగా కూర్చుంటే ఈ పిచ్చిచూపులు, పిచ్చి మాటలూ వుండేవి కావుగా...? అన్నీ చిల్లర బుద్ధులు- చిల్లర చేష్టలు, ఎప్పటికి నేర్చుకుంటావయ్యా మంచి బుద్ధులు...? నాగరికత?" టైని సవరించుకుంటూ అన్నాడు సామంత్.

 

    "అసలితను ఎవరు...? ఏం చేస్తుంటాడు?" సెక్రటరీ సామంత్ ని ఉద్దేశించి ప్రశ్నించాడు.

 

    "గతంలో దొంగ వెధవలకి కత్తెర్లు అమ్మేవాడు. అందుకే అతని పేరుకు ముందు కత్తెర్ల అని తగిలించి టోటల్ గా కత్తెర్ల కనకారావు అని పిలుస్తుంటారు. నాలుగైదు కేసుల్లో పోలీసులకు దొరికిపోవడంతో కుళ్లబొడిచారు. దాంతో ఇలాంటి పనులు మొదలుపెట్టాడు..." సామంత్ నవ్వుతూ అన్నాడు.

 

    "నన్నేనా...? నిన్నో...?" కసిగా నవ్వుతూ అన్నాడు.

 

    "నన్ను పొడిచినవాడు అతి త్వరలోనే రోడ్డెక్కబోతున్నాడు. నీలా నేను పిరికి సన్నాసిని కాదు - చూస్తూ ఊరుకోవడానికి ..." సామంత్ మధుమతిని, స్టీఫెన్స్ స్ట్రీట్ లోని ఆరవనెంబర్ ఇంటిని గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు.

 

    "నువ్వు నిన్ను పొడిచిన వాడ్ని పొడుస్తావో... నీ మొరటు వ్యవహారం బయటపడి పోగానే నిన్ను నాగమ్మ గారు పొడుస్తారో తేలిపోవడానికి ఎక్కువ టైమ్ అక్కర్లేదు. నీకెంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చినా నీ మాటల్లోని యాసపోలేదు. నీ పిచ్చి అలవాట్లు పోలేదు - స్టయిల్ రాలేదు. ముందుంది మొసళ్ళ పండగ..." సర్ క్కాస్టిక్ గ్గా అన్నాడు కనకారావు.

 

    "ఏడ్చావ్ పిచ్చి వెధవ" తిరస్కారంగా అన్నాడు సామంత్.

 

    "నీకు చనువిచ్చి నెత్తికెక్కించుకొని పెద్ద పొరపాటు చేసాను..." అన్నాడు కనకారావు నొచ్చుకుంటున్నట్టు.

 

    "అవును నువ్వెప్పుడూ పొరపాట్లే చేస్తుంటావ్. ఉన్నమాటన్నావ్... You cannot become a powet in your profession not achieve enduring success in any worthy undertaking until you become big enlugh to blame yourself for your mistakes and reverses..."

 

    ముందో క్షణం సామంత్ అన్నదేమిటో అర్థం కాలేదు. తేరుకున్నాక కూడా అన్నదేమిటో అర్థం కాలేదు కాని, అన్న విధానానికి అదిరిపడ్డాడు.

 

    ఆంగ్ల భాషా పరిజ్ఞానం బాగా వున్న ఒక్క స్కాలర్ ఆంగ్లంలో ఎలా మాట్లాడతాడో సరిగ్గా అలాగే మాట్లాడాడు సామంత్.

 

    ఆ యాక్సెంట్... ఆంగ్ల పదాల వెంట వచ్చే స్మూత్ సౌండ్ అంతా అచ్చం అలాగే వుంది. అద్భుతంగా వుంది. మాట్లాడేప్పుడు స్టయిల్ గా భుజాల్ని ష్రగ్ చేయడం... తను చూస్తున్నది కలా? నిజమా?

 

    సెక్రటరీ కూడా సామంత్ ఆంగ్లంలో మాట్లాడిన విధానానికి అచ్చెరు వొందాడు.

 

    "ఆంగ్లం అర్థం కాలేదా మిస్టర్ కనకారావ్...?

 

    నీ తప్పుల్ని, నీ దౌర్భాగ్యాల్ని నువ్వే నిందించుకోనంత కాలం, నీ వృత్తిలో, లేకపోతే జీవితంలో నువ్వు ఒక శక్తివి కాలేవు, విజయాన్ని సొంతం చేసుకోలేవు..."

 

    ఎంత స్వచ్చంగా, వినసొంపుగా మాట్లాడాడు తెలుగులో...? ఎక్కడా యాసలేదు. ప్రయాస పడలేదు నిజంగా యిది సాధ్యమా...? నేర్చుకోవల్సిన విషయంపై ఇంతటి ఏకాగ్రత సంభవమా? ఒక మనిషి తన లక్ష్యంపై ఇంత నిశ్చల మనస్కుడు కాగలడా?

 

    కనకారావుకి మెదడు మొద్దుబారిపోయినట్లయింది.

 

    కారు సర్రున దూసుకుపోతూనే వుంది.

 

    గాలి రివ్వున కార్లోకి సుడిగాలిలా వస్తూనే వుంది. సెక్రటరీ, కనకారావు నిర్ఘాంతపోయి ఆ స్థితిలో అలాగే ఒకింతసేపు వుండిపోయారు.

 

    వాళ్ళిద్దర్నీ పట్టించుకోనట్లు సామంత్ బయటకు చూస్తుండిపోయాడు.

 

    మొత్తానికి కొంతసేపటికి కనకారావు ముందుగా తేరుకుంటూ - "నువ్వు... నువ్వేనా...?" అన్నాడు అతికష్టం మీద.

 

    "ఎస్...నేను...నేనే... ఈజ్ దేర్ ఎనీ డౌట్?" తిరిగి అదే స్టయిల్లో ప్రశ్నించాడు షార్ప్ గా కనకారావు కేసి చూసి సామంత్.

 

    కళ్లెదుట ప్రత్యక్షంగా కనిపిస్తున్నా నమ్మలేకపోతున్నాడింకా కనకారావు.

 

    కాని అతని కళ్ళు మాత్రం ఆనందంతో మెరిసిపోతున్నాయి.

 

    అంత గొప్ప మార్పుకి కారణం కేవలం తను ఇచ్చిన ట్రైనింగే అని ఆత్మవంచన చేసుకోవటం లేదు కనకారావు.

 

    పీటర్, అర్జునరావు మెప్పు మెండుగా పొందవచ్చని ఆనందిస్తున్నాడు.

 

    కాని సెక్రటరీ మాత్రం సామంత్ పట్ల కొత్త కొత్త అనుమానాలు పెంచుకున్నాడు.

 

    సరిగ్గా కారు 6.20కి నాగమ్మ ఎస్టేట్ లోకి ప్రవేశించింది.

 

    మరో పదినిముషాలకు సామంత్ నాగమ్మ ముందుకు తీసుకెళ్ళబడ్డాడు.

 

    నాగమ్మ మొదటి చూపులోనే సామంత్ ని ఆపాదమస్తకం స్కాన్ చేసి సంతృప్తి పడింది.

 

    ఆరడుగుల ఎత్తులో బలిష్టంగా, ఆరోగ్యంగా వున్న సామంత్ ని చూసి ఆమె తన ఎన్నికపట్ల గర్వపడింది.

 

    షార్ప్ గా వున్న కళ్ళు, తెలివితేటల్ని ప్రతిబింబించే ఆ కళ్ళు కదలికలు నాగరికత ఉట్టిపడే నడక, పెద్దల పట్ల గౌరవం, అన్నీ బాగా నచ్చాయి నాగమ్మకు.

 

    ఖచ్చితంగా తన మనుమరాలికి తగిన జోడు. సామంత్ ని కూర్చోమని కొన్ని ప్రశ్నలు వేయడం మొదలెట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS