"అది సరే. రజియాకు అన్యాయం చేస్తావా? నిన్ను దైవంగా ఎంచి అరాదిస్తోందే-- ఆమె పూజలు ఫలించకుండా చేస్తావా? ఆమె ఆశలు మట్టిలో కలిపి ఆమె జీవితాన్ని నాశనం చేయడం నీకు ధర్మమా?"
'ఆమెకు అన్యాయం చెయ్యలేను. వారికి ద్రోహం చెయ్యలేకున్నాను. దిక్కు తోచడం లేదు."
"ఏం నిర్ణయం చేసుకున్నావు?"
"అది చేసుకోలేకనే ఈ బాధంతా! నాకిటు వంటి పరిస్థితులు వస్తాయని కలలో గూడా అనుకోలేదు. నేను తెలిసి ఎవరికీ ఏ అపకారం తలపెట్టలేదు. భగవంతుడు నాకీ శిక్ష విధించాడు." చేతులతో తల కొట్టుకున్నాడు రాజ్.
"రాజా!"
"ఏం చెయ్యమంటావురా? జరుగబోయ్యేది తలుచుకుంటే తల బాదుకుందామనిపిస్తోంది. ఏం చెయ్యాలి అని హృదయం అడుగుతుంటే మెదడు జవాబు చెప్పలేక పోతోంది. తిక్క పట్టి నట్లుంది.' కన్నీరు కార్చాడు మిత్రుని కౌగలించుకొని.
ద్రవించి పోయాడు ఆనంద్. నిర్దయుడవైన భగవంతుడా , ఇటువంటి వారికి గూడా కష్టాల నిస్తున్నావా! అని నిందించాడు మనసులోనే.
"నువ్వు కూడా దుఃఖాన్ని జయించాలేవని ఈనాడు తెలుసుకుంటున్నాను."
"ఈ పరిస్థితులను చూస్తుంటే ఏడవడమే, కాదు చచ్చిపోవాలని గూడా అనిపిస్తోంది. చిన్నప్పటి నుండి కష్టాలలో మునిగి తేలుతూ ఇప్పటికి ఒక గట్టు చేరుకున్నానని సంతోషించాను. కానీ ఆ గట్టు ఒక చిన్న మట్టి గడ్డే నని తేలిపోతోంది. తిరిగి సముద్రం లోకి ఈదుకు పోయే శక్తి నాలో లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని దాటుకునెంత లో ఈ జీవితం అంతమై పోతుంది."
ఆనంద్ ఏమీ చెప్పలేక పోయాడు.
"రజియా -- హు-- ఆ అమాయకమైన జీవితంలో ప్రవేశించి ఎందుకు కల్లోలం రేపానా అని చింతిస్తున్నాను. నాపై ఆశలు పెంచుకొని నన్ను భర్తగా ఎంచుకొని తన భావి జీవితాన్ని అందంగా అలంకరించుకొని, తన హృదయ పీఠం లో ఒక పవిత్రమైన గుడి కట్టుకొని అందులో నా రూపాన్ని ప్రతిష్టించు కొని పూజించింది. నేడు ఆమె పూజలు నిష్పలమవుతున్నాయి. ఆమె పవిత్ర దేవాలయం శిధిలమై పోతుంది. నా జీవితానికే ఒక వెలుగు నిచ్చి, నాకో జ్యోతి ని చూపించి, జీవితపు ఆనందాన్ని చవి చూపించి, కొన్ని సత్యాలను తెలిపిన ఆమెను అరాదించాను. నేడు అమెకుదూరం కావాలి. ఇది సాధ్యమా? ఈ బాధ తీర్చేదేవరు? ఈ ఆవేదన వినేదెవరు? ఈ హృదయం లో మండే అగ్ని పర్వతాలను అర్పెదేవరు? జీవితమంతా ఇలా ఏడుస్తూ గడప వలసిందేనా? నా జీవితం తో పాటు ఒక నిండు జీవితాన్ని బలి చేస్తున్నాను. ఈ పాపానికి నిష్కృతి ఎన్ని జన్మల కైనా లేదు."
"ఊరుకోరా. ఎందుకలా బాధపదతావ్?"
"బాధపడక ఏం చెయ్యాలి? మా కలలన్నీ కరిగి పోవలసినదేనా? ఆనందమయమైన బ్రతుకులను వదులుకొని దుఃఖమయమైన జీవితాలు గడపాలా? దివ్య జ్యోతిని విడిచి పెట్టి అంధకార కూపం లోకి దిగబడి పోవాలా? ఈ బ్రతుకు కన్నా చిన్నప్పుడే నా తల్లితండ్రుల తో పాటు ఆ దేవుడు నన్ను కూడా తీసుకుపోయి ఉంటె బాగుండేది. ఈ బాధలేమీ ఉండేవి కావు."
"వసంత ఎంత సద్గుణ వతో నీకు పూర్తిగా తెలుసు కదా? ఆమెతో ఎలా కాపురం చేస్తావ్?"
'అది దేవుడెరుగు. ఇప్పుడు రజియా కు ఏ మొహం పెట్టుకొని ఈ విషయం చెప్పమంటావు? కూతురి సుఖం పై ఎన్నో ఆశలు పెట్టుకొన్న ఆమె తండ్రి నన్ను ఒక మోసకారిగా తలంచి అసహ్యించుకొంటాడే అని దిగులు పడుతున్నాను."
"నా మాట విని నీ ఉద్దేశ్యం మార్చుకో."
'అందుకు అవకాశం లేదురా! డాక్టరు గారే మన్నారో తెలుసా? వారి మనసులో ఏదో చింత ఉందని, అది తీరెంత వరకూ ఈ వయసులో ఆ వ్యాధి నయం కాదని అన్నారు. నేను కాదంటే ఆ ముసలి ప్రాణం కాస్తా గుటుక్కు మంటుంది. చేసిన మేలు మరిచి కృతఘ్నుడనయి ఒక జీవితాన్ని హత్య చేసిన వాడినవుతాను. అది మార్చుకొంటే మరొకరి సౌఖ్యాన్ని అంతం చేసిన వాడినవుతాను. ఏ పని చేసినా నేను మరొకరి దృష్టి లో మోసకారీ, హంతకుడూ అయిపోతాను."
"పరిస్థితుల కు బానిసై కోరి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావ్!"
"కష్టాలను కోరి తెచ్చుకోవడం నాకిష్టం లేదు. కానీ ఇప్పట్లో పరిస్థితులకు బానిస కాక తప్పదు. ఆ తరువాతే వాటిని ఎడురించడం నేర్చుకోవాలి. నా కొక్క విషయం బాధగా ఉంది. రజియాను ఒప్పించగలను. కానీ ఖాన్ గారి హృదయాన్ని ఓదార్చే శక్తి నాకు లేదు. జీవితంలో ఒకసారి దెబ్బతిని, తన జీవితాన్ని నాశనం చేసుకొని, కనీసం తన కుమార్తె అయినా ఆనందంగా ఉండాలని కోరుకున్న అయన గారి ఆఖరి కోరిక తీర్చలేక పోగా, గాయం కలిగిన చోటనే మరో గాయాన్ని కలిగిస్తున్నాను. అయన కెలా మొహం చూపించను? అయన అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్పను? తానంటే జీవితంలో అనుకొన్న సుఖాల్ని, పొందలేక పోగా తన కుమార్తె కు కూడా అటువంటి గతే పట్టిందని తెలుసుకొన్న ఆమె తల్లి గారి శాపం నన్ను జన్మజన్మ లకూ వెన్నంటి తరుముతుంది. ఇంత పెద్ద శిక్ష ను నేనెలా భరించను? కనీసం ఆ శక్తి నైనా యివ్వు , భగవంతుడా!" అని తలను చేత్తో పట్టుకొని ఉండిపోయాడు.
* * * *
సముద్రుని కెదురుగా కూర్చున్నాడు రాజ్. అతని గంబీర్యం సముద్రుడి ని పోటీకి పిలుస్తుంది. అది చూచింది రజియా. అంతటి గంబీర్యం వెనుక ఎంత విషాదాన్ని దాచాడు అనుకొని విరక్తి పూర్వకంగా ఒక చిరునవ్వు నవ్వింది రజియా. రజియా లో మామూలు ఉత్సాహం లేదు. ఆ మౌనం వెనుక నున్న నిజం, నిస్పృహ ఆమెను అలా మార్చి వేశాయి. అది గమనించినా అప్పట్లో దాని కంత ప్రాధాన్యం ఇవ్వలేక పోయాడు రాజ్.
"రజీ, నేనొక విషయం అడుగుతాను. చెప్తావా?"
"అడుగు , రాజ్ ." ఉద్భోధ కనిపించిందా కంఠంలో.
"ఒక అమ్మాయి అనాధ కాగా ఒక సహృదయుడు ఆమెను ఆదరించి విద్యాబుద్దులు చెప్పించాడు. అతడే ఆమెను ఆదరించకుంటే ఆమె నామరూపాలు ఈ ప్రపంచం లో ఉండేవి కావు. ఆ అమ్మాయి ఒక అబ్బాయి చేత ప్రేమింప బడ్డది; ప్రేమించింది. తమ భావి జీవితాన్ని పటిష్టంగా నిర్మించుకొని దానిని గురించి కలలు కంటూ గడిపారు. కానీ ఆమె ఒక చిక్కులో పడింది. ఆమెను ఆదరించిన ఆ సహ్రుదయుడికి ఒక కుమారుడు ఉన్నాడు. త్రాగుబోతు, వ్యభిచారి అయిన అతణ్ణి పెళ్ళి చేసుకొని అతని జీవితాన్ని బాగు పరచవలసినది గా కోరాడు అయన. మానవ సహజమైన బలహీనత ఆమెలో ప్రవేశించింది. తన ప్రియుడికి అన్యాయం చేసి, తన జీవితాన్ని నరకం చేసుకొని ఆయనకు ఒక మనిషిలా కృతజ్ఞత తెలపాలా? తన సౌఖ్యం కోసం, తన ప్రియుడి ఆనందం కోసం ఆ కోరిక నిరాకరించి స్వార్ధంతో కృతజ్ఞతనే చూపాలా? చెప్పు, రజీ!"
"మానవత్వం నిరూపించు కొనేందుకు ఆమె తన సౌఖ్యాన్నీ, తన ప్రేమనూ త్యాగం చేసి అయన కోరిక తీర్చాలి.'
"నువ్వూ అలాగే అన్నావా, రజీ!"
"అంతేకాదు. రాజ్. ఆ నరకాన్నీ స్వర్గంగా మార్చుకో ప్రయత్నించాలి."
"రజీ!"
"అవును, రాజ్! నువ్వు వసంత ను పెళ్లి చేసుకోవడమే సమంజసం."
"రజీ!" ఆశ్చర్యం లో అరిచాడు రాజ్.
"నాకంతా తెలుసు, రాజ్!"
"ఎలా?"
"నువ్వూ ఆనంద్ గదిలోకి ప్రవేశిస్తుండగా అప్పటికి అక్కడే అరుణతో మాట్లాడుతున్న నేను చూశాను. మీరున్న గదిలోకి వస్తుండగా నీ మాటలు నన్ను అక్కడే ఆపేశాయి. నీబాధ నర్దం చేసుకొన్నాను. నువ్వు ఆనందరావు గారి కోరిక తీర్చడమే ధర్మం."
"రజీ, నన్ను పరీక్షిస్తున్నావా?"
"కాదు, రాజ్! నాకోసం నారాజ్ అపనింద పాలుకావడం నాకిష్టం లేదు. నేను ఇన్నాళ్ళూ ఒక గొప్ప వ్యక్తిని , మానవతీతుడైన నా రాజ్ ను అరాదించాను. నా జీవితాంతం అతన్ని ఆరాదిస్తూనే ఉంటాను. అతనికి ఏ మచ్చా అంతకూడదు. అదే నాకు తృప్తి. నేను ఒక త్యాగ మూర్తిని ప్రేమిస్తున్నావన్న అదృష్టాన్ని నాకు కలుగజెయ్యి. అంతేకానీ అతణ్ణి నా స్వార్ధానికి ఉపయోగించుకొని ఒక కృతఘ్నుడుగా చేశాననే ఆత్మ ఘోష నాకు వద్దు."
ఆమె కళ్ళు ఇక అపలెం అంటూ ఏకధారగా కన్నీటి ని ప్రవహింప జేశాయి. అది చూసి చెమ్మగిల్లాయి రాజ్ కళ్ళు.
"రజీ, నా పాపానికి నిష్కృతి ఉండదు."
రజియా కళ్ళు తుడుచుకుని "రాజ్, ఎందుకలా బాధపదతావ్? కష్టాలను ఎదిరించమని నువ్వే నాకు నేర్పావు. ఈనాడు నువ్వే ఎందుకిలా వాటికి లొంగి పోతావు?' అన్నది.
"ఇంత ఓర్పు నెక్కడ నేర్చుకోన్నావు , రజీ?" బదులు పలుకలేదు రజియా.
"రజీ , నిన్ను వదిలి ఎలా జీవించడం?"
"అదే అలవాటయి పోతుందిలే. మనసుకు ధైర్యం తెచ్చుకో."
"వద్దు, రజీ. అలాంటి మాటలు అనకు. నిన్ను వదులు కోలేను. లోకం ఏమను కొన్నాసరే! ఆనందరావు గారు ఏమను కొన్నాసరే! నిన్ను విడిచి పెట్టవద్దని ఒక్కమాట చెప్పు, బిజీ!"
"రాజ్, ఆవేశం లో పిచ్చిగా మాట్లాడకు. నేను ఆలోచించే ఈ నిర్ణయాని కొచ్చాను. నేను ఆరాదించేది ఒక త్యాగ మూర్తి ని కానీ ఒక కృతఘ్నుడినీ, స్వార్ధ పరుడినీ కాదు."
"అంతేనా, రజీ! నా జీవితానికి ఆనందం, సౌఖ్యం ఇవేమీ ఉండవా! నా జీవితం అంధకార బంధురం చేసుకోవలసినదేనా?"
"ఆ అంధకారాన్ని పోగొట్టి వెలుగు తెచ్చుకునే శక్తి నీలో ఉంది. ప్రయత్నించి నీ జీవితాన్ని సుఖంగా గడువు."
"సుఖం , శాంతి -- ఇక వీటిని మరిచి పోవాలి. రజీ, పోనీ నువ్వు నాకొక ప్రమాణం చేస్తావా?"
"అజ్ఞాపించే అధికారం నీకెప్పుడూ ఉంది. రాజ్!"
"నువ్వు నాకు ఎప్పుడూ తోడుగా ఉండాలి."
"ప్రయత్నిస్తాను. రాజ్!" నిట్టూర్చింది రజియా.
