Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 38


    ఇహ ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి. పారిపోవాలి. ఎంత బావుంటుంది. వీళ్ళకు కనిపించను. కాళీ మంచం కనిపిస్తుంది. వాళ్లు ఏడుస్తారు- నా ఆస్తికోసం- పెన్షన్ కోసం విలపిస్తారు! వాహ్! వాహ్! చాలా బావుంటుంది. సరదాగా ఉంటుంది. మజాగా ఉంటుంది.
    హయ్యో! ఎలా? ఈ రెండో "నేను" ఉన్నాడు. వాడు పథకం పాడుచేశాడు! వెధవ! వాడు నాకు కాపలా! అసలు నేను రెండు ముక్కలు ఎందుకయినట్లు? ముక్కలయిన మనిషి ఏంచేయగలడు?
    ఆరోజు ఇద్దరు పిల్లల్ని గదిలోకి పంపించారు.
    ఒకడు పది పదకొండేళ్ల పిల్లవాడు. వాడికి బెదురు. భయం, అనుమానం. నా చేతిని చూస్తున్నాడు- రాయి ఉందేమోనని భయం. వాడు "పప్పూ"- ఇంకో అమ్మాయి మున్నీ, అందంగా ఉంది, చేతిలో బొమ్మ ఉంది, కీ ఇస్తే కదులుతుంది.
    "చూఁ చూఁ ఆవో ఆవో" అంటూంది బొమ్మ.
    మున్నీని నేను పిలవలేదు. "పప్పూ" వారిస్తున్నాడు. అయినా ఉరికివచ్చింది. నామీద పడ్డది. ఆమె బంగారు వెంట్రుకలు నా గుండెమీద పరచుకున్నాయి.
    "నాన్నా! నాన్నా! మీకు దెబ్బ ఎలా తగిలిందీ? పప్పూ ఉన్నాడు చూశారా, వాడికి మీరంటే భయం! నాన్నా మీరు మమ్ముల్ని కొట్టారుగా?" మున్నీ రెండు చిన్ని చేతుల్తో నా చెంపలు పట్టుకొని అడిగింది-మెల్లగా-సన్నగా!
    "మాకొక విమానం తెచ్చివ్వండి అందులో కూర్చుందాం. ఎగిరిపోదాం- దూరం- చాలాదూరం.... వెళ్ళిపోదాం-నాన్నా!"
    అమాంతంగా మేమిద్దరం విమానంలో పడ్డాం. ఎగిరిపోతూంది విమానం. పోతూంది....పోతుంది.
    బొమ్మ మా వెంట ఎలా వస్తుంది? వెధవది నేలమీద పడుండేది?
    "టాటా....టాటా! ఆగండి. మీరెక్కడికి?" కొత్తఇంటివారిని వారించాను.
    "ఆగండి....ఎక్కడికి వెళ్ళడం?"
    వెధవలు మళ్ళీ పట్టేశారు!
    "మీ ఆరోగ్యం బావుండలేదు. అంత వేగంగా పరిగెత్తకండి" "నిమ్మో" వెనుకనుంచి నన్ను పట్టుకుంది.
    "మున్నీ దిగు. మీ నాన్న భుజం ఎక్కే సరదా మానుకో.... వారి ఆరోగ్యం అంత బావుండలేదు."
    "విడువండి....వదలండి....మేం విమానంలో ఢిల్లీ పోతున్నాం. దూరం.... చాలాదూరం వెళ్తున్నాం.... టాటా!"
    మున్నీని బలవంతంగా దింపారు. నేను నా గదిలోకి వచ్చి పడుకోవాల్సివచ్చింది.
    నిమ్మో నాదగ్గర కూర్చుంటుంది. "భగవంతుని దయ మీరు పిల్లల్ను మరిచిపోలేదు" గారాబంగా అంటుంది. "నిజం. మీరు పిల్లల్ని మరిచిపోతే మాగతేం కాను?"
    "ఏం. నీకేమి అవుతుంది?" నేను దూరంగా జరిగి కూర్చుంటాను.
    "బావుంది. నేనేం సంపాదించగలను? మీ పెన్షన్ వస్తుంటే గడుస్తూంది. ఏదో కొద్దిగా ఆస్తి ఉంది. ఇమ్తీయాజ్ తల్లి బాగా సుఖపడ్డది. వెళ్ళిపోయింది. మీరు నన్ను చేసుకున్నారు. పిల్లల్ని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళను?"
    ఇది నిజంగా పిచ్చిదే. దీనికి పిచ్చెక్కింది. ఇప్పుడే ఏడ్చింది. మళ్ళీ నవ్వుతూంది.
    "ఇదిగో, దీనిమీద సంతకం చేయండి"
    ఏమిటిది? జాగ్రత్తగా చూశాను. నన్ను బానిసను చేసే కాగితం కాదు కదా! నేను రెండుగా విడిపోయాననే ఖరారునామా కాదుకదా! నాలో ఒక భాగం కిటికీలోంచి తొంగిచూస్తూంది. మరోభాగం ఈ దుర్మార్గుల చేతికి చిక్కింది.
    "ఏమిటి చూస్తారు? సంతకం చేయండి." నిమ్మో నిప్పులమీద నుంచున్నట్లుంది. ఆమెకు తొందరగా ఉంది. ఆరాటంగా ఉంది.
    నేను కాగితాన్ని చూచాను. దీక్షగా చూచాను. ఒక వేయి ఏదో వేలమాట. ఇది డబ్బును గురించింది. ఇంతే! డబ్బేగా! సంతకం పెట్టేశాను.
    "అమ్మా! నాన్న సంతకం చేయడమూ మరచారనుకో, అప్పుడు ఏమి అవుతుంది?" దగ్గరనుంచున్న పప్పూ అడుగుతున్నాడు. పప్పూ పక్కని ఫజ్లూ, ఫజ్లూ పక్కన షమ్మీ, ఇంకెవరో అమ్మీ టమ్మీ అంతా ఉన్నారు.
    "అయ్యా కలంపట్టటం మరిచిండనుకో- ఇగ పైస చేతికేడ వచ్చును?"
    ఫజ్లూగారు పాకురు పళ్ళతో ఇకిలించారు.
    "ముయ్-నోర్ముయ్" నేను వాడిమీద వంటికాలితో లేచాను. "వచ్చాడయ్యా మహా డబ్బుల గారడీ చూడ్డానికి! ఎందుకుబే- అదే నన్ను చూచి నవ్వుతావ్. ఆ ఇక్కడేం కోతులు ఆడుతున్నాయా? నా తలకు కొమ్ములు వచ్చాయా?"
    నా మాట విన్నారు. అంతా భళ్లున నవ్వారు.
    అప్పుడు నాకు నిజంగానే అనుమానం కలిగింది. అవును నా ముఖంలో ఏదో మార్పు వచ్చింది. కాకుంటే వాళ్ళందరూ ఎందుకు నవ్వుతారు? ఆ తెలిసింది. నేను విడిపోయానుగా- రెండుగా! అందుకే అలా చూస్తున్నారు అంతా. అంతేకాదు, నేను కిటికీలో కూర్చున్నానుగా. ఆ నేనూ నమ్మి ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఏమిటీ వెధవవేషాలు! ఇహ మానెయ్యాలి.
    నిన్న ఏం జరిగింది? ఈగను చంపాలనుకున్నాను. కర్ర అందుకున్నాను ఇల్లంతా ఉరికాను. దాంతో బల్బులన్నీ పగిలిపోయాయి. అద్దాల బీరువా తలకిందులైంది. జనమంతా కూడారు 'తమాషా' చూడ్డానికి. ఏమిటిది-జనం ఇంతగా వచ్చేశారు? పట్నంలో సినిమాహాళ్ళన్నీ మూసేశారా?
    నిన్న పగలు మా డైనింగ్ హాల్లో మాట్నీ షో ఆడింది! అందంగా ఉంది అమ్మాయి షమ్మీ-హీరోయిన్. నల్లగా పొడుగ్గా ఉన్నాడు యువకుడు హీరో. వాళ్లు 'రొమాంటిక్ మూడ్' లో ఉన్నారు. వలపు ఒలకబోస్తున్నారు. ఇది చాటు ఏడుపు! వీళ్ళది దొంగ ఏడుపు!! అయినా వింత ఏముంది? ఇది అన్ని భారతీయ పిక్చర్లలో ఉండేదే. అదిగో పాట ప్రారంభం- 'తూ మేరా చాంద్....మై తెరీ చాంద్నీ' అది పాట. పాటేగా. ఆ పాట నిజంగా వినిపిస్తే నేను పిచ్చివాణ్ణి అవుతాను.
    "ఆపండి. ఆపండి" అరిచాన్నేను.
    నా అరుపు విని అర్ధాంతరంగానే ఆగిపోయింది సీను.
    హీరో పరుగు లంకించుకున్నాడు. హీరోయిన్ నా కాళ్ళకు చుట్టేసింది. "నాన్నా క్షమించు" ఆమె ఉత్తుత్తి కన్నీరు కారుస్తుంది.
    నేను చేయిచాపి సినిమాలో హీరోయిన్ తండ్రిలా "నన్ను క్షమించు అర్థంలేని మీ డ్రామాలో నేను వేషం వేయలేను" అన్నాను.
    ఇంతలో చూ చూ వచ్చింది. ఆమె వడినిండా కాగితం ముక్కలున్నాయి.
    "నాన్నా! చూడండి ఎన్ని నోట్లు తెచ్చానో!" అని వడిలో కాగితాలన్నీ గుమ్మరించింది. అవి నిజంగానే నోట్లు అయిపోయాయి- చిన్న చిన్న నోట్లు - బుల్లి బుల్లి నోట్లు!
    "ఈ నోటుతో కేకులు కొంటా...ఈ నోటుతో విమానం.... ఈ నోటుతో నాన్నకు సిగరెట్లు.... ఒక్కొక్క నోటు తీసి మహా ఇల్లాలులా లెక్కపెడ్తూంది.
    "ఈ నోటుతో నాన్న....."
    "హుత్ పిచ్చిదానా! నోటుతో నాన్నను కొంటారా ఎక్కడన్నా!" పప్పు అంటాడు.
    "అవును. కొనవచ్చు" చూఁ చూఁ చాలా నిబ్బరంగా అంటుంది.
    "నాన్నా! నువ్వు మా అందర్నీ ఒక్క నోటిచ్చి కొన్నావు కదూ!"
    "అవును అలాగే కొన్నాను. మీరంతా నా బానిసలు. నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇలారండి ఇక్కడ నుంచోండి."
    "పప్పు వట్టి మొద్దు" మున్నీ అంటుంది.
    "డబ్బుంటే అన్నీ కొనవచ్చంటుంది అమ్మ"
    అయితే నాలో రెండోభాగం ఉందే - దాన్ని కొంటాను. భలే ఐడియా! మున్నీ దగ్గరున్న రూపాయలన్నీ లాక్కున్నాను.
    "వెళ్లండి వెళ్లిపోండి. ఈ రూపాయలన్నీ నావి"
    "కాదు నావి" మున్నీ ఏడుపు సాగించింది. "నా రూపాయలు నాన్న తీసుకున్నారు. ఇప్పించు."
    "ఈ కాగితాలు ఏంచేసుకుంటారు? ఇచ్చెయ్యరాదూ" నిమ్మో లోనికి వచ్చేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS