అమెరికా దేశమునకు బోయిన యాంధ్రుల సంఖ్య చాలా స్వల్పము, వంగల శివరాముగారు పి.హెచ్.డి. రాజ్యతంత్రజ్ఞానమునందు పట్టమునంది, భరతదేశమున, కలకత్తా విశ్వవిద్యాలయములో, నటుతర్వాత లక్నో విశ్వవిద్యాలయములో పండితులుగా జేరి ప్రఖ్యాతి బడసియున్నారు. బాపినీడుగారు ఎమ్.ఏ. వ్యవసాయశాస్త్రమున పట్టమునంది, భారతదేశమునందు వ్యవసాయమున నూతన మార్గముల నెలకొల్ప దీక్షతో నున్నారు.
ఎల్లాప్రగడ సుబ్బారావుగారిని రామచంద్రరావుగారు హార్వర్డు లోనే సందర్శించినారు. చెన్నపట్టణములో నాయన వైద్యవిద్యలో ఎల్.ఎమ్.ఎస్. పట్టమునంది. హార్వర్డు విశ్వవిద్యాలయములో ఉన్నత వైద్య విద్య బడయుటకు సంకల్పించి, యా విద్యా కృషిలో దన్మయులై, యుత్తమ పరీక్షలలో గృతార్థులై, వైద్యవిద్యలో సత్యనూత్రార్జన తపస్సులో లీనమైపోయినారు. ఆయన విద్యయే యాయనకు భార్యయట, తల్లియట, బిడ్డలట. మరల భారతదేశమున కెప్పుడు రాగలడో? తన గురువు గారితో నేకమై బయోకెమిస్ట్రీ విద్యలో ననేక నూతనపథములు కనుగొని నూతన విషయముల ప్రపంచమున కర్పించుచున్నాడు.
రామచంద్రరావు యొక్క యుత్కృష్టధీశక్తిగాంచి హార్వర్డు విశ్వవిద్యాలయ పండితోత్తములాశ్చర్యపూరితులైనారు. గణిత శాస్త్రమున బ్రపంచ ప్రఖ్యాతిగాంచిన కమింగ్సు పండితుడు రామచంద్రుని మేధాసంపన్నతకు మెచ్చి, యతని దనయండ జేర్చుకొని వేయి కనులతో గాపాడుచుండెను.
గాఢస్నేహము
నారాయణరావు మదరాసులో బి.ఎల్. తరగతిలో జేరినాడు. టెన్నిస్, కాలిబంతి, క్రికెట్ ఆటలలో నతడు మొనగాడు. న్యాయకళాశాలలో నాంధ్ర విద్యార్ధులందరు నారాయణరావును విద్యార్థి సంఘ కార్యదర్శిగా నెన్నుకొని ధన్యులైనారు. పరమేశ్వరుని తనకడ కొన్నినాళ్లుండమని నారాయణ కోరుటచే నా యువకుడును వచ్చి చెన్నపట్టణములో నతని చెంతనే నివసించెను.ఆలం నారాయణుని వదలడు.
పరమేశ్వరునకు చిత్రవిద్యా సంబంధమగు ఉద్యోగమేదైన దొరకు వరకు, విశ్వదాత యగు నాగేశ్వరరాయలు ఆంధ్రపత్రికా కార్యాలయమున నతనికి బ్రవేశము ప్రసాదించిరి. కావున 'భారతి'కి కథలను బద్యములను వ్రాసి యిచ్చుచు, దినమునకు రెండు గంటలు చిత్రవిద్యాపరిశ్రమము సల్పుమని నారాయణరావు బోధించెను. తానును బరమేశ్వరునకు వివిధంబుల సహాయము చేయుచుండెదనని నెమ్మదిగా దెలిపినాడు. నారాయణుడు తీరికయైన వేళలందు పరమేశ్వరునితో గలసి, మహాదానందరూపములై అద్భుత లేఖనా మూర్తిమంతములగు చిత్రములు చిత్రించువాడు. పరమేశ్వరుడాంధ్రపత్రికా కార్యాలయమున బ్రవేశించినాడు.
పరమేశ్వరున కయిదుగురన్నదమ్ములు. పరమేశ్వరమూర్తి తండ్రియగు వెంకటరమణమూర్తిగారు మునసబీ చేసి యుపకార వేతనము (ఫించను) బుచ్చుకొన్నారు. బహుకుటుంబి యగుటచే నాయన ధనమేమిము వెనుక వైచుకొనలేదు. కుమార్తె వివాహమున ఆరువేలు ఖర్చుచేసినాడు. లంచముల మాట వినబడినచో నగ్నివలె మండిపోవువాడు. నేడు ప్రభుత్వము వారిచ్చు వేతనము తప్ప నాయన కితరాధారము లేదు. ఆరుగురు కుమారులకు జదువులు చెప్పించెను. నెలకు వచ్చు మూడువందల రూపాయలు తిండికి, కడగొట్టు బాలుర చదువులకు, వృద్దురాలగు తల్లి వైద్యమున కాయనకు బప్పువలె ఖర్చయిపోవును. పెద్దకొడుకులు ముగ్గురుద్యోగములలో నున్నను వారు తెచ్చు జీతములు వారి కుటుంబములకే సరిపోవును. అప్పు చేయుట యన్నచో నాయనకు దేహము కంపించిపోవును. ధనము లేనిచో పస్తుండును గాని ఒక కానీ పద్దు వ్రాయడు, నోటు వ్రాయడు.
పెద్దకుమారుడు విశాఖపట్టణము కాలేజీలోనున్న ఉన్నత పాఠశాలలో చరిత్ర పాఠముల చెప్పు నుపాధ్యాయుడు, వరదరాజులు బి.ఏ.,ఎల్.టి.గారు. రెండువ కుమారుడు శ్రీరంగనాయకరావు. ఎటులనో స్కూలు ఫైనలు పరీక్ష పూర్తిచేసి, పెద్దాపురము మునసబు న్యాయస్థానములో లేఖరి యుద్యోగము తండ్రిగారి ప్రాపకముచే బొంది, తగు లంచములు గొనుచు భార్యాబిడ్డలతో గాలక్షేపము చేయుచుండెను. మూడవయతడు బి.ఎ., బి.ఎల్. పరీక్షలలో గృతార్థత నొంది అప్రెన్ టిస్ అయి, హైకోర్టు వకీలయి, అనకాపల్లిలో న్యాయవాది వృత్తి సలుపుచు, బదిరాళ్ళయిన నింటికి దేలేక, తండ్రిగారి ప్రాపకముచే నెప్పుడు మునసబీ పని యగునాయని గడియలు యుగములుగా లెక్కపెట్టుచుండెను. పరమేశ్వరమూర్తి నాల్గవవాడు. పరమేశ్వరమూర్తి వెనుక నొక బాలిక ఉమ, ఆమె వెనుక నిరువురు కవలలు, రామారావు, లక్ష్మణరావులు. వెంకటరమణమూర్తిగారి జన్మమును దరింపజేయ నుద్భవించిరి. వారిరువురు నాల్గవఫారము చదువుచుండిరి. ఇట్టి చిక్కుల్లో నుండుటవలననే వెంకటరమణమూర్తిగారు, పరమేశ్వరునికి అనేక విధములగు సహాయము తామొనరింపజాలమనియు, కుమారుడు అందరితోబాటు తనకడనున్న ఎట్టులో కలో గంజో పోయగలననియు, నితర స్థలములకు బోయినచో, పరమేశ్వరుడు తన కుటుంబమును దానే భరించుకొనవలయుననియు మొగమాటము విడిచి జెప్పినారు.
పరమేశ్వరుడు నారాయణకన్న రెండేళ్ళు పెద్ద, పందొమ్మిది వందల ఇరువది రెండవ సంవత్సరము గాంధీ మాహాత్ముడు భరతదేశ దాస్యశృంఖలా విమోచనమునకని ప్రారంభించిన అసహాయోద్యమములో జేరి, పరమేశ్వరుడొక సంవత్సరము కారాగారవాస మనుభవించెను. అప్పటికతని వయస్సు పందొమ్మిది. బి.ఏ. చదువుచుండెను. నారాయణరావునకు పరమేశ్వరునకు చెఱసాల యందు గాఢస్నేహము కుదిరినది. చెఱ వదలి వచ్చిన వెనుక వారిరువురి మైత్రి తీగవలె నల్లుకొనిపోయి వారిరువురి యాత్మలొకటి, దేహములు మాత్రము వేరైనవి. పరమేశ్వరుడు 1924లో బి.ఏ. పూర్తిచేసెను.
నారాయణరావు పరమేశ్వరులిరువురు సర్వకళోపాసకులు. నారాయణరావు పరిమిత మేధాసంపన్నుడు. పరమేశ్వరునికి జ్ఞాపకశక్తికన్న సృజనాశక్తి మెండు. నారాయణరావునకు కళాసృష్టి శక్తికన్న, ధీశక్తిమిన్న. నారాయణరావు చూపుమాత్రాన నెట్టివిషయమును సర్వార్ధములతో గ్రహింపగలడు. ఏ జటిల విషయమునైన సులువుగా బోధపడు రీతనుపదేశింపగలడు. ఉపన్యాసమీయగలడు. నారాయణునకు జ్ఞాపకశక్తి యత్యద్భుతము. శాస్త్రజ్ఞానములో ఎయిన్ స్టెయిన్ మొదలగు పండితోత్తముల గ్రంథము లతనికి మంచినీళ్ళ ప్రాయములు. అర్ధమయిన విషయములు తలచినంతమాత్రాన నతని మనోముకు రమున ప్రత్యక్షములగును. నారాయణ జ్ఞానపిపాసకు, ఈ శాస్త్ర మాశాస్త్రమని హద్దులేదు. అతని ధీకిరణము సర్వశాస్త్రములపై ప్రసరించును. రామన్ గారి 'కిరణ' విషయజ్ఞానమననెంత ప్రేమయో ఆంధ్రేతిహాస విషయమునందు నంత ప్రేమయే. న్యూటను, ఎయిన్ స్టెయిన్, అడిసన్, గౌతమ కణ్వాదులు, నాగార్జునులు అతనికి చిరపరిచితులు. మహాపండితుల సిద్ధాంతములెంత శ్రద్ధయై గ్రహించునో, శోణానదిపైని వంతెన పొడవును, చీనా కుడ్యచరిత్రను, ఆర్మీనియనుజతివారి చరిత్రమును, సముద్రమీనా భేదములను, అవి యివి యన నేల సమస్త వస్తుజ్ఞానమును అతడంత యాస్థమే గ్రహించును.
పరమేశ్వరుని జ్ఞానశక్తి నారాయణరావు మేధాశక్తి యంత యగాధము కాదు. ఇరువురి హృదయములు రసార్ద్రములే యగును కాని, పరమేశ్వరుని యందు లలితకళాశక్తి యెక్కువ విజృంభించియున్నది. ఇరువురు సౌందర్యోపాసకులే. ఇరువురు జ్ఞానప్రియులే కాని పరమేశ్వరుడు తుమ్మెద, నారాయణుడు తేనెటీగ. జ్ఞానామృత సంపాదనమున నిదియే వారికిగల భేదము.
