Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 38

"అవునూ"
"ప్రళయం వచ్చి సర్వనాశనం అయిపోయాక మళ్ళీ కొత్త సృష్టి జరుగుతుంది. అలా వృద్ధి పొందిన ఆ కొత్త సృష్టి, దాని నాగరికతా ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చే ప్రళయంలో ధ్వంసం అయిపోతాయి."
"అంటే మనిషికి నాగరికత అబ్బడం ఇది మొదటిసారి కాదంటావా?"
"జీర్ణించుకోవడానికి కష్టం అనిపిస్తున్నా కూడా నిజం ఇదే! ఈ భూగోళం మీద ఎన్నో ప్రళయాలు వచ్చాయి. ఎన్నెన్నో నాగరికతలు వృద్ధిపొంది నశించాయి."
"అవును. గత ప్రళయానికి ముందు వృద్ధి పొందిన నాగరికత తాలూకుది అయి వుండవచ్చు. లేదా గత ప్రళయం తరువాత మిగిలిన ఆ పాత నాగరికత తాలూకు అవశేషాలదన్నా కావచ్చును."
"ఓసారి ప్రళయం వచ్చాక గత నాగరికత అంతా ధ్వంసం అయిపోతుంది కదా? మరి ప్రళయం వచ్చాక ఇంక ఆ సివిలైజేషన్ తాలూకు ప్రభావం ఇంకా ఏం మిగుల్తుంది?"
"ఇది కాస్త వివరంగా చెప్పాల్సిన విషయం" అన్నాడు సాహస్.
"చెప్పు" అన్నాడు అంకుష్ ఆసక్తిగా.
"బైబిల్ ప్రకారం ప్రళయం వచ్చినప్పుడు దేవుడు నోవాతో ఒక నౌకని నిర్మించమనీ దానిలో జీవకోటిని అంటే రకానికి ఓ జంట చొప్పున ఉంచమన్నాడని చెప్పుకున్నాం కదా! అదే పద్ధతిలో ప్రళయానంతరం ఇంకా కొన్ని కొన్ని ప్రదేశాలలో కొంతమంది మనుష్యులు బతికి బయటపడి వుండవచ్చును."
"అంటే ప్రళయం వచ్చాక ఒకవైపు కొత్తగా సృష్టి జరుగుతూ ఉండగా ఇంకో వైపున గతించిపోయిన నాగరికత రహస్యాలు తెలిసిన వాళ్ళతో వుండి వుంటారన్నమాట!
"జస్ట్ లైక్ దట్. అది పెద్ద కాంట్రాస్ట్. ఒక వైపు అంధకారం. మరోవైపు మహా విజ్ఞానం. చెకుముకి రాయితో నిప్పు తయారు చేయడం నేర్చుకుంటున్న అనాది మానవులు, ఇంకోవైపు ఖగోళ శాస్త్రంతో సహా అన్నీ తెలిసిన నాగరికులు..."
చిత్రంగా చూస్తూ అన్నాడు అంకుష్.
"అయితే అంధ యుగాలలో కూడా వేద విజ్ఞానం వుండి వుండడానికి కారణం ఇదే అయి వుండవచ్చా?"
"అయి వుండాలి!"
"మరి తర్వాత ఆ విజ్ఞానం, వేద విజ్ఞానం అంతా ఏమయిపోయింది? మధ్య యుగాలలో అంత అంధకారం ఎందుకు ఆవరించింది? వేదాలలో వున్న టెక్నాలజీ మధ్య యుగాలలో ఏమయిపోయింది? మనం వేదాలలో వున్నవాటినే గత వందా, రెండొందల సంవత్సరాలుగా తిరిగి కనుక్కుంటున్నాం కదా! అలా ఎందుకు జరగవలసి వస్తోంది" అన్నాడు అంకుష్.
"వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ మైడియర్ అంకుష్" అన్నాడు సాహస్ మెచ్చుకోలుగా. "అయితే ఇక్కడొక చిన్న సవరణ. నేను వేదకాలంలో వుండిన టెక్నాలజీ అంటున్నాను. నువ్వేమో వేదాలలో వుండిన టెక్నాలజీ అంటున్నావు"
"తేడా ఏమిటీ?"
"వేదకాలంలో వుండిన టెక్నాలజీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ కాలంలో ఉన్న టెక్నాలజీ అని. అది వేదాలలో వున్న సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు. ఈజిప్టులో కట్టిన పిరమిడ్ల టెక్నాలజీ కావచ్చు. మరోచోట వున్న మరో విశేషం కావచ్చు. వేదాలలో టెక్నాలజీ అంటే కేవలం 'హిందూ మతపరమైన' అనే ఇరుకు అర్థం అయిపోతుంది."
"అర్థమయింది. అయితే నా ప్రశ్నకు జవాబు రాలేదు. వేదకాలంలో వున్న టెక్నాలజీ గత ప్రళయానికి ముందు వున్న నాగరికత తాలూకుదని అంటున్నావ్. కాని, అది మధ్య యుగాలలో ఎందుకు మాయమైపోయింది?"
"దానికి అనేకమైన కారణాలు వుండవచ్చు."
"లైక్ వాట్?"
"గత నాగరికతకి చెందిన మనుషులు ప్రళయం తరువాత కూడా మిగిలి వుంటారు. మళ్ళీ ఆ నాగరికత, ఆ టెక్నాలజీ సాయంతో అద్భుతాలు అనిపించే పనులు అనేకం చేసి వుండవచ్చును. అంటే మహాభారత యుద్ధ కాలంలోనే అణ్వస్త్రాలవంటి ఆయుధాల ప్రయోగం, విమానయానం...అలాంటివి. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం సర్వసాధారణంగా అందరికీ అందుబాటులో వుండదు. కేవలం కొంతమంది వ్యక్తులకో, కుటుంబాలకో పరిమితమై వుండిపోతుంది."
"ఎందుకనీ?"
"ఎందుకనీ అంటే చాలా పవర్ ఫుల్ అయిన ఆ సాంకేతిక రహస్యాలు అందరికీ తెలిస్తే తమ ప్రాముఖ్యం తగ్గిపోతుందన్న భయంతో గుప్పెట్లో పెట్టుకుని వుండవచ్చును. లేదా అతి ప్రమాదకరమైన సమాచారం అనర్హుల చేతిలో పడితే అది పిచ్చివాడి చేతిలో రాయిలాగా మారవచ్చుననే భయం వల్ల కావచ్చును."
"అలాగంటావా?"
"మొత్తానికి ఏ కారణం వలనయితేనేమి అత్యద్భుతమైన అనేక రహస్యాలు, సాంకేతిక పరిజ్ఞానం కేవలం కొంతమంది ఆధీనంలోనే వుండిపోయింది. ఆ విద్యలో వాళ్ళు అద్భుతాలు చేశారు. ఆ తర్వాత తర్వాత తరాలలో వాళ్ళు గతించడం, ఆ రహస్యాలు వాళ్ళతో బాటు అంతమైపోవడం జరిగి వుంటుంది. మధ్యయుగాలు వచ్చేసరికి ప్రళయానికి ముందు వుండిన నాగరికత తాలూకు చిహ్నాలు పూర్తిగా మాయమైపోయి చీకటి యుగం మొదలయింది. గత వందా, రెండొందల ఏళ్ళుగా మళ్ళీ మనం నాగరికతలో ఓనమాలు దిద్దడం మొదలుపెట్టామని చెప్పుకోవచ్చు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS