"మరేం చేసేది చెప్పండి, నా రేటు పెరిగిపోతే నేను మనసిచ్చిన అమ్మాయి అంత కట్నం యిచ్చుకోలేదు. అంచేత ఒకటికి రెండుసార్లు ఫెయిలవుతుంటే కట్నాల మార్కెట్ లో నా రేటు పరమ చీప్ గా పడిపోతుంది. రూపాయి కట్నమడిగితే మా నాన్నని చెప్పుతో కొడతారు. అ చెప్పుదెబ్బలు తినలేక గంతకి తగిన బొంతని చూసుకోమని నా పెళ్ళిగొడవ నాకే వదిలేస్తాడు, ఏమంటారు?" అన్నాడు కోదండరాం.
ఇదేదో చిక్కుల వ్యవహారంగానే కనిపించింది కృష్ణమూర్తికి.
"ఏమిటో అనుకున్నాను. నువ్వుకూడా కుంపటిలో కూచున్నావన్న మాట?" అన్నాడు అతను.
"కూడా అంటున్నారు. మీకూ వుందా ఏమిటి?" అడిగాడు కోదండరాం.
"మెల్లిగా అడుగుతావేం? పీకలదాకా ఇరుక్కుపోయాను. ఇప్పుడా విషయమెందుగ్గానీ- ఈ క్షణంనుంచీ మనం ఫ్రెండ్సుగా ఉందాం, ఓ.కే?"
"చదువుతప్ప మీరేం చెప్పినా నా ఓటు మీకే."
"ఆల్ రైట్! ఫ్రండ్సుమిగనక ఒకరికొకరు సహకరించుకోవడం ధర్మం. నే చెప్పేది శ్రద్ధగా విను. ఈ పరీక్ష పాసవ్వు. నా మాటకి అడ్డం రావద్దు. పాసయ్యేక నీకు నచ్చిన అమ్మాయితో నీ పెళ్ళి నేను చేస్తాను, ఓ.కే.?"
"మీరా! చాల్లే ఊరుకోండి."
"ఏం?"
"మానాన్న సంగతి మీకు తెలీదు కాబోలు తోలు వల్చేస్తాడు."
"అట్లాగా! నా సంగతేమిటో నీకూ మీ నాన్నకూ ముందు ముందు తెలుస్తుంది. పరీక్ష పాసవడం నీ ధ్యేయంగా పెట్టుకో! నీ పెళ్ళివిషయం నేను చూసుకుంటాను. నీచెయ్యి ఇవ్వు."
కోదండం ఇచ్చేడు. ఆ చేతిలో చెయ్యివేసి గంభీరంగా అన్నాడు-
"ఇది నా ప్రామిస్!"
23
ట్యూషన్ హోరాహోరీగా సాగుతుంది.
రోజులు జరుగుతున్నాయి. కృష్ణమూర్తి యజ్ఞం కూడా మహత్తరంగానే సాగుతోంది. కోదండానికి ట్యూషన్ చెప్పడంతో పాటు ఆ ఇంటిలో చిల్లరపనులు కూడా చేస్తున్నాడు.
పాదులకు నీళ్ళుపోయడం దగ్గర్నుంచీ పొలానికి ఎరువులు తోలేంత వరకు రెక్కలు ముక్కలయ్యేట్లు కష్టపడి పనులు చేస్తున్నాడు అతను.
లక్ష్మీపతి మాటవరసకి నీకెందుకీ అవస్థ అని అడిగినప్పుడు ఎప్పుటికప్పుడు అతను కొన్ని థియరీలు చెబుతున్నాడు.
థియరీ నెంబరు ఒకటి---
"మీరేదో మెచ్చుకుని నా మెడలో దండ వేస్తారనే ఆశతో నేను ఈ పనులు చేయడంలేదు. నేనెక్కడుంటే అదే నా ఇల్లుగా భావించడం నా అలవాటు. నా ఇంటి పనులు నేను చేసుకోడంలో తప్పుగానీ, దోషంగానీ లేవుగదా!"
థియరీ నెంబరు రెండు---
"మగపుట్టుక పుట్టేక గోళ్ళు గిల్లుకుంటూ కూచోడం నా కిష్టంలేదు. ఏదో ఒకపని చేయకపోతే నాకు తోచదు. అభ్యంతరం చెప్పకండి."
థియరీ నెంబరు మూడు---
"ఈ ఇంటిలో మీరొక్కరే మంచి ప్లానింగూ ఫ్యూచర్ మీద గొప్ప థింకింగూ ఉన్నవారుగా కనిపిస్తున్నారు. మీరు మాత్రం ఎన్ని పనులని చూసుకుంటారు? నేనేం పరాయివాడిని కాదుగదా, కొన్ని పనులు నా చేతులమీద జరగనివ్వండి, సంతోషిస్తాను."
థియరీ నెంబరు నాలుగు-
"పూర్వజన్మలో మీరెవరో నేనెవరో నాకు తెలియదు. మిమ్మల్ని చూస్తుంటే ఆ జన్మలో మీకు చాలా ఋణపడి ఉన్నానని అంతరాత్మ చెబుతోంది. ఆ ఋణాన్ని ఏ విధంగా తీర్చుకుంటున్నాను. నన్ను ఋణ విముక్తుడ్ని కానివ్వండి."
- ఈ విధమయిన థియరీలతో కృష్ణమూర్తి లక్ష్మీపతితో చాలా సుఖంగా చెడుగుడు ఆడుకుంటున్నాడు.
అతని మంచితనానికీ, పనితనానికి లక్ష్మీపతి అంతో యింతో పడిపోతూనే ఉన్నాడు.
అన్నపూర్ణమ్మగారి విషయం ప్రత్యేకించి చెప్పక్కరలేదు ఆమెకి ఒకే ఒక్క ఆలోచన- ఈ కృష్ణమూర్తి అల్లుడైతే బావుండిపోనూ అని!
పద్మకి మాత్రం ఇదంతా చిరాగ్గానే వుంది. ఎంత చిరాగ్గా వున్నా అతని స్వభావం తెలిసిన మనషి గనక నీకిదేం పోయే కాలమని అడగలేకపోతోంది.
ఒకరోజు---
కృష్ణమూర్తి నీళ్ళుతోడి పాదులకు నీళ్ళుపోస్తున్న కార్యక్రమాన్ని సత్యం చాలా పరిశీలనాత్మక దృష్టితో చూసేడు! సొంతయింట్లో పూచికపుల్ల సైతం అటుదిటు పెట్టని సుపుత్రుడు ప్రేమకోసమై యిక్కడ ఆపసోపాలు పడిపోవడం విడ్డూరంగా వుంది.
మాటల్లో అడిగితే సమాధానం తిన్నగా రాదేమోనన్న డవుటుతో పాటరూపంలో అడిగాడు. "కొడకా- ఇదేంఖర్మ అని." కొడుకు సూటిగానే సమాధానమిచ్చేడు. "ప్రేమ వరానికిది యజ్ఞమని."
* * *
ఆ ఇంటిలో అడ్డమైన చాకిరీ చేస్తూ హీనాతి హీనంగా బతికే కొడుకుని చూస్తుంటే సత్యంగారి కడుపు తరుక్కుపోయిన మాట వాస్తవమే.
కోటీశ్వరుడి బిడ్డగా పుట్టి--- ఒక ఆఫ్టరాల్ గాడింటిలో వెట్టిచాకిరి చేస్తుంటే ఏ తండ్రి సహించగలడు?
సత్యంగారు మాత్రం సహించక తప్పదనుకున్నాడు.
మరోపక్క పద్మ గుణగణాలు కనిపెట్టే ప్రయత్నాలలో ఆయన కూడా చురుకుగానే కార్యక్రమాలు నడిపిస్తున్నారు.
ఒకనాడు---
పద్మని పిలిచి ఫోటో ఆల్బమొకటి ఆమె చేతిలో పెట్టాడు.
"ఇందులో వున్న కుర్రాళ్ళందరూ కోటీశ్వరుల బిడ్డలే నా మాట ఎవ్వరూ కాదనరు. నీకు నచ్చినవాడ్ని ఎంచుకో! ఆ ఫోటోతీసి విడిగాపెట్టు. దట్సాల్! ఆ అబ్బాయితో నీ పెళ్ళి జరిపించే పూచీ నాది" అన్నాడు సత్యం.
పద్మ అమాయకంగా అతనివేపు చూసింది.
సత్యం నవ్వుతూ అన్నాడు---
"మీ నాన్న ఉద్దేశం కూడా అదే! నీకో మంచి సంబంధం చూడమని నన్ను ప్రాధేయపడ్డాడు. తప్పకుండా చూస్తానని అతనికి మాటకూడా యిచ్చేను. నీ మనసేమిటో తెలుసుకొని మిగతా ప్రయత్నాలు చేద్దామనుకుంటున్నాను. ఆల్బమ్ చూడు, ఏ కుర్రాడు నచ్చాడో రేపు ఉదయానికల్లా నాకు తెలియాలి. అతనితో నీ పెళ్ళి జరిపించి అమెరికాకో, ఆస్ట్రేలియాకో హనీమూన్ పంపించేస్తాను, ఓ.కే! ఇక నువ్వు వెళ్ళచ్చు!"
పద్మ ఆల్బమ్ తీసుకుని వెళ్ళిపోయింది.
సత్యం అర్ధవంతంగా నవ్వుకున్నాడు.
ఈ కాలపు ఆడపిల్లలకి ప్రేమా దోమా ఎంత ముఖ్యమో అమెరికా పారిస్ లు కూడా అంతే ముఖ్యం. అమెరికా కోసం తమ అమోఘమయిన ప్రేమనుకూడా త్యాగం చేయడానికి వెనకాడరని సత్యం అప్పుడే అనుకున్నాడు.
ఆ మరుసటిరోజు పద్మ ఆల్బంతోపాటు అతని గదికి తిరిగి వచ్చింది. ఆల్బంని సత్యానికి అందించింది.
ఆల్బం తీసుకుంటూ అడిగాడు సత్యం.
"వరుడ్ని ఎంచుకున్నావా?"
"మీరు చెప్పినట్టే ఆ ఫోటో విడిగా పెట్టాను. కవరు తెరవగానే కనిపిస్తుంది. దయచేసి చూడండి" అన్నదామె.
