Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 38


    అంత త్వరగానా? వీలుపడదని చెబుదామనుకుంది. కనీ అంతలోనే అర్జునరావు పాప తనను శోధిస్తోందని చెప్పటం గుర్తువచ్చి మౌనంగా వాటిని అంగీకరిస్తూ తలూపింది నాగమ్మ.

 

    "సాయంత్రం వరకు ఇక్కడే వుండి పెళ్ళిచూపుల తతంగం కూడా నిర్వహించి వెళితే బాగుంటుంది. ఏమంటారు?"

 

    నాగమ్మ కోర్కెను కాదనలేకపోయాడు పూజారి.


                                                      *    *    *    *


    నాగమ్మ సెక్రటరీని పిలిచి పెళ్ళిచూపులు అరేంజ్ చేయమని చెప్పడం- అతను వెంటనే ఆ పనిలో నిమగ్నమయి పోవటం క్షణాల్లో మొదలయిపోయింది.

 

    నాయకి ఫస్ట్ ఫ్లోర్ లో వున్న టెర్రస్ పిట్టగోడ కానుకొని మంద్రస్థాయిలో వీస్తున్న పిల్లగాలి తాకిడికి ఊగుతున్న అశోక్ వృక్షాల కేసే చూస్తోంది.

 

    ఒక నిమిషం క్రితమే ఆమెకి ఆ సాయంత్రం ఆరున్నరకి పెళ్ళిచూపులనే వార్త అందింది.

 

    అసలవి పెళ్ళిచూపులు కావు - కాబోయే వధూవరులు ఒకరినొకరు చూపులతో పరామర్శించుకోవటమని కూడా నాగమ్మ తన మనుమరాలికి తెలియపర్చింది.

 

    ఇప్పుడామె స్వచ్చమైన హృదయపీఠంపై సంఖ్యాతీతమైన మధురోహలు ముద్ర వేసుకుంటున్నాయి.

 

    ఆమెలోని అనంతమైన కోర్కెలు ఆమె ఊహల్ని స్వకీయం చేసుకునేందుకు ఆరాటపడుతున్నాయి.

 

    ఇన్నాళ్ళ తన ఒంటరి జీవితాన్ని తరిమికొట్టే ప్రణయభాగస్వామి ఎన్నిక చేయబడ్డాడన్న భావన ఆమెను ఓ చోట నిలువనివ్వటం లేదు.

 

    ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్?...

 

    ఆపైన పిహెచ్.డి...

 

    స్వయంకృషితో పైకొచ్చిన ధీశాలి...

 

    లక్ష్యశుద్ధి వున్నవాడు...

 

    శ్రమను గౌరవించే ఉన్నతుడు...

 

    నీతి, నిజాయితీలంటే ప్రాణమిచ్చేవాడు...

 

    ప్రవర్తనలో హుందాతనం...

 

    ఎవరి అండా లేకుండా ఒంటరిగా పోరాటం సాగిస్తున్నవాడు ఆజానుబాహుడు...

 

    అందగాడు...

 

    నిజంగా ఇన్ని లక్షణాలు ఒక యువకుడితో వుండటం అబ్బురమైన విషయమే!

 

    'వీటికి తోడు ఎప్పుడూ ఏ కష్టానికి వెరవనివాడు- తాను బ్రతుకుతూ నలుగుర్ని బ్రతికించగలిగేవాడు- తాను నవ్వుతూ నలుగుర్ని నవ్వించ గలిగేవాడు- ప్రేమించేవాడు- ఆ ప్రేమకు విలువనిచ్చేవాడు- శృంగారానికి ఆది అంతాన్ని తెలుసుకోగలిగేవాడు, అనుబంధానికి, ఆత్మీయతకు అర్థం చెప్పగలిగేవాడు అయితే చాలు.'

 

    తన నాయనమ్మ సంకల్ప బలాన్ని మెచ్చుకోకుండా వుండలేక పోయింది నాయకి.

 

    ఎన్నో సంబంధాల్ని వడకట్టి ఈ సంబంధాన్ని ఎన్నిక చేసింది. ఎంత సహనం, ఎంత ఓపిక! మరెంత ప్రేమ తన మీద...?

 

    ఇంక తను చూసేదేమిటి?

 

    ధైర్యంగా తాళి కట్టించుకోక...

 

    హృదయంలోంచి చీల్చుకు వస్తున్న కోర్కెల అల్లరి రొద ఆమెని వివశురాల్ని చేస్తోంది.

 

    "ఒక గొప్పవ్యక్తికి భార్యను కావడం, నిజంగా నా అదృష్టమే...

 

    నా ఆశలకి, ఆశయాలకి, ఆదర్శాలకి ఆలంబన అయి అద్దంపట్టే ఓ అద్భుతమైన వ్యక్తి! నా హృదయపూర్వక ఆహ్వానాన్ని పంపిస్తున్నాను. అందుకొని ఆర్తిగా నాకై పరుగులు తీస్తూ రా..." ఆమె కెప్పుడూ అనుభవంలో లేని చిత్ర విచిత్రమైన ఆలోచనలు ఆమెనిప్పుడు ఆనందోద్వేగంలో ముంచివేస్తున్నాయి.


                                                    *    *    *    *


    వెళ్ళిన అరగంటకు రెండు అశోక్ లేలాండ్ లారీలతో తిరిగి వచ్చాడు నరసింహం.

 

    మోటార్ బైక్ కి స్టాండ్ వేసి, లారీలో వున్న హమాలీలకి సైగ చేశాడు.

 

    వెంటనే రెండు లారీల్లోంచి పదిమంది దాకా హమాలీలు దిగి నరసింహాన్ని అనుసరిస్తూ ఆరవ నెంబర్ ఇంటిలోకి దారితీసారు.

 

    నరసింహం కీ తీసి డోర్ లాక్ ఓపెన్ చేసి వాళ్ళను లోపలకు రమ్మని సైగ చేస్తూ తను ముందుకు సాగి హాల్లోకి వెళ్లాడు.

 

    అక్కడ మధుమతి కనిపించలేదు. వాళ్ళనక్కడే వుండమని, తనుమాత్రం పైకెళ్ళి చూసాడు. అయినా మధుమతి కనిపించలేదు. పైనున్న గదులన్నీ వెతికాడు. ఫలితం లేకపోవడంతో షాపింగ్ కి బయటకు వెళ్ళి వుంటుందని భావించి క్రిందకు వచ్చి పాత ఫర్నిచర్ ని లారీల్లోకి ఎక్కించమని ఆజ్ఞ జారీ చేసాడు.

 

    ఆ కార్యక్రమం దాదాపు గంటసేపు పట్టింది. నరసింహం తిరిగి ఇంటికి తాళం వేసి లారీలతో బయలుదేరాడు.

 

    ఈసారి ఆరవనెంబర్ ఇంటికి ఇరువేపుల వున్న ఇళ్ళలో నివసిస్తున్న కొందరు నరసింహాన్ని, అతని పనుల్ని చూసి విస్తుపోయారు.

 

    వాళ్ళు అలా వెళ్ళిపోగానే మధుమతి వేగంగా ఆరవ నెంబర్ ఇంటి వెనుకవేపు చేసుకుంది. పెరటి ద్వారాన్ని తెరుచుకుని ఇంటిలోకి ప్రవేశించింది. అప్పుడు సమయం సాయంత్రం ఆరుగంటలు. ఇల్లంతా చీకటిగా వుంది.

 

    అప్పటివరకు హేండ్ బ్యాగ్ లో వున్న పెన్ టార్చ్ బయటకు తీసి బటన్ ప్రెస్ చేసింది.

 

    సన్నటి వెలుగురేఖ లేసర్ బీమ్ లా పదడుగుల దూరం వరకు దూసుకుపోయింది.

 

    దాని సహాయంతో మెల్లగా మెయిన్ హాల్లోకి వచ్చింది.

 

    అక్కడో క్షణం ఆగి టార్చ్ ని నలువేపులా తిప్పుతూ చూసింది. హాలంతా బోసిగా కనిపించింది. చిరునవ్వు ఓ క్షణకాలం ఆమె పెదవులపై మెరిసి అదృశ్యమైపోయింది.

 

    ఆమె అక్కడి నుండి టెలిఫోన్ దగ్గరకు నడిచి ప్రక్కనే వున్న స్టూల్ మీద కూర్చుని ఫోన్ చేతిలోకి తీసుకుని ఒన్... ఫైవ్... సెవెన్ కి రింగ్ చేసి అత్తిలికి ట్రంకాల్ బుక్ చేసింది.
    


    నో డిలే సర్వీస్ కావటంతో క్షణాల్లో లైన్ దొరికింది.

 

    ఫోన్ లో ఆవేపు ఓ వ్యక్తి లైన్ లోకి వచ్చాడు.

 

    ఆ వ్యక్తి వంట ఆముదం వ్యాపారం చేస్తుంటాడు.

 

    అతనితో ఆముదం వ్యాపారం గురించి పావుగంట మాట్లాడి ఫోన్ పెట్టేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS