ఏమంటారు అన్నట్లు రజియా ను, సుగుణను చూశాడు రాజ్. అభ్యంతరం లేదన్నాయి వారి చూపులు.
"ఈ గోపీగాడు ఎక్కడ చచ్చాడ్రా?' అడిగాడు ఆనంద్ దియేటర్ లో ప్రవేశిస్తూ.
వారిని చూసి "రండి సార్" అన్నాడు గెట్ కీపర్ వారిని గుర్తించి.
ఆనంద్ ఠీవి గా "మీ మేనేజరు గారు లేరా?' అనడిగాడు.
"వారు రాలేదు సార్! ప్రోపయిటర్ గారికి ఒంట్లో బాగులేక ఇంటి దగ్గరే ఉన్నారు."
"ఏమిటీ? ముకుందరావు గారికీ ఒంట్లో బాగులేదా? ఎప్పటి నుండి?" ఆశ్చర్యపోయి అడిగాడు రాజ్.
"ఓ వారం రోజులవుతొందండీ!"
ఆనంద్ ను చూశాడు రాజ్. తల ఊపాడు ఆనంద్.
"రజీ, మీరు పిక్చర్ చూస్తుండండి. మేం గోపీ వాళ్ళింటికి వెళ్ళొస్తాం."
"అలాగే" అన్నది రజియా.
"చాలా దూరం ఉంది కదరా! నడిచే వెళదామా?" అడిగాడు ఆనంద్.
"రిక్షాలో వెళదాం పద. " మౌనంగా ఏదో ఆలోచిస్తున్న రాజ్ అన్నాడు.
ఇంట్లో ప్రవేశిస్తున్న రాజ్ గడప దాటుతుండగా క్రింద పడ్డాడు.
"ఏమిటిరా" అని ఆనంద్ అతన్ని లేవనెత్తుతుండగా పై నుండి ఎవరో ఆడవారు ఏడుస్తునట్లు విన్నాడు రాజ్. ఒక్క పరుగున పైకి చేరుకొన్నాడు . శారద తండ్రి శవం పై పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. శవం కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తున్నాడు గోపీ. ప్రక్కన ఒక కుర్చీ పై శారద భర్త తలను చేతులతో పట్టుకొని కూర్చుని ఉన్నాడు. ప్రక్కన గోపీ తల్లితండ్రులు బంధువులూ ఉన్నారు.
రాజ్ ను చూసిన గోపీకి దుఃఖ మాగలేదు మిత్రుడిని కావలించు కొన్నాడు.
"గోపీ, ఏమిటిది? చిన్నపిల్లాడి;లా నువ్వు కూడా ఏడుస్తూ కూర్చుంటే శారదను ఓదార్చేదెవరు? ఈ తతంగమంతా చేసేదెవరు? ధైర్యం తెచ్చుకో. ఊరుకో."
"ఏం ధైర్యం తెచ్చుకోను? ఇంత భారాన్ని నా నెత్తిన వదిలి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు మామయ్యా. ఈ బరువు నెలా మోయడం?"
"ఛ , ఊరుకోరా" మిత్రుడి ను ఓదార్చాడు రాజ్
26
"ఇక ఈ జన్మలో దానికి పెళ్లి చెయ్యలేను." నిట్టూర్చాడు ఆనందరావు గారు.
"అంత నిరుత్సాహా పడిపోతే ఎలాగండీ? మన ప్రయత్నాలు మనం చేస్తుంటే సమయం కలిసి వచ్చినప్పుడు దానంతట అదే అవుతుంది." అన్నాడు రాజ్.
"ఆ. ఇక నా శ్రాద్ధం కావలసిందే . మానం మర్యాద పోగొట్టుకొని అందరి గడపా త్రొక్కి నానా మాటలూ అనిపించుకోన్నాను. కట్నం ఎక్కువిస్తామని చెప్పినా కూతురి గుణాలు కప్పి పెట్టడానికి డబ్బును ఆసరాగా పెడుతున్నావా అన్నారు."
"వాళ్ళేదో అన్నారని మీరు దిగులుపడితే ఎలా?"
"దిగులుపడక చేసేదేముంది చెప్పు? నేను బ్రతికి ఉండగా దాని పెళ్లి కాదు. నా ఆరోగ్యం దినదినానికి పాడై పోతోంది. నే చచ్చేలోగా కూతురి పెళ్లి చెయ్యలేక పోయానని లోకం అపవాదు."
"మీరు దాన్ని గురించి ఎక్కువ ఆలోచించ కండి. అదంతా నే చూసుకుంటాను. ముందే మీకు రక్తపోటు . దీన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే వ్యాధి మరింత వృద్ది చెందుతుంది. ఆ ఆలోచనే మానేయ్యండి."
"మానివేసి ఏం చెయ్యమంటావు? నా చేతకాని తనానికి ఏడుస్తూ కూర్చో మంటావా ?"
"నాన్నా, నేను పెళ్ళే చేసుకోను." అంది, అంతవరకు వారి మాటలు వింటున్న వసంత.
ఆ మాట విన్న ఆనందరావు గారి కోపం మితిమీరి పోయింది కోపంగా లేచాడు.
"పెళ్లి చేసుకోక? ఉన్న మానం, మర్యాద అన్నీ మంట గలిపావు. చాలదూ? ఇంకా సిగ్గు లేక పెళ్లి కూడా చేసుకోకుండా తిరుగుతానని చెపుతున్నావా? ఫో అవతలికి."
"ఏమైనా కానీ, నాకు పెళ్లి వద్దు."
"ఔను . నీకు నీ కన్నవారి మర్యాద తో వారి సుఖం తో ఏం పని? ముసలితనం లో ఉన్న తండ్రిని సుఖ పెట్టాలనే జ్ఞానం నీ కెందు కుంటుంది? నీ సుఖం, నీ ఆనందం నీవే! నీకోకరి సుఖ శాంతులతో పనిలేదు. నీలాంటి బిడ్డను కన్నందుకు ఇప్పుడేడుస్తున్నాను." అని గుండె చేత్తో పట్టుకొని "అబ్బా" అని క్రింద పడబోయారు ఆనందరావు గారు.
రాజ్ వారిని పట్టుకొని సోఫా లో కూర్చో బెట్టాడు.
"వసంతా, దయచేసి అవతలి కెళ్ళు" అని ఆనందరావు గారిని వారి గదిలోకి తీసు కెళ్ళి నౌకరు పరిచిన ప్రక్కపై పడుకో బెట్టాడు.
"నువ్వెళ్ళి డాక్టరు గారికి ఫోను చెయ్యి." ఆజ్ఞాపించాడు నౌకరు కు.
'అక్కరలేదోయ్!" చిన్నగా మూలిగాడు ఆనందరావు గారు.
"అదేమిటండి!"
"మరేం ఫర్వాలేదోయ్!" లేవబోయారు.
"అరే ! మీరు నెమ్మదిగా పడుకోండి."
"ఏం నేమ్మదో! జీవితం పై విసుగు పుడుతోంది."
"మీరు మనసులో ఏ ఆలోచనలూ పెట్టుకోక విశ్రాంతి తీసుకోండి."
"ఇక చచ్చి పోయిన నాడే విశ్రాంతి."
"నామాట వినండి. నెమ్మదిగా పడుకోండి."
"మరి నా మాట వినేదెవరు?"
"అందరూ వింటారు. కాసేపు నిద్రపోండి. అంతా పోతుంది.
"ఆ విషయాలు పోనీలే. అనుకొన్నట్లు నువ్వు ఫస్టున పాసయ్యావు. అదృష్టవ శాత్తూ లెక్చరర్ ఉద్యోగం కూడా ఈ ఊళ్లోనే దొరికింది కదూ? ఈనాడు మీ నాన్న కిచ్చిన మాటను నెరవేర్చగలిగాననే తృప్తి నాకు కలిగింది."
"అంతా మీ చలువే. మీ అభిమానంతో నే ఇంత వాడినయ్యాను."
"నీలాంటి వారికి సహాయం చేసేందుకు కూడా ఎవరికైనా పూర్వజన్మ సుకృతం అంటూ ఉండాలి." నిట్టూర్చారు వారు.
* * * *
"ఖాన్, మీ అమ్మాయి చాలా అదృష్ట వంతురాలు.
"రజియా నీ కూతురు కాదా, సరూ?"
ఏం జవాబు చెప్పగలదు? కన్న కూతురును తన బిడ్డ అని చెప్పుకొనే అర్హత లేదు. నోరు తెరిస్తే సంఘం లో తనకు ఉండబోయే గౌరవం ఊహించు కోగలదు. ఇటువంటి జన్మలను ఎందుకిస్తావ్ , భగవాన్!
"పోనీలే, సరూ! ఆ విషయాలు మరిచి పో. అమ్మాయి డాక్టరు. అల్లుడు లెక్చరర్. అంత కన్నా ఏం కావాలి? కనీసం వారి జీవితాలైనా సుఖంగా గడిచి పొతే చాలు."
వీరింకా రాలేదా?"
* * * *
"అప్పుడే పోయి ఏం చేద్దాం , రాజ్? ఇంకాసేపు కూర్చో."
"ఎంతసేపు కూర్చున్నా ఇంతే కదా, రజీ!"
'అక్కడ మాత్రం నీకేం పని ఉంది?"
"చెప్పనా?"
"ఊ. చెప్పు."
"ఒక పెద్ద యిల్లు కొనుక్కోవాలి."
"యిల్లా? అందులోనూ పెద్దది. నీకేందుకు?"
"ఎందుకంటావేమిటి? మా శ్రీమతి డాక్టరు. ప్రాక్టీసు కు పెద్ద యిల్లు తీసుకోక చిన్న గుడిసె తీసుకో మంటావా!" అతని చిలిపి చూపుల నుండి తప్పించు కోవడానికి రజియా సిగ్గుతో చేతులతో మొహం దాచుకొంది.
"మీ ఆడవాళ్ళ కు అడగకుండానే సిగ్గు వచ్చేస్తుంది. ఏదీ ఒకసారి సిగ్గుతో ఎర్రబడ్డ నీ మొహాన్ని చూపించు." ఆ చేతులను తీసేశాడు.
"పొండి , మీరు మరీను" అంటూ రజియా అతని గుండెలలోనే తల దాచుకొంది.
"ఇదేమిటి? బహువచన ప్రయోగం చేస్తున్నావు?"
"మరి సంప్రదాయం ప్రకారంగా భర్త గారిని ఏమంటారు?"
"అప్పుడే పెళ్ళయి పోయిందా?"
"కాకపోయినా అయిందను కొంటాను."
"ఓహో, ఇది రిహర్స'లన్న మాట."
"రాజ్, నాన్నగారు ముహూర్తం పెట్టించ మంటావా అని అడుగుతున్నారు."
"నాకేం అభ్యంతరం లేదని నేనూ చెప్పమంటున్నాను."
జయించాను అంటూ ఆకాశాన్ని చూసింది రజియా.
సముద్రుడు ఆ శుభవార్త నేనూ విన్నానులే అని ఆశీర్వదిస్తున్నట్లు నీటి తుంపరలను చల్లింది. పక్షులు కలకలారావములు వినిపిస్తున్నాయి. సముద్రపు హోరు ఎక్కువయింది. చల్లని గాలి వారి శరీరాలతో అడుకొంతుంది. ఆవేళ పూర్ణిమ. పున్నమ చంద్రుడు నిండు వెన్నెలను కురిపిస్తున్నాడు . అప్పుడే షికారు కొచ్చిన అతని అందం ఆనందాన్ని కలిగిస్తుంది. అది చూచి సముద్రం అంతులేని ఆనందంతో పొంగుతుంది. ఆ పొంగు చూస్తుంటే భయం వేస్తుంది. తనకోసం విప్పారిన కలువలను, తన కాంతి కోసం ఆనందిస్తున్న చకోరాలను చూచి నవ్వుకుంటున్నాడు చంద్రుడు. అప్పుడప్పుడు మబ్బుల చాటున మాయమవుతూ వాటితో ఆడుకుంటున్నాడు.
` ఆ వెన్నెల పెళ్లి పందిరి కాగా, చంద్రుడు పెళ్ళి పెద్దయి , సముద్రపు హోరు మేళం కాగా, నీటి తుంపరులు అక్షింత లై అలరారగా , పంచ భూతములు సాక్షిగానూ, సముద్రుడు కార్య నిర్వాహకుడుగాను అయి ధైర్యాన్నిస్తుండగా, వారి పెళ్ళయి పొతే?
* * * *
పేవ్ మెంటు మీద నడుస్తున్న రాజ్ తాను ఎక్కడున్నానని కూడా తెలుసుకోలేక పోయాడు. తల తిరిగి పోతున్నట్లు కాగా ఆ ఆలోచనలకు అంతం లేక ఎదురుగా ఏమున్నదీ తెలుసుకోలేకుండా రోడ్డుకు అడ్డం నడిచాడు. "రాజా" అంటూ ఆనంద్ అతన్ని ప్రక్కకు లాగడం, ఒక కారు రయ్ మని వారి ప్రక్క నుండి దూసుకు పోవడం ఒకేసారి జరిగాయి.
"ఏమిట్రా , అంత పరధ్యానం?' గద్దింపుగా అడిగిన ఆనంద్, రాజ్ మొహం చూసి అదిరి పడ్డాడు. చిన్నప్పటి నుండి చూస్తున్నాడు తను. ఏనాడూ అతని ,మొహంలో బాధ కనుపించేది కాదు. ఈనాడు ఆ బాధలో ఏం చేసేది కూడా తెలుసుకోలేక పోతున్నాడంటే అందుకు కారణం ఎటువంటిదో ఊహించు కోగలిగాడు.
"మా ఇంటికి పోదాం, పద."
రాజ్ మౌనంగా అతన్ని అనుసరించాడు. తనకు కారు ప్రమాదం తప్పింది, అందుకు సంతోషించాలి అని కూడా అనుకోలేదు.
"రాజా! ఎన్నడూ లేని మార్పు ఈనాడు నీలో కనిపించింది. కారణం తెలుసుకోవచ్చా?" గంబీరంగా అడిగాడు ఆనంద్.
కుర్చీలో కూర్చొని వెంట్రుకలలోకి చేతులు పోనిచ్చి విసుగుగా తలను చేత్తో రాచుకుంటున్న రాజ్ అతని కళ్ళలోకి చూసి తిరిగి కుర్చీలో వెనక్కు వాలిపోయి, "ఏమీ లేదురా" అన్నాడు.
'అబద్దం . నువ్వేదో దాస్తున్నావు. నాతొ చెప్పకుంటే నా మీద ఒట్టు."
'అంత మాటెందుకురా! నీతో కాకుంటే ఇంకెవరితో చెప్పుకొంటాను? నేను వసంత ను పెళ్లి చేసుకోవాలిట."
"ఏమిటీ?"
"ఇది ఆనందరావు గారి ఒక్కగానొక్క కోరిక. ఇప్పుడు చెప్పు. ఏం చెయ్యమంటావు?"
"చేసేదేముంది ? వీల్లేదని చెప్పెయ్యి."
'అదంత తేలికే అయి వుంటే ఆ పని నేనప్పుడే చేసేవాణ్ణి."
"ఇందులో కష్ట మేముందిరా? నీ పరిస్థితుల్లో నేనే ఉంటె అలాగే చెప్పేవాడిని."
"ఆనంద్! ఈ బాధ నీకర్ధం కాదు. వారి డబ్బుతో పెరిగిందీ శరీరం. ఆయనే లేకుంటే నేనీనాడు ఇటువంటి పరిస్థితులలో ఉండేవాడిని కాదు. అనాధయైన నన్ను చిన్నప్పటి నుండీ ఆదరణ తో పోషించి చదివించారు. ఈనాడు నేను నలుగురి లో ఒకరిగా ఉంటున్నాను అంటే ఆయనే కారణం. ఆయనే లేకుంటే నేను ఒక బికారి గానో, బిచ్చ గాడిగానో లేక అన్నం దొరకక ఆకలితో అలమటించి పోయి చెయ్యరాని పనులు చేసి ఒక దొంగగా , హంతకుడి గా కూడా తయారయ్యే వాడినేమో? నన్ను దగ్గర తీసి పోషించకుంటే నా ఈ రూపం ఈ ప్రపంచం లో ఉండేది కాదేమో? నాలో ఇంత చదువు, సంస్కారం , విజ్ఞానం, అలవడడానికి ఆధారం అయన. అటువంటి వారి ఒక్కగానొక్క కోరిక తీర్చలేని నాడు ఈ చదువు లెందుకు? ఈ శరీర మెందుకు? మనం మనుష్యులం . చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకోవడం మన విధి. అది చేయలేని నాడు మనకూ, మృగాలకూ బేధం లేదు. అలాంటప్పుడు ఒక దిక్కు లేని జీవితాన్ని రూపులు దిద్ది సమాజం లో ఒక మనిషి గా నిలిపినవారి ఒక్కగానొక్క కోరిక తీరనప్పుడు ఈ ప్రపంచం లో మంచి తనానికే విలువ ఉండదు. నా బ్రతుకు కుక్క కన్నా హీనమై పోతుంది."
