పరుల ఇల్లు
'ఇళ్ళన్నీ ఒకేరకంగా ఉన్నాయి. నేను పరుల ఇంట్లో ప్రవేశించలేదుకదా?'
నన్ను ఆస్పత్రినుంచి ఇంటికి తీసికెళ్ళేప్పుడు తేప తేప నాకు అదే ఆలోచన వచ్చింది.
కారు ప్రమాదంలో బలమైన గాయం తగిలిందన్నారు డాక్టర్లు. అంతా అబద్ధం. గాయం తగిల్తే బాధపెట్టాలిగా? నాకేమి బాధలేందే!
వాళ్లంతా అదోలా చూస్తున్నారు నన్ను. నాకు కాపలా కాస్తున్నారు. నేను పారిపోతానేమో అన్నట్లు చుట్టివేశారు.
నేను అనుకున్నంతా అయింది.
నన్ను పరుల ఇంట్లో వదిలివెళ్ళారు. నన్నుపట్టి మంచంలో పడుకోబెట్టారు. ఎవరో ఆడది పెద్దగా ఏడుస్తూంది. "హయ్యో! ఏమాయే!! ఇతడు నా హామిద్ ఎలా అవుతాడు? ఎందుకిలా అయింది?" అని మొత్తుకుంటూంది.
'అమ్మా! ఆ దుప్పటి కప్పుకున్నదెవరు? నాన్న మంచంమీద ఎందుకు పడుకున్నాడు?' ఒక పిల్లవాడు అడుగుతున్నాడు.
ఇహ ఎలాంటి అనుమానం లేదు. పొరపాటున మరో ఇంటికి వచ్చేశాను.
పొరపాటున మరొకరి ఇంటిలో దూరితే ఏమౌతుంది అని నేను. ఎప్పుడూ ఆలోచిస్తుండేవాణ్ణి. ఏమౌతుంది ఇంట్లోవాళ్లు వస్తారు. నన్ను తరుముతారు. నేను పారిపోతాను.
కాని ఇక్కడ అలాలేదే! నాలుగువేపులా మనుషులున్నారు. నన్ను పట్టుకుని కూర్చున్నారు!
'వదినా ఊరుకో, ఏమిటా ఏడుపు' అని ఎవరో వారిస్తున్నారు. "మీరు ఇంత గోలచేస్తే అతడు ఇప్పుడే పిచ్చివాడయిపోతాడు. మీరంతా శాంతంగా ఉండాలి. అతణ్ణి మరిపించాలి. అతని ధ్యాస ఇంటివైపు మళ్ళేట్లు చేయాలి"
"మరిపించండి-మరిపించండి" ఏమిటిది? ఎందుకు అంటున్నారు వీళ్ళంతా ఇలా? అంటే నేను పరాయి ఇంటికి వచ్చినట్లేగా? ఎవడా వెధవ-పిరికిపంద-పెళ్ళాం పిల్లల్ను సాగలేక పారిపోయాడు? నన్నెందుకు ఇలా పడుకోబెడ్తున్నారు? అందరూ దొంగల్లా ఉన్నారు-దోపిడీదార్లు. నన్ను దోచుకుంటున్నారు. అవును. నా తాళంచెవులేవి? తాళంచెవులివ్వండి- నా తాళంచెవులు!
ఏమిటీ వెధవ ఇల్లు- ఈ గదిలో వెలుగేలేదు! ఏమిటి-ఇవ్వాళ ఇంకా సూర్యుడు రాలేదా? సూర్యుణ్ణి మరొకరి ఇంట్లో చెరపెట్టారేమో! ఉహూ! ఇది రాత్రిలా ఉంది. రాత్రి అయితే చంద్రుడుండాలిగా! చుక్కలుండాలి.
చందమామ రావే
జాబిల్లి రావే
ఓహో! వచ్చిందెవరు? సూర్యుడుగారా! రాండి. రాండి. ఇహ సూర్యుడు రావలసిందే. సూర్యుడు లేని పగలు! ఏమిటిది? ప్రళయం కాదూ!
సూర్యుడు రాకుంటే నేను గడ్డం ఎలా గీక్కుంటాను. టీ ఎలా తాగుతాను? చీకటి గదిలో షేవ్ చేసుకోను వస్తుందా? ఛీ మెడ కోసుకోను. అదేమిటి డాక్టర్ నన్ను షేవ్ చేసుకోవద్దంటాడు? ఏమీ, నాకేమైంది? కారు ప్రమాదంలో చేతులు కూడా విరిగాయనుకుంటున్నారా? వెర్రివాళ్లు.
నాకు షేవ్ సామాను ఎలా దొరుకుతుంది? తాళంచెవులు పోయినాయే! అన్నీ పోయినాయి. అంతా మాయం అయింది. దొంగలు-దొంగలు నా సొత్తంతా దోచుకున్నారు. పారిపోయారు. ఇది ఇల్లుకాదు. దొంగల బస్తీ. ఏమిటలా చూస్తారు- అందరూ నన్ను-వింతగా- విచిత్రంగా. ఏమిటా గుసగుసలు? వాడెవడు? అన్నం తెచ్చే ఫజ్లూ. వాడూ నన్ను చూచి నవ్వుతున్నాడు వెధవ.
పాపం, వీళ్ళంతా పిచ్చివాళ్ళలా ఉన్నారు. కారు ప్రమాదంలో కావచ్చు. అంతా కార్లో వెళ్తున్నారు ఎక్కడికో- అమాంతంగా- అబ్బ! ఏమిటి నా తల ఇలా బద్దలవుతుందేమీ? అవును. నిజమే ఎవడో రాయితో కొట్టాడు నన్ను. నేనేం చేయాలి? నేనూ మళ్ళీ రాయితోనే కొట్టాలి. అందరినీ కొట్టాలి. కసి తీర్చుకోవాలి. కాని ఇప్పుడెలా? ఈ పరుపు మెత్తగా ఉంది. హాయిగా ఉంది. లేవాలనిపించడంలేదు. ఎవడా మనిషి-కిటికీలో కూర్చున్నాడు. నన్నే చూస్తున్నాడు. ఎందుకలా చూస్తాడు నన్ను? భయంకరంగా ఉన్నాడు. నాకు భయంగా ఉంది. ఎలా లేస్తాను మరి, వాడే "చూశావా పట్టేశాం" అంటున్నాడు. వాడెవడు నన్ను పట్టడానికి?
"అరే వెధవా! పో ఇక్కణ్ణుంచీ వెళ్లు. నన్ను వదులు" కేక పెట్టాను.
నా కేకలు విన్నారు. ఒక స్త్రీ గదిలోకి వచ్చింది. ఆమె లావుగా ఉంది. బొద్దుగా ఉంది. ఆమెపేరు "నిమ్మో."
అవును ఆమెపేరు నాకెలా తెలిసింది? విచిత్రమే. ఇందులో ఒక నాటకం ఉంది. ఆమె నా భార్యట! ఛ. చూస్తేనే అసహ్యంగా ఉంది. దాని ముఖం అదీ, అబ్బే! 'చూడు. నిన్ను నా కాలితోకూడా తాకను ఆ' అని చెప్పేశాను ముందే. అయినా నా గదిలోకి వస్తుంది. ఒక్కసారి కాదు. అనేకసార్లు. అంతేకాదు, కోప్పడుతుంది. మెదలకుండా పడుకొమ్మంటుంది. హుకుం జారీ చేస్తుంది. వచ్చే జన్మలో నాలాంటివాడి పెళ్ళాం కావడం ఖాయం.
ఆమె గదిలోకి వచ్చింది. "ఎవరు వచ్చారు? ఎందుకా కేకలు?" అని అడిగింది.
"ఎవడువాడు? ఎందుకు ఎప్పుడూ నన్ను కొరకొర చూస్తుంటాడు?" అడిగాను కిటికీలో కూర్చున్నవాణ్ణి చూపి.
"యా! అల్లా! నామీద దయదలచు" అని నొసలు బాదుకుంది.
"వాడు మనిషా? వాణ్ణి చూచి దడుపేమి? అది ఫోటో! ఏమిటి మిమ్ముల్నే మీరు మరచారా?"
కాదు కావడానికి వీల్లేదు. వాడు "నేను" ఎలా అవుతాను? తప్పు 'వాడు' 'నేను' అయితే మరి నేనెవరు? కాదు ఏదో గొడవ అయింది. మా ఇద్దరిలో "అసలు నేను" ఎవరు? అరే! నిజం మనిషి మరొకడని తెలిస్తే! ఇంకేముంది? వీల్లేదు-నేను దాక్కోవాలి. ఏదీ నా దుప్పటి. ఇహ ఎవరన్నా మొత్తుకోనీ-పలకను ఆహఁ- పలకనే పలకను.
మరో గదిలోనుంచి ఎవరో అంటున్నారు. అవును. అతను పలికేది నాపేరే! ఏమంటున్నాడు?
"వాడికి పిచ్చెక్కలేదు. మీరు వాడికి చికిత్స చేయించరు. వాడు బాగుకావడం మీకు ఇష్టంలేదు. బాగయితే మీమీద పెత్తనం చలాయిస్తాడని భయం.
ఇంత ఆస్తి! బ్యాంకులో డబ్బు!! ఏడువందల పెన్షన్!!!
ఎవడు వాడు? 'నిమ్మో' మొగుడు కావచ్చు. ఖాయం వాడే. పిచ్చెక్కినట్లుంది. అంతా కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేయాలనుకుంటున్నారు. కుట్ర చేస్తున్నారు. 'నన్ను' రెండు ముక్కలు చేశారు. వ్రేలాడతీశారు. ఇదీ కుట్రలో భాగమే. నన్ను ఆస్పత్రి నుంచి ఎత్తుకొని వచ్చారు. నన్ను దొంగిలించారు. వీళ్లు దొంగలు.
ఎవరది, ఎవరు నా దుప్పటి గుంజేది? నేనిక్కడ లేను, పైన ఉన్నాను- గోడకు. కిటికీలోంచి తొంగిచూస్తున్నాను.
అబ్బా నిమ్మో మళ్ళీ వచ్చింది. ఆమె చేతిలో ద్రాక్షపళ్ల పొట్లం ఉంది. వెంట కొందరు జనం ఉన్నారు. వింత చూడ్డానికి వచ్చినట్లున్నారు. వాళ్ళకు నన్ను చూపించాలనుకుంది. తీసుకు వచ్చింది.
ప్రేమగా ద్రాక్షపండు నా నోటిలో పెట్టింది. 'హమిద్! కాస్త తెలివి తెచ్చుకోండి. చూడండి ఎవరొచ్చారో? మీ పిన్ని వచ్చింది. నిషాతా, అబ్తల్ వచ్చారు. వీళ్ళనూ మరచారా!' అడిగింది.
ఒక పెద్దమనిషి నా దగ్గరకు వచ్చాడు. కూర్చున్నాడు. అడిగాడు 'ఎలా ఉంద'ని.
"అచ్ఛా అచ్ఛా అర్థమైంది. మీరు ఆస్పత్రి మనుషులు, ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చారు." అని లేచాను. నా రక్షణకు పక్కనున్న గ్లాసు అందుకున్నాను. "వెళ్ళండి. ఇక్కడినుంచి కదలకుంటే కాళ్ళు విరక్కొడ్తాను" అని అరచాను.
నిమ్మో ఏడుస్తూంది. ఆమెను ఒక తన్నుతన్నాను. "ఏమిటీ నటన! నన్ను గారడి చేయాలనుకున్నావు. అందరికీ ఆట చూపాలనుకున్నావు. ఏమనుకున్నావో - నీ ఆట కట్టించగలను"
