అది అమెరికా!
అక్కడ అతి సాధారణ పౌరుడయినా, లేక అది సాక్షాత్తూ అమెరికన్ ప్రెసిడెంటే అయినా సరే - అందరికీ ఒకే రూలు - రూలంటే రూలే కూడా!
అయితే నిస్సందేహంగా అక్కడ కూడా అవినీతి వుంది - అన్యాయాలూ, అక్రమాలూ జరిగిపోతూనే వుంటాయి. కానీ అదంతా చాలా పెద్ద లెవెలులో. సాధారణ ప్రజా జీవితంలో మాత్రం అవినీతి కొట్టొచ్చినట్లుగా కనబడడు.
ఒక కానిస్టేబుల్ తలుచుకుంటే, ఒక ప్రెసిడెంటుని కూడా చలాన్ చేసేటంత వెసులుబాటు ఉన్న వ్యవస్థ అది.
"మన ఇండియాలో లాగా బొత్తిగా అన్యాయ వ్యవస్థ కాదు. మరి మన దగ్గర స్వాముల వారికో రూలు, సినిమా స్టార్లకో రూలూ, సాయుధపోరాటం వాళ్ళకో రూలు, శాండల్ వుడ్ స్మగ్లర్లకి ఇంకో రూలు కదా- మనిషికో న్యాయం! అచ్చంగా అందుకే కరప్షన్ తో కుళ్ళిపోతున్న స్వదేశాన్ని వదిలి పారిపోయి వచ్చేసి ఇక్కడ ఈ విదేశంలో సెటిలయిపోతున్నాం!" అన్నాడు దగ్గరలోనే వున్న ఇంకో ఇండియన్ కస్టమర్ సూరజ్ తో, హిందీలో.
ఫైను కట్టి, ఆ వ్యవహారం సెటిల్ చేసిన సూరజ్ తలతిప్పి చూసేసరికి అరుణ అతనికి దూరంగా వెళ్ళిపోయింది.
* * * *
సీజర్స్ పాలెన్ హోటల్లోనే కూర్చుని ఉన్నాడు అభిరాం. అతని పక్కనే ఓ అమ్మాయి, దాదాపుగా అతన్ని ఆనుకున్నట్లే కూర్చుని వుంది.
ఆమె శృతి. బోస్టన్ నగరంలో ఒక ఇండియా కేఫ్ లో పార్ట్ టైం పనిచేసే అమ్మాయి. రీసెర్చి స్కాలరు.
'మిస్ యూనివర్స్' సునయనకి తండ్రి అయిన ఆనంద్, ఆరోజు అంతగా మెచ్చుకున్న అందగత్తె తనే.
ప్రపంచంలోని ప్రేమ అంతా తన కనురెప్పల కిందే కాపురం వుంటున్నట్లుగా, అభిరాం వైపు ఆరాధనగా చూస్తోంది శృతి.
సరదాగా అన్నాడు అభిరాం.
"ఎట్లా వున్నాడు నీ ముసలి ప్రియుడు?"
"ప్రియుడా!" అని పరిహాసంగా నవ్వింది శృతి.
"వెంటబడే వృద్ధుడికీ, ప్రేమించే ప్రియుడికీ చాలా చాలా తేడా వుంటుందని నీకు తెలియదా అభిరాం?"
"మరి నీ నిజం ప్రియుడు ఎవరూ?" అన్నాడు అభిరాం నవ్వుతూ.
చిరుకోపంగా చూసింది శృతి.
"సమాధానం తెలిసి కూడా అడగడం అదోరకం సరసమా?"
"అతని పేరు ఆనంద్ అన్నావుకదా! ఆ ఓల్డీ ఎక్కడ తగిలాడు నీకూ? బోస్టన్ లో అన్నావు కదూ?"
"అవును! అక్కడే ఇండియా కేఫ్ లో తగులుకున్నాడు! ముసలాడికి మహా రొమాంటిక్ పిచ్చి! నన్ను ఏం పొగిడాడో! నేను 'మిస్ యూనివర్స్' పోటీకి వెళ్తే గెలుస్తానట!" అని నవ్వింది శృతి.
"అందులో డౌటేమీ లేదులే! ఉన్నమాటే అన్నాడు" అన్నాడు అభిరాం, ఆమెని అరటి చెట్టు ఎక్కించేస్తూ.
"మిస్ యూనివర్స్ అంటే గుర్తొచ్చింది. అతని కూతురు నిజంగానే మిస్ యూనివర్స్ - సునయన!" అంది శృతి.
నుదురు చిట్లించి చూశాడు అభిరాం.
సునయనా!
అయితే ఆ ఓల్డ్ మాన్ సునయనకే తండ్రా?
ఆ విషయాన్ని మనసులోనే నోట్ చేసుకున్నాడు అభిరాం.
వెరీ ఇంటరెస్టింగ్! వెరీ వెరీ ఇంటరెస్టింగ్!
సునయనేమో ఆ ముసలాడి కూతురూ, అతను వెంటబడ్డ - ఇప్పుడు తన వెంట బడుతున్న - ఈ శృతి ఏమో గాంగ్ స్టర్ దాసుగాడి కూతురూనూ!
కథ ముదురు పాకాన పడుతోంది.
ఆ దాస్ గాడు 'సినిమా తీస్తాను - సాయం చేసి పెద్ద హీరో డేట్లు ఇప్పించండి' అని అడిగాడు.
ఆ రౌడీ ఎమ్మెల్యే -
వాడు గాంగ్ స్టరే అయినా పిల్లని మాత్రం పెద్ద చదువులు చదివిస్తున్నాడు - అమెరికాలో వుంచి మరీనూ!
మా గొప్ప పనే చేస్తున్నాడు గానీ, మరి తను చెప్పిన అసలు పని చేస్తున్నాడో లేదో?
ఆ పెద్ద హీరో డేట్లు ఇప్పించమంటే అందుకు టెస్టు కేసుగా అరుణని ఎత్తుకు రావాలని కదా దాసుకి చెప్పాడు తను?
తక్షణం సెల్ ఫోను తీసి దాస్ నెంబరు కలిపాడు అభిరాం.
"పని పూర్తయిందా లేదా?" అన్నాడు కాస్త కఠినంగా.
అభిరాం గొంతుని వెంటనే గుర్తుపట్టాడు దాస్.
"నమస్తే సార్!" అన్నాడు ఎగ్జయిటెడ్ గా.
"పని పూర్తయిందా లేదా?" అన్నాడు అభిరాం మళ్ళీ.
"పిల్ల వాళ్ళ పక్కింట్లోనే ఎక్కువగా వుంటోంది సార్! దొరకట్లేదు."
"ఈ పరీక్ష నీకు పిల్లాటలాంటిదనుకున్నాను. పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నావే!" అన్నాడు అభిరాం అసహనంగా.
"ఇంకొద్దిగా టైం కావాలి సార్!"
"టైమయిపోయింది బ్రదర్!"
"సారీ సార్! సారీ సార్!" అంటున్నాడు దాస్ కంగారుగా.
అతని గొంతు నోక్కేసినట్లుగా, లైన్ కట్ చేసేశాడు అభిరాం.
పేరుకి పెద్ద రౌడీ! ఆఫ్టరాల్ ఓ ఆడపిల్లని తెచ్చి తన ముందు పడెయ్యలేకపోతున్నాడు!
"పని చేసిపెట్టనందుకు పనిష్ మెంటుగా ఈ పిల్లని ఈ శృతిని ఈ దాస్ గాడి కూతుర్ని చెడగొట్టాల్సిందే!' అనుకున్నాడు అభిరాం నిర్దాక్షిణ్యంగా.
అయితే అంతలోనే, మళ్ళీ ప్రసన్న వదనంతో మాట్లాడడం మొదలెట్టాడు.
కానీ -
అతనికి తెలియదు. తనకి తెలియకుండానే తనకి అరుణపట్ల ఆకర్షణ పెరిగిపోతోందని!
నిప్పులాంటి పిల్లట!
ఆ నిప్పు మీద నీళ్ళు పోసి ఆర్పేస్తే గానీ తనకు తోచదు!
మంచి ఎక్కడున్నా దానిని ముంచేయకపోతే భరించలేడు తను! నిజం! మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో!
"ఇంకా చెప్పు శృతీ! నీ వెంటబడ్డ ఓల్డ్ రోమియో చేష్టలు శృతిమించి సరాగాన పడ్డాయన్నమాట!"
"ఓల్డీకి ఒళ్ళంతా కుళ్ళిపోయింది కంప్లయింట్స్ తో! షుగర్, బీపీ, ఎట్ సెట్ రా...ఎట్ సెట్ రా...! అయినా సరే, 'ముసలాడికి దసరా పండగలా' రొమాంటిక్ డైలాగులు వదుల్తూనే వుంటాడు. నేను సీలు ఓపెన్ చేయని షాంపేన్ సీసా లాగా వుంటానుట!" అని నవ్వింది శృతి.
"ఉన్నమాటే అన్నాడు. సీసా అంటే గుర్తొచ్చింది. సీలు ఓపెన్ చేస్తే చాలు ప్రళయం వచ్చేసేలాంటి ఓ సీసాతో పని వుంది మని. ఆపని పూర్తిచేయడానికి ముసలాడు మనకి పనికి వస్తాడు" అన్నాడు అభిరాం.
ఆ తర్వాత తన ప్లానుని శృతికి వివరంగా చెప్పి "ముసలాణ్ణి మురిపిస్తూనే వుండు - కనీసం మన పని పూర్తయ్యేదాకా! ఇది నీకు పరీక్ష!" అన్నాడు.
మొహంలో మోహం కనబడిపోతూ వుండగా, అభిరాం వైపు తమకంగా చూస్తూ, "అలాగే!" అంది శృతి.
* * * *
'ఈ సీజర్స్ పాలెస్ హోటల్లో అడుగుకి ఒకరు చొప్పున హాలీవుడ్ స్టార్స్ కనబడతారు. అడుగడుగునా హాలీవుడ్ వాసనలే! కానీ అడుక్కున్నా ఒక్క సినిమా ఛాన్సు ఇచ్చేవాళ్ళు కనబడరు! అనుకుంది సునయన చాలా కసిగా.
'మిస్ యూనివర్స్' అయ్యీ అవగానే ఇంక తను హాలీవుడ్ హీరోయిన్ ఛాన్సులు మిసయ్యే 'స్కోపే' లేదని మిస్ అండర్ స్టాండ్ చేసుకుంది తను.
కానీ అది సినిమా స్కోపు అంతటి అపోహే అని అతి త్వరలోనే తెలిసివచ్చింది ఆమెకి.
అటు ఆ కాలిఫోర్నియాలోని హాలీవుడ్డూ - ఇటు ఈ నెవాడాలోని లాస్ వేగాస్ - అంతా కాళ్ళు అరిగేలా తిరిగేశాక!
కాలిఫోర్నియా రాష్ట్రం-అందులోనూ లాస్ ఏంజిలిస్ నగరం- అక్కడి బెవర్లీ హిల్సు ప్రాంతం-'హాలీవుడ్' అనే ఏరియా-
ఇవన్నీ చిన్నప్పటి నుంచి చిరపరిచితమైన పేర్లు తనకి. తన టెక్నికలర్ కలలలో తరచుగా దర్శనం ఇచ్చే ప్లేసెసే!
హైదరాబాద్ లో జూబ్లీహిల్సు లాగా ఇక్కడి బెవెర్లీ హిల్సు. తెరవేల్పులు ఉండేది ఇక్కడే. ఇక్కడే వుంటుంది 'హాలీవుడ్' అనే ప్రాంతం. అది సినిమాలకే కేంద్రం.
పక్క రాష్ట్రమే నెవాడా. ఇక్కడే ఉంది ఈ లాస్ వేగాస్ నగరం. హాలీవుడ్ స్టార్సూ, దైరెక్టర్లూ, ప్రొడ్యూసర్లతో బాటుగా ప్రపంచవ్యాప్తంగా వుండే మహా ధనికులనీ వీవీవీ ఐపీలనీ ఆకర్షిస్తూ ఉంటాయి ఇక్కడి హోటళ్ళూ కేసినోలూ, నైట్ క్లబ్బులూ వగైరాలు.
తలుచుకుంటే తనని తారని చేసేయడం ఈ బిగ్ షాట్స్ కి క్షణాల మీద పనే!
ఆ ఆశతోనే తను లాస్ ఏంజెలిస్ దగ్గర నుంచి లాస్ వేగాస్ దాకా 'ఎక్కినా లిఫ్టూ, దిగిన లిఫ్టూ' చందంగా తిరిగింది.
నో యోస౧ నో యూస్ బేబీ!
కానీ ఒక మహత్తర సత్యం మాత్రం మహా బాగా అర్థం అయింది.
హాలీవుడ్ లో షైనవ్వాలంటే అటు తెల్లవాళ్ళయినా కావాలి, ఇటు నల్లవాళ్ళయినా కావాలి.
అమెరికన్ లు, ఇంగ్లీష్ వాళ్ళు ఇటాలియన్ ల లాంటి తెల్లవాళ్ళు.
