Previous Page Next Page 
వైరం పేజి 39


    అది కాకపోతే - ఒక హాలేబెర్రే, ఒక డెనిజిల్ వాషింగ్ టన్, ఒక సిడ్నీపాయిటర్, ఒక ఎడ్డీమర్ఫీ లాంటి నల్లజాతి వాళ్ళు. అంతే తప్ప తనలాంటి బ్రౌన్ గర్ల్స్ కి ఛాన్సులు - నోవే!
    మరీ ముఖ్యంగా - ఇండియన్ అమ్మాయిలకి - తనలాగా ఎంత తెల్లగా అయినా వుండవచ్చుగాక - కానీ జాతిపరంగా 'బ్రౌన్ కలర్' కిందే లెఖ్ఖ! చాలా చులకన!
    ఆ! అక్కడక్కడ అక్కడొక ఐశ్వర్యారాయ్ నీ ఇక్కడొక మల్లికా షెరావత్ నీ 'ఇంగ్లీష్' సినిమా ఛాన్సులు ఊరించి వుండవచ్చును గానీ -
    కానీ రియల్ సక్సెస్ ఏదీ?
    ఒక ఇండియన్ తీసిన ఇంగ్లీష్ సినిమాలో నటించింది ఐశ్వర్య. హాంగ్ కాంగ్ నటుడు జాకీ ఛాన్ సినిమాలో మల్లికాకి ఒక అవకాశం.
    అలనాటి తెలుగు అమ్మాయి టంగుటూరి సూర్యకుమారి మాత్రం ఇంగ్లీషు సినిమాలలో కనబడలేదూ?
    వేశానంటే వేశా! అంతే!
    అంతే తప్ప, అక్కడి టాలెంటు ఇక్కడ షైనవదు.
    నో ఛాన్స్ బేబీ! నో ఛాన్స్!
    అడుగో! అక్కడ వెళ్తున్నాడే! ఆ కేస్టింగు డైరెక్టరు! తనని తిప్పుకుని తిప్పుకుని చివరికి ఏమన్నాడూ?
    "రాత్రి రెండు తర్వాత రా! ముందు మంచి 'బెడ్ ఆర్టిస్టు' అనిపించుకో! తర్వాత నిన్ను బెస్ట్ ఆర్టిస్ట్ ని చేస్తా. మేకప్ చేసి టెస్టు చేసేవాళ్ళు మోర్ఖులు౧ బట్టలు తీసి టెస్టు చేయడం నా టేస్టు!" అన్నాడు.
    కేస్టింగ్ కౌచ్!
    సినిమాలకీ, శీలానికీ లంకె!
    అప్పుడు వినబడింది వెనకనుంచి పిలుపు.
    చాలా సందేహంగా -
    "అ..రు...ణా.!" అని.
    కమ్చీతో కొట్టినట్లయింది సునయనకి!     
    అరుణా?
    ఉచ్చరించరాని ఆ పేరుతోనేనా తనని ఎవరో పిలుస్తున్నారూ?
    చివాలున వెనక్కి తిరిగింది సునయన.
    "అరుణా!" అంటున్నాడు, అక్కడే వున్న సూరజ్, తటపటాయిస్తూ. చాలా తికమక పడిపోతున్నట్లుగా కనబడుతున్నాడు అతను.
    అసలు ఈ అమ్మాయి అరుణేనా?
    అరుణే!
    కానీ-
    ఇంత ఒడ్డూ పొడుగూ?
    ఇంత మంచి కాంప్లెక్షనూ?
    ఇంత మంచి...
    సూరజ్ అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండగానే అరుణ మొహంలో రంగులు మారాయి.
    "నేను అరుణని కాను! నాపేరు సునయన! గాట్ ఇట్?" అంది కటువుగా.
    "మిస్ యూనివర్స్ సునయనా?" అన్నాడు సూరజ్ ఆశ్చర్యంగా.
    అతని ఆశ్చర్యం తను ఒక మిస్ యూనివర్స్ ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు కాదు -
    అచ్చం అరుణలాగే ఉన్న ఆమె అరుణ కానందుకు! అంతే!
    అది అర్థమయింది సునయనకి.
    అతను తనని గుర్తు పట్టలేదు.
    తను 'మిస్ యూనివర్స్' సునయనని!
    కానీ ఇతను    
    తనకి గుర్తొస్తున్నాడు.
    ఆ రోజున ఫ్రాంక్ ఫర్ట్ ఫ్లయిట్ కి టెక్నికల్ ట్రబుల్ వచ్చి, పడిపోయే ప్రమాదంలో పడినప్పుడు - అప్పుడు కూడా ఏమీ పట్టనట్లుగా కూర్చున్నాడే - అతనే కదా ఇతనూ?
    పేరు...సూరజ్ కదా!
    అప్పుడు తను తూలి ఇతని వళ్ళోనే పడిపోయింది కూడా!
    ఒళ్ళో ఉన్న తనని పట్టుకుని కూర్చున్నాడే గానీ, అస్సలు పట్టించుకోలేదు! తను మిస్ యూనివర్స్ ని! సరే ఆరోజున అతను ఏదో ఆలోచనలో ఉండి తన ఐడెంటిటీని గుర్తించడం మిస్సయ్యాడనుకుందాం.
    కానీ -
    ఆ తర్వాత అయినా గమనించలేదా?
    కనీసం పేపర్లయినా చదవడం లేదా? అసలు చదివే అలవాటే లేదా?
    చదివినా మిస్సయ్యాడా?
    ఏమో!
    పైగా - ఆ రోజున తను చాలా ఫాన్సీ మేకప్ లో ఉంది గదా! బంగారు రంగులో ఉన్న బ్లాండ్ విగ్ పెట్టుకుంది. ఫ్లయిట్ లో ఉన్న ఏ హాలీవుడ్ ప్రొడ్యూసరో తనని తక్షణం బుక్ చేసేస్తాడని ఊహ! ఆకాశంలాంటి అవకాశం అప్పుడే అప్పనంగా అందినంతగా అత్యుత్సాహం!
    ఇవాళ- ఆ ఆశలన్నీ అడియాసలేనని దాదాపుగా తేలిపోయాక -
    ఇంక తను తనుగానే వుంటోంది.
    'మేకప్ చేసి కాదు - బట్టలు తీసి టెస్ట్ చేయడమే నా టేస్ట్! అన్న కేస్టింగ్ డైరెక్టరు టేస్ట్ లెస్ డైలాగుతో తనకి మేకప్ మీదా, ఫాన్సీ డ్రెస్సింగ్ మీదా కూడా ఒక్కసారిగా విరక్తి కలిగింది.
    మేనుని కప్పేసే మేకప్పు గనక లేకపోతే, తనకీ అరుణకీ ఉన్న పోలికలు బాగా బయటపడిపోతాయి.
    అరుణ!
    తనకి ఆగర్భ శతృవు నిజంగానే!
    తనకీ అరుణకీ ఆ జన్మాంత వైరం!
    వరసకి అరుణ తనకి అక్క!
    కానీ - తన దృష్టిలో ఆమె అక్క కాదు! కుక్కకంటే హీనం!
    ఇంతకీ అరుణ ఇతనికి తెలుసా?
    ఎలా తెలుసో తను తెలుసుకోవాలి!
    అలా అనుకుంటుండగానే - ఆమె చూపు అక్కడే కూర్చుని వున్న అభిరాం, శృతిలమీద పడింది.
    దగ్గర దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటున్న అభిరాం, శృతిలమీదే ఉంది సునయన దృష్టి అంతా.
    సీజర్స్ పాలెస్ హోటలు ఇప్పుడు ఆమెకి ఒక జనారణ్యంగా కనబడుతోంది.
    అందులో ఈ అభిరాం ఒక మృగం!
    మేకవన్నె పులి! గోముఖ వ్యాఘ్రం!
    తనని తొలిప్రేమ మెట్టు ఎక్కించింది ఇతను కాదూ?
    ఇంతలోనే ఇతగాడి బండారం బట్టబయలు!
    కొత్తరోజు కొత్త దేశం- కొత్త అమ్మాయి!
    అయినా -
    సముద్రాలు దాటే సెయిలర్ లకు ప్రతి పోర్టులోనూ ఓ ప్రేయసి వుంటుందన్న చతురోక్తిని తను ఎలా మరిచిపోయిందీ? వివేకం కోల్పోవద్దని మనసు మరీ మరీ హెచ్చరిస్తోంది సునయనని.
    కానీ- తన వీక్ నెస్ తనకే బాగా తెలుసు ఆమెకి.
    మూడ్ స్వింగ్స్!
    స్పందిస్తే స్నేహం!
    వికటిస్తే విరోధం!
    అటో- ఇటో! అంతే!
    మధ్యేమార్గం మాటేలేదు.
    హాలీవుడ్ ఛాన్సులు రావడం టెక్నికలర్ కలే అని దాదాపు రూఢ అయిపోయిన సునయనకి, కాబోయి మానేసిన ఈ ప్రియుడు అభిరాం ఆ అందగత్తెతో అంత చనువుగా మాట్లాడటం చూస్తే శివమెత్తినట్లయింది.
    చంపదలుచుకున్న జంతువు వెంటపడిన సివంగి వడివడిగా అడుగులు వేస్తూ, వేగం పెంచి పరుగందుకున్నట్లుగా, పరుగులాంటి నడకతో అభిరాంనీ,శృతినీ సమీపించింది సునయన.
    చంపిపారెయ్యాలి వీళ్ళిద్దరినీ!
    సునయన రాకని ఆమె హోటల్లో అడుగుపెట్టిన క్షణంలోనే గమనించాడు అభిరాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS