ఎంత చక్కటి పాట గుర్తు చేశాడు లతీఫ్!
'జీనా యహా -మర్ నా యహా- ఇస్ కే సివా-జానా కహా?'
అప్పటికప్పుడే అమెరికా వదిలి ఇండియాకు వెళ్ళిపోవాలన్నంత ఉద్వేగం కలిగింది సూరజ్ కి.
రాజ్ కపూర్ సినిమాలోని పాట అది!
'షోమాన్' రాజ్ కపూర్!
తనకి రాజ్ కపూర్ సినిమాలు ఇష్టం!
తనది పాతకాలపు టేస్టు. అయితే అవుగాక!
రాజ్ కపూర్ సినిమాలలోని సాహిత్యం వినువినమని శాసిస్తుంది.
'జీనా యహా...మర్ నా యహా'
'పుట్టింది ఇక్కడే - గిట్టేది ఇక్కడే...'
రాజ్ కపూర్!
ఇండియన్ సినిమాకి ఇతర దేశాల్లో కూడా గౌరవం తెచ్చిపెట్టినవాడు కాడూ?
ముక్కుతో పాడే ముఖేష్ గొంతుతో రాజ్ కపూర్ 'ఆవారా హూ' అంటూ ఉంటే రష్యా ఆనందంగా అడుగులు కలిపి, కదపలేదూ?
ఈ జిమ్మిక్కుల, గ్రాఫిక్కుల యుగానికి ముందు వచ్చిన అనేకానేకమైన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తనని ఉర్రూతలూగించాయి.
తను స్కూలు ఎగ్గొట్టి రోజుకి రెండు మూడు కూడా సినిమాలు చూసిన రోజులు వున్నాయి. టీవీ వీసీడీలూ, డీవీడీలు వచ్చాక, క్లాసిక్స్ చాలా చాలా చూసేశాడు.
మేరానామ్ జోకర్!
చటుక్కున అనిపించింది సూరజ్ కి.
అసలు ఆ పేరు తనకే బాగా సూట్ అవుతుందా?
జోకరయిపోతున్నాడా తను?
మరీ ముఖ్యంగా అరుణ విషయంలో?
అరుణలో ఏమి చూసి తను ఇంతగా వెంపర్లాడి పోతున్నాడూ?
ఆ అమ్మాయి అంత తెలివైనదా?
ఉహూ! యూనివర్సిటీ ఫస్టు వచ్చి గోల్డు మెడల్సు సొంతం చేసుకునేటంత అకడెమిక్ ఎక్స్ లెన్స్ లేదు.
సోషియాలజీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ చేసింది. మంచి మార్కులతో పాసయింది. అంతే!
బ్యాక్ గ్రౌండ్?
మామూలు మధ్యతరగతి కుటుంబం కంటే కూడా తక్కువ.
అందం?
అరుణ అద్భుతమైన అందగత్తె అని ఎవ్వరూ అనగా తను వినలేదు.
నిజం చెప్పాలంటే -
అందం మాట అటువుంచి, అరుణది అంత గొప్ప కాంప్లెక్షన్ కూడా కాదు. కొంతమంది చామనచాయలో వున్నా కూడా ఆరోగ్యంతో మిసమిస మెరిసిపోతున్నట్లుగా వుంటారు.
అరుణ అలా కనబడదు.
పర్సనాలిటీ?
అరుణ కాస్త సన్నమే! కష్టాల వల్ల కలిగే మెంటల్ టెన్షనూ, సరైన ఆహారం లేకపోవడం వల్ల శరీర సౌష్టవం సరిగా లేకపోవడం.
ఇవన్నీ కారణాలయి వుండవచ్చును.
అలా కాకుండా, అరుణే గనక బాగా పుష్టిగా, బంగారు రంగులో, ఫ్యాషన్ మోడల్సులాగా '36-24-36' కొలతలతో వుండి వుంటే అందగత్తె అనిపించుకుంటుందా?
కళ్ళు మూసుకుని వూహించుకోవడానికి ప్రయత్నించాడు సూరజ్.
కళ్ళు తెరిచేసరికి -
అతని ఊహా చిత్రానికి ఊపిరి వచ్చినట్లుగా - కళ్ళెదుట కనబడింది అరుణ!
ఆమె అప్పుడే ఆ హోటల్లోకి ప్రవేశించింది. చకచక అతనివైపే వస్తోంది!
దిగ్భ్రమ కలిగింది సూరజ్ కి!
తను చూస్తున్నది నిజమేనా?
లేక ఇది కూడా తన భ్రమేనా?
భ్రమలు చాలా కామన్ అయిపోతున్నాయి తనకి!
హల్యూసినేషన్స్ కలుగుతున్నాయి ఈ మధ్యన - రెగ్యులర్ గా.
వాటిలో ఇది ఒకటా?
లేకపోతే అరుణ - ఇక్కడ - అమెరికాలోనా?
సూరజ్ కి దగ్గరగా వచ్చిన అరుణ, ఆగకుండానే అతన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతోంది. యథాలాపంగా ఒక్కసారి సూరజ్ వైపు చూసి, వెంటనే చూపులు మరల్చేసుకుంది.
ఆ చూపులో -
ఆత్మవిశ్వాసం మితిమీరితే కళ్ళలో కనబడే అహంభావపు ఛాయ!
తనకు తెలిసిన అరుణ చూపు ఎంతో నిర్మలంగా వుండేది.
తన కళ్ళు తననే మోసం చేస్తున్నాయా? లేక ఇది రియల్ లైఫ్ లోనే ఒక ట్రిక్ ఫోటోగ్రఫీ షాటా? అద్భుతమైన యానిమేషన్, గ్రాఫిక్సూ టెక్నాలజీలు కలబోసినా టెక్నికల్ కలలాంటిదా?
అరుణా? ఇక్కడా? అమెరికాలోనా?
కళ్ళప్పగించి చూస్తున్నాడు సూరజ్.
అవును! నిజమే!
తన కళ్ళముందే నడిచి వెళ్తోన్న అరుణ, పసిడి వన్నెలో వున్న పాలరాతి శిల్పంలా వుంది!
ఎక్సలెంట్ కాంప్లెక్షన్!
పైగా బాగా పుష్టిగా వుంది తను!
కొలతలు బహుశా '36-24-36'అయివున్నా వుండవచ్చును!
కానీ కానీ-
అరుణ ఇంత పొడుగు వుందా?
అంత పెద్ద హీల్సు ఉన్న జోళ్ళు వేసుకుని వుండడం వల్ల అలా కనబడుతుందేమో!
నడక?
వయ్యారంతో కలిసిపోయి ఉన్న ఆత్మవిశ్వాసం! తన నడకలో రాయించల హొయలు ఉన్న వైనం తనకే తెలిసినట్లుగా కులుకు!
జుట్టు?
అరుణలో అందాలు వెదికితే ప్లస్ పాయింట్లు అన్నీ పిరుదుల దాకా వచ్చే ఆమె పొడుగాటి జడకే పడతాయి.
కానీ -
ఇప్పుడు అరుణ జుట్టు పొట్టిగా కత్తిరించి వుంది.
హఠాత్తుగా ఇంతలా ఎలా మారిపోయింది. తన అరుణ? నాణాన్ని తిరగేస్తే బొమ్మ బొరుసైపోయినట్లుగా!
విస్మయంగా చూస్తున్నాడు సూరజ్. అతన్ని దాటి ముందుకెళ్ళిపోయిన అరుణ, ఒక్కసారి వెనక్కి తిరిగి, మళ్ళీ మరొక్కసారి అతన్ని చూసి తక్షణం తల తిప్పేసుకుంది.
సరిగ్గా అదే సమయంలో -
"గుడ్ డే సర్!" అని వినబడింది ఒక గొంతు.
తిరిగి చూశాడు సూరజ్.
అక్కడ నిలబడి వున్నాడు ఒక పోలీసు కానిస్టేబుల్.
ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు సూరజ్.
"ఏ టిక్కెట్ ఫర్ యూ సర్ ఫర్ స్పీడింగ్" అన్నాడు పోలీసు కానిస్టేబుల్.
అది అతను తన బుగాట్టీ వెరాన్ కారుని దాని మాక్జిమమ్ స్పీడులో ట్రాఫిక్ స్పీడు లిమిట్స్ దాటి పరిగెత్తించినందుకుగానూ టిక్కెట్. ఇండియన్ పరిభాషలో 'చలాన్'. ఫైను కట్టాలి.
పోలీసు కానిస్టేబుల్ అంటున్నాడు.
"బుగాట్టీ వెరాన్ బెస్ట్ కార్స్ లో ఒకటి. మాగ్జిమం స్పీడు ఐదొందల కిలో మీటర్లు అని అందరికీ తెలుసు. కానీ అంత స్పీడుతో వెళ్ళడం సామాన్యమైనది కాదు సర్ - అది స్టంట్ డ్రైవింగ్ అవుతుంది. ట్రాఫిక్ స్పీడ్ లిమిట్స్ కి విరుద్ధం! మీతోబాటు అందరికీ ప్రమాదం! ప్లీజ్ నోట్!"
అంత విలాసవంతమైన హోటల్లోకి 'ఆఫ్టరాల్ ఒక పోలీస్ కానిస్టేబుల్' వచ్చి అంత ధైర్యంగా ఒక కస్టమర్ కి టిక్కెట్ అందిస్తున్నా, ఎవరి దగ్గర నుంచీ ప్రతిఘటన లేదు.
