Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 37


    లియోనారాకన్య తల్లి ఇటాలియను. అప్పటికే ప్రసిద్ధికెక్కి, సంపూర్ణ యౌవనములోనున్న డాక్టరు రౌనాల్డుసన్ గారికడ చికిత్స బడయుట కామె విచ్చేసినప్పుడు వైద్యుడు రోగియు ఒకరినొకరు ప్రేమించుకొన్నారు. మ్యరియానా, కౌంట్ గ్యాలెటీ ఫెబియానో గారి కుమార్తె. తండ్రి ఇటలీదేశము తరఫున రాయబారియై వాషింగ్టన్ పట్టణములో నున్నప్పుడు బాలిక యగు మ్యారియానా ప్రభుకుమారికి హృదయరోగము సంభవించి హృదయరోగ చికిత్సాదక్షుడగు రౌనాల్డుసన్ గారి వైద్యమునకై గొనిపోబడినది. దేహసంబంధమగు హృదయరోగమును మాన్పి, మనస్సంబంధమగు కామరోగమును గల్పించినాడు ధన్వంతరి రౌనాల్డుసన్. తమ కుమార్తెను అపరిమితముగ బ్రేమించు ఫేబియానో బ్రభుదంపతులు తుదకు వారిరువురి వివాహమునకు సమ్మతింపవలసి వచ్చినది.
    ఆ రౌనాల్డుసన్ దంపతుల గర్భమున చంద్రకిరణమువలె లియోనారా జనించినది.
    లియోనారా స్వప్నకుమారి. మధుర మధురముగ సంగీతము పాడగలదు. లాటిన్ దేశస్థుల బ్రునెటీ (నల్లజుట్టు కలవారు) యందము, నార్డుజాతివారి స్వర్ణకేశసంపద, నిర్మల నీలదృష్టి, స్నిగ్దశరీర ధావళ్యము నామెలో బ్రతిఫలించి, లియొనారాను అమెరికా బాలికలలో ఆనాటి అందగత్తెలలో రాణిని జేసినవి, ఆధ్యాత్మికానుభవ విషయములన్నియు నామె హృదయమును చలింపజేయును. హిందూదేశము, చైనా, జపాను, బర్మా, జావా, బలి, సింహళ దేశముల చరిత్రలు, కథలు, కవిత్వము ఆ బాలిక బ్రతుకు మూలమంట గదలించి వేయును.
    తండ్రి కుమార్తె లిరువురు భారతీయులతో స్నేహ మొనరింప ముచ్చట పడుచుందురు. ప్రసిద్ధ భారతీయు లమెరికా వచ్చినప్పుడు వారిని తనయింటి కతిథిగా బిల్చుచుందురు. రవీంద్రనాధుడు, మెహర్ బాబా, ప్రేమానందస్వామి, కృష్ణాజీ మొదలగువారాయన భవనమున కతిథులుగా వచ్చినారు. తారకనాధ దాసు, సుధీంద్రబోసు, లజపతిరాయి వారియింటికి తరచు వచ్చుచుండునారు.
    రామచంద్రుడొక యుత్తము బ్రాహ్మణకుమారుడు, భారతీయుడని వినినంతనె తండ్రి కుమార్తె లిరువురు నతని స్నేహ మొనరించి తమగృహమునకు దీసికొనిపోయి ప్రసిద్ధినొందిన హార్వర్డు విశ్వవిద్యాలయములో బ్రవేశపెట్టింప దలపోసినారు.

                                          హార్వర్డు

    శాంతమహాసముద్రము మహాసముద్రములలోనెల్ల విచిత్రమైనది. ఇందున్న దీవులు పెక్కులు. దీవులలోని పంట అద్భుతము. ఇచ్చటనే బొప్పాయి, టొమాటో, పొటాటో, పొగాకు, సదాపనస, పంపర, అనాస, జీడిమామిడి మొదలగు జాతులు ప్రథమమున నుద్భవించినవి. నిర్మల శర్వరీ గగనముల మినుకాడు నక్షత్రకాంతులు సముద్రపు నీటిమెరుపులలో బ్రతిబింబము లైనవి. ఉబుకు తరంగముల గీతికలలో జ్యోత్స్నా రేఖలు పొదిగింపబడినవి. ఆ మహానౌక యాపరిమిత వేగమున నడుచుచున్నది.
    రామచంద్రునకు రౌనాల్డుసన్ తన స్నేహితులందరితో పరిచయము కలిగించినాడు. రామచంద్రుని విజ్ఞానమునకు వారందర పరిమితానందము నొందుచుండిరి. ఎంతటి చిక్కులనైన నాతడిట్టె విప్పి చెప్పగలడు. పదార్థ విజ్ఞానశాస్త్ర రహస్యములన్నియు వానికి గరతలామలకములు. కావున నతడు విద్యుచ్చక్తి విషయికమగు జ్ఞానమునెల్ల సముపార్జించుట యుత్తమ మనియు, దనదేశమునకు, దనకు ఖ్యాతి తెచ్చుట కింతకన్న వీలింకొకటి లేదనియు లియోనారా యతనికి జెప్పి యొప్పించెను.
    ఓడలో నుండియే రౌనాల్డుసన్ హార్వర్డు విశ్వవిద్యాలయమునకు వాయు వార్త బంపి రామచంద్రుని ప్రవేశమున కంగీకారము సంపాదించెను.
    అర్జునసింగ్ శాంతనుహానీరధి తీరములనున్న పట్టణములలో వర్తకముజేయు నొక చీనా కోటీశ్వరుని యుద్యోగి. అతడును స్వంతముగా గొంత వర్తకము జేయుచుండును. అర్జునసింగ్ నివాసము శాన్ ఫ్రాన్సిస్ కో నగరము. కతిపయదినములకు నౌక శాన్ ఫ్రాన్సిస్ కో నగరము వచ్చి చేరినది. ఆ మహాపట్టణము అమెరికా పడమటితీరముననున్న గొప్ప  నౌకాశ్రయస్థలము, ప్రసిద్ధికెక్కిన రేపుపట్టణము. పశ్చిమతీరమున నిది మహాపట్టణ మగుటవలన ఇక్కడనే చైనావారివి, జపాను వారివి అనేకవేల కుటుంబములున్నవి. శాంత మహాసముద్రమున దిరుగు నౌకలు శాన్ ఫ్రాన్సిస్ కో వచ్చి యచ్చటనుండి పెనామా కాలువ దాటి అట్లాంటిక్ మహాసముద్రోపశాఖయగు మెక్సికో సముద్రము నుండి న్యూయార్కు, బోస్టన్, ఫిలెడెల్ ఫీయా మొదలగు పట్టణములకు బోవును.
    రామచంద్రరావు, అర్జున సింగు, రౌనాల్డుసన్, ఆయన కుమార్తె యందరు ఓడ దిగి 'ది గేట్ వెస్ట్రన్' అను భోజన హర్మ్యమునకు బోయిరి. హిందూ దేశ వాసస్థుల ఆచార వ్యవహారాదుల కంటే జపాను దేశస్థుల ఆచార వ్యవహారాదులు వేరు. ఈ రెంటికీ, నమెరికా సంప్రదాయములకు నెంతయో భేదమున్నది. అడుగడుగునకు నాయాభేదములు గాంచుచు రామచంద్రరావు విస్మయము పడుచుండెను. రెండురోజుల కర్జునసింగు రామచంద్రుని హాలీవుడ్ అను సినిమా పట్టణమునకు దీసికొనిపోయెను. నెలకు లక్షలకొలది డాలర్లు జీతములు గలవారు, సంవత్సరమున కొకసారి వివాహవిచ్చేదమును జేసికొని మరల నితరుల వివాహమాడువారు, మిక్కిలి బలసంపన్నులు, సాహసవంతులు, అందమైనవారు, నాట్యకళావేత్తలు, హాస్యరస చూడామణులగు ప్రసిద్ధ నటీనటుల సమూహము లచట నున్నవి. ఆ పట్టణ వీధులలో, నుద్యానవనములలో, కర్మాగారములలో పట్టణములు, ఎడార్లు, మహాసముద్రములు, కొండలు, నదులు, గాలి వానలు, ఎండలు, చీకట్లు, మంచు ప్రదేశములు, వేలకొలది సంవత్సరముల నాటివి, వందలకొలది సంవత్సరముల నాటివి, నేటివి ప్రతిదినము పుట్టుచు మాయమైపోవుచుండును. సృష్టిమాయాతత్వమెల్ల నచ్చట ననుక్షణము కన్నుల గట్టుచుండును.
    అచ్చట నుండి మోటారులో, రైలులో ననేకవేలమైళ్లు పయన మొనర్చి న్యూయార్కు పట్టణమునకు మన యాత్రికులందరు విచ్చేసినారు. రామచంద్రరావు మూడు దినములు రౌనాల్డుసన్ వైద్యశేఖరుని కతిథియై మర్యాదలు చూరగొనినాడు. రౌనాల్డుసన్ గారి వైద్యాలయమునకు వారి జనపదావాసమునకు లియోనారాకన్యయు, ఇటలీ నుండి తండ్రి కుమార్తెలకన్న ముందుగా వచ్చిన రౌనాల్డుసన్ సతియు, రామచంద్రుని గొనిపోయిరి. వారి భవనములన్నియు స్వర్గలోకతుల్యములైయుండెను. రౌనాల్డుసన్ భారతీయ విగ్రహములను, జిత్ర లేఖనములను, లక్కబొమ్మలను, దెరలను అలంకరించిన యొక శాలకు 'భారతీయ మందిర' మను నామకరణముంచెను. వేరొక మందిరము 'చైనా మందిర' మట. వేరొకటి 'గ్రీకు మందిర' మట. ఇంకొకటి 'ఈజిఫ్టు మందిర' మట. వీని యన్నిటియం దలంకరించిన విగ్రహములకు, చిత్రములకు, బంగారు, వెండి, రాగి సామానులకు, గంథము, దంతము, పింగాణీ చెక్కడములకు, దెరలకు గొన్ని లక్షల డాలర్లు రౌనాల్డుసన్ వెచ్చబెట్టియుండును. తన తండ్రియు, నారాయణరావు ప్రోత్సాహముచే తన మామగారును బంపిన పదివేల రూప్యములకు సరియగు డాలర్లను రౌనాల్డుసన్ రామచంద్రుని పేర మంచి బ్యాంక్ లో వేయించెను.
    రామచంద్రరావు బి.ఎస్ సి. తరగతిలో చేరుటకు వలయ సౌకర్యముల నన్నియు జూచుకొని హార్వర్డు విశ్వవిద్యాలయమునకు లియోనారా కన్యతో రౌనాల్డుసన్ సతీమణితో గలసివెళ్ళి విశ్వవిద్యాలయములో చేరినాడు. విద్యార్ధులనేకులు త్రోవబత్తెముమాత్రమెట్లో సముపార్జించుకొని, అమెరికాకు బోయి విద్యాలయములలో ప్రవేశించెదరట. అమెరిక ధనవంతుల కాటపట్టగుటచే, ఇంగ్లండు దేశమునకన్న నక్కడ నన్నివస్తువులును మిగుల గిరాకిగా నుండును. తక్కిన యూరపియను రాజ్యములకన్న ఇంగ్లండులో వస్తువుల విలువ ఎక్కువ. భారతదేశమునకన్న యూరపియను దేశములలో వెల అధికము. కావున అచటికేగిన విద్యార్థులు హోటళ్లలో వడ్డించియో, సినిమాలలో బ్రేక్షకులకు దారిచూపియో, ఇంచుకించుక సంపాదించుకొందురు. కొందరు సెలవులకు పల్లెటూళ్లకు బోయి, యచట రైతులకడ గూలిపనిచేసి ధనము సేకరించెదరట బీదవిద్యార్దులిట్లెన్నియో యగచాట్లుబడి చదువుకొందురు. కొందరు బాలురకు శ్రీరామతీర్థ వివేకానందులేర్పరచిన యుచిత వేతనములు దొరుకునట. అమెరికాలోని భారతీయులను అమెరికన్లు చాలా గౌరవము చేయుచుందురు. భారతీయులు అమెరికా ప్రజలగుటకు మాత్రము అమెరికన్లు లొప్పరు. తమతో వర్తకము జేయుటకు, తమదేశపు విచిత్రములు జూచుటకు వేదాంతముల గూర్చి ఉపన్యసించుటకు, తమ విద్యాలయములలో జదువుకొనుటకు భారతీయులు విచ్చేయుట అమెరికన్ల కెంతయు నిష్టము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS